ప్రేమంటే.. ఏదీ ఆశించకుండా ఉండటమా..?, త్యాగమా...?, ప్రేమించిన వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడమా..?
ఇలా రకరకాలుగా వినిపించినప్పటికీ ఇప్పటివరకు ఎవ్వరూ కచ్చితమైన నిర్వచనమివ్వలేకపోయారనేది వాస్తవం.
కానీ ప్రేమలో పడితే ఎలాంటోళ్లైనా సరే ఓ సరికొత్త అద్భుతమైన ప్రపంచంలో ఉన్నామనే ఫీలింగ్‌తో ఉంటారని చాలా మంది స్వీయానుభవాల సారం చెబుతోంది. అంత గొప్ప ఫీలింగ్‌ని కలుగజేసే ఈ ప్రేమను దర్శక, నిర్మాతలు అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. వారి వారి కోణాల్లో ప్రేమ గురించి చెప్పేందుకు చేసిన ప్రయత్నాల్లో ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని (ఈనెల 14.. బుధవారం) పురస్కరించుకుని ప్రేక్షకుల్ని ఫిదా చేసిన కొన్ని ప్రేమకథా చిత్రాల గురించి అందిస్తున్న స్పెషల్ షో..
ది లాంగెస్ట్ రైడ్
గేమ్ ఆడుతున్న సమయంలో సోఫియా అనే అందమైన అమ్మాయిని చూసి బుల్ రైడర్ ల్యూక్ ప్రేమలో పడతాడు. వారిద్దరూ కలిసి సరదాగా జర్నీ చేస్తున్న సమయంలో కారు యాక్సిడెంట్‌కు గురైన ఓ వృద్ధుడిని కాపాడతారు. ఈ జోడీని చూసిన ఆ వృద్ధుడు తన గతంలోకి వెళ్ళిపోతాడు. బుల్ రైడరైన ఆ వృద్ధుడి ప్రేమ ఎలా సాగింది?, ఆ ప్రేమలోని మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఆ యువ జంటతో పంచుకోవడమే ఈ చిత్ర కథాంశం. యాదృచ్ఛికంగా ఇద్దరు జంటలు ఒకే నేపథ్యానికి చెందిన వాళ్ళు కావడం ఇక్కడ విశేషం. నికోలస్ స్పార్క్స్ రాసిన 'ది లాంగెస్ట్ రైడ్' అనే అత్యంత పాఠకాదరణ పొందిన నవల ఆధారంగా దర్శకుడు జార్జ్ టిల్మన్ జూనియర్ రూపొందించారు. 2015లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో ల్యూక్ పాత్రలో స్కాట్ ఈస్ట్‌వుడ్, సోఫియా పాత్రలో బ్రిట్ రాబర్ట్సన్ నటించగా, మరో జంట పాత్రలో జాక్ హస్టన్, ఊనా చాప్లిన్‌ల నటన మెస్మరైజ్ చేస్తుంది.
ది ఏజ్ ఆఫ్ అడలిన్
29 ఏండ్ల అడలిన్ అనే అమ్మాయి కారు యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్తుంది. కొన్నేండ్ల వరకు ఎలాంటి ఉనికి లేకుండా ఏకాంతంగా బతికేస్తుంది. తనెవరు?, తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?, తనకు ఏమైందనేది అడలిన్కు తెలియదు. అనేక సంవత్సరాల తర్వాత ఆమెను ఓ వ్యక్తి కలుస్తాడు. దీంతో ఆమె తన గతంలోకి వెళ్ళి యుక్త వయసులోని తన ప్రేమను, తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. మరి తన గత ప్రేమ ఎలా సాగింది?, ఎలాంటి పరిణామాలను చవి చూసిందనేది సినిమా. ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేసే ఈ రొమాంటిక్ ఫాంటసీ చిత్రాన్ని దర్శకుడు లీ టోలాండ్ క్రైగర్ రూపొందించారు. 2015లో విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇందులో అడలైన్ పాత్రలో బేక్ లైవ్లీ నటన ఆద్యంతం అద్భుతం.
