ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే
71వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈనెల 8న అంగరంగ వైభవంగా ఫ్ర్రాన్స్లో ఆరంభం కానుంది. సినిమా అభివృద్ధి, నవ్యత, నాణ్యత, నూతన ప్రతిభ ఆవిష్కరణ, ప్రోత్సాహమే లక్ష్యంగా కొనసాగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'..
ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్ది ఎవర్ గ్రీన్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రపంచ సుందరాంగులందరూ ట్రెండీ దుస్తులతో రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ హల్చల్ చేస్తారు. వారి అందాలను బంధించేందుకు కెమెరా ఫ్లాష్‌లు పోటీపడుతుంటాయి. రెడ్‌కార్పెట్‌పై ప్రపంచ దేశాల కథానాయికలతోపాటు మన భారతీయ నటీమణులు కూడా సందడి చేస్తుంటారు. సోనమ్ కపూర్ గత ఏడేండ్లుగా రెడ్ కార్పెట్‌పై మెరుస్తూ అందర్నీ మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఈ సారి కూడా ఆమెకు లోరియల్ కాస్మొటిక్ బ్రాండ్ తరఫున పాల్గొనే ఛాన్స్ రావడం విశేషం. కేన్స్‌లో సోనమ్ ఎనిమిదోసారి పాల్గొనబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక కాస్ట్యూమ్స్‌ను తయారు చేయించుకునే పనిలో నిమగమై ఉంది. ఈ ఫెస్టివల్లో సోనమ్ 14, 15 తేదీలో రెడ్ కార్పెట్‌పై భిన్నమైన ట్రెండీ డ్రెస్‌లతో సందడి చేయనుంది. సోనమ్‌తోపాటు తొలిసారి కంగనా రనౌత్ కూడా కేన్స్‌లో అడుగుపెట్టేందుకు ఎంపికైంది. అలాగే ఐశ్వర్యరారు 12, 13 తేదీల్లో, దీపికా పదుకొనె 10, 11 తేదీల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోనున్నారు. కేన్స్‌లో పాల్గొనడం ఐశ్వర్యకిది 17వ సారి కావడం విశేషం. మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్యాషన్ రంగంలో వస్తున్న కొత్త పుంతలను అందిపుచ్చుకుని నవ్యమైన కాస్ట్యూమ్స్ ధరించి కథానాయికలు ఎర్రతివాచీపై హోయలు పోతుంటే చూసే వీక్షకులకు అద్భుతమైన కనువిందు. ఇదిలా ఉంటే, అన్సర్టెన్ రిగార్డ్ సెక్షన్లో నటి, ఫిల్మ్ మేకర్ నందితా దాస్ తెరకెక్కించిన 'మంటో' చిత్రం అవార్డుకు పోటీపడుతుండటం విశేషం.
ఈ నెల 8 నుంచి 19 వరకు (12 రోజులు) ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరిగే 71వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంరంభానికి సర్వం సిద్ధమైంది. విశ్వవ్యాప్తంగా సినిమా పండుగగా భావించే ఈ చలన చిత్రోత్సవంలో ఏడాది ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలు ఉన్నాయని నిర్వాహక కమిటీ చెబుతోంది. ఆస్ట్రేలియన్ కథానాయిక కేట్ బ్లాంచెట్ అధ్యక్షురాలిగా 9 మంది సభ్యుల జ్యూరీ పోటీలో పాల్గొన్న చిత్రాల్లో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేస్తుంది. అలాగే ఉత్తమ చిత్రానికి ప్రతిష్టాత్మక 'పాల్మా డి ఓర్' పురస్కారాన్ని అందిస్తారు. ఇందులో భాగంగానే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, బెస్ట్ డాక్యుమెంటరీ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్లకూ అవార్డులను బహూకరిస్తారు.
