వూడీ అలెన్.. వైవిధ్యమైన హాస్యానికి కేరాఫ్. హాస్య ప్రధాన చిత్రాలకు మన తెలుగునాట జంధ్యాల ఎంత ప్రసిద్ధో హాలీవుడ్లో అలెన్ కూడా అంతే. ఆయన సినిమాలు చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవాల్సిందే. రెగ్యులర్ కామెడీని నవ్య పంథాలోకి మార్చిన ఘనత వూడీదే. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా విశేష ఆదరణ పొందిన అసమాన ప్రతిభావంతుడు. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా పలు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి వూడీ అలెన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
జోకులంటే మక్కువ..
న్యూయార్క్‌లోని బ్రూక్లెయిన్ పట్టణంలో 1935 డిసెంబర్ 1న జన్మించారు. అసలు పేరు అలెన్ స్టీవార్డ్ కోనిగ్స్‌బర్గ్. 17వ ఏట తన పేరును హేవుడ్ అలెన్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆ పేరు కాస్త వూడీ అలెన్‌గా మారిపోయింది. అలెన్ తండ్రి మార్టిన్ సేల్స్‌మెన్‌గా, జువెలరీమెన్గా, టాక్సీ డ్రైవర్‌గా రకరకాల ఉద్యోగాలు చేసేవారు. ఆ తర్వాత బుక్ మేకర్‌గా స్థిరపడ్డారు. తల్లి నెట్టి బుక్‌కీపర్‌గా పనిచేశారు. అలెన్‌కు సోదరి లెట్టీ ఉన్నారు. ఆమె నిర్మాతగా రాణించారు. తల్లిదండ్రులు కలిసి ఉండకపోవడంతో అలెన్ బాల్య జీవితం అసంతృప్తిగానే సాగింది. ఆయన ఎక్కువగా తల్లి నెట్టి దగ్గరే పెరిగారు. హెబ్య్రూస్కూల్, పబ్లిక్ స్కూల్, మిడ్వుడ్ హైస్కూల్లో ఉన్నత చదువు పూర్తి చేశారు. అలెన్‌కు చిన్నప్పట్నుంచి జోకులంటే ఇష్టం. వాటిని పేపర్‌పై రాసేవారు. 20 ఏండ్లు వచ్చే సరికి వాటిపై మరింత ఆసక్తి ఏర్పడింది. జోక్స్ రాసి న్యూస్ పేపర్‌కు అమ్మేవారు. అంతేకాదు ఆయన మంచి బేస్‌బాల్ క్రీడాకారుడు కూడా. మ్యాజిక్ ట్రిక్స్ ఉపయోగించి ఆడటం వల్ల బాగా పాపులర్ అయ్యారు. రాసిన జోక్స్ వల్ల వచ్చే డబ్బుతో న్యూయార్క్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ విభాగంలో మాస్టర్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల మాస్టర్స్‌ని పూర్తి చేయలేకపోయారు. అలాగే మోషన్ పిక్చర్ ప్రొడక్షన్ కోర్స్ చేసి ఫెయిల్ అయ్యారు.
పేపర్ జోక్స్ టు కామెడీ సినిమాలు..
