జానీ డెప్.. ప్రయోగాలకు కేరాఫ్. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాల సిరీస్‌తో ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన ఫాంటసీ చిత్రాల కథానాయకుడు. కలెక్షన్ల రికార్డులతో
విమర్శకుల్ని సైతం మెప్పించిన బాక్సాఫీస్ స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిషియన్‌గా వెండితెర, బుల్లి తెర ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన జానీడెప్ పుట్టినరోజు శనివారం (జూన్ 9). ఈ సందర్భంగా జానీ డెప్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
నాన్న స్ఫూర్తితో మ్యూజిషియన్‌గా రాణింపు..
సరికొత్త పాత్రల రూపంలో సవాళ్ళను స్వీకరించేందుకు ఎప్పుడూ ముందే ఉండే జానీ డెప్ జూన్ 9, 1963లో అమెరికాలోని కెంటకీ పట్టణంలోని ఓవెన్స్బోరోలో జన్మించారు. పూర్తి పేరు జాన్ క్రిస్టోఫర్ డెప్ 2. తల్లి బెట్టీ సుయి పాల్మర్ వెయిటర్‌గా పనిచేశారు. తండ్రి జాన్ క్రిస్టోఫర్ డెప్. సివిల్ ఇంజనీర్. వీరి నలుగురి సంతానంలో డెప్ చిన్నవారు. బాల్య జీవితం వివిధ ప్రాంతాల్లో సాగింది. దాదాపు 20 ప్రాంతాలు తిరిగి చివరికి ఫ్లోరిడాలో సెటిల్ అయ్యారు. 15ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రాబర్ట్ పాల్మర్‌ను పెళ్ళి చేసుకున్నారు. ఆయన పాపులర్ పాప్ సింగర్. తనకు ఆయనే స్ఫూర్తి అని డెప్ పలు సందర్భాల్లో చెబుతుండేవారు. 12ఏండ్ల వయసులో డెప్‌కు తల్లి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. గ్యారేజ్ బ్యాండ్స్‌ను వాయించడం ప్రారంభించారు. తల్లితండ్రులు విడాకుల తీసుకోవడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. సంగీతంపై డెప్‌కి ఉన్న ఆసక్తిని గమనించిన స్కూల్ ప్రిన్సిపల్ ఆ దిశగా దృష్టి సారించమని ప్రోత్సహించారు. తోటి స్నేహితులతో కలిసి 'సిక్స్ గన్ మెథడ్' పేరుతో డెప్ స్థానికంగా చిన్నచిన్న బ్యాండ్ షోస్ నిర్వహిస్తూ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 'రాక్ సిటీ ఏంజెల్స్' బ్యాండ్ టీమ్‌లో జాయిన్ అయ్యారు. వీరి సారథ్యంలోనే 'యంగ్ మ్యాన్స్ బ్లూస్' పేరుతో మొదటిసారి ఓ ఆల్బమ్ చేశారు. ఈ క్రమంలో బ్యాండ్ టీమ్‌లో ఓ స్నేహితుడి సోదరి లోరి అన్నె అల్లిసన్ను 1983లో వివాహమాడారు. ఆమె సినిమాల్లో మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు. హాలీవుడ్ నటుడు నికోలస్ కేగ్కు డెప్‌ను అతని భార్య పరిచయం చేశారు. డెప్‌ను సినిమాల్లోకి రమ్మని నికోలస్ ప్రోత్సహించారు. దీంతో లాస్ ఏంజెల్స్‌లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. మొదటగా పాపులర్ హర్రర్ సినిమా 'ఏ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్' ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ప్రైవేట్ రిసార్ట్' అనే కామెడీ చిత్రంలో ఓ హీరోగా నటించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక భార్య లోరితో విడిపోయారు.
సాధారణ నటుడి స్థాయి నుంచి టాప్ స్టార్‌గా..
