ఈ సృష్టి ఎన్నో అద్భుతాలకు, వింతలు విశేషాలకు నెలవు. అలాంటి వింతలు, అద్భుతాలను వెండి తెరపై సినిమాగా తీస్తే చూసి తరించేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఉంటారు. అందుకే సృష్టిలోని అద్భుతాలను సృష్టికి ప్రతిసృష్టిగా ప్రపంచ దర్శక, నిర్మాతలు ఎన్నో సైన్స్ ఫిక్షన్ చిత్రాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ప్రపంచ ప్రేక్షకులను ఫిదా చేసి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది కూడా మరిన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులోని కొన్ని సినిమాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'..
మేజ్ రన్నర్: ది డెత్ క్యూర్..
థామస్ తన గ్రాడర్ గ్రూపుకు లీడర్. భూమిపై జరిగే దాడిని ఎదుర్కొంటుంటారు. వీరు అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను చేపట్టాల్సి వస్తుంది. దాడి చేసే క్రమంలో అక్కడ ప్రజలందరికీ ఓ ప్రాణాంతకమైన వ్యాధి సోకుతుంది. అది అంటు వ్యాధిలా వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేసేందుకు థామస్ బృందం చేసే పోరాటమే ఈ చిత్రం. పోరాడే క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ళేంటనేది సినిమాలో ఆసక్తికరం. విజువల్ వండర్‌గా నిలిచే ఈ చిత్రం ఈ నెల 26న విడుదలై ఆకట్టుకుంది. మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమాకు వెస్ బాల్ దర్శకత్వం వహించారు. 'మేజ్ రన్నర్' ఫిల్మ్ సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడవ చిత్రమిది. థామస్ పాత్రలో డైలాన్ ఓ బ్రియన్ నటన కట్టిపడేస్తుంది. ఇతర పాత్రల్లో థామస్ బ్రాడీ, ప్యాట్రిసియా క్లార్క్సన్, కయా స్కోడెలారియో, డెక్ట్సర్ డర్డెన్, నటాలి ఎమ్మాన్యుయెల్ తదితరులు నటించి మెప్పించారు.
రెడీ ప్లేయర్ వన్
భవిష్యత్‌లో భూమిపై చోటు చేసుకునే పరిణామాలను తెలిపే చిత్రమిది. 2045లో భూమి అధిక జనాభాతో నిండిపోతుంది. దీంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, కాలుష్యం పెరగడం, మనుషుల్లో అవినీతి ఎక్కువ కావడం జరుగుతుంది. వ్యవస్థ మొత్తం అస్తవస్థ్యంగా మారుతుంది. భూమిపై నివాసం భారంగా మారుతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా వర్చ్‌వల్ రియాలిటీ టెక్నాలజీతో 'ఓహసిస్'(ఓంటోలాజికల్లీ ఆంథ్రోపోసెంట్రిక్ సెన్సారీ ఇమ్మెన్సివ్ సిమ్యులేషన్) అనే సరికొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. జనం అంతా అందులోనే ఉండాలను కుంటారు. అక్కడే వినోదం, ఎడ్యూకేషన్ పొందుతుంటారు. ఈ క్రమంలో ఓహసిస్ను తయారు చేసిన ఫౌండర్ చనిపోతాడు. దీంతో దాన్ని కంట్రోల్ చేయడమనేది కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఓహసిస్లోనూ జరిగే పోరాటమే ఈ చిత్రం కథాంశం. స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 30న విడుదలకు సిద్దమవుతుంది. ఇందులో టై షెరిడాన్, ఒలివియా కుక్, బెన్ మెండెల్సోన్, టి.జె.మిల్లర్, సిమన్ పెగ్, మార్క్ రైలాన్స్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అద్భుత చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పసిఫిక్ రిమ్ అప్రైజింగ్
మానవ జాతి రక్షణ కోసం, ప్రపంచ మనుగడ కోసం ఇతర ప్రపంచానికి చెందిన రాక్షస వర్గాలకు, మానవ పైలెట్ వర్గానికి మధ్య జరిగే భీకరమైన పోరాటమే ఈ చిత్ర కథాంశం. అత్యాధునికి టెక్నాలజీ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి స్టీవెన్ ఎస్ డేని నైట్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. అద్భుతమైన విజువల్ వండర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా మార్చి 23న విడుదల కానుంది. 2013లో వచ్చిన 'పసిఫిక్ రిమ్' చిత్రానికిది సీక్వెల్. అది సైన్స్ ఫిక్షన్ చిత్రంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో జాన్ బోయేగా, స్కాట్ ఈస్ట్వూడ్, కైలీ స్పీనీ, చార్లీ డే, బర్న్ గోర్మన్, రింకో కికుచీ, జింగ్ తైయాన్ నటించారు.
