జాంగ్ జియి.. అందం, అభినయంతో విశ్వ ప్రేక్షకుల్ని ఫిదా చేసిన కథానాయికే కాదు మెరుపువేగంతో శత్రువుని మట్టికరిపించే యాక్షన్ క్వీన్ కూడా. కమర్షియల్ చిత్రాల్లోని పాత్రలతో విలక్షణతను చూపిస్తూనే, మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లో పోరాడే యోధురాలిగా మహిళా శక్తిని చాటిన అసమాన నటి. అభిరుచిగల నిర్మాతగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్న చైనీస్ స్టార్ హీరోయిన్ జాంగ్ జియి గురించి
ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
మలుపు తిప్పిన తొలి చిత్రం..
చైనాలోని బీజింగ్‌లో పుట్టిన జాంగ్ జియి తండ్రి జాంగ్ యువాన్సువోయా అకౌంటెంట్. తల్లి లీ జుషెంగ్ టీచర్. చిన్నప్పట్నుంచి డాన్స్ పట్ల మక్కువతో శిక్షణ తీసుకుని 15 ఏండ్ల ప్రాయంలోనే జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో హాంకాంగ్ టెలివిజన్ ప్రకటనల్లో నటించే అవకాశాలొచ్చాయి. అలా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన జాంగ్ ఆ తర్వాత ప్రతిష్టాత్మక సెంట్రల్ అకాడమీ డ్రామా స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న తరుణంలో ప్రముఖ చైనీస్ దర్శకుడు జాంగ్ యిమౌ 'ది రోడ్ హోమ్' (1999) చిత్రానికి జాంగ్ని ఎంపిక చేశారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యుక్త వయసు అమ్మాయిగా జాంగ్ నటించింది. టీచర్‌తో ప్రేమలో పడే అమ్మాయిగా అమయాకత్వ నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. అంతేకాదు హండ్రెడ్ ఫ్లవర్స్ అవార్డునూ దక్కించుకుంది. బెర్లిన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ఈచిత్రం సిల్వర్ బీర్ ప్రైజ్‌ను గెల్చుకుంటే, జాంగ్ వీక్షకుల మనసుల్ని దోచేసింది.
అంతర్జాతీయ గుర్తింపు..
పరిశ్రమలోకి అడుగిడి అతి తక్కువ టైమ్‌లోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నటిగా జాంగ్ రికార్డు సృష్టించింది. 2000 సంవత్సరంలో విడుదలైన మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ చిత్రాలు 'క్రౌచింగ్ టైగర్', 'హిడెన్ డ్రాగన్' చిత్రాలు జాంగ్‌ను స్టార్‌ను చేశాయి. అంతేకాదు ఆయా చిత్రాల్లో మార్షల్ విద్యలతో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఈ చిత్రాలు జాంగ్‌కు హాలీవుడ్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేశాయి. ఆ వెంటనే అమెరికన్ చిత్రం 'రష్ అవర్ 2'లో నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆమె నటించిన తొలి అమెరికా చిత్రం కావడం ఓ విశేషమైతే, ఇందులో నెగటివ్ పాత్రను పోషించడం మరో విశేషం. హాలీవుడ్‌లోకి అడుగిడుతూనే ఓ సరికొత్త పాత్రలో విలక్షణమైన నటనను కనబర్చి ఆకట్టుకుంది. 2002లో హాంకాంగ్ నటుడు టోనీ లెండ్తో కలిసి 'హీరో' చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి జాంగ్ యిమౌ (ది రోడ్ హోమ్) దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డునందుకుంది. ఆ తర్వాత నటించిన మరో కమర్షియల్ చిత్రం 'పర్పుల్ బట్టర్ఫ్లై' కేన్స్‌లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత తనకు మంచి పట్టున్న మార్షల్ ఆర్ట్స్ జోనర్లో 'హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగ్గర్స్' చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి కూడా జాంగ్ యిమౌనే దర్శకత్వం వహించడం విశేషం. చైనీస్ సూపర్ స్టార్ టకెషి కనెషిరోతో తొలిసారి జాంగ్ నటించిన చిత్రమిది. చైనీస్ టాప్ నటీనటులు నటించిన రొమాంటిక్ డ్రామా '2046' జాంగ్ నటించిన తన స్పెషాలిటీని మరోసారి చాటుకుంది. ఇందులో స్ట్రగుల్ పడే వేశ్యగా జాంగ్ బాడీ లాంగ్వేజ్, హావభావాలకు ప్రేక్షకుల అభినందనలతోపాటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. అంతేకాదు హాంకాంగ్ ఫిల్మ్ అకాడమీ అవార్డు కూడా వరించింది. జాంగ్‌కు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'జాస్మిన్ ఉమెన్' మరొకటి. 'ఉమెన్ లైవ్స్' అనే నవల ఆధారంగా రూపొందిన చిత్రమిది. 2005లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన 'ప్రిన్సెస్ రాక్కూన్' చిత్రం అనేక అవార్డులను దక్కించుకోవడంతోపాటు జాంగ్‌ను ఇంటర్నేషనల్ స్టార్ హీరోయిన్నిచేసింది. దీని తర్వాత నటించిన 'ది బాక్విట్' చిత్రం సైతం జాంగ్కి అగ్ర కథానాయికగా మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది.
హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర..
2007లో అమెరికన్ యానిమేషన్ చిత్రం 'టిఎమ్ఎన్టి'కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆ తర్వాత 2008లో అమెరికన్ సినిమా 'ఫరెవర్ ఎంత్రాల్డ్'లో నటించే ఛాన్స్ అందుకుంది. పెకింగ్ ఎపెరా నటుడు మెయి లాఫాంగ్కు సంబంధించిన కథ ఆధారంగా రూపొందించిన బయోగ్రాఫికల్ చిత్రమిది. ఇందులో మెయి ప్రియురాలి పాత్రలో జాంగ్ తనదైన అందం, అభినయంతో మెప్పించింది. ఇందులోని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జాంగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమాలో 'ది హార్స్‌మెన్' ఒకటి. ఇందులో హాలీవుడ్ నటుడు డెన్నిస్ క్వాయిడ్ సరసన నటించడం విశేషం. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన జాంగ్ 2009లో మళ్ళీ తిరిగి చైనా చిత్రాల్లో నటించింది. రొమాంటిక్ కామెడీ చిత్రం 'సోఫీ రివేంజ్', ఎయిడ్స్‌పై అవగాహన నేపథ్యంలో వచ్చిన 'లవ్ ఫర్ లైఫ్' చిత్రాలు చైనాలో జాంగ్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాయి. 2012లో ఫ్రెంచ్ నవల ఆధారంగా వచ్చిన 'డేంజరస్ లైసన్స్'లో ప్రముఖ నటులు సెసెలియాచాంగ్, జంగ్ డాంగ్‌లతో కలిసి నటించింది. ఈ చిత్రానికిగానూ ఆమె 3.5 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకుంది. అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్గా జాంగ్ రికార్డు సృష్టించింది.
'ఫరెవర్', 'ది గ్యాంగ్‌మాస్టర్', 'ది బాంక్విట్', 'మై లక్కీ స్టార్', 'ది క్రాసింగ్', 'ఓ మై గాడ్', 'రన్ ఫర్ లవ్', 'ది వేస్టెడ్ టైమ్స్' వంటి తదితర బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించింది జాంగ్ తిరుగులేని కథానాయికగా చైనాలో గొప్ప పేరు తెచ్చుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'ది బాంక్విట్' ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆమె నటించిన సైన్స్‌ఫిక్షన్ 'ది క్లెవర్ఫీల్డ్ పారాడాక్స్' ఈ ఏడాది ఫిబ్రవరిలో, డ్రామా చిత్రం 'ఫరెవర్ యంగ్' జనవరిలో విడుదలయ్యాయి. ప్రస్తుతం నటిస్తున్న 'గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాతగా..