పోస్టర్ ప్రత్యేకత..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు విశిష్ట సేవలందించిన సినీ ప్రముఖుల గౌరవార్థం వారి గుర్తుగా,
వాళ్ళ ఫొటోలు లేదా వారి పాపులర్ చిత్రాలతో పోస్టర్స్ రూపొందిస్తుంటారు. గతంలో పాల్ న్యూమ్యాన్, మార్సిల్లో మాస్ట్రోయిన్ని, ఇంగ్రిడ్ బెర్గ్‌మ్యాన్, మార్లిన్ మాన్రో వంటి ప్రముఖుల ఫొటోలను పోస్టర్లుగా వేశారు. 2016లో ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్, ఫిల్మ్ క్రిటిక్ జీన్ లూక్ గోడార్డ్ గౌరవార్థం ఆయన రూపొందించిన పాపులర్ చిత్రం 'కాంటెప్ట్'ని పోస్టర్‌గా విడుదల చేశారు. గతేడాది ఇటాలియన్ నటి క్లాడియా కార్డినాలె గౌరవార్థం కేన్స్ ఫెస్టివల్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక మరోసారి ఫ్రెంచ్ దర్శకుడు జీన్ లూక్ గోడార్డ్ 1965లో రూపొందించిన 'పియరోట్ లే ఫౌ' చిత్ర పోస్టర్‌ను 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్‌గా డిజైన్ చేశారు. హీరోహీరోయిన్లు జీన్ పాల్ బెల్మోండో, అన్నా కరినా ముద్దు పెట్టుకునే ఫ్రేమ్‌తో ఈ పోస్టర్ ఉంది. ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ జార్జెస్ పియర్రె ఫ్రెంచ్ సినిమాతోపాటు ప్రపంచ సినిమాకు చేసిన సేవలకుగానూ ఆయన జ్ఞాపకార్థం ఈ పోస్టర్‌ను డిజైన్ చేయడం విశేషం. ఈ ఏడాది కేన్స్ క్లాసిక్స్‌గా '2001: ఏ స్పేస్ ఒడిస్సీ' ఒకే ఒక్క చిత్రం ప్రదర్శితం కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫిల్మ్ మేకింగ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఫ్రాన్స్ ఎడ్యూకేషన్ అండ్ ఫైన్ ఆర్ట్స్ మంత్రిత్వ శాఖ ఈ సినిమా వేడుకలను ప్రారంభించింది. సినీ ప్రియుల్లో స్ఫూర్తిని నింపడంతోపాటు సినిమాలు తీయాలనుకునే వారిని ప్రోత్సహించడం, సినిమాలు తీసిన వారిని ప్రమోట్ చేయడం, సినిమా పరిశ్రమలను అభివృద్ధి చేయడంతోపాటు అన్ని దేశాలు ఒక పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభమైంది. దీనిలో భాగంగా వరల్డ్‌వైడ్‌గా అనేక దేశాలకు చెందిన సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శనకు పోటీ పడుతుంటాయి. వివిధ దేశాల సినీ ప్రముఖులు, ఫిల్మ్ మేకర్స్‌తోపాటు సినీ ప్రేమికులు ప్రతి ఏటా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక రెడ్ కార్పెట్‌పై అందాల తారలు చేసే క్యాట్‌వాక్‌లు, వారి అందాలను బంధించడానికి పోటీలు పడే కెమెరా క్లిక్క్లు ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఈ ఏడాది జరగబోతున్న 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 8 నుంచి ప్రారంభమై 19వ తేదీతో ముగుస్తుంది. 12 రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేన్స్ ప్రతిష్టాత్మక 'పాల్మా డి ఓర్' పురస్కారం కోసం ఈ ఏడాది పలు దేశాలకు చెందిన దాదాపు 21 సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిల్లో కొన్ని చిత్రాల విశేషాలు..
