అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులపై ఈ ఏడాది ఆరంభం నుంచే అందరిలోనూ ఉత్సుకత పెరిగింది. 90వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం లాస్ ఏంజ్ల్స్లోని డాల్భీ థియేటర్లో మార్చి 4న అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ విశ్లేషకులు ఫలానా చిత్రానికి ఆస్కార్ గ్యారంటీ అంటూ జోస్యం చెబుతున్నారు.
వారి జోస్యాన్ని నిజం చేసేందుకు ఉత్తమ చిత్ర విభాగంలో దాదాపు 14 చిత్రాలు ఆస్కార్ బరిలో అమీతుమీకి సిద్ధమవుతున్నాయి.డన్కిర్క్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫ్రెంచ్ పట్టణ డన్కిర్క్ సముద్ర తీరాన్ని జర్మన్ సైన్యం ఆక్రమిస్తుంది. వీరి నుంచి తప్పించుకోవడానికి బ్రిటీష్, దాని మిత్ర రాజ్యాల సైన్యం పోరాటం చేస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగిన భీకరయుద్ధం అనంతరం యుద్ధం కంటే ప్రాణం ముఖ్యమని సముద్రం గుండా బ్రిటీష్ సైన్యం పారిపోవాల్సి వస్తుంది. యుద్ధం చేసినా చనిపోతారు, సముద్రంలోకి వెళ్ళిపోయినా చనిపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటీష్ సైన్యం ప్రాణాలతో బయటపడేందుకు చేసే సాహసోపేత పోరాటమే ఈ సినిమా. 1940లో చోటు చేసుకున్న యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించారు. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించిందీ చిత్రం.
ది పోస్ట్
వియత్నాం వార్ సమయంలో అమెరికా చేసిన కుట్రలకు సంబంధించిన 'పెంటగాన్ పేపర్స్'ను వాషింగ్టన్ పోస్ట్, ది న్యూయార్క్ టైమ్స్ పత్రికలు లీక్ చేశాయి. ఈ ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకుని అమెరికా ప్రభుత్వానికి, మహిళా పత్రికాధినేతకు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో 'ది పోస్ట్' చిత్రాన్ని తెరకెక్కించారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
గెట్ అవుట్
ఆఫ్రికన్-అమెరికన్‌కు చెందిన నల్లజాతీయుడు క్రిస్. తెల్లజాతీయురాలైనా రోజ్‌ను ప్రేమిస్తాడు. తన ప్రేమ గురించి మాట్లాడేందుకు ప్రియురాలి ఇంటికి వెళతాడు. అక్కడ రోజ్ తల్లిదండ్రులు తప్ప మిగతా పనివాళ్ళంతా నల్లజాతీయులే.
ఈ క్రమంలో క్రిస్‌ను చంపేందుకు, అక్కడి నుంచి పంపించేందుకు అక్కడి వారంతా ప్రయత్నాలు చేస్తుంటారు.
మరి వాళ్ళు అలా చేయడానికి కారణమేంటనేది సినిమా. జోర్డన్ పీలె దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది.
ఫాంటమ్ థ్రెడ్
ఉడ్‌కాక్ గొప్ప ఫ్యాషన్ డిజైనర్. హీరోలకు, సంపన్న వర్గాల పిల్లలకు, సామాజిక కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు వివిధ రకాల డిజైనింగ్ డ్రెస్స్‌లను తయారు చేస్తూ బాగా పాపులర్ అవుతాడు. అతని ఉన్నతికి సోదరి కిరిల్ సహకారం చాలా ఉంటుంది. రాయల్‌గా సాగుతున్న ఉడ్‌కాక్ జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఉడ్‌కాక్ అన్నింటిని కోల్పోయి బికారిగా, సాధారణ స్థాయికి చేరుకోవడం, అనంతరం చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ చిత్రం. పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వంలో పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.
కాల్ మి బై యువర్ నేమ్
1983 ఇటలీలో జరిగే కథ ఇది. 17ఏండ్ల టీనేజ్ కుర్రాడు ఎలియో వేసవి సెలవుల్లో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటాడు.
