మన దగ్గరే కాదు హాలీవుడ్‌లోనూ సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకోవటానికి బోల్డెన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. రొమాంటిక్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ యాక్షన్, సైకలాజికల్ హర్రర్ థ్రిలర్..
ఇలా రకరకాల జోనర్ల నేపథ్యంతో ఈనెల ఐదు సినిమాలు వేసవి వినోదానికి కర్టెన్ రైజర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
మిడ్నైట్ సన్..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి జీవిత సంఘర్షణను తెలిపే చిత్రమిది. 17 ఏండ్ల టీనేజ్ అమ్మాయి కేటీ, తన తండ్రితో కలిసి ఉంటుంది. సూర్యరశ్మి తగిలితే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న ఒక అరుదైన వ్యాధితో కేటీ బాధపడుతుంటుంది. ఈ వ్యాధి కారణంగా ఆమెకు ఇల్లే ప్రపంచం అవుతుంది. లైఫ్‌లాంగ్ ఇంట్లోనే గడపాల్సి వస్తుంది. బయటి ప్రపంచాన్ని చూడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కేటీకి ఛార్లీ అనే కుర్రాడు పరిచమయవుతాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఛార్లీని ప్రేమించిన తర్వాత కేటీ జీవితం ఎలా మారింది?, సూర్యరశ్మిని ఎదిరించి సాధారణ జీవితం గడిపేందుకు కేటీ ఏం చేసిందనేది సినిమా. స్కాట్ స్పీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేటీ పాత్రలో బెల్లా తోర్నె, ఛార్లీ పాత్రలో పాట్రిక్ స్చ్వార్జ్నెగ్గర్ నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పసిఫిక్ రిమ్: అప్ రైజింగ్
2013లో వచ్చిన 'పసిఫిక్ రిమ్' చిత్రానికిది సీక్వెల్. రహస్య సాంకేతిక శక్తులు కలిగిన కైజు వర్గం, భయానక రూపాలు కలిగిన సముద్ర జాతులకు చెందిన రోగ్స్ పదేండ్ల తర్వాత భూమిపై, మానవ నివాసాలపై దాడి చేస్తుంటాయి. అంతేకాదు నిబంధనలను సైతం ఖాతరు చేయకుండా యుద్ధానికి దిగుతాయి. దీంతో వాటిని కంట్రోల్ చేయడానికి స్టాకర్ పెంటకోస్ట్ తనయుడు జేక్ పెంటకోస్ట్ టీమ్ చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రానికి నూతన దర్శకుడు స్టీవెన్ ఎస్.డెనైట్ దర్శకత్వం వహించారు. ఇందులో జేక్ పెంటకోస్ట్ పాత్రలో జాన్ బోయేగా, ఇతర పాత్రల్లో స్కాట్ ఈస్ట్‌వుడ్, కైలీ స్పాయినీ నటించారు. విజువల్ వండర్‌గా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 23న విడుదల కానుంది. వేసవిలో చల్లటి వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది.
అన్సాన్
తనకు తాను భయంతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ ఆవేదనను తెలిపే చిత్రమిది. సాయెర్ వాలెంటిని మానసికంగా ఇబ్బందులు పడుతున్న బిజినెస్ ఉమెన్. ఆమెకు తరచూ పాత బారుఫ్రెండ్కు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. తనను ఎవరో వెంటాడుతున్నట్టు ఆందోళన చెందుతుంది. దీంతో మెంటల్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. బయటి వాళ్ళను కలిసే అవకాశామే ఉండదు. దీంతో తను మరింతగా భయాందోళనకు గురవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆ భయాందోళనల నుంచి ఎలా బయటపడింది?, ఇంతకి తనలో ఉన్నది భయమా లేక భ్రమ? అనేది సినిమా కథాంశం. ప్రముఖ దర్శకుడు స్టీవెన్ సొడెన్బర్గ్ ఈ చిత్రాన్ని సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఇందులో సాయెర్ పాత్రలో క్లైర్ ఫోరు నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. వేసవి కానుకగా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది.
రెడీ ప్లేయర్ వన్
సమీప భవిష్యత్‌లో మనిషి జీవన విధానాన్ని తెలిపే చిత్రమిది. 2045లో భూమిపై కాలుష్యం పెరిగిపోతుంది, అధిక జనాభా, అవినీతి, వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ టైమ్‌లో కొత్తగా క్రియేట్ చేయబడిన డిస్టొపియన్ ఎర్త్‌లో మనుషులంతా ఓవాసిస్ అనే వర్వ్చువల్ స్పేస్‌తో కనెక్ట్ అయి ఉంటారు. అదొక రకమైన గేమ్ లాంటిది. ఎక్కువ సమయం అందులోనే గడిపేస్తుంటారు. దాన్ని కనిపెట్టిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఎదురైన సమస్యలేంటి?, దాన్ని కంట్రోల్ చేసేందుకు వేడ్ వాట్స్ అనే కుర్రాడు ప్రయత్నిస్తుంటే, దాన్ని మిస్యూజ్ చేసేందుకు కొంతమంది ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో విజయం ఎవరికి దక్కిందనేది సినిమా. హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంపై సర్వత్రా క్రేజ్ నెలకొంది. వేడ్ వాట్స్ పాత్రలో టై షెరిండన్ నటించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఎక్రిమోని
నమ్మి ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త కొద్ది రోజులకే మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. తాను మోసపోయానని తెలుసుకున్న భార్య, భర్తపై రివేంజ్ తీర్చుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్రం. ఓ మహిళలోని సంఘర్షణను తెలిపే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి టైలర్ పెర్రీ దర్శకత్వం వహించారు. ఇందులో భార్య పాత్రలో తరాజీ పి.హెన్సన్, భర్త పాత్రలో లిరిక్ బెంట్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
Authorization