జాంగ్ జియి చైనీస్ రాక్ మ్యూజిషియన్ వాంగ్ ఫెంగ్‌ను 2015లో వివాహమాడారు. వీరికి ఓ కూతురు వాంగ్ గ్జింగ్గ్జింగ్ ఉన్నారు. నటిగా, డాన్సర్‌గానే కాదు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. 'సోఫీ రివేంజ్' చిత్రాన్ని నిర్మించడంతో పాటు అందులో నటించారు. 'మై లక్కీ స్టార్', 'ఓ మై గాడ్' వంటి తదితర చిత్రాలను నిర్మించిన జాంగ్ చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవలకుగానూ 2013లో ఆర్డె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ పురస్కారం అందుకున్నారు. 2008 షాంగై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు చైనీస్ సినిమా' అవార్డును, 2010లో యాక్ట్రెస్ ఆఫ్ ది డికేడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. టైమ్స్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావితమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. 2006లో కేన్స్ జ్యూరీ మెంబర్‌గా పనిచేసిన జాంగ్ 'కేర్ ఫర్ చిల్డ్రన్'కు అధికార ప్రతినిథిగా, చైనా స్పెషల్ ఒలంపిక్స్‌కు, మొదటి బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు, స్క్రీన్ సింగపూర్ 2011 ఫిల్మ్ ఫెస్టివల్‌కు, ఆనాథల కోసం మెడికల్ క్యాంప్స్ నిర్వహించే చిల్డ్రన్ ఆఫ్ చైనా పెడియాట్రిక్ ఫౌండేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. 2012లో చైనీస్ వెబ్సైట్ బోక్సన్ తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినందుకు 100 మిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేశారు. అలాగే హాంకాంగ్‌కు చెందిన నెక్ట్స్ మీడియాపై కూడా కోర్టుకెక్కారు.
మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లో నట విశ్వరూపం..
కమర్షియల్ చిత్రాల్లోనే కాదు మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లోనూ జాంగ్ అత్యద్భుతమైన నటనా ప్రతిభను చూపింది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో యుద్ధనారిగా జాంగ్ మహిళా శక్తిని చాటింది. మార్షల్ ఆర్ట్స్ విద్యల్లో ఆరితేరిన అమ్మాయిగా ఆయా చిత్రాల్లో తనదైన యాక్షన్‌తో మెస్మరైజ్ చేసింది. జాంగ్ పేరు వినగానే మెరుపు వేగంతో ఫైట్ చేసే యోధురాలు గుర్తుకొస్తుంది. అదే జాంగ్ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతకే విశ్వ ప్రేక్షకులు జాంగ్‌కు ఫిద్ అయిపోయారు. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లో ముఖ్యంగా 'క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్' చిత్రం గురించి చెప్పుకోవాలి. తన రక్షణ కోసం యుద్ధవీరుడైన ప్రియుడు ఇచ్చిన ఖడ్గాన్ని ఓ వ్యక్తి దొంగిలిస్తారు. అతన్ని పట్టుకుని తన ఖడ్గాన్ని తిరిగి పొందేందుకు రహస్యంగా యుద్ధ విద్యలు నేర్చుకునే ఉన్నత మహిళ పాత్రలో జాంగ్ నటన మైమరిపిస్తుంది. యాక్షన్ టెలివిజన్ సిరీస్ 'లెజెండ్ ఆఫ్ జు మౌంటేన్'లో గెస్ట్ పాత్రలో తనదైన యాక్షన్‌తో జాంగ్ అలరించింది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా వచ్చిన మరో చిత్రం 'హీరో'. క్రీ.పూ.227లో క్విన్ అనే రాజ్యానికి చెందిన రాజును హత్య చేసిన జింగ్ కె చరిత్రక కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో యుద్ధ వీరురాలిగా, జింగ్ కెను ఎదురించే మహిళగా జాంగ్ తనదైన నట విశ్వరూపం చూపించింది. ఇందులో చైనా అగ్ర నటుడు టోని లెంగ్తో కలిసి నటించడం విశేషం. దర్శకుడు జాంగ్ యిమౌ దర్శకత్వంలో జాంగ్ జియికిది రెండో చిత్రం. ఇక జియి యాక్షన్‌కు, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రతిబింబం 'హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగ్గర్స్'. ఇందులో