వియత్నాం వార్ ప్రధానంగా ప్రముఖ దర్శకుడు ఓలివర్ స్టోన్ రూపొందించిన 'ప్లాటూన్' చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ టైమ్‌లో ఎక్కువగా టీనేజ్ బేస్డ్ చిత్రాలు చేస్తూ యువతరం మనసు దోచుకున్న క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1987లో '21 జంప్ స్ట్రీట్' అనే టెలివిజన్ సీరియల్లోనూ నటించారు. ఆ తర్వాత నటుడిగా తనని ఇన్స్పైర్ చేసిన ఫ్రెడరిక్ ఫారెస్ట్‌తో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు. 1990లో వచ్చిన మ్యూజికల్ కామెడీ 'క్రై-బేబి' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దీంతో డెప్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. తన నటనలోని విలక్షణతను చాటి చెప్పే అవకాశం తన స్నేహితుడు టిమ్ బర్టన్ రూపొందించిన 'ఎడ్వర్డ్ సిజర్హాండ్స్' చిత్రం ద్వారా వచ్చింది. ఇది ఆయన్ని స్టార్ హీరోని చేసింది. అంతేకాదు ఏకంగా 54 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సీరియస్ పాత్రలు, డార్క్ రోల్స్, విలక్షణమైన పాత్రలు ఇలా ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు. రెండేండ్ల గ్యాప్ తర్వాత 'ఏ నైట్మేర్ ఆఫ్ ఎల్మ్ స్ట్రీట్' ఫ్రాంఛైజీలోని ఆరవ చిత్రంలో నటించారు. రొమాంటిక్ కామెడీ 'బెన్నీ అండ్ జాన్'తోపాటు లీయోనార్డ్ డికాప్రియో, జూలియెట్టి లెవిజ్ నటించిన డ్రామా చిత్రం 'వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్'లో, కామెడీ డ్రామా 'అరిజోనా డ్రీమ్' చిత్రాల్లో నటించి నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు.
మలుపు తిప్పిన ఎడ్వుడ్ సినిమా..
1994లో సినిమాల ఎంపికలో డెప్ కొంత ఒత్తిడికి లోనయ్యారు. ఆ సందిగ్ధంలో ఉన్న టైమ్‌లోనే తన స్నేహితుడు, దర్శకుడు టిమ్ బర్టన్ 'ఎడ్వుడ్' కథతో వచ్చారు. ప్రముఖ కల్డ్ క్లాసిక్ దర్శకుడి బయోగ్రఫీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమా చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక గొప్ప నటుడిగా అభివర్ణించింది. ఈ క్రమంలో 'డాన్ జువాన్ డిమాక్రో', బ్లాక్ అండ్ వైట్ 'డెడ్ మ్యాన్'తోపాటు ఫ్లాప్ సినిమా 'నిక్ ఆఫ్ టైమ్' చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆల్ పసినోతో కలిసి 'డాన్నీ బ్రాస్కో' చిత్రంలో నటించారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ 'స్లీపీ హలో', 'చాకోలెట్', 'బ్లో', 'ఫ్రమ్ హెల్', 'వన్స్ అప్ ఏ టైమ్ ఇన్ మెక్సికో', 'ఫైండింగ్ నెవర్‌ల్యాండ్', 'చార్లీ అండ్ ది చాకోలెట్ ఫ్టాకరీ', 'స్వీనీ టాడ్: ది డెమన్ బార్బర్ ఆఫ్ ఫ్లీట్ స్ట్రీట్', 'పబ్లిక్ ఎనిమీస్' చిత్రాలతో హాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఎదిగారు. జానీ నటుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' సిరీస్ ప్రధానంగా ఉంటుంది. ఇందులో భాగంగా వచ్చిన 'ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పీయర్ల్', 'డెడ్ మ్యాన్స్ చెస్ట్', 'ఎట్ వరల్డ్స్ ఎండ్', 'ఆన్ స్ట్రేంజర్ టైడర్స్','డెడ్‌మ్యాన్ టెల్ నో టేల్స్' చిత్రాల్లో కెప్టెన్జాక్ స్పారో పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రాలు జానీ డెప్‌ను నటుడిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. దీంతోపాటు విభిన్న నేపథ్య చిత్రాలు 'అలైస్ ఇన్ వండర్లాండ్', 'ది టూరిస్ట్', 'రాంగో', 'ది రమ్ డైరీ','జాక్ అండ్ జిల్', '21జంప్ స్ట్రీట్', 'డార్క్షాడోస్', 'ది లోన్ రేంజర్''ట్రాన్సెండెన్స్', 'టస్క్', 'ఇన్‌టూ ది వూడ్స్', 'బ్లాక్ మాస్', 'లండన్ ఫీల్డ్స్', 'యోగా హౌసర్స్', 'డోనాల్డ్ ట్రంప్స్ ది ఆర్ట్ ఆఫ్ ది డీల్: ది మూవీ', 'అలైస్ థ్రూ ది లుకింగ్ గ్లాస్', 'మర్డర్ ఆన్ ది ఒరియెంట్ ఎక్స్‌ప్రెస్', 'షెర్లాక్ గ్నోమ్స్' వంటి వాటిలో నటించి మెప్పించారు. ఆయా చిత్రాలు బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టాయి. దీంతో డెప్‌ను బాక్సాఫీసు స్టార్‌గా మీడియా అభివర్ణించింది. ప్రస్తుతం 'సిటీ ఆఫ్ లైస్', 'ఫాంటాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండర్లాండ్', 'రిచార్డ్ సేస్ గుడ్బారు' చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శక, నిర్మాత..
1997లో వచ్చిన 'ది బ్రేవ్' చిత్రం ద్వారా డెప్ దర్శకుడిగా మారారు. ఇందులో తనే హీరో. ఇది కేన్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. దీంతోపాటు 'స్టఫ్' అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. డెప్ 2004లో నిర్మాతగా మారి 'ఇన్ఫినిటం నిహిల్' అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించారు. దీన్ని తన సోదరి క్రిస్టి చూసుకునేవారు. 2011లో నిర్మాతగా 'ది రమ్ డైరీ', 'హ్యూగో', 'డార్క్ షాడోస్', 'మోర్టడెకారు', 'డౌగ్ స్టానోప్: నో ప్లేస్ లైక్ హౌమ్' చిత్రాలను నిర్మించారు. 'ది లోన్ రేంజర్' చిత్రానికి, 'లా డోన్నా హర్రీస్: ఇండియన్ 101' టివి డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. పలు టెలివిజన్స్లోనూ కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. 'లేడీ బ్లూ', 'స్లో బర్న్', '21జంప్స్ట్రీట్', 'హౌటెల్', 'ది వికర్ ఆఫ్ డిబ్లీ', 'ది ఫాస్ట్షో', 'కింగ్ ఆఫ్ హిల్', 'లైఫ్టూ షార్ట్', 'దిస్ అమెరికన్ లైఫ్', 'స్పాంగ్బాబ్ స్క్వైర్ పాంట్స్' వంటి టెలివిజన్ షోస్‌లో కీలక ఎపిసోడ్స్‌లో నటించి టీవీ రంగంలోనూ అగ్ర నటుడిగా రాణించారు. అనేక డాక్యుమెంటరీస్‌లో నటించి మెప్పించారు. యానిమేషన్ చిత్రం యాక్షన్కామెడీ 'రాంగో' అలాగే 'కార్ప్సె బ్రైడ్', 'గ్నోమియో అండ్ జూలియెట్: షెర్లాక్ గ్నోమ్స్'కు వాయిస్ అందించారు. 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్: ది లెజెండ్ ఆఫ్ జేక్ స్పారో' వీడియో గేమ్‌కు కూడా వాయిస్ ఇచ్చారు. నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాతగా అటు వెండితెర, ఇటు బుల్లి తెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. 