భిన్న నేపథ్యాలు, వైవిధ్యమైన ప్రయోగాలతో తెరకెక్కిన ఆసియా దేశాల చిత్రాలు
ఈ ఏడాది ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. అంతేకాకుండా మంచి కలెక్షన్లు కలెక్ట్ చేసి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా కూడా చాటాయి.కంటెంట్ ప్రధానంగా రూపొంది అందర్నీ అలరించిన కొన్ని ఆసియా దేశాల చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ది ప్రిసన్
మద్యం సేవించిన ఓ మాజీ పోలీస్ అధికారి యాక్సిడెంట్‌కు కారణమవుతాడు. దీంతో అతనికి జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఖైదీలు, అక్కడి వార్డెన్‌తో సహా అందరూ క్రైమ్ సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తి నియంత్రణలో ఉంటారు. అతను బయట్నుంచే అన్నింటినీ శాసిస్తుంటాడు. ఇది తెలుకున్న మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడు?,
క్రైమ్ సిండికేట్ వెనుకాల ఉన్న అసలు రహస్యాలను ఎలా తెలుసుకున్నాడు?, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది ఈ సినిమా. జైలు ప్రధానంగా సాగే ఈచిత్రానికి నాహైయున్ దర్శకత్వం వహించారు. ఈ సౌత్ కొరియన్ క్రైమ్ యాక్షన్ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. మాజీ పోలీస్ పాత్రలో కిమ్ రాయి వాన్ నటన అలరించింది.
గాడ్ ఆఫ్ వార్..
16వ శతాబ్దంలో జరిగే కథ ఇది. జపాన్‌కు చెందిన సముద్ర దొంగలకు, చైనీస్ నౌకాదళానికి మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. 1557లో జపాన్‌కు చెందిన సముద్ర దొంగలు చైనా సముద్ర తీరాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తారు. తీరంలోని జీజాంగ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. నెల రోజుల పాటు చైనా నౌకాదళం తీవ్రంగా పోరాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆ టైమ్‌లో కొత్తగా వచ్చిన జనరల్ క్వీ ఆధ్వర్యంలో కమాండర్ యూ తన బృందంతో కలిసి సముద్ర దొంగలపై దాడి చేస్తారు. దీంతో సముద్ర దొంగలు పారిపోవడమే చిత్ర కథాంశం. ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా సాగే చైనీస్ హిస్టారికల్ వార్ యాక్షన్ చిత్రాన్ని గోర్డన్ ఛాన్ రూపొందించారు. జూన్‌లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.
డక్‌వీడ్
యాక్సిడెంట్ కారణంగా దాదాపు మరణం అంచుల వరకు వెళ్ళిన స్పోర్ట్స్ కారు డ్రైవర్ తన గతంలోకి వెళ్తాడు. గతంలో తన తల్లిదండ్రులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ క్రమంలో అతను పొందిన అనుభూతి ఏంటి?, అతని తల్లికి ఏమైంది?, గతంలో జరిగిన సంఘటనలేంటనేది సినిమా కథాంశం. హన్ హన్ దర్శకత్వం వహించిన ఈ చైనీస్ చిత్రం జనవరిలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.
కుక్ ఆఫ్ ఏ స్టోమ్
ఇద్దరు ప్రొఫెషనల్ చెఫ్స్ గురించి తెలిపే చిత్రమిది. అంతర్జాతీయ కాంపిటీషన్లో పాల్గొన్న ఇద్దరు వంటగాళ్ళు చేసే ప్రత్యేకతలేంటి?, తమదైన వంటకాలతో ఎలా ఆకర్షించారు?, ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, పోటీల్లో గెలిచారా, లేదా? అన్నది ఆద్యంతం ఆసక్తికరం. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రయిమాండ్ యిప్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా హాస్యభరితంగా అలరించింది. ఇద్దరు వంటగాళ్ల పాత్రల్లో నికోలస్ ట్సె, జంగ్ యంగ్ హ్వా నటించి ఆకట్టుకున్నారు.
కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్
నార్త్ కొరియాకు చెందిన నేరగాళ్లు తమ దేశంలో భారీగా క్రైమ్స్‌కు పాల్పడుతుంటారు. నార్త్ కొరియాతోపాటు సౌత్ కొరియాకూ విస్తరిస్తారు. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా డిటెక్టివ్స్, సౌత్ కొరియన్ డిటెక్టివ్స్తో కలిసి క్రిమినల్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ సౌత్ కొరియన్ యాక్షన్ చిత్రాన్ని కిమ్ సంగ్ హూన్ రూపొందించారు. జనవరిలో విడుదలైన ఈ సినిమా 9మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 60 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. విశేష ప్రేక్షకాదరణతోపాటు పలు అవార్డులను కూడా గెలుచుకుంది.
న్యూ ట్రయల్
చేయని నేరానికి తన విలువైన జీవితాన్ని జైల్లో గడిపిన ఓ వ్యక్తి కథ ఇది. లీ జూన్ యంగ్ అనే కుర్రాడు అనుకోకుండా ఓ టాక్సీ డ్రైవర్ హత్యను చూస్తాడు. అంతేకాదు ఆ హత్యకు కారణం అతనే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దుండగులు ఇతనే దోషి అని ఆధారాలు క్రియేట్ చేసి శిక్ష పడేలా చేస్తారు. అలా పదేండ్ల పాటు జైల్లో మగ్గిపోతుంటాడు. ఈక్రమంలో జైల్లో అతను పడ్డ స్ట్రగుల్స్ ఏంటనేది సినిమా. చివరికి ఓ లాయర్ లీ నిర్దోషి అని నిరూపించే ప్రయత్నం ఆద్యంతం ఆసక్తికరం. కిమ్ టాయి యూన్ దర్శకత్వం వహించిన ఈ సౌత్ కొరియన్ చిత్రం 2000లో జరిగిన ఓ కేసు ఆధారంగా రూపొందించారు. వ్యక్తి మానసిక వేదనను తెలిపే ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. లీ జూన్ పాత్రలో జంగ్ హూ నటన కట్టిపడేస్తుంది.
అనార్కిస్ట్ ఫ్రమ్ కాలనీ
కొరియా జపాన్ ఆధీనంలో ఉన్నప్పుడు ఓ దేశ భక్తుడు చేసిన పోరాటాన్ని తెలిపే చిత్రమిది. కొరియా వలసల కాలంలో పార్క్ యిహౌల్ అనే వ్యక్తి 'బ్లాక్ వేవ్' అనే ఆర్గనైజేషన్‌ను స్థాపిస్తాడు. తన బృందంతో జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆద్యంతం సాహసోపేతం. బయోగ్రాఫికల్ పీరియడ్ డ్రామా చిత్రాన్ని లీ జూన్ ఇక్ రూపొందించారు. స్వాతంత్ర సమరయోధుడు పార్క్ యిహౌల్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌లో విడుదలైన విశేషంగా ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది.