చదువు పరంగా పెద్దగా రాణించలేకపోవడంతో తన ఆసక్తి అంశమైన జోకులను నమ్ముకున్నారు. తన జోకులను రెగ్యులర్‌గా న్యూస్ పేపర్స్‌కు పంపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమంగా టెలివిజన్స్ కామెడీ సీన్స్ రాయడం ప్రారంభించారు. 'యు షో ఆఫ్ షోస్'కి ఆయన రాసిన జోకులు బాగా పేలాయి. దీనికిగానూ ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.1950 నుంచి చాలా టెలివిజన్స్ షోస్‌కి రైటర్‌గా పనిచేశారు. 'ది కోల్గేట్ కామెడీ హవర్' అందులో ఒకటి. ఇలా వరుసగా 'ది ఎడ్ సుల్లీవన్ షో', 'ది టునైట్ షో', 'సెసర్ హవర్', 'క్యాండిడ్ కెమెరా' వంటి టెలివిజన్ సిరీస్‌లకు పనిచేశారు. టెలివిజన్ షోస్ బోర్ కొట్టడంతో న్యూయార్స్ సిటీ కామెడీ క్లబ్ సర్య్కూట్లో కామెడీ స్కిప్ట్స్ రాస్తూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత హాస్యభరిత నాటకాలు రాయడంతోపాటు అందులో నటించారు. హాస్యాన్ని వివిధ రకాలుగా పండించడమనేది ఇక్కడే బాగా ప్రాచూర్యం పొందింది. హాస్య నటనలోని కొత్త కొత్త మెళకువలను, సరికొత్త స్టయిల్‌ను, ట్రిక్స్‌ను ప్రపంచానికి చాటే యత్నం చేశారు. 'వాట్స్ న్యూ పుస్సీక్యాట్' అనేది ఆయన రాసిన తొలి నాటకం. ఆ తర్వాత 'డోంట్ డ్రింక్ ద వాటర్' మంచి ఆదరణ పొంది అలెన్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. 1965లో 'వాట్ న్యూ పుస్సీక్యాట్' సినిమాగా వచ్చింది. దీనికి వూడీ అలెన్ స్క్రిప్ట్ అందించడం విశేషం. క్లీవ్ డోనర్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఈ చిత్రంతోనే అలెన్ నటుడిగానూ తెరంగేట్రం చేశారు. హీరో ఫ్రెండ్పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. 1966లో 'వాట్స్ అప్ టైగర్ లిలీ?' అనే కామెడీ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీన్ని 'ఇంటర్నేషనల్ సీక్రెట్ పోలీస్: కీ ఆఫ్ కీస్' జపనీస్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. ఇందులో కీలక పాత్రలో అలెన్ నటించడంతోపాటు రచయితగానూ పనిచేశారు. ఇది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 1969లో వచ్చిన 'టేక్ ది మనీ అండ్ రన్' చిత్రం దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'బెనానస్', 'ఎవ్రీథింగ్ యు ఆల్వేస్ వాంటెడ్ టు నో ఎబౌట్ సెక్స్', 'ప్లే ఇట్ ఎగైన్, సామ్', 'స్లీపర్'తో దర్శకుడిగా, నటుడిగా అలెన్ తానేమిటో నిరూపించుకున్నారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు..
అలెన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం 'అన్నె హాల్'. 1977లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రమిది. దర్శకత్వం వహించడంతోపాటు నటిస్తూ, రచయితగా పనిచేశారు. ఈ చిత్రం భారీవిజయం సాధించి కెరీర్ పరంగా మంచి బ్రేక్‌నిచ్చింది. మానసిక విశ్లేషణ, ఆధునికవాదం, మతం, లవ్, సెక్స్‌కు మధ్య సున్నితమైన తేడావంటి అనేక అంశాలను హాస్యభరితంగా ప్రతిబింబించిన ఈ చిత్రం నాలుగు ఆస్కార్లను కైవసం చేసుకుంది. అందులో ఉత్తమ దర్శకుడిగా అలెన్కూ పురస్కారం దక్కింది. అంతేకాదు అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో వంద బెస్ట్ చిత్రాల్లో 35వ స్థానంలో ఈ చిత్రం నిలిచింది. ఆ తర్వాత దాదాపు రెండు దశబ్దాల పాటు ఎన్నో విజయాలు, అపజయాలు చవి చూశారు. ఈ క్రమంలో 1982లో రూపొందిన 'ఏ మిడ్ సమ్మర్ నైట్స్ సెక్స్ కామెడీ' ఆయన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. తర్వాత రూపొందిన కామెడీ డ్రామా 'హన్నా అండ్ హర్ సిస్టర్స్' చిత్రం బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. 