ఈ క్రమంలో తన తండ్రి ఓలివర్, ప్రియురాలు మార్జియాతోపాటు మరో స్నేహితుడితో అతని అనుబంధం ఎలా సాగిందనేది సినిమా. పాపులర్ నవల 'కాల్ మి బై యువర్ నేమ్' ఆధారంగా ఈ రొమాంటిక్ కమింగ్ ఏజ్ డ్రామా చిత్రాన్ని రూపొందించారు. టీనేజ్ కుర్రాడిలోని మానసిక సంఘర్షణను, కోరికలను, ఆలోచనలను ప్రతిబింబించే ఈ సినిమాను ల్యూకా గాడనినో రూపొందించారు.
లేడీ బర్డ్
17ఏండ్ల టీనేజ్ అమ్మాయి లేడీ బర్డ్‌కు, తన తల్లికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే చిత్రమిది. హైస్కూల్ సీనియర్ టీనేజ్ గర్ల్ ఓ స్కూల్లో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత తనలో వచ్చిన మార్పేంటి?, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా తన ప్రవర్తన ఎలా ఉందనేది చిత్ర కథాంశం. ఈ కమింగ్ ఏజ్ కామెడీ డ్రామా చిత్రాన్ని గ్రెటా గెర్విగ్ రూపొందించారు.
మడ్ బాండ్
రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇద్దరు సైనికులు(ఒకరు వైట్, మరొకరు బ్లాక్) తిరిగి ఇంటికి బయలు దేరి వస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న జాత్యాంకారాన్ని, వేధింపులను తెలియజేసే చిత్రమిది. ఈ అమెరికన్ పీరియడ్ డ్రామా చిత్రాన్ని డీ రీస్ రూపొందించారు. థ్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్ మిస్సోరీ ఇదొక డార్క్ కామిక్ డ్రామా చిత్రం. కూతురు హత్యకు సంబంధించిన హంతకులను కనిపెట్టడం కోసం ఓ తల్లి పడే వేదన, సంఘర్షణ, తిరుగుబాటును తెలిపే చిత్రం. తన కూతురు హత్యకు గల కారకులను కనిపెట్టాలని తల్లి మిల్డర్డ్ హయీస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఎన్ని రోజులైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకుండాపోతుంది. విసిగిపోయిన ఆ తల్లి పోలీసులకు వ్యతిరేకంగా మూడు వివాదాస్పద పెయింటింగ్ బోర్డులను పెడుతుంది. పోలీసులు ఆమెపై కోపగించుకుంటారు. అంతేకాదు ఆమెతో తరచూ గొడవకు దిగుతుంటారు. దీంతో పోలీసులను ఎదుర్కొంటూ, తన కూతురిని హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు తల్లి చేసే సాహసం నేపథ్యంలో మార్టిన్ మెక్డోనాగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ది ఫ్లోరిడా ప్రాజెక్ట్
కూతురు మూనీతో కలిసి తల్లి హాల్లే ఫ్లోరిడాలోని తక్కువ బడ్జెట్ హోటల్లో నివసిస్తుంటుంది. హాల్లే చాలా కోపిష్టి. రెబల్ కూడా. అయినప్పటికీ సంక్షేమ పథకాలతో మనుగడ సాధిస్తుంటుంది. ఈ క్రమంలో హాల్లే, మూనీ మధ్య అనుబంధం ఎలా సాగింది?, వీరికి హోటల్ మేనేజర్ ఏ విధంగా సహాయపడ్డాడు?, తోటి పిల్లలతో మూనీ చేసి అల్లరి ఏంటనేది సినిమా.
ఈ డ్రామా చిత్రాన్ని సీయాన్ బేకర్ రూపొందించారు.
ది షేప్ ఆఫ్ వాటర్
1962లో అమెరికాలోని కోల్డ్‌వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్న బయోలాజికల్ ల్యాబ్‌లో ఎలిసా అనే మూగ మహిళ పనిచేస్తుంటుంది. ఆ ల్యాబ్‌లో ఆంపీబియన్ (కప్ప తరగతికి చెందిన ఓ రకమైన జీవం)పై ప్రయోగాలు చేస్తుంటారు.
