మోనికా బెల్లూచి..
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఎవర్గ్రీన్ గ్లామర్ క్వీన్. అందం, అభినయంతో ఇటాలియన్ చిత్ర పరిశ్రమనే కాకుండా హాలీవుడ్‌ని సైతం షేక్ చేసిన స్టార్ హీరోయిన్. అగ్ర హీరోలకు దీటుగా రాణించిన కథానాయిక. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి చిత్ర పరిశ్రమలోకి అడుగిడిన మోనికా సినీ ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం. సెక్స్ సింబల్ ఇమేజ్‌తో ఇటు మోడల్‌గా, అటు కథానాయికగా తరచూ సంచలనాలు సృష్టిస్తున్న మోనికా గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
మోడల్‌గా కెరీర్ ఆరంభం..
ఇటాలియన్ నటిగానే కాకుండా హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన మోనికా బెల్లూచి 1964, సెప్టెంబర్ 30న ఇటలీలోని ఉంబ్రియాకు చెందిన సిట్టా డి కాస్టెల్లో పట్టణంలో జన్మించారు. బ్రునెల్లా బ్రిగాంటి, పస్క్వాలె బెల్లూచి తల్లిదండ్రులు. వీరికి ఒకే ఒక్క సంతానం మోనికా బెల్లూచి. ఆమె బాల్యం మొత్తం శాన్ గిస్టినో పట్టణంలో సాగింది. పెరుగియా యూనివర్సిటీలో లా విద్యనభ్యసించారు. 13వ ఏట హైస్కూల్ టైమ్‌లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. స్థానికంగా జరిగే ఈవెంట్లలో పాల్గొనేవారు. 1988లో యూరప్‌లోని ఫ్యాషన్ సెంటర్ మిలన్లో ఫ్యాషన్ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మొదట ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రెంచ్ మ్యాగజైన్ ఎల్లెలో మోడల్‌గా ఆకట్టుకున్నారు. డోల్కె అండ్ గబ్బానా సంస్థలో డిజైనర్‌గా వర్క్ చేశారు. 1989లో పారిస్‌తోపాటు అట్లాంటిక్, న్యూయార్క్‌లో ప్రముఖ ఫ్యాషన్ మోడల్‌గా పాపులర్ అయ్యారు. ఆ టైమ్‌లోనే 1990లో ఫొటోగ్రాఫర్ క్లాడియో బాస్సోను వివాహం చేసుకున్నారు. నాలుగేండ్లకే విడిపోయారు. ఆ తర్వాత 1996లో వచ్చిన 'ది అపార్ట్మెంట్' చిత్ర సమయంలో ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ కాస్సెల్తో పరిచయం ఏర్పడింది. మూడేండ్ల తర్వాత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి సంతానంగా ఇద్దరు కుమార్తెలు డెవా, లియోని జన్మించారు. 2013 ఆగస్ట్‌లో విడాకులు తీసుకున్నారు.
స్టార్ హీరోయిన్..
