ఎమ్మా స్టోన్..
నేటి తరం యువ కథానాయికల్లో క్రేజీ టాప్ స్టార్. అత్యధిక పారితోషికం తీసుకునే హాలీవుడ్ స్టయిలీష్ ఐకాన్ కూడా. బాలనటిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఎమ్మా కథానాయికగా
వెండితెర ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్దుల్ని చేసింది. ఉత్తమ నటిగా ఆస్కార్నీ కైవసం చేసుకుంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్కి కేరాఫ్ అయిన ఎమ్మాస్టోన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
చిన్నప్పట్నుంచి నటనపై మక్కువ..
కమర్షియల్ స్టార్ హీరోయిన్గా విశ్వ ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన ఎమ్మా స్టోన్ అసలు పేరు ఎమిలీ జీన్ స్టోన్. 1988లో నవంబర్ 6న అమెరికాలోని స్కాట్స్డాలెలో జన్మించారు. తల్లి క్రిస్టా జీన్ స్టోన్ ఇల్లాలు. జెఫ్రీ చార్లెస్ స్టోన్ జనరల్ కాంట్రాక్టింగ్ కంపెనీ సీఈఓ. ఎమ్మాకు తమ్ముడు స్పెన్సర్ ఉన్నారు. ఎమ్మా స్కూల్ డ్రాపౌట్ స్టూడెంట్. చిన్నప్పట్నుంచి నటి కావాలనే కోరికతో చదువుపై దృష్టి పెట్టలేదు. ప్రాజెక్ట్ హాలీవుడ్ పేరుతో ఓ పేపర్ ప్రజెంటేషన్‌ను తల్లిదండ్రులకు వివరించడంతో ఎమ్మాను నటనవైపు వెళ్ళేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. మొదట కాలిఫోర్నియాకు, 2004లో లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చారు. అయితే ఎమ్మా తన నాలుగేండ్ల వయసు నుంచే థియేటర్స్‌లో నటించడం ప్రారంభించారు. షార్ట్ కామెడీ ఎపిసోడ్ 'స్కెచ్ కామెడీ'లో నటించాలనుకున్నారు. కానీ ఆమె దృష్టి మ్యూజికల్ థియేటర్స్ వైపు మళ్లింది. ది విండ్ ఇన్ ది విల్లోస్ అనే థియేటర్ ప్రొడక్షన్స్‌లో తొలిసారిగా నటించారు. అప్పటికి ఆమె వయసు పదకొండేండ్లు. థియేటర్స్‌లో నటిస్తూనే రెండేండ్లు చదువుపై దృష్టిపెట్టారు. ఈక్రమంలో వరుసగా 16 ప్రొడక్షన్స్‌లో పనిచేశారు. వ్యాలే యూత్ థియేటర్‌కు సంబంధించిన 'ది ప్రిన్సెస్ అండ్ ది పీ', 'అలైస్ అడ్వెంచరస్ ఇన్ వండర్లాండ్', 'జోసెఫ్ అండ్ ది అమేజింగ్ టెక్నికలర్ డ్రీమ్కోట్' వంటి తదితర థియేటర్స్ ప్రొగ్రామ్‌లో కామెడీ తరహా పాత్రల్లో మెప్పించారు. మరోవైపు సినిమాల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. 'ఆల్ దట్' వంటి పలు చిత్రాల ఆడిషన్స్‌కి వెళ్ళి ఫెయిల్ అయ్యారు. ఎమ్మాకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ఆమెకు ప్రైవేట్ యాక్టింగ్ స్కూల్ విలియమ్ మోర్రిస్ ఏజెన్సీలో శిక్షణ ఇప్పించారు.
ఫెయిల్యూర్స్ నుంచి..