'బి హియర్ నౌ' అనే ఆల్బమ్‌లో 'ఫేడ్ ఇన్ ఔట్' అనే సాంగ్‌కు, 'డోంట్ గో అవే'లో 'ఫేడ్ వే' పాటలకు స్లైడ్ గిటార్ వాయించారు. అలాగే 'చాకోలేట్' చిత్రంలో గీటారిస్ట్గా పనిచేశారు. 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో'లో సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేశారు. తన స్నేహితుడు షానె మెగోవాన్తో కలిసి 'ది పోగుస్' పేరుతో అనేక మ్యూజిక్ షోస్ ఇచ్చారు. సోలోగా ఓ ఆల్బమ్ చేశారు. అమెరికాకు చెందిన ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ గ్రూపులో సభ్యుడిగానూ ఉన్నారు. 'ఇన్టు ది గ్రేట్ వైడ్ ఓపెన్' మ్యూజిక్ ఆల్బమ్‌లో టామ్ పెట్టీతో కలిసి నటించారు. మరో ఆల్టర్ నేటివ్ బ్యాండ్ 'ది లెమన్హెడ్స్', 'ఇట్స్ ఏ షేమ్ అబౌట్ రే' బ్యాండ్ గ్రూపుల్లో పనిచేశారు. 'అలైస్' సాంగ్‌లో, నటాలియా పోర్టమన్తో కలిసి 'కిస్సెస్ ఆన్ ది బాటమ్' ఆల్బమ్‌లో నటించి మెప్పించారు. అలాగే 'యు ఆర్ సో వయిన్'లో నటించారు. ఇలా అనేక ఆల్బమ్స్‌లోని పాటల్లో నటించడంతోపాటు గీటారిస్ట్గా పనిచేసి సంగీతంపై తనకున్న అభిరుచి చాటుకున్నారు.
కుటుంబ జీవితం.. వ్యాపారాలు.. వివాదాలు.. విశేషాలు..
లోరి అన్నె అల్లిసన్తో డైవర్స్ తర్వాత ఫ్రెంచ్ నటి, సింగర్, మోడల్ వనెస్సా పారడైజ్తో పరిచయమేర్పడింది. వీరి సహజీవన ఫలితంగా కూతురు లిలి రోస్ మెలోడీ డెప్, కుమారుడు జాక్ జాన్ క్రిస్టోఫర్ డెప్ జన్మించారు. దాదాపు 14ఏండ్ల సహజీవనం అనంతరం 2012లో విడిపోయారు. డెప్ ఆ తర్వాత 'ది రమ్ డైరీ' చిత్ర టైమ్‌లో కోస్టార్ అంబర్ హియర్డ్ను కలిశారు. 2013లో ఎంగేజ్మెంట్ జరుపుకుని, 2015లో వివాహం చేసుకున్నారు. గతేడాది విడిపోయారు. డెప్ వ్యాపార రంగంలోనూ రాణించారు. 1993లో మరో ఇద్దరితో కలిసి లాస్ ఏంజెలో ది వైపర్ క్లబ్‌ను ప్రారంభించారు. తన 'పి' రాక్‌బ్యాండ్‌తో కలిసి మ్యూజికల్ షోస్ ఇచ్చేవారు. కానీ నటుడు రివర్ ఫోనిక్స్ అతిగా మద్యం తీసుకుని చనిపోవడంతో క్లబ్ ఇబ్బందుల్లో పడింది. దీంతో డెప్ మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. ఈ టైమ్‌లోనే సూపర్‌మోడల్ కేట్ మోస్‌కు దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య అనేక గొడవలు జరిగాయి. రెెండు దశాబ్దాల కాలంలో తనకు సంబంధించి దాదాపు 650 మిలియన్ డాలర్ల మేరకు అవకతవకలకు పాల్పడాడని తన బిజినెస్ మేనేజర్‌పై 25మిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేశారు. డెప్‌కు ఫ్రాన్స్‌లో గ్రేప్స్ నుంచి వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అలాగే నటులు సియాన్ పెన్న్, జాన్ మాల్కోవిచ్, మిక్ హక్నాల్తో కలిసి పారిస్‌లో మ్యాన్ రే పేరుతో ఓ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. 2012లో హౌస్ ఆఫ్ ఎర్త్ అనే నవలకు ఎడిటర్‌గానూ పనిచేశారు. డెప్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. అమెరికాలో 2.6 బిలియన్ డాలర్లు వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలు 6బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. దీంతో జానీ డెప్‌ను బాక్సాఫీసు సూపర్ స్టార్‌గా పిలిచేవారు. 