బ్లాక్ ఫాంథర్
ఆఫ్రికాలోని వాకండా రాజ్యానికి చెందిన రాజు చనిపోవడంతో తన కుమారుడు, సూపర్‌హీరో, బ్లాక్ ఫాంథర్ అయిన టి.చల్లా తిరిగి తన రాజ్యానికి వస్తాడు. వాకండాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అత్యంత సాంకేతిక పరమైన సూపర్ పవర్స్ కలిగిన ఇద్దరు శత్రువులు ప్రయత్నిస్తుంటారు. వారిని ఎదిరించడమనేది బ్లాక్ ఫాంథర్ తక్షణ కర్తవ్యం. దీంతో వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం సిఐఏతో కలిసి బ్లాక్ ఫాంథర్ చేసే పోరాటమనే ఈ చిత్ర కథ. ఈ సూపర్ హీరో చిత్రానికి ర్యాన్కూగ్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్వెల్ స్టూడియో సంస్థలో వస్తున్న 18వ చిత్రమిది. బ్లాక్ ఫాంథర్ పాత్రలో చాడ్విక్ బోస్మన్ నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
సోలో: ఏ స్టార్ వార్స్ స్టోరీ
గెలాక్సిపై డార్క్ క్రిమినల్ అండర్ వరల్డ్‌లో మంచి కోసం పోరాడే హీరో వర్గానికి చెందిన హాన్ సోలో శత్రువులతో చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా. 'స్టార్ వార్స్' ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న నూతన చిత్రమిది. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లెర్, రాన్ హౌవార్డ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్డెన్ ఎరెన్రిచ్, వూడి హర్రెల్సన్, ఎమిలియా క్లార్క్, డోనాల్డ్ గ్లోవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 25న ఈ సినిమా విడుదల కానుంది. 'స్టార్ వార్స్' సిరీస్‌లో భాగంగా వస్తోన్న ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది.
ప్రిడేటర్
ఇది 1987లో వచ్చిన 'ప్రిడేటర్' చిత్రానికి సీక్వెల్. ఓ దట్టమైన అడవికి కొంత మంది సముహంగా వెళతారు. అందులో ఒక్కొక్కరుగా మాయమవుతుంటారు. కనిపించని ఓ మృగం వారిని చంపేస్తుంటుంది. గతంలో అడివిలోకి వెళ్ళి దాన్నుంచి తప్పించుకున్న వారు ఎంతో నరకం అనుభవిస్తూ మనుగడ కోసం పోరాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ మృగాన్ని ఎలా ఎదుర్కొన్నారనేది ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రానికి షేన్ బ్లాక్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హర్రర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బోర్డు హౌల్ బ్రూక్, ఒలివియా మున్, ట్రెవాంటే రోడ్స్, కీగన్ మైఖేల్ కీ, స్టెర్లింగ్ కె బ్రౌన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్
పరిశోధన నిమిత్తం కొంతమంది టీమ్ జురాసిక్ పార్క్‌కి వెళతారు. అక్కడ డైనోసార్స్తోపాటు మరికొన్ని వింత జంతువులు వీరిపై దాడికి దిగుతాయి. వాటి నుంచి తప్పించుకుని మనుగడ కోసం ఈ టీమ్ చేసే సాహసం, పోరాటమే ఈ చిత్రం. 'జురాసిక్ పార్క్' ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఐదవ చిత్రమిది. దీనికి జె.ఎ.బయోనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హౌవార్డ్, బి.డి.వాంగ్, జేమ్స్ క్రామ్వెల్, టెడ్ లెవిన్, జస్టిస్ స్మిత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 'జురాసిక్ పార్క్' చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన క్రేజ్ ఉంటుంది. దీంతో తాజా చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం జూన్ 2 విడుదల కానుంది.