1989లో సినిమాల్లో రాణించాలని యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్ళారు. తొలుత 'విటా కోయి ఫిగ్లీ' అనే టెలివిజన్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. 1991లో కామెడీ చిత్రం 'ది రఫ్లీ'లో నటించి మెప్పించారు. 'స్టాకర్స్ డ్రాకులా'లో గ్యారీ ఓల్డ్మన్ వాంపైర్ పాత్ర పోషించగా, బెల్లూచి చిన్న పాత్రలో మెరిశారు. ఇలా వరుసగా 'ఎస్టినాటో డెస్టినో', 'బ్రిగంటి అమోరె ఈ లిబెర్టా', 'ఐ మిటికి', 'స్నోబాల్', 'బిట్స్ అండ్ పీసెస్', టెలివిజన్ ఫిల్మ్ 'జోసెఫ్'తోపాటు 'అపార్ట్మెంట్', 'సోరెల్లినా ఈ ఎల్ ప్రిన్సిపల్ డెల్ సోంగో', 'స్ట్రీస్సటి', 'డోమెర్మాన్న్', 'మావైస్ జెనర్', 'కమ్ మి వుయోయి', 'లె ప్లైసిర్', 'కాంప్రమైజ్', 'కపుట్ట్ ముండి', 'ఏ లాస్ క్వీ ఎమాన్', 'కామ్మె అన్ పాయిజన్ హర్స్ డె లీయు', 'మెడిటర్రెనీస్' వంటి విభిన్న కథా చిత్రాల్లో అందం, అభినయంతో మెప్పించారు. ఈ చిత్రాలు మోనికాకు సరైన గుర్తింపును, ఇమేజ్ను తీసుకురాలేకపోయాయి. 2000లో వచ్చిన 'మలెనా' చిత్రం సంచలన విజయం సాధించింది. ఒక్కసారిగా మోనికా స్టార్ హీరోయిన్ అయ్యింది. అప్పట్లో ఇటాలియన్ సినీ పరిశ్రమలో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓ రకంగా మోనికాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. 'బ్రదర్ హుడ్ ఆఫ్ ది వోల్ఫ్', 'అండర్ సస్పీషన్', 'ఎర్రెవెర్సిబుల్' చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో మంచి గుర్తింపు పొందారు. అగ్ర నటిగా ఎదిగారు. ఇవి హాలీవుడ్, యూరప్‌లో సైతం మోనికాకు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి. 'టీయర్స్ ఆఫ్ ది సన్', 'ది మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ది ప్యాషన్ ఆఫ్ ది క్రిస్ట్', 'ది బ్రదర్స్ గ్రిమ్', 'లె డెక్సీమె సౌఫ్లీ', 'షూట్ ఎమ్ అప్', 'డోంట్ లుక్ బ్యాక్', 'ది సోర్సెరర్స్ అప్రెంటిస్' వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవంతమైన నటిగా ఎదిగారు. 'ఆస్టెరిక్స్ అండ్ ఒబెలిక్స్ మీట్ క్లియోపాత్రా' చిత్రంలో క్లియోపాత్రగా మోనికా నటన విమర్శకుల్ని సైతం మెప్పించింది. ఇలా తన మూడు దశబ్దాల కెరీర్లో దాదాపు 65 చిత్రాల్లో నటించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జీవితం ఆధారంగా రూపొందాల్సిన 'సోనియా' బయోపిక్‌లో సోనియా పాత్రకు మోనికా ఎంపికయ్యారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా రద్దయ్యింది. మోనికా ఇటాలియన్, ఫ్రెంచ్ చిత్రం 'షూట్ ఎమ్ అప్'కి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే వీడియో గేమ్ 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా: వారియర్ విథిన్'లో కైలీనాకు, ఫ్రెంచ్ యానిమేషన్ ఫిల్మ్ 'రాబర్ట్స్'కి ఫ్రెంచ్ వెర్షన్ వాయిస్ ఇచ్చారు. ఈ క్రమంలో రెండు ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్, ఒక గ్లోబో డి ఓరో అవార్డులనందుకున్నారు.
సెక్స్ సింబల్ ఇమేజ్..
మోనికా నటిగానే కాదు మోడల్‌గా పలు మ్యాగజైన్లకు హాట్ లుక్‌లో ఫొటోలిస్తూ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో 'మెన్స్ హెల్త్ అనే మేగజీన్ ప్రకటించిన 100 హాటెస్ట్ ఉమెన్ ఆఫ్ ఆల్ టైమ్ విభాగంలో 21వ స్థానంలో నిలిచారు. 2002లో మోస్ట్ డిజైరబుల్ మహిళగా నిలిచారు. అంతేకాదు రెండు వార్తాపత్రికలు ఆమెపై సెక్స్ సింబల్ ముద్ర వేశాయి. 2004లో ఫ్రెగెన్సీ టైమ్‌లో న్యూడ్‌గా ఫోజులిచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. అలాగే 2010లో అదే తరహాలో కవర్ పేజ్‌కు ఫోజిలిచ్చారు. అనేక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. 'మ్యాట్రిక్స్' సిరీస్‌లోని తన పర్సెఫోన్ పాత్రకుగానూ ఎంపైర్ మ్యాగజైన్ ప్రకటించిన 'ది సెక్సీయెస్ 25 క్యారెక్టర్స్ ఇన్ సినిమా ది ఉమెన్'లో 21వ స్థానంలో నిలిచారు. 2009లో ప్రపంచంలోని అత్యంత సెక్సీయెస్ట్ ఉమెన్‌గా 25వ స్థానం దక్కించుకున్నారు. మోనికా మూడేండ్ల క్రితం వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'స్పెక్టర్'లో నటించారు. వయసు పైబడిన బాండ్‌గర్ల్‌గా ప్రసిద్ధి చెందారు. అప్పటికే ఆమె వయసు 50 ఏండ్లు కావడం విశేషం.