2012లో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కారు. ఆ ఏడాది ఆయన 75 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నారు. అంతేకాదు 2015లో ఆయన్ని డిస్నీ లెజెండ్‌గా అభివర్ణించారు. డెప్ శరీరంపై 13 టాటూలుంటాయి. తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి, ముఖ్యమైన సంఘటనలను అవి ప్రతిబింబిస్తాయి. కమర్షియల్ హీరోగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన డెప్‌కు ఒక్క ఆస్కార్ కూడా రాకపోవడం గమనార్హం. మూడు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డునందుకున్నారు.
నట విశ్వరూపానికి ప్రతిబింబాలు
లార్జర్ దేెన్ లైఫ్ సినిమాలు చేయడం జానీకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. విలక్షణమైన పాత్రలతో కామెడీతోపాటు యాక్షన్, వింతైన భయానక పాత్రలు పోషించారు. ఫాంటసీ చిత్రాలతో ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. మొదటగా నటించిన సూపర్‌నేచురల్ స్లాషర్ చిత్రం 'ఏ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్' చిత్రంలో హీరోయిన్‌కి ప్రియుడిగా, రాక్షస విలన్ బాధితుల్లో ఒకడిగా అమాయకుడి పాత్రలో మెప్పించారు. కల్ట్ క్లాసిక్ చిత్రాల రూపకర్త ఎడ్వర్డ్ డేవిస్ వుడ్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ఎడ్వుడ్' చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో జానీ డెప్ నటన, ఎడ్వర్డ్లా పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ మైమరపిస్తుంది. ఇందులో తనదైన కామెడీని పంచి ఆకట్టుకున్నారు.
థ్రిల్లర్ నేపథ్య చిత్రం 'నిక్ ఆఫ్ టైమ్'లో రాజకీయ నాయకుడిని చంపి తన కూతురిని సేవ్ చేసే అకౌంటెంట్ పాత్రలో సెటిల్డ్‌గా నటించి అలరించారు. 'డాన్ జువాన్ డె మాక్రో'లో గొప్ప లవర్‌గా అలరించారు. యాక్షన్ అడ్వెంచరస్ క్రైమ్ చిత్రం 'ది టూరిస్ట్'లో అమెరికన్ టూరిస్ట్‌గా, ఓ మాయా లేడీకి హెల్ప్ చేసే పాత్రలో డెప్ నటన ఆద్యంతం కనువిందు చేస్తుంది. రొమాంటిక్ కామెడీ డ్రామా 'చాకోలెట్'లో యంగ్ మదర్ని అభిమానించే ప్రియుడిగా, తనని తాను అన్వేషించుకునే వ్యక్తిగా డెప్ నటన ఆద్యంతం అబ్బురపరుస్తుంది. వెస్టర్న్ డ్రామా ఫాంటసీ చిత్రం 'డెడ్ మ్యాన్'లో స్పిరిట్చ్వల్ జర్నీ చేసే క్రమంలో మనుగడ కోసం మర్డర్స్ చేసే వ్యక్తిగా కౌబారు తరహా పాత్రలో డెప్ నటన తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. పూర్తి వెస్టర్న్ స్టయిల్లో సాగే ఈ చిత్రంలో పూర్తి స్థాయి సీరియస్ పాత్రతో ఆకట్టుకున్నారు. హర్రర్ ఫాంటసీ 'స్లీపీ హలో' చిత్రంలో ఇన్వెస్ట్గేట్ చేసే పోలీస్ అధికారిగా సాహసోపేతమైన నటనతో అలరించారు. వియత్నాం వార్ నేపథ్యంలో రూపొందిన 'ప్లాటూన్' చిత్రంలో వీరోచితంగా పోరాడే సైనికుడిగా నటించారు.