అన్నిహిలేషన్
కొంత మంది సైనిక బృందం పర్యావరణ విపత్తుకు నెలవుగా మారిన జోన్లోకి వెళతారు. అక్కడ నుంచి ఒక్క సైనికుడు మాత్రమే ప్రాణాలతో బయటకు వస్తాడు. అది కూడా తీవ్ర గాయాలతో. దీంతో ఆ ప్రదేశంలో ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అతని భార్య కొంత మందితో ఆ ప్రాంతానికి వెళ్తుంది. ఆమె బయోలాజిస్ట్. మరి అక్కడ తను ఏం తెలుసుకుంది. అక్కడి భయానక మృగాలు, వింత శక్తులను ఎలా ఎదుర్కొందనేది సినిమా కథ. ఈ సైన్స్ ఫాంటసీ యాక్షన్ హర్రర్ చిత్రాన్ని దర్శకుడు అలెక్స్ గార్లాండ్ రూపొందిస్తున్నారు. బయోలాజిస్ట్ పాత్రలో నటాలియా పోర్ట్మన్, ఆమె భర్త పాత్రలో ఆస్కార్ ఇసాక్, ఇతర పాత్రల్లో జెన్నిఫర్ జాసన్ లెV్‌ా, గినా రోడ్రిగ్విజ్, టెస్సా థాప్సన్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
ది మెగ్..
పరిశోధన నిమిత్తం మాజీ నావికదళ కెప్టెన్, ఎంతో నైపుణ్యం కలిగిన షిప్ డ్రైవర్ జానస్ టైలర్ సముద్ర లోతులోకి వెళ్ళి రిస్క్యూ మిషన్ చేపడతారు. ఈ క్రమంలో దాదాపు 70 అడుగుల పొడవైన షార్క్ ఫిష్ షిప్‌పై దాడి చేస్తుంది. ఆ దాడి నుంచి తప్పించుకుని వెళ్తున్న వీరికి ఎదురైన సంఘటనలేంటి. మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశారనేది చిత్ర కథ. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హర్రర్ చిత్రానికి జోన్ టర్బెల్తాబ్ దర్శకత్వం వహిస్తున్నారు. టైలర్ పాత్రలో జాసన్ స్టాథమ్, ఇతర పాత్రల్లో జెస్సికా మెక్ నామీ, లి బింగ్‌బింగ్ నటిస్తున్నారు. 1997లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ బుక్ 'మెగ్: ఏ నావెల్ ఆఫ్ దీప్ టెర్రర్' ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలిటా: బ్యాటిల్ ఏంజెల్
ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఓ మహిళ చేసే పోరాటమే ఈ చిత్రం. ఈ క్రమంలో ఆ మహిళా జర్నీ, తానెవరు, తనకున్న శక్తి ఏంటి, అదే సమయంలో తనకు సంబంధించిన సరికొత్త నిజాలను తెలుసుకోవడమే ఈ చిత్ర కథాంశం. మహిళా శక్తిని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్తాను చాటేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి రాబర్డ్ రోడ్రిగ్విజ్ దర్శకత్వం వహిస్తుండగా జేమ్స్ కామెరూన్ నిర్మిస్తుండటం విశేషం. రోసా సాలజార్, క్రిస్టోఫ్ వాల్ట్, జెన్సిఫర్ కోన్నెలీ, మహర్షలా అలీ, ఎడ్ స్క్రీయిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న విడుదల కానుందీ చిత్రం.
ది డార్కెస్ట్ మైండ్స్..
ఓ విచిత్రమైన వ్యాధి వల్ల దాదాపు 98శాతం పిల్లలు చనిపోతుంటారు. కేవలం 2శాతం మాత్రమే మనుగడ సాధించగలుగుతుంటారు. ఆ పిల్లలకు సూపర్ పవర్స్‌ను ఇవ్వాలనుకుంటారు. 16ఏండ్ల టీనేజ్ అమ్మాయి రూబీ ఆ పిల్లల క్యాంప్‌లో నుంచి తప్పించుకుని ప్రభుత్వంచే రన్ అవుతున్న మరో గ్రూపులో చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రానికి జెన్నిఫర్ యుV్‌ా నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. రూబీ పాత్రలో అమండ్లా స్టెన్‌బర్గ్ నటిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కానుంది.
Authorization