సినిమా ఛాన్స్‌ల కోసం తన పేరును స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో ఎమిలీ స్టోన్‌గా రిజిస్టర్ చేయించారు. నాటకాల్లో అప్పటికే ఆమెను రిలే స్టోన్‌గా పిలిచేవారు. ఎన్బీసీ టెలివిజన్ సిరీస్ 'మీడియం', 'మాల్కామ్ ఇన్ ది మిడిల్' వంటి వాటిలో గెస్ట్ రోల్స్ చేశారు. అయినా తన పేరు విషయంలో స్టోన్ అసంతృప్తిగానే ఫీలయ్యారు. దీంతో ఎమ్మా స్టోన్‌గా మార్చుకున్నారు. 'ఇన్ సెర్చ్ ఆఫ్ ది న్యూ పాట్రిడ్జ్ ఫ్యామిలీ' అనే రియాలిటీ షో ద్వారా టెలివిజన్‌లో పూర్తి స్థాయిలో తెరంగేట్రం చేశారు. ఈ షో ఆశించిన పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత 'లక్కీ లూయి' అనే టెలివిజన్ సిరీస్‌లో అతిథి పాత్రలో మెరిశారు. మరో టెలివిజన్ డ్రామా 'హీరోస్'లో నటించేందుకు ఆడిషన్ ఇచ్చారు, కానీ సెలక్ట్ కాలేదు. 2007లో డ్రైవ్ టెలివిజన్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించారు. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు, ఫెయిల్యూర్స్ అనంతరం 2007లో కామెడీ చిత్రం 'సూపర్బ్యాడ్' ద్వారా నటిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. గ్రెగ్ మొట్టోలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టీనేజ్ విద్యార్థినిగా నటించి ఆకట్టుకున్నారు. ఆమె పాత్రను మలిచిన తీరు పట్ల ప్రశంసలు దక్కాయి. కొత్త నటిగా యంగ్ హాలీవుడ్ అవార్డునందుకున్నారు. ఏడాది తర్వాత మరో కామెడీ చిత్రం 'ది రాకర్'లో కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించినా, విమర్శకుల ప్రశంసల్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
కెరీర్ బ్రేక్.. స్టార్ ఇమేజ్..
ఎమ్మా నటించి మొదటి మూడు సినిమాలు సరైన గుర్తింపు తీసుకురాలేదు. అయినప్పటికీ ఆమె 2009లో మరో మూడు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి 'ఘోస్ట్ ఆఫ్ గర్ల్‌ఫ్రెండ్స్ పాస్ట్'. మార్క్ వాటర్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని 'ఏ క్రిస్మస్ కరోల్' అనే నవల ఆధారంగా రూపొందించారు. విమర్శకుల నుంచి నెగటివ్ స్పందనను రాబట్టుకున్నప్పటికీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నటించిన హర్రర్ కామెడీ 'జాంబిలాండ్' చిత్రం సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇండిపెండెంట్ కామెడీ డ్రామా 'పేపర్ మ్యాన్' చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించారు. 2010లో విల్ గ్లుక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ చిత్రం 'ఈజీ ఏ' ఎమ్మా కెరీర్‌ను మలుపుతిప్పింది. నటిగా మంచి బ్రేక్ వచ్చింది. 2011లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు 'ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్', 'క్రేజీ, స్టుపిడ్, లవ్', 'ది హెల్ప్' ఎమ్మాను స్టార్ హీరోయిన్ని చేశాయి. 2012లో మార్క్ వెబ్ దర్శకత్వంలో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్' ఎమ్మా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. అద్భుతమైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొంది హాలీవుడ్ అగ్ర నటీమణుల జాబితాలో చేరారు.
ఈ క్రమంలో చేసిన 'గ్యాంగ్‌స్టర్ స్వ్కాడ్', 'మూవీ 43', 'ది క్రూడ్స్', 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2', వూడీ అలెన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మ్యాజిక్ ఇన్ ది మూన్లైట్', అలెజాండ్రో గోంజాలెజ్ ఇనార్రిటు దర్శకత్వంలో వచ్చిన 'బర్డ్‌మ్యాన్', కామెరాన్ క్రౌ తెరకెక్కించిన 'అలోహ', వూడీ అలెన్ దర్శకత్వంలో వచ్చిన 'ఇర్రేషనల్ మ్యాన్', డామియెన్ చాజెల్లె రూపొందించిన 'లా లా ల్యాండ్' చిత్రాలు వరుస విజయాలు సాధించి ఎమ్మాను తిరుగులేని నటిని చేశాయి. హాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగానూ నిలబెట్టాయి.