టంబుల్డౌన్
మ్యూజీషియనైన తన భర్త అకాల మరణంతో హన్నా అనే మహిళ జీవితం గతంలో మాదిరిగా సాగలేని స్థితిలో ఉంటుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సంఘర్షణ పడుతున్న తరుణంలో అనుకోకుండా ఓ రచయిత పరిచయమవుతాడు. హన్నా భర్త మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌కు అతను హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమంలో హన్నా ఆమె ప్రేమలో పడుతుంది. అనంతరం వీరి ప్రేమ ఎలా సాగిందనేది సినిమాలో ఆసక్తికరం. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు సీన్ మెవాషా రూపొందించారు. హన్నా పాత్రలో రెబెక్కా హల్, రైటర్ పాత్రలో జాసన్ సుడైకిస్ నటించి మెప్పించారు. 2015లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలనూ సొంతం చేసుకుని మంచి విజయం సాధించింది.
అలోహ
మిలిటరీ కాంట్రాక్టర్ తన పనిని విజయవంతంగా పూర్తి చేశాక తిరిగి తన క్యాంప్‌కు వస్తాడు. అక్కడ తనతో పనిచేసే ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారి ప్రేమలో పడతాడు. అత్యంత మధురంగా వీరు తమ ప్రేమ బంధాన్ని అనుభవిస్తుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రేమ దూరమైనప్పుడు ఆ జంట పడిన సంఘర్షణ ఏంటనేది సినిమా కథాంశం. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి కామెరాన్ క్రౌ దర్శకత్వం వహించారు. మిలిటరీ అధికారిగా బ్రాడ్లీ కూపర్, లేడీ అధికారి పాత్రలో ఎమ్మా స్టోన్ల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
బ్లైండ్
కారు ప్రమాదానికి గురై ఓ నవలా రచయిత తన కళ్ళతోపాటు, భార్యనూ కోల్పోతాడు. దీంతో ఒంటరి వాడైన అతన్ని నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యాపారవేత్త భార్య కలుస్తుంది. భర్త నిర్లక్ష్యానికి గురైన ఈ మహిళ తరచూ రచయితను కలవడం, అభిరుచులు కలవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. మరి వారి ప్రేమ నిజమైనదా? కాదా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరూ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణే ఈ సినిమా. లేటు వయసులో పుట్టే ప్రేమను తెలిపే ఈ చిత్రానికి మైఖేల్ మెయిలర్ దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రచయిత పాత్రలో అలెక్ బాల్డ్విన్, వ్యాపారి భార్య పాత్రలో డెమి మూరే నటన అలరించడంతోపాటు ఆలోచింప చేస్తుంది.
బ్రీత్
పోలియో కారణంగా వచ్చిన భయంకరమైన వ్యాధి (నెక్ పెరాలిసిస్) బాధపడిన అడ్వకెేట్ రాబిన్ కావెండిష్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తనకు ఆ వ్యాధి రాకముందు డయానా బ్లాకర్‌తో ప్రేమలో పడతాడు. ఇద్దరు ఒక్కటై ఎంతో సంతోషకరమైన ప్రేమ జీవితాన్ని గడుపుతారు. 28 ఏండ్ల వయసులో రాబిన్‌కి నెక్ పెరాలిసిస్ వస్తుంది. అయినప్పటికీ దాన్ని ఎదిరించి తన జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు, తను అనుకున్నది సాధించేందుకు అతను పడే తపన, ఈ క్రమంలో తన భార్య డయానా అందించిన సపోర్ట్‌ను తెలిపే చిత్రమిది. అంతేకాకుండా తనలా బాధపడేవారికి స్ఫూర్తిగా ఉండేందుకు ఈ భార్యాభర్తలు చేసిన సుదీర్ఘ ప్రయాణమే ఈ చిత్రం. ఆద్యంతం హృదయాలను స్పృశించేలా సాగే ఈ చిత్రానికి ఆండీ సెర్కిస్ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం టొరంటో వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలు అవార్డులను అందుకుంది. ఇందులో రాబిన్ పాత్రలో ఆండ్రూ గార్ఫీల్డ్, డయానా పాత్రలో క్లైర్ ఫోరుల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