జాక్వెస్ టోండెల్లి అనే రచయిత వయసు ఇంకా 40 కూడా దాటలేదు. కానీ అతని జీవితం అనుమానాస్పదమవుతుంది. గందరగోళంగా తయారవుతుంది. అతనికి తోడుగా ఓ విద్యార్థి ఆర్థర్ ప్రిగెంట్ వస్తాడు. తనకి చదవడం, నవ్వడం ఇష్టం. ఈ నేపథ్యంలో భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగి ఈ ఇద్దరు దగ్గరవడమనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'సారీ ఏంజెల్'. క్రిస్టోఫ్ హానర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్రెంచ్ డ్రామా చిత్రంలో జాక్వెస్ పాత్రలో పీయిర్రె డెలాడోంచాప్స్ నటించారు. పేద కుటుంబంలో జన్మించిన ఒక ఫ్యామిలీలోని పిల్లలు, పెద్దలంతా వంకర బుద్ధి కలిగి ఉంటారు. రోజువారి పనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తుంటారు. పేద కుటుంబంలోని అనుబంధాలను, సంఘర్షణను తెలిపే జపనీస్ డ్రామా చిత్రం 'షాప్లిఫ్టర్'కు హిరోకాజు కోరె ఎడా దర్శఖత్వం వహించారు. లిలీ ఫ్రాంకీ, సాకురా ఆండో, మయు మట్సుకా, సోసుకె కెమట్సు ప్రధాన పాత్రల్లో నటించారు.
1950 పోలాండ్ కోల్డ్‌వార్ టైమ్‌లో ఇద్దరు ప్యాషనేట్ లవర్స్ మధ్య ప్రేమను తెలిపే చిత్రం 'కోల్డ్ వార్'. విభిన్న నేపథ్యాలు, భిన్న మనస్తత్వాలు, స్వభావాలకు చెందిన ప్రేమికుల ప్రేమాయణం ఎలా సాగిందనే ఇతివృత్తంతో డ్రామా,రొమాన్స్ నేపథ్యంలో రూపొందిన ఈ పోలాండ్ చిత్రానికి పవెల్ పవ్లికోవిస్కీ దర్శకత్వం వహించారు.
ముగ్గురు వ్యక్తులు ఎవరికి వారు తమ స్టయిల్లో జీవితాన్ని సాగిస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన ఓ మిస్టీరియస్ ఇన్సిడెంట్ వల్ల వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఇతివృత్తంతో 'బర్నింగ్' చిత్రాన్ని మిస్టీరియస్ డ్రామాగా దర్శకుడు లీ ఛాంగ్ డాంగ్ రూపొందించారు.
ఒక కుక్కల పోషకుడి జీవితాన్ని తెలిపే చిత్రమిది. కుక్కలను పోషిస్తూ సాధారణ జీవితం గడిపే ఓ వ్యక్తి జీవితంలోకి ఓ మ్యూజిషియన్ (పబ్‌లో పని చేసే వ్యక్తి) వస్తాడు. ఆ తర్వాత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీంతో అతని జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారంగా రూపొందించిన చిత్రం 'డాగ్‌మ్యాన్'. మట్టియో గర్రోనె దర్శకత్వం వహించిన ఈ ఇటాలియన్ డ్రామా చిత్రంలో డాగ్‌మ్యాన్ పాత్రలో అడమో డియోనిసి నటించారు.
కరోలినా స్పానిష్ మహిళ. బ్యూనస్లో ఉంటుంది. తన భర్త, పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళ్తుంది. అక్కడ వీరి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఇంతకి ఆ ఘటన ఏంటి? వీరి గత జీవితం ఏంటనే కథాంశంతో దర్శకుడు అస్ఘర్ ఫర్హాది 'ఎవ్రీబడీ నోస్' చిత్రాన్ని రూపొందించారు.
'ఏ సపరేషన్' వంటి ఆస్కార్ అవార్డు చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడీయన. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో కరోలినా పాత్రలో పెనెలోప్ క్రజ్ నటించారు. భర్త పాత్రలో జేవియర్ బార్డెమ్ నటించారు. లజ్జారో అనే స్వచ్ఛమైన మనస్తత్వం కలిగిన రైతుకు, ఓ డిఫరెంట్ మెంటాలిటి కలిగిన సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. అబద్దాలు వారిని కలిపితే, ఓ నిజం వారిని దూరమయ్యేలా చేయడమనే కథాంశంతో దర్శకులు అలైస్ రోహర్వచర్ 'హ్యాపీ యాజ్ లజ్జారో' చిత్రాన్ని రూపొందించారు.