మెస్మరైజ్ చేసిన మోనికా చిత్రాలు..
ఒక పెయింటర్, ఫిల్మ్ స్టార్ వివాహం చేసుకుంటారు. వీరి వైవాహిక జీవితం రొమాంటిక్‌గా సాగుతుంది. రోమన్లో హాలీడేస్‌ను ఎంజారు చేస్తుంటారు. అక్కడికి మరో జంట వస్తుంది. ఆ తర్వాత వీరి వివాహ జీవితంలో చోటు చేసుకున్న స్ట్రగుల్స్, సంఘర్షణకు ప్రతిరూపమే 'ఏ బర్నింగ్ హాట్ సమ్మర్'. ఇందులో ఫిల్మ్ స్టార్‌గా మోనికా బెల్లూచి నటించారు. ఆమెకు భర్తగా పెయింటర్ పాత్రలో లూయిస్ గర్రెల్ నటించారు. విభిన్న భావోద్వేగాలు పంచుతూనే తనదైన అందంతో బెల్లూచి నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
రాబర్ట్ తన ప్రియురాలు సారాతో అనుబంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వీరి మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల ప్రియురాలు అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. దీంతో అతడికి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ క్రమంలో ఆల్బా అనే గాల్లరీ ప్రొప్రెటర్ అతని జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో రూపొందిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'ది మ్యాన్ హు లవ్స్'. తన లవర్ విడిపోవడానికి, ఆల్బాకు ఉన్న సంబంధమేంటనేది ఆసక్తికరం. ఇందులో ఆల్బా పాత్రలో మోనికా బెల్లూచి కన్నింగ్ లేడీగా ఆకట్టుకున్నారు.
వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. మలెనా ఓ అందమైన మహిళా. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కలిగే కోరికలతో నలిగిపోతుంది. తనను తాను వెతుక్కునే క్రమంలో తన అందానికి ముగ్దుడైన ఓ కుర్రాడిని చూసి మలెనా ఆకర్షితురాలవుతుంది. ఆ తర్వాత వీరి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర రొమాంటిక్ సన్నివేశాల సమాహారమే 'మలెనా' చిత్ర కథాంశం. ఇందులో మలెనా పాత్రలో మోనికా బెల్లూచి నటన ఆద్యంతం కనువిందు చేయడంతోపాటు అందం, అభినయం, తన విలక్షణ నటన ఆ కుర్రాడినే కాదు ప్రేక్షకులనూ మంత్రమగ్దుల్ని చేస్తుంది. ఇటాలియన్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం 2000లో విడుదలై వివాదాస్పద చిత్రంగా నిలిచింది.
మాక్స్ ఔత్సాహిక రచయిత. తన ప్రియురాలు లిసాతో మనస్పర్థల వల్ల విడిపోతాడు. కొంత కాలానికి మాక్స్‌కి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా తన మాజీ ప్రియురాలిని చూస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది 'ది అపార్ట్మెంట్' సినిమా. మాజీ ప్రియురాలు లీసా పాత్రలో మోనికా నటించారు.