1990 టైమ్‌లో భారీ సినిమాలను పక్కన పెట్టి చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. అలా 'హస్బెండ్స్ అండ్ వైవ్స్', 'బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్వే', 'మైటీ అఫ్రోడిట్', 'స్వీట్ అండ్ లోడౌన్' చిత్రాలను తెరకెక్కించారు. పంథా మార్చి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించారు. ట్రెండ్‌కు అనుగుణంగా, తన వ్యంగ్య కామెడీకి నవ్యతను జోడించి సినిమాలు తీశారు. అలా వచ్చిన 'మ్యాచ్ పాయింట్', 'విక్కీ క్రిస్టినా బ్యార్సెలోనా', రొమాంటిక్ కామెడీ 'మిడ్నైట్ ఇన్ పారిస్', 'టు రోమ్ విత్ లవ్', 'బ్లూ జాస్మిన్' వంటి తదితర చిత్రాలు అలెన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇందులో 'మిడ్నైట్ ఇన్ పారిస్' స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. 'టు రోమ్ విత్ లవ్' చిత్రంలో అంతర్జాతీయ నటీనటులు నటించారు. ఇక కోలిన్ ఫిర్త్ ప్రధాన పాత్రధారిగా రొమాంటిక్ కామెడీ 'మ్యాజిక్ ఇన్ ది మూన్లైట్' చిత్రాన్ని తెరకెక్కించి విజయం అందుకున్నారు. డ్రామా నేపథ్యంలో జోక్యిన్ ఫీనిక్స్, ఎమ్మా స్టోన్ జంటగా 'ఇర్రేషనల్ మ్యాన్', పీరియడ్ చిత్రాలు 'కేఫ్ సొసైటీ', 'వండర్ వీల్' చిత్రాలు అలెన్‌ను దిగ్గజ దర్శకుడిని చేశాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో 49 చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు 58 సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ఇక 55 చిత్రాల్లో నటుడిగానూ ప్రేక్షకులను అలరించారు. 'టేక్ ది మనీ అండ్ రన్', 'బెనానస్', 'స్లీపర్', 'లవ్ అండ్ డెత్', 'అన్నెహాల్', 'ఇంటీరియర్స్', 'మ్యాన్‌హట్టన్', 'స్టార్‌డస్ట్ మెమరీస్', 'ఏ మిడ్సమ్మర్ నైట్స్ సెక్స్ కామెడీ', 'హన్నా అండ్ హర్ సిస్టర్స్', 'న్యూయార్క్ స్టోరీస్', 'షాడోస్ అండ్ ఫాగ్', 'హస్బెండ్స్ అండ్ వైవ్స్', 'మ్యాన్‌హట్టన్ మర్డర్ మిస్టరీ', 'మైటీ అప్రోడైట్', 'స్వీట్ అండ్ లోడౌన్', 'స్మాల్ టైమ్ క్రూక్స్', 'ది కర్స్ ఆఫ్ ది జేడ్ స్కూర్పియన్', 'హాలీవుడ్ ఎండింగ్', 'ఎనీథింగ్ ఎల్స్', 'టు రోమ్ విత్ లవ్', 'కేఫ్ సొసైటీ' వంటి చిత్రాలకు దర్శకుడిగా, రైటర్‌గా, నటుడిగా భిన్న పాత్రలు పోషించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్నారు. పలు విజయవంతమైన సినిమాలు నిర్మించి అభిరుచిగల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. వీటితోపాటు 'డోంట్ డ్రింక్ ది వాటర్' అనే టెలివిజన్ ఫిల్మ్‌కి దర్శకుడిగా, రచయితగా పనిచేస్తూ నటించారు. 'ది సన్‌షైన్ బార్సు'లో నటించి మెప్పించారు. అలాగే 'మెన్ ఆఫ్ క్రైసిస్: ది హార్వే వాలింగర్ స్టోరీ' లఘు చిత్రానికి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా పనిచేశారు. 'సౌండ్స్ ఫ్రమ్ ఏ టౌన్ ఐ లవ్' షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించారు. వీటితోపాటు 'ది కోల్గేట్ కామెడీ హవర్', 'సీజర్స్ హవర్', 'స్టాన్లీ', 'జెనరల్ ఎలెక్రిక్ థియేటర్', 'కాండిడ్ కెమెరా', 'ది గ్యారీ మూరె షో', 'ది సిడ్ సీజర్ షో', 'జెనె కెల్లి ఇన్ న్యూయార్క్, న్యూయార్క్', 'క్రాఫ్ట్ మ్యూజిక్ హాల్', 'ది వూడీ అలెన్ స్పెషల్' వంటి టెలివిజన్స్కి రచయితగా పనిచేశారు. 'క్రైసిస్ ఇన్ సిక్స్ సీన్స్' టెలివిజన్‌కు దర్శకత్వం వహించడంతోపాటు నటించారు. అలాగే 'జెనె కెల్లి ఇన్ న్యూయార్క్', 'న్యూయార్క్', 'ది వూడీ అలెన్ స్పెషల్', 'జస్ట్ షూట్ మీ' వంటి టెలివిజన్స్‌లో రియల్ లైఫ్ పాత్రను పోషించారు.