బ్లేడ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్
మాంజీ యుద్ధ విద్యల్లో ఆరితేరిన యోధుడు. తన సోదరి దారుణ హత్యకు గురవుతుంది. కత్తియుద్ధంలో నిష్ణాతులైన ఆంటోస్టు దుండగుల సమూహం ప్రజలపై దాడి చేస్తుంటుంది. ఈ క్రమంలో రిన్ అనే యువతి తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. తన తల్లిదండ్రులను చంపేసిన వారిపై పగ తీర్చుకోవడానికి మాంజీ సహాయాన్ని రిన్ కోరుతుంది. రిన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆంటోస్టు దుండగుల బృందంపై మాంజీ చేసే పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకుల విశేషాదరణ పొందింది. దర్శకుడు తకాషి మైక్‌కి ఇది వందవ చిత్రం కావడం విశేషం. మాంజీ పాత్రలో టకుయ కిమురా, రిన్ యువతి పాత్రలో హనా సుగిసాకిల నటన ఆద్యంతం కనువిందు చేస్తుంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
మిడ్నైట్ రన్నర్స్
హాంగ్ కి జున్.. చాలా రఫ్ అండ్ టఫ్. ఫైటింగ్ చేయడంలో దిట్ట. హీ యేల్.. పుస్తకాల పురుగు. చాలా కూల్. విరుద్ధ భావాలు కలిగిన వీళ్ళిద్దరు కొరియన్ నేషనల్ పోలీస్ యూనివర్సిటీలో చదువుకుంటుంటారు. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఓ రోజు ఓ కిడ్నాప్ సంఘటనను వీళిద్దరూ ప్రత్యక్షంగా చూస్తారు. దాన్ని చేధించాలని నిర్ణయించుకుంటారు. ట్రైనింగ్ క్యాంప్ నుంచి రాత్రి సమయంలో బయటకు వెళ్తూ రహస్యంగా కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కిడ్నాపర్ల కోసం వెతికే క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు కిమ్ జు హాన్ రూపొందించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. హీ యేల్ పాత్రలో సియో జూన్ పార్క్, హాంగ్ కి జున్ పాత్రలో పార్క్ సియో జూన్ నటన అలరించడంతోపాటు ఆలోచింపచేస్తుంది. హాంకాంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది.
హు కిల్డ్ కాక్ రాబిన్
ఇదొక నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ. ఓ రోజు రాత్రి జరిగిన ఓ కారు యాక్సిడెంట్‌కు జర్నలిస్ట్ హసియోచి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. ఈ యాక్సిడెంట్లో కారు డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న యువతి మరణిస్తుంది. జోరున వర్షం పడుతున్న సమయంలోనూ యాక్సిడెంట్‌కి కారణమైన కారు తాలూకా నెంబర్ ప్లేట్‌ను ఫొటో తీస్తాడు. అయితే ఆ ఫొటో సరిగా కనిపించకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేస్తుంది. కొన్ని సంవత్సరాల అనంతరంగా జర్నలిస్ట్ ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తాడు. కొన్నేండ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్‌కు ఈ కారుకు సంబంధం ఉందనే విషయం తెలుసుకున్న తర్వాత ఆ జర్నలిస్ట్ ఏం చేశాడు?, అందరూ మరచిపోయిన ఈ కేసులో ఎలా విజయం సాధించాడు? అనే అంశాల సమాహారంగా ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాన్ని చెంగ్ వెయి హవో తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. జర్నలిస్ట్ పాత్రలో కైజర్ షువాంగ్ తనదైన అద్భుతమైన నటనతో మెప్పించారు.
సింగిల్ రైడర్
ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసే ఫండ్ మేనేజర్ కాంగ్ జాయి హూన్ తన సంస్థ దివాళా తీయడంతో అన్ని కోల్పోతాడు. దీంతో ఆస్ట్రేలియాలో ఉండే తన ఫ్యామిలీ వద్దకు వెళ్తాడు. అక్కడ తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఆసక్తికర, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ కథాంశం. లీ జూ యంగ్ దర్శకత్వం వహించిన ఈ సౌత్ కొరియన్ ఫాంటసీ డ్రామా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి ఆదరణ పొందడంతోపాటు పలు అవార్డులను కూడా అందుకుంది.