బ్లైండ్ డాన్సింగ్ గర్ల్, యుద్ధ విద్యల్లో అత్యంత ప్రతిభ కలిగిన ఫైటర్‌గా నటించింది. పోలీస్‌లకు, రెబల్స్‌కి జరిగే యుద్ధంలో రెబల్ నాయకురాలిగా జాంగ్ చేసే అద్భుత పోరాటం కట్టిపడేస్తుంది. చైనీస్ స్టార్ హీరో తకెషి కనెషిరోతో కలిసి నటించారు. అంధురాలిగా కనిపించేందుకు రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంది. జాంగ్ యిమౌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004లో విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టడంతోపాటు ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. విలియమ్ షేక్స్పీయర్ రాసిన ట్రాజెడీ నవల 'హామ్లెట్' ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామా 'ది బంక్విట్' చిత్రంలో యువరాణి వాన్ పాత్రలో హుందాతనం, ధీరత్వం, పోరాట పటిమ కలిగిన యోధురాలిగా జాంగ్ నటన శభాష్ అనిపించేలా ఉంటుంది. ఏడేండ్ల గ్యాప్ తర్వాత జాంగ్ నటించిన మార్షల్ ఆర్ట్స్ చిత్రం 'ది గ్రాండ్‌మాస్టర్'. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, వింగ్ చున్ ఆర్ట్స్ టీచర్, బ్రూస్లీ గురువు ఐపీ మ్యాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రత్యర్థి కూతురు పాత్రలో జాంగ్ నటించారు. ఇందులో ఐపీ మ్యాన్‌గా చైనీస్ స్టార్ టోనీ లెంగ్ నటించడం విశేషం. వీరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రమిది. ఆస్కార్‌కు సైతం నామినేటైందీ సినిమా. ఎపిక్ హిస్టారికల్ రొమాంటిక్ వార్ డ్రామా చిత్రం 'ది క్రాసింగ్'. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా 1940లో చైనా రివల్యూషన్ టైమ్‌లో జరిగిన డిజాస్టర్ ప్రధానంగా రూపొందించారు. ఇందులో పెళ్లైన జంటగా తకేషి కనెషిరోతో కలిసి జాంగ్ నటించిన తీరు ఆద్యంతం అద్భుతం.
నాణానికి మరో వైపు..
మార్షల్ ఆర్ట్స్ చిత్రాలతోనే కాదు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తోనూ హాలీవుడ్ ప్రేక్షకుల్ని సైతం జాంగ్ ఫిదా చేసింది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా.. జోనర్ ఏదైనా, పాత్ర ఏదైనా వాటికి పూర్తి న్యాయం చేయటం ఆమె నటనా ప్రతిభకు నిదర్శనం. 'ది రోడ్ హోమ్'లో టౌన్ టీచర్ ప్రేమలో పడే అమాయక యువతిగా, 'రష్ అవర్ 2'లో నెగటివ్ రోల్లో సైకోగా, 'పర్పుల్ బట్టర్ఫ్లై'లో ప్రతిఘటన దళం 'పర్పుల్ బట్టర్ఫ్లై'కి చెందిన సభ్యురాలిగా, 'మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్‌స్టర్ 2'లో అతిథి నటిగా, నాలుగు తరాలకు చెందిన వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలను తెలిపే మహిళా ప్రధాన చిత్రం 'జాస్మిన్ ఉమెన్'లో మూడు జనరేషన్స్ బామ్మగా, తల్లిగా, కూతురిగా, 'మెమరీస్ ఆఫ్ ఏ గైషా'లో వేశ్యగా, డాన్సర్‌గా, 'లవ్ ఫర్ లైఫ్' చిత్రంలో ఎయిడ్స్ బాధితురాలిగా, చైనా ప్రభుత్వం నిర్మించిన చిత్రం 'ది ఫౌండింగ్ ఆఫ్ ఏ రిపబ్లిక్'లో చైనాలోని విదేశీ వ్యవహరాలు చూసే అధికారిగా, 'బెటర్ అండ్ బెటర్' చిత్రంలో అతిథి హాస్యనటిగా, 'మై లక్కీ స్టార్' ప్రేమికురాలు సోఫీగా, 'ఓ మై గాడ్'లో విలక్షణ ప్రేమికురాలిగా, ఐదు ప్రేమ కథల నేపథ్యంలో రూపొందిన 'రన్ ఫర్ లవ్' చిత్రంలో చైనాకు చెందిన ప్రేమికురాలిగా జాంగ్ తన అద్భుతమైన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇటు కమర్షియల్ చిత్రాలతో, అటు మార్షల్ ఆర్ట్స్ చిత్రాలతో దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన ముద్రతో ప్రేక్షకుల మదిపై జాంగ్ చెరగని సంతకం చేసింది. అందం, అభినయం, అద్భుతమైన వ్యక్తిత్వం అన్నింటికి మించి సేవాగుణం జాంగ్‌ను విశ్వస్థాయిలో ఉత్తమ మహిళగా నిలిపింది.
Authorization