ఓ 12ఏండ్ల అమ్మాయి మర్డర్ మిస్టరీలో లాయర్ సాక్ష్యుడిగా ఉంటాడు. హత్యకేసులో అతను ఎలా ఉపయోగపడ్డాడు, సంపన్న టాక్స్ అటార్నీ హెన్రీకి, అతని భార్యకు మధ్య దూరం పెరగడానికి కారణమేంటనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'అండర్ సస్పీషియస్'. ఈ ఫ్రెంచ్ థ్రిల్లర్ చిత్రంలో అటార్నీ భార్య పాత్రలో మోనికా నటించి ఆకట్టుకున్నారు. కేన్స్‌లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది.
ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులంతా విభిన్న వ్యాపకాలతో, కోరికలతో, ఆలోచనలతో ఉంటారు. అవి నెరవేరని పరిస్థితుల్లో నిరాశతో బతుకుతుంటారు. కుటుంబ పెద్ద అయిన తండ్రి మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత వారి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే 'రిమెంబర్ మీ, మై లవ్' చిత్ర కథాంశం. ఇందులో ప్రియురాలి పాత్రలో మోనికా బెల్లూచి నటన ఆద్యంతం అలరిస్తుంది.
ఇద్దరి మధ్య ప్రేమకు సంబంధించిన జరిగిన సంఘర్షణ ఏంటనేది 'హౌమచ్ డుయు లవ్ మీ' కథాంశం. ఇందులో వ్యభిచారిగా తన అందం, అభినయంతో మోనికా ఆకట్టుకున్నారు. అదే సమయంలో వృత్తిపరంగా, ప్రేమకు మధ్య జరిగిన సంఘర్షణలో నలిగిపోయే సన్నివేశాల్లో మోనికా నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
జీన్నె రచయిత, పెళ్లై ఇద్దరు పిల్లలుంటారు. క్రమంలో ఆమె శరీరంలో మార్పు వస్తుంది. అద్దంలో చూసుకుంటున్నప్పుడు మరో మహిళ ఫేస్ ప్రతిబింబిస్తుంది. దీంతో మానసికంగా ఆమె ఇబ్బంది పడుతుంటుంది. మరి ఆమెలో మార్పుకు కారణమేంటి, గతంలో జీన్నె ఎవరు అనేమిస్టరీ అంశాల సమాహారమే 'డోంట్ లుక్ బ్యాక్' చిత్రం. ఈ మిస్టరీ హర్రర్ డ్రామా చిత్రంలో జీన్నె యువ ఏజ్‌లో, మరో రహస్య మహిళగా రెండు పాత్రలతో మోనికా కనువిందు చేశారు.
బోస్నియా, హర్జెగోవినా యుద్ధం అనంతరం పనిచేసిన బెబ్రాస్కా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాత్రిన్ బోల్కోవాక్ జీవితం స్ఫూర్తిగా రూపొందిన చిత్రమిది. శాంతి కోసం, సెక్స్ ట్రాఫికింగ్‌పై ఆమె చేసిన పోరాటం, ఈ క్రమంలో తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌ను ప్రతిబింబించేలా 'ది విజిల్ బ్లౌవర్' చిత్రం రూపొందింది. కత్రీనాకు, లారాకు మధ్య సంబంధమేంటనేది ఇందులో ఆసక్తికరం. లారా పాత్రలో మోనికా నటన ఆద్యంతం అద్భుతం.
గ్లోబల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ స్పెక్టర్‌కు వ్యతిరేకంగా జేమ్స్‌బాండ్ చేసే పోరాట నేపథ్యంలో రూపొందిన జేమ్స్ బాండ్ చిత్రం 'స్పెక్టర్'. ఇందులో అందమైన క్రిమినల్ లూసియా పాత్రలో మోనికా నటించారు. ఆమె నటించిన మొదటి బాండ్ చిత్రమిది. అంతేకాదు బాండ్ సినిమాల్లో నటించిన అత్యంత వయస్సు(50ఏండ్లు) కలిగిన కథానాయిక కూడా మోనికానే కావడం విశేషం. ఈ చిత్రంలోని మోనికా నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సామ్ మెండిస్ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Authorization