సంగీత దర్శకుడిగానూ నవ్వించారు..
అలెన్ నటుడు, దర్శకుడు, రచయితనే కాదు మ్యూజిషియన్ కూడా. సంగీతానికి కూడా కామెడీని జోడించి ఆల్బమ్స్ రూపొందించారు. అందులో తన పేరుతోనే రూపొందించిన 'వూడీ అలెన్', 'వాల్యూమ్ 2', 'ది థర్డ్ వూడీ అలెన్ ఆల్బమ్' వంటి బాగా పాపులర్ అయ్యాయి. 'ది టునైట్ షో స్టారింగ్ జానీ కార్సన్' టెలివిజన్ షోలో 9ఏండ్లు గెస్ట్‌గా పాల్గొన్నారు. 1965లో గ్రేట్ బ్రిటన్‌లో అలెన్ కోసం ప్రత్యేకంగా 'ది వూడీ అలెన్ షో'ను ఏర్పాటు చేశారు. దానికి ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాత 'ది క్రాఫ్ట్ మ్యూజిక్ హాల్' పేరుతో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మొదటిసారి అమెరికా టెలివిజన్ సీబీఎస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ది ఆండీ విలియమ్స్ షో', 'ది పెర్రీ కోమో' వంటి షోలో స్టాండ్ అప్ కామెడీ చేసి ఆహుతులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.
విశేష పాఠకాదరణ పొందిన రచయిత..
వూడీ అలెన్ పుస్తకాలు కూడా రాశారు. గెట్టింగ్ ఎవెన్ (1971), వితౌంట్ ఫీతర్స్(1975), సైడ్ ఎఫెక్ట్స్ (1980), అలెన్ వూడీ (1991), ది ఇన్సానిటీ డిఫెన్స్: ది కంప్లీట్ ప్రోస్ (2007), మెరె అనార్చీ (2007), అలెన్, వూడీ (వూడీ అలెన్ ఆన్ వూడీ అలెన్: ఇన్ కన్వర్జేషన్ విత్ స్టిగ్ బ్జోర్క్మ్యాన్) (2005) వంటి పుస్తకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. దీంతోపాటు 'డోంట్ డ్రింక్ ది వాటర్: ఏ కామెడీ ఇన్ టూ యాక్ట్స్', 'ప్లే ఇట్ ఎగైన్, సామ్', 'గాడ్: ఏ కామెడీ ఇన్ వన్ యాక్ట్', 'ది ఫ్లోటింగ్ లైట్ బల్బ్', 'త్రీ వన్ యాక్ట్ ప్లేస్', 'రైటర్స్ బ్లాక్' వంటి నాటక కథలు కూడా విశేష పాఠకాదరణ పొందారు.
రియల్లైఫ్లోనూ రొమాంటిక్ హీరో..
వూడీ అలెన్ ముగ్గురు మహిళలను పెళ్ళి చేసుకున్నారు. అందులో మొదటగా 1956లో హార్లెన్ రోసెన్ ను వివాహం చేసుకున్నారు. ఏండేండ్ల తర్వాత 1966లో నటి లూయిస్ లాస్సర్ను వివాహం చేసుకున్నారు. తాను రూపొందించిన 'టేక్ ది మనీ అండ్ రన్', 'బాననస్', 'ఎవ్రీథింగ్ యు ఆల్వేస్ వాంటెడ్ టు నో ఎబౌంట్ సెక్స్', 'స్టార్‌డస్ట్ మెమరీస్' వంటి చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. 1997లో హాలీవుడ్ నటి మియా ఫారో దత్తత తీసుకున్న కూతురు సూన్ యి ప్రెవిన్ను పెళ్ళి చేసుకున్నారు. అనేక సెక్స్ అలిగేషన్స్, వివాదాల్లో అలెన్ ఇరుక్కున్నారు.