అత్యంత పేరు గాంచిన బ్యాంక్ దొంగ జాన్ డిల్లింగర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 'పబ్లిక్ ఎనిమీస్' చిత్రంలో జాన్ డిల్లింగర్గా స్టయిలీష్ నటనతో, కొకైన్ స్మగ్లర్ జార్జ్ జంగ్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ క్రైమ్ చిత్రం 'బ్లౌ'లో కొకైన్ స్మగ్లర్‌గా తెలివైన స్టయిలీష్ నటనతో నట విలక్షణను చూపించి విశేష ప్రశంసలందుకున్నారు. కాంటెంపరరీ వెస్టర్న్ యాక్షన్ చిత్రం 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సీకో' చిత్రంలో సీఐఏ ఏజెంట్‌గా డెప్ చేసే యాక్షన్ కనువిందు చేస్తుంది. స్కాటిష్ నవలా రచయిత, నాటక రచయిత, పాపులర్ ఫిక్షనల్ పాత్ర పీటర్ పాన్ సృష్టికర్త జె.ఎం.బ్యారీ జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ఫాంటసీ చిత్రం 'ఫైండింగ్ నెవర్లాండ్' చిత్రంలో జె.ఎం.బ్యారీ పాత్రలో సెటిల్డ్ నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. సైన్స్ ఫిక్షన్ 'ట్రాన్సెండెన్స్' చిత్రంలో కంప్యూటర్ తరహాలో పనిచేసే మనిషిగా డెప్ అద్భుత నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. ఇక తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫాంటసీ చిత్ర ఫ్రాంఛైజీ 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్'. ప్రపంచం మొత్తం తమ గుప్పింట్లో పెట్టుకొని శాషిస్తున్న బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సముద్ర దొంగలు చేసే పోరాట నేపథ్యంలో రూపొందిన చిత్రాలివి. సముద్ర ఓడదొంగ కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో డెప్ చేసిన పోరాటమే ఈ చిత్రాల కథాంశాలు. ఇందులో విలనిజం, హీరోయిజం మేళవింపుగా ఆయన పండించే కామెడీ అబ్బురపరుస్తుంది, మైమరపిస్తుంది, కడుపుబ్బా నవిస్తుంది, ఆలోచింపచేస్తుంది. ఈ చిత్రంలోని నటనకుగానూ ఆస్కార్‌కు ఎంపికయ్యారు. ఇతర అవార్డులనందుకున్నారు. ఇందులో భాగంగా వచ్చిన 'ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పీయర్ల్', 'డెడ్ మ్యాన్స్ చెస్ట్', 'ఎట్ వరల్డ్స్ ఎండ్', 'ఆన్ స్ట్రేంజర్ టైడర్స్','డెడ్‌మ్యాన్ టెల్ నో టేల్స్' చిత్రాల్లో కెప్టెన్జాక్ స్పారో పాత్రల్లో విలక్షణ నటనను ప్రదర్శించారు. ఈ చిత్రాలు రికార్డ్ స్థాయి కలెక్షన్లు కలెక్ట్ చేసి డెప్‌ను బాక్సాఫీసు స్టార్‌గా నిలబెట్టాయి.
Authorization