ఈ క్రమంలో ఓ కొత్త రకమైన జీవిని తయారు చేస్తారు.
ఆ జీవి ఎలిసాకు బాగా కనెక్ట్ అవుతుంది. దానితో అనుబంధం ఏర్పర్చుకుంటుంది. దీంతో అనంతరం చోటు చేసుకున్న భయానక, ఆసక్తికర సన్నివేశాల సమాహారమే
ఈ చిత్ర కథాంశం. ఈ ఫాంటసీ డ్రామా చిత్రాన్ని దర్శకులు గుల్లెర్మో డెల్ టోరో తెరకెక్కించారు.
డార్కెస్ట్ హవర్
రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో జరిగిన ఇతివృత్తంతో రూపొందించిన చిత్రమిది. విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన కొద్ది రోజులకే నాజీ జర్మన్ నుంచి అడ్డంకులు ఎదురవుతుంటాయి. రెండు దేశాల మధ్య అనిశ్చితి చోటు చేసుకుంటుంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని ముందు రెండే ఆప్షన్లుంటాయి. ఒకటి శాంతి కోసం జర్మన్‌తో రాజీ కుదుర్చుకోవడం, లేదంటే దానికి
వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగడం. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?, దీని కారణంగా అతనిలో, ప్రభుత్వంలో జరిగిన సంఘర్షణ ఏంటనేది ఈ చిత్ర కథాంశం. ఈ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రానికి జోయి రైట్ దర్శకత్వం వహించారు.
ది బిగ్ సిక్
పాకిస్థాన్‌కు చెందిన హాస్యనటుడు కుమైల్ నాంజియాని, గ్రేడ్ స్టూడెంట్ ఎమిలీ గార్డనర్ ప్రేమలో పడతారు. వారి సంస్కృతులు భిన్నమైనవి. దీంతో వీరి కుటుంబాల్లో కల్చర్‌కు సంబంధించి ఘర్షణ ఏర్పడుతుంది. ఆ టైమ్‌లో ఎమిలీ అనారోగ్యానికి గురవుతుంది. దీంతో ఫ్యామిలీ స్ట్రగుల్స్‌ను ఎదుర్కొని, తన ప్రేమను గెలుచుకోవడానికి కుమైల్ ఏం చేశాడనేది సినిమా. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని మైఖేల్ షోవాల్టర్ రూపొందించారు.
వండర్ ఉమెన్
ప్రిన్సెస్ డయానా అమోజాన్ రాజ్యానికి యువరాణి.
ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విద్యలు నేర్చుకుంటుంది. ఓ విమానం కూలిపోయినప్పుడు వేరే ప్రపంచ వల్ల తమ రాజ్యానికి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటుంది. దీంతో అక్కడికి వెళ్ళి మనుషుల ప్రపంచంతో యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలో తనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తులను పొందగలుగుతుంది. ఆ తర్వాత తన అసలైన విధి ఏంటనేది తెలుసుకోవడమే ఈ చిత్ర కథాంశం. ఈ అమెరికన్ సూపర్ హీరో చిత్రాన్ని దర్శకుడు ప్యాట్టీ జెంకిన్స్ తెరకెక్కించారు.
స్టార్ వార్స్:
ది లాస్ట్ జెడీ
అంతరిక్షంలో ఉన్న గ్రహాలపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో 'స్టార్ వార్స్' సిరీస్ చిత్రాలు రూపొందుతున్న విషయం విదితమే. తాజాగా జెడీ అనే కల్పిత ప్రపంచంపై ఆధిపత్యం కోసం సూపర్ మ్యాన్ శక్తులు, సాంకేతిక పరమైన శక్తిని కలిగిన వర్గాల మధ్య పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.
'స్టార్ వార్స్' సిరీస్‌లో
భాగంగా స్టార్ వార్స్ సీక్వెల్ ట్రయాలజీలో విడుదలైన రెండవ చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. రియాన్ జాన్సన్ ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రానికి దర్శకత్వం వహించారు.
Authorization