'అన్నే హాల్' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో, 'హన్నా అండ్ హర్ సిస్టర్స్' చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో, 'మిడ్నైట్ ఇన్ పారిస్' చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డులందుకున్నారు. 10 బ్రిటీష్ అకాడమీ అవార్డులు, రెండు గోల్లెన్ గ్లోబ్ పురస్కారాలను దక్కించుకున్నారు. దీంతోపాటు ఒక డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు, ఐదు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు, ఒక శాటర్న్ అవార్డు, ఒక అమెరికన్ కామెడీ అవార్డు, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ పురస్కారాన్ని అందుకున్నారు.
దట్ ఈజ్ వూడీ అలెన్ అనేలా..
వూడీ అలెన్ తన కెరీర్లో ఎన్నో విలక్షణమైన సినిమాలు రూపొందించినప్పటికీ ప్రధానంగా రొమాన్స్, సెక్స్, థ్రిల్లర్, హాస్యం, హ్యూమర్ అంశాల చుట్టూతే కథలు తిరిగాయి. దీంతోపాటు అభద్రతా భావం, వీక్నెస్, తెలివితేటలు, మహిళల సాధికారత వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాలు, సొసైటీపై ఎక్కువగా హాస్యభరితమైన సెటైర్స్ వేస్తుంటారు. కానీ పౌరహక్కులు, మహిళా హక్కులు, కోల్డ్ వార్ వంటి అంశాలను పట్టించుకోలేదనే విమర్శ అలెన్‌పై ఉంది.
వూడీ అలెన్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో 'కాసినో రాయల్' ఒకటి. మొదటి జేమ్స్ బాండ్ నవల ఆధారంగా అలెన్ 1967లో స్పై కామెడీగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రిటైర్మెంట్ అయిన జేమ్స్ బాండ్ ఓ మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో ఎదురైన సంఘటనల నుంచి పుట్టే కామెడీ నేపథ్యంలో వ్యంగ్యంగా రూపొందిన ఈ సినిమా భారీవిజయాన్ని సాధించింది. ఇందులో జిమ్మీ జేమ్స్ బాండ్ 007 పాత్రలో అలెన్ నటించి కడుపుబ్బా నవించారు. ఈ చిత్రాన్ని ఆరుగురు దర్శకులు రూపొందించడం విశేషం. వూడీ అలెన్‌ను అగ్ర దర్శకుడిగా నిలబెట్టిన చిత్రం 'మ్యాన్‌హట్టన్'. 1979లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంలో ప్రధానంగా ఓ టెలివిజన్ రైటర్ ప్రేమను తెలియజేస్తుంది. తన భార్యకు విడాకులిచ్చిన రైటర్, టీనేజ్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ వేశ్యపై మోజు పడటంతో అతని జీవితం గందరగోళంగా తయారవ్వడమనే ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రేమలోని భిన్న పార్శ్వాలను దర్శకుడు అలెన్ ప్రతిబింబించారు. అంతేకాదు రైటర్ పాత్రలో తానే నటించి ప్రేక్షకుల్ని మెప్పించడం విశేషం. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాను 2.35 వైడ్స్క్రీన్లో తెరకెక్కించడం మరో విశేషం. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. వివిధ ఏజ్ గ్రూపుల్లోని ప్రేమను ప్రతిబింబిస్తూ మ్యూజిక్ ప్రధానంగా 1996లో 'ఎవ్రీవన్ సేస్ ఐ లవ్ యూ'ను తెరకెక్కించారు. ఈ మ్యూజిక్ కామెడీలో అలెన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రధానంగా ప్రేమ, సొంత ఆలోచన, రాజకీయ వంచన, మానసిక స్థితులను ప్రతిబింబించింది.