అన్నె.. పోర్న్ చిత్రాల నిర్మాత. నటి లూయిస్‌తో కలిసి భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించాలనుకుంటారు. కానీ ఓ మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ వీరి ప్లాన్‌ను చెడగొట్టే ప్రయత్నం చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రం 'నైఫ్ ప్లస్ హార్ట్'. ఈ ఫ్రెంచ్ డ్రామా చిత్రాన్ని యాన్ గొంజాలెజ్ తెరకెక్కించారు.
అమెరికా భద్రతా దళాలు అప్ఘనిస్తాన్‌లో చేసిన దాడి నేపథ్యంలో రూపొందించిన చిత్రం 'ఎట్ వార్'. స్టీఫెన్ బ్రిజ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్రెంచ్ డ్రామా చిత్రంలో విన్సెంట్ లిండన్ ప్రధాన పాత్రలో నటించారు. అసాకో అనే అమ్మాయి బాకు అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు బాకు కనిపించకుండా పోతాడు. రెండేండ్ల తర్వాత తన ప్రియుడిని పోలిన మరో వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో 'అసాకో 1 అండ్ 2' చిత్రం తెరకెక్కింది. రయిస్యుకే హమాగుచి దర్శకత్వం వహించిన ఈ ఫ్రెండ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో బాకు పాత్రలో మసాహిరో, అసాకో పాత్రలో ఎరికా కరాటా నటించారు.
ఓపెనింగ్-క్లోజింగ్ చిత్రాలు
కాంపిటీషన్ సెక్షన్లో ఓపెనింగ్ చిత్రంగా 'ఎవ్రీబడీ నోస్', క్లోజింగ్ చిత్రంగా 'ది మ్యాన్ హు కిల్డ్ డాన్ క్విక్సోట్'ను ప్రదర్శించనున్నారు. అన్ సర్టెన్ రిగార్డ్‌లో 'డాన్బాస్' (ఉక్రెయిన్), స్పెషల్ స్క్రీనింగ్‌లో 'వైల్డ్‌లైఫ్' (అమెరికా) ఓపెనింగ్ చిత్రాలుగా, పారలల్ సెక్షన్లో 'గారు'(ఫ్రాన్స్) క్లోజింగ్ చిత్రంగా ప్రదర్శించనున్నారు.
పోటీ విభాగంలో..
సినిమా ఎంపిక ప్రధానంగా మూడు రకాల సెక్షన్స్ ఉంటాయి. అందులో
'ద అఫీషియల్ సెక్షన్' కీలకమైంది. రెండోవది 'పార్లల్ సెక్షన్', మూడవది అదర్ సెక్షన్. అఫీషియల్ సెక్షన్లో అవార్డుల కోసం పోటీపడుతున్న సెక్షన్, పోటీలో లేని సెక్షన్, అన్ సర్టెన్ రిగార్డ్, స్పెషల్ స్క్రీనింగ్, సినీఫౌండేషన్, షార్ట్‌ఫిల్మ్స్ ఉంటాయి. ఈ సారి 21 సినిమాలు మెయిన్ కాంపిటీషన్లో 'పాల్మె డి ఓర్' అవార్డు కోసం పోటీపడుతున్నాయి. వాటిలో 'ఎట్ వార్' (ఫ్రాన్స్), 'అసాకో 1, 2' (జపాన్), 'అష్ ఈజ్ పురెస్ట్ వైట్' (చైనా), 'బర్నింగ్' (సౌత్ కొరియా), 'కెపర్నాయుమ్' (లెబనాన్), 'బ్లాక్క్లాన్సమన్' (అమెరికా), 'కోల్డ్ వార్' (పోలాండ్), 'డాగ్‌మ్యాన్' (ఇటలీ), 'ఎవ్రీబడీ నోస్' (స్పెయిన్), 'గర్ల్స్ ఆఫ్ ది సన్' (ఫ్రాన్స్), 'హ్యాపీ యాజ్ లజ్జారో' (ఇటలీ), 'ది ఇమేజ్ బుక్' (ఫ్రాన్స్, స్విట్జర్లాండ్), 'నైఫ్ ప్లస్ హార్ట్' (ఫ్రాన్స్), 'ది లిటిల్ వన్' (కజఖ్‌స్తాన్), 'షాప్లిఫ్టర్' (జపాన్), 'సారీ ఏంజెల్' (ఫ్రాన్స్), 'సమ్మర్' (రష్యా), 'త్రీ ఫేసెస్' (ఇరాన్), 'అండర్ ది సిల్వర్ లేక్' (అమెరికా), 'ది వైల్డ్ పీయర్ ట్రీ' (టర్కీ), 'యోమెడ్డినె' (ఈజిప్ట్) వంటి చిత్రాలు
అవార్డు కోసం పోటీపడుతున్నాయి.