బ్రూక్లిన్
బ్రూక్లిన్కు వలస వచ్చి హోమ్ సిక్‌గా ఫీలవుతున్న ఐర్లాండ్‌కు చెందిన ఓ అమ్మాయికి టోని అనే ఓ ఛార్మింగ్ కుర్రాడు పరిచయమవుతాడు. అతని సాన్నిహిత్యంతో హోమ్ సిక్ ఫీలింగ్ నుంచి బయటపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. హఠాత్తుగా తన సోదరి చనిపోయినట్టు తెలియడంతో ఆ అమ్మాయి తిరిగి ఐర్లాండ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఎలాగూ బ్రూక్లిన్ వస్తాననే నిర్ణయంతో టోనిని అదరాబాదరగా పెళ్ళి చేసుకుంటుంది. ఐర్లాండ్ వెళ్ళాక తిరిగి రావడం కష్టంగా మారుతుంది. ఐర్లాండ్‌లో ఉండలేక, బ్రూక్లిన్కు రాలేక తనెలాంటి ఇబ్బందులు పడింది?, ఈ ప్రేమ జంట జీవితంలో అనూహ్యంగా చోటు చేసుకున్న మార్పులేంటనేది సినిమా కథాంశం. జాన్ క్రౌలీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం 2015లో విడుదలై మంత్రముగ్దుల్ని చేసింది. ఐర్లాండ్ అమ్మాయిగా సోయిర్స్ రోనన్, టోనీ పాత్రలో ఎమోరీ కోహెన్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు.
ది స్పేస్ బిట్వీన్ అజ్
అంగారక గ్రహంపై ప్రయోగ నిమిత్తం కొంత మంది వ్యోమగాములు రాకెట్లో బయలుదేరుతారు. అందులో గర్భవతి అయిన ఓ మహిళా వ్యోమగామి కూడా ఉంటుంది. కొన్ని ఏండ్లపాటు అక్కడ ప్రయోగాలు జరుగుతాయి. అంగారక గ్రహంపైనే ఆ మహిళకు ఓ కొడుకు జన్మిస్తాడు. దాదాపు 16ఏండ్ల తర్వాత వారు భూమిపైకి వస్తారు. అంగారక గ్రహంపై జన్మించిన ఆ కుర్రాడు భూమి వాతావరణ పరిస్థితులకు అలవాటు కావడానికి చాలా టైమ్ పడుతుంది. ఈ క్రమంలో ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. భూమిపై మనుగడ కోసం, తన ప్రేమ కోసం ఈ ప్రేమికులిద్దరు పడే తపనే ఈ చిత్రం. పీటర్ చెల్సోమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం గతేడాది విడుదలైంది. గారి ఓల్డ్ మాన్, ఆసా బటర్ఫీల్డ్, కార్లా గుగినో, బ్రిట్ రాబర్ట్సన్ల నటన అందర్నీ ఫిదా చేస్తుంది.
మీ బిఫోర్ యు
నాలెజ్డ్తోపాటు అమాయకత్వం లూయిసా క్లర్క్ సొంతం. సేవ చేసే గుణం కూడా ఎక్కువే. అప్పటి వరకు చేస్తున్న జాబ్ అర్థాంతరకంగా పోతుంది. యాక్సిడెంట్ కారణంగా పక్షవాతం రావడంతో తల తప్ప శరీరంలోని ఇతర భాగాలను కదిలించలేని విల్‌కు కేర్ టేకర్‌గా లూయిసా జాయిన్ అవుతుంది. అతని గురించి తెలుసుకుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. వీరి ప్రేమ బలపడిన తర్వాత ఒకరికొకరు తోడ్పడుతూ ఒకరి జీవితాలను మరొకరు ఎలా మార్చుకున్నారనేది కథ. అద్భుతమైన ప్రేమ కథకు, హృదయాలను కదిలించే భావోద్వేగాలకు ఈ చిత్రం ప్రతిరూపం. ఈ బ్రిటీష్- అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని 'మి బిఫోర్ యు' అనే నవల ఆధారంగా దర్శకుడు థీయ షారోక్ 2016లో రూపొందించారు. 20 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 208 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
Authorization