ది విలన్సేస్
ఓ క్రూరమైన హంతకురాలు జీవిత గమనాన్ని తెలిపే చిత్రమిది. సూక్ హీ చైనాకు చెందిన కిల్లర్. డబ్బు కోసం హత్యలు చేస్తుంటుంది. తన గురువు చనిపోవడంతో ఆమెను సౌత్ కొరియన్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల అనంతరం ఆమెను మంచిగా మార్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్ ఏజెంట్‌గా నియమిస్తారు. అలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. పదేండ్ల సర్వీస్ తర్వాత నటిగా మారుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలోకి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఆ తర్వాత ఆమె లైఫ్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలేంటి అనేది సినిమా. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సౌత్ కొరియన్ యాక్షన్ చిత్రానికి జంగ్ బైయుంగ్ గిల్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా కేన్స్తోపాటు, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై మంచి ప్రశంసలందుకుంది. పలు అవార్డులను సైతం దక్కించుకుంది. సూక్ హీ పాత్రలో కిమ్ ఓక్ బిన్ తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది.
షాక్ వేవ్
టెర్రరిస్టులు వరుసగా బాంబ్ బ్లాస్ట్‌లకు తెగబడుతుంటారు. దీంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లుతుంటుంది. ఈ క్రమంలో బాంబ్ స్వ్కాడ్ డిపార్ట్మెంట్(ఎక్స్‌ప్లోసివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బ్యూరో)కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ చియుంగ్ చోయి సాన్ టెర్రరిస్ట్‌ల బాంబ్ బ్లాస్ట్లను అడ్డుకునేందుకు, వాటి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు చేసే సాహసం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ హాంకాంగ్ చైనీస్ యాక్షన్ చిత్రానికి హెర్మన్ యు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా క్రిటికల్‌గానే కాకుండా కమర్షియల్గానూ మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఇన్స్పెక్టర్ పాత్రలో ఆండీలా నటన ఆకట్టుకుంటుంది.
ది మెర్సిలెస్
ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, ద్రోహాన్ని తెలిపే చిత్రమిది. ఒకరు గ్యాంగ్ నాయకుడు. జైల్లో ఖైదీలు తన ఆధీóనంలో పనిచేయాలని కోరుకుంటాడు. మరొకరు కొత్తగా జైలుకు వచ్చిన కుర్రాడు. ఈ ఇద్దరిలో ఎవరు జైల్లోని గ్యాంగ్‌కు లీడర్ అయ్యారు?, ఆ గ్యాంగ్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నాడు?, ఈ క్రమంలో వారి మధ్య సాగే స్నేహం, ద్రోహం ఏంటనేది సినిమా. బైయున్ సంగ్ హైయున్ దర్శకత్వంలో రూపొందిన ఈ సౌత్ కొరియన్ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలై మంచి విజయం సాధించింది. కేన్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. పలు పురస్కారాలనూ సొంతం చేసుకుంది. ప్రధాన పాత్రల్లో సోల్ కైయుంగ్ గు, ఇమ్ సి వాన్ నటించి మెప్పించారు.
ఏ టాక్సీ డ్రైవర్
గ్వాంజులో కాలేజ్ విద్యార్థులు, యువకులు తమ స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం భారీస్థాయిలో ఆందోళన, ఉద్యమం చేపడతారు. ఈ ఉద్యమాన్ని కవర్ చేసేందుకు జర్మనీకి చెందిన ఓ జర్నలిస్ట్ ఓ టాక్సీ ఎక్కుతాడు. ఈ ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో ఈ టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దీంతో అక్కడ జరిగిన పరిణామాల సమహారమే ఈ చిత్రం. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్, జర్నలిస్ట్‌ల జీవితాలెలా మలుపు తిరిగాయన్నది ఆసక్తికరం. జాంగ్ హూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1980లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. గ్యాంజు డెమోక్రటైజేషన్ మూమెంట్ అప్పట్లో ఓ సంచలనం. దీన్ని ఆధారంగా చేసుకుని హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఆస్కార్‌కు సైతం నామినేట్ అయ్యింది. అనేక ఇతర అవార్డులను దక్కించుకుంది. ఇందులో టాక్సీ డ్రైవర్ పాత్రలో సాంగ్ కాంగ్ హౌ, జర్నలిస్ట్ పాత్రలో థామస్ క్రెస్ట్సెమాన్న్ నటించారు.
Authorization