అన్ సర్టెన్ రిగార్డ్
సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను వాటి గౌరవార్థం ప్రదర్శిస్తారు. వీటిలో
'ది ఏంజెల్' (అర్జెంటీనా, స్పెయిన్), 'ఏంజెల్ ఫేస్' (ఫ్రాన్స్), 'బార్డర్' (స్వీడన్, డెన్మార్క్), 'ది డెడ్ అండ్ ది ఆదర్స్' (పోర్చుగల్), 'డై మాంస్టర్, డై' (అర్జెంటీనా), 'డాన్బాస్' (ఉక్రెయిన్), 'యిఫోరియా' (ఇటలీ), 'ఫ్రెండ్' (కెన్యా), 'ది జెంటిల్ అండిఫరెన్స్ ఆఫ్ ది వరల్డ్'(కజఖ్‌స్థాన్, ఫ్రాన్స్), 'గర్ల్'(బెల్జియం), 'ది హర్వెస్టర్స్' (సౌతాఫ్రికా, ఫ్రాన్స్, పోలాండ్, గ్రీస్), 'ఇన్ మై రూమ్' (జర్మనీ, ఇటలీ), 'లిటిల్ టిక్‌లెస్' (ఫ్రాన్స్), 'లాంగ్ డేస్ జర్నీ ఇన్‌టూ నైట్' (చైనా), 'మంటో' (ఇండియా), 'మై ఫేవరేట్ ఫాబ్రిక్' (ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ), 'సెక్స్టేప్' (ఫ్రాన్స్), 'సోఫియా' (బెల్జియం) వంటి చిత్రాలు గౌరవార్థం ప్రదర్శించబడంతోపాటు అవార్డుల కోసం పోటీపడుతున్నాయి.
ఇందులో 'గర్ల్', 'ది హార్వెస్టర్స్', 'లిటిల్ టిక్‌లెస్', 'మై ఫేవరేట్ ఫ్యాబ్రిక్'
వంటివి నూతన దర్శకులు రూపొందించిన చిత్రాలు కావడం విశేషం.
స్పెషల్ స్క్రీనింగ్
ఈ విభాగంలో పర్యావరణాన్ని పరిరక్షించే చిత్రాలను గుర్తించి, ప్రత్యేకంగా ప్రదర్శించడం జరుగుతుంది. వాటిలో 'అనదర్ డే ఆఫ్ లైఫ్' (పోలాండ్,స్పెయిన్, జర్మనీ, బెల్జియం, హంగేరి), 'డెడ్ సౌల్స్' (చైనా), 'ది గ్రేట్ మిస్టికల్ సర్కస్' (బ్రెజిల్), 'పోప్ ఫ్రాన్సిస్: ఏ మ్యాన్ ఆఫ్ హిజ్ వరల్డ్' (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్), 'ది స్టేట్ ఎగెనెస్ట్ మండెలా అండ్ ది అదర్స్' (ఫ్రాన్స్), '10 ఇయర్స్ థాయిలాండ్' (థాయిలాండ్), 'టు ది ఫోర్ వైండ్స్' (ఫ్రాన్స్), 'ఆన్ ది రోడ్ ఇన్ ఫ్రాన్స్' (ఫ్రాన్స్) వంటి చిత్రాలున్నాయి.