విడాకులు తీసుకున్న తర్వాత భార్యభర్తల జీవితం ఎలా సాగింది. వారు ఎలా అదృష్టవంతులయ్యారనే ఇతివృత్తంతో కామెడీ డ్రామాగా 'సెలబ్రిటీ' చిత్రాన్ని రూపొందించారు. యువత ప్రేమలోని సంఘర్షణను, చపలచిత్తమైన మనస్తత్వాలను ప్రతింబించేలా 2003లో రొమాంటిక్ కామెడీ 'ఎనిథింగ్ ఎల్స్' చిత్రాన్ని రూపొందించారు.
అలెన్ సోదరి లెట్టి అరోన్సన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలెన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో 'మ్యాచ్ పాయింట్' ఒకటి. 2005లో వచ్చిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్‌గా విశేష ఆదరణ పొందింది. నైతికత, అత్యాశ, కామం, డబ్బు, అదృష్టం వంటి అంశాలను ఈ చిత్రం ద్వారా అలెన్ చర్చించారు.
ఇక 2006లో 'స్కూప్' చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు. ఓ మిస్టరీని చేధించే క్రమంలో జర్నలిస్ట్‌లు ఓ మ్యాజికల్ పర్సన్ ప్రేమలో పడటమనే ఇతివృత్తంతో రూపొందిన ఈచిత్రంలో వూడీ అలెన్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం.
2011లో రూపొందించిన ఫాంటసీ కామెడీ 'మిడ్నైట్ ఇన్ పారిస్' చిత్రంలో ఓ యువ జంట ద్వారా మిడ్ నైట్ బ్యాక్‌డ్రాప్‌లో వారి సొంత ఆలోచనలు, ఆధునికత, వ్యామోహాలను ప్రతిబింబించారు. అలెన్ ట్రెండ్ మార్చి మ్యాజికల్ రియలిస్ట్ రొమాంటిక్ కామెడీ ప్రధానంగా 2012లో 'టు రోమ్ విత్ లవ్' తెరకెక్కించారు. రోమ్ నగరంలో తనని తాను సెలబ్రిటీగా భావించే ఓ క్లర్క్, అర్కిటెక్ట్ విద్యార్థి, యువ జంట హానీమూన్ ట్రిప్, దర్శకుడు ఆలోచనలు ఇలా నాలుగు కథలను, వారి భిన్న నేపథ్యాలను తెలియజేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలెన్ దర్శకత్వం వహించడంతోపాటు తండ్రి పాత్రను పోషించారు. ఓ 53 ఏండ్ల మెజీషియన్‌కు 23ఏండ్ల టీనేజ్ అమ్మాయికి మధ్య అందమైన ప్రేమను ప్రతిబింబిస్తూ 2014లో రొమాంటిక్ కామెడీగా 'మ్యాజిక్ ఇన్ ది మూన్లైట్' చిత్రాన్ని రూపొందించారు. ప్రేమ వల్ల వ్యక్తిగత జీవితానికి, వృత్తిగత జీవితానికి మధ్య జరిగిన సంఘర్షణతో మెజీషియన్ పడిన ఇబ్బందులకు ప్రతిరూపంగా ఈ చిత్రం నిలిచింది. సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే 2015లో అస్తిత్వం కోల్పోయిన ఓ ప్రొఫెసర్ తన విద్యార్థితో ప్రేమలో పడటం వల్ల అతనిలో వచ్చిన మార్పు నేపథ్యంలో 'ఇర్రేషనల్ మ్యాన్' చిత్రాన్ని రూపొందించారు. క్రైమ్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కించి అలెన్ తనలోని మరో కోణాన్ని చాటుకున్నారు. అలెన్ రొమాంటిక్ కామెడీ చిత్రాలే కాదు పీరియడ్ సినిమాలను సైతం చేయగలడని నిరూపించిన చిత్రం 'వండర్ వీల్'. 1950లో కోనీ ఐలాండ్‌లోని పార్క్‌లో నాలుగు పాత్రల జీవితాలను, వారిలో హ్యాపీనెస్‌ను, ఇబ్బందులను, సంఘర్షణను తెలిజేసే కథాంశంతో తెరకెక్కించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించి దిగ్గజ దర్శకుడిగా, కామెడీ నటనతో గొప్ప హాస్యనటుడిగా, క్రియేటివ్ రైటర్‌గా దట్ ఈజ్ వూడీ అలెన్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు.
Authorization