సినీ ఫౌండేషన్, షార్ట్ ఫిల్మ్స్..
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఫిల్మ్ స్కూళ్ళలో విద్యార్థులు తీసిన చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. ఇందులో షార్ట్‌ఫిల్మ్స్, అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలుంటాయి. 'ఈక్వల్లీ రెడ్ అండ్ బ్లూ', 'ఫైమ్ మినిట్స్ ఔట్‌సైడ్', 'యాజ్ ఈజ్ ఆన్ ఎర్త్', 'రబ్బర్ డాల్ఫిన్', 'ది స్టోమ్స్ ఇన్ అవర్ బ్లడ్', 'డాట్స్', 'ది సమ్మర్ ఆఫ్ ది ఎలెక్ట్రిక్ లయన్', 'ఎండ్ ఆఫ్ సీజన్', 'ఏ పీస్ ఆఫ్ ట్రాజెడీ', 'ఐ యామ్ మై ఓన్ మధర్', 'ఇనానిమేట్', 'ఇన్నీ', 'కాలెండర్', 'హెక్టర్స్ నైట్‌ఫాల్', 'లైక్ ఏ గుడ్ కిడ్', 'పాల్మ్ ట్రీస్ అండ్ పవర్ లైన్స్', 'సైలర్స్ డిలైట్' చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే, 'ఆల్ దీస్ క్రియేచర్స్', 'కారో8లిన్', 'డ్వాలిటీ', 'గాబ్రియెల్', 'ఇల్', 'జడ్జ్మెంట్', 'టరికి', 'ఆన్ ది బార్డర్' వంటి లఘు చిత్రాలు పోటీలో ఉన్నాయి.
డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్..
'అమిన్' (ఫ్రాన్స్), 'బర్డ్స్ ఆఫ్ ప్యాసేజ్' (కొలంబియా), 'బరు మీ ఏ గన్' (మెక్సీకో),'కార్మెన్ అండ్ లోలా' (స్పెయిన్), 'క్లైమాక్స్' (ఫ్రాన్స్), 'లీవ్ నో ట్రేస్' (అమెరికా), 'ది లోడ్' (సెర్బియా, ఫ్రాన్స్), 'మాండీ' (అమెరికా), 'మిరాయి ఆఫ్ ది ఫ్యూచర్' (జపాన్), 'ది వరల్డ్ ఈజ్ యువర్స్' (ఫ్రాన్స్), 'ది ప్లుటో మొమెంటో' (చైనా), 'పెట్రో'(స్పెయిన్, ఫ్రాన్స్), 'సమౌని రోడ్' (ఇటలీ, ఫ్రాన్స్), 'లాస్ సైలెన్సాస్' (బ్రెజిల్, కొలంబియా, ఫ్రాన్స్), 'ది స్నాక్చ్ థీఫ్' (అర్జెంటీనా), 'టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్' (ఫ్రాన్స్), 'థ్రెట్ మీ లైక్ ఫైర్' (ఫ్రాన్స్), 'ట్రోప్పాగ్రాజియా' (ఇటలీ), 'ది ట్రబుల్ విత్ యు' (ఫ్రాన్స్), 'డియర్సన్' (బెల్జియం, ఫ్రాన్స్).
ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా వంటి తదితర దేశాలకు చెందిన చిత్రాలు పోటీ పడుతుంటే మన దేశం నుంచి ఒక్క సినిమా కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. నవ్యతకు, నాణ్యతకు, నూతన ప్రతిభకు పట్టం కట్టే ఇటువంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో కనీసం వచ్చే ఏడాదైనా భారతీయ సినిమాలు పోటీ పడాలని కోరుకుందాం.
Authorization