గతేడాది వచ్చిన 'బ్యాటిల్ ఆఫ్ ది సెక్సెస్' చిత్రం సైతం ఎమ్మాకు మంచి గుర్తింపు తెచ్చింది. వీటిలో 'స్పైడర్‌మ్యాన్', 'బర్డ్‌మ్యాన్', 'అలోహ', 'లా లా ల్యాండ్', 'ఇర్రేషనల్ మ్యాన్' చిత్రాలు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేశాయి.
ఆయా చిత్రాల్లో ఎమ్మాస్టోన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అద్భుతమైన నటనతో మెప్పించే ఎమ్మాకు 'లా లా ల్యాండ్' చిత్రంలోని ఉత్తమ నటనకు ఆస్కార్ అవార్డు వరించింది. 'బర్డ్‌మ్యాన్' చిత్రానికిగానూ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 'లా లా ల్యాండ్' చిత్రానికే ఒక ఆస్ట్రేలియన్ అకాడమీ అవార్డు, ఒక బ్రిటీష్ అకాడమీ పురస్కారం, గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ పురస్కారాలు వరించాయి. 'ది హెల్ప్' చిత్రానికి హాలీవుడ్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ బోర్డ్ ఆఫ్రివ్యూ పురస్కారం దక్కాయి. దీంతోపాటు ఇతర సినిమాల్లోని తన నటనకు పలు అవార్డులు లభించాయి.
మ్యూజికల్ ఆల్బమ్స్‌తోనూ గుర్తింపు..
ఎమ్మా స్టోన్ కెరీర్ థియేటర్స్, టెలివిజన్ సిరీస్‌ల నుంచే ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం 'మనియాక్' టెలివిజన్ సిరీస్‌లో నటించడంతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఎమ్మా మ్యూజికల్ ఆల్బమ్స్‌లోనూ నటించారు. 2008లో రూపొందించిన 'ది హౌస్ బన్నీ' ఆల్బమ్‌లో 'ఐ నో వాట్ బార్సు లైక్' అనే పాటలో డాన్స్ చేశారు. అలాగే 'ఈజీ ఏ' చిత్ర ఆల్బమ్‌లో 'నాక్ ఆన్ వుడ్' సాంగ్‌లో, 'పాప్‌స్టార్: నెవర్స్టాప్ నెవర్ స్టాపింగ్' ఆల్బమ్‌లో 'టర్న్ అప్ ది బీఫ్' సాంగ్‌లో నటించి మెప్పించారు. దీంతోపాటు 'లా లా ల్యాండ్' చిత్ర ఆల్బమ్‌లోనూ ఆకట్టుకున్నారు. ఇందులోని అన్నిపాటల్లోనూ ఎమ్మా అద్భుతమైన డాన్సులలో మంత్రముగ్దుల్ని చేశారు. 'అన్నా' అనే మ్యూజిక్ వీడియాలో విల్ బట్లర్‌తో కలిసి నటించారు. ఇదేకాకుండా 'క్యాబరేట్' అనే థియేటర్ మ్యూజికల్లోనూ మెరిశారు.
వ్యక్తిగత జీవితం.. పాపులారిటీ..
ఎమ్మా 'స్పైడర్ మ్యాన్' చిత్రం చేసేటప్పుడు కోస్టార్ ఆండ్రూ గార్ఫీల్డ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి బ్రేకప్ అయ్యింది. ఎమ్మా నటిగా అలనాటి నటి డయాన్ కీటన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అలాగే సింగర్, సాంగ్ రైటర్ మరియాన్ కోటిల్లార్డ్ కూడా తనకు స్పూర్తి అని ఎమ్మా చెబుతుండేవారు. ఎమ్మా 'ఈజీ ఏ' చిత్ర టైమ్‌లో అస్తమాతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత కోలుకున్నారు. తన తల్లి క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. ఆ అనుభవంతో అవకాశం వచ్చినప్పుడల్లా క్యాన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో, ఫండ్ రైజింగ్ ఈవెంట్లలో పాల్గొంటుంటారు. సినిమా ఇండిస్టీతోపాటు బయట కూడా మహిళ రక్షణ, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 'టైమ్స్ అప్' కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 మంది మహిళలతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే ఎమ్మా హై ప్రొఫైల్ హీరోయిన్గా, మోస్ట్ టాలెంటెడ్ నటిగా, అత్యంత ప్రభావితం చేసే నటిగా, యువతరం కలల రాణిగా, అందమైన యువ కథానాయికగా పలు మేగజీన్లోకి ఎక్కారు. 2015లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో ఒకరిగా ఫోర్బ్స్ ఎమ్మా స్టోన్ పేరును ప్రకటించింది. 2013, 2017లోనూ టైమ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల వంద మంది వ్యక్తుల్లో నిలిచారు. ఎఫ్హెచ్ఎం మేగజీన్ ప్రకటించిన వంద మంది సెక్సీయెస్ట్ ఉమెన్స్‌లోనూ ఎమ్మా స్థానం సంపాదించారు. ఎమ్మా స్టయిలీష్ ఐకాన్ కూడా. ఆమె హెయిర్, ఐస్, కాస్ట్యూమ్స్ ఇలా పలు అంశాల్లో హాలీవుడ్లో స్టయిల్ ఐకాన్‌గా నిలిచారు.
విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా..
ఎమ్మా స్టోన్ ఫ్యామిలీ, డ్రామా, లవ్, రొమాంటిక్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి కమర్షియల్ హీరోయిన్గా, విలక్షణ నటిగా ఆకట్టుకున్నారు. ప్రియురాలిగా, టీనేజ్ అమ్మాయిగా పలు చిత్రాల్లో ఆమె పలికించిన భావోద్వేగాలు, కామెడీ, నాటకీయతకు ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తన మొదటి చిత్రం 'సూపర్బ్యాడ్'లో అమాయకత్వం, ఏమీ తెలియని తత్వం, చెడు అలవాట్లకు బానిసయ్యే టీనేజ్ అమ్మాయిగా, సులభంగా ప్రేమకు ఆకర్షితురాలయ్యే విద్యార్థినిగా ఎమ్మా నటన అలరిస్తుంది. ఇక 'ది రాకర్' చిత్రంలో గిటారిస్ట్‌గా, సంఘర్షణను ఎదుర్కొనే అమెలియా స్టోన్ పాత్రలో విభిన్న భావోద్వేగాలు పలికించారు. కామెడీ చిత్రం 'ది హౌస్ బన్నీ'లో బబ్లీ తరహా పాత్రలో అలరించారు. రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఘోస్ట్ ఆఫ్ గర్ల్‌ఫ్రెండ్స్ పాస్ట్'లో పాత ప్రియుడిని వెంటాడే దెయ్యంగా ఎమ్మా నటన ప్రేక్షకుల్ని భయపెడుతుంది.
ఆ తర్వాత చేసిన మరో హర్రర్ కామెడీ 'జాంబిలాండ్'లో కాన్ ఆర్టిస్టుగా తనదైన కామెడీతో మెప్పించారు. తనపై వచ్చిన లైంగికపరమైన రూమర్లను తొలగించుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించే హైస్కూల్ అమ్మాయి పాత్ర ప్రధానంగా రూపొందిన సెటైరికల్ కామెడీ చిత్రం 'ఈజీ ఏ'లో ఒక హైస్కూల్ విద్యార్థి ఓలివ్ పాత్రలో ఎమ్మా నటన ఆద్యంతం అద్భుతంగా. రొమాంటిక్ కామెడీ 'క్రేజీ, స్టుపిడ్, లవ్'చిత్రంలో స్కూల్ గ్రాడ్యూయేట్గా, ప్రేమ కోసం వెంటపడే అమ్మాయిగా స్టీవ్ కారెల్, రియాన్ గోస్లింగ్, జులియానె మూరోలతో కలిసి నటించారు. ఇందులో ఓ కన్విక్షన్‌తో కూడిన పాత్రలో కనిపించారు. ఎమ్మాను స్టార్ హీరోను చేయడంలో 'ది హెల్ప్' చిత్రం కీలక భూమిక పోషించింది. టేట్ టైలర్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ పీరియడ్ డ్రామా చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ పోషించారు. రైటర్ కావాలనుకునే అమ్మాయి తన దగ్గర నల్లజాతీయులు పనిచేయాలనుకుని ఇంటర్వ్యూలు చేస్తుంది. ఈక్రమంలో నల్లజాతీయులతో ఇబ్బంది పడే అమ్మాయిగా ఎమ్మా నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందీ చిత్రం. 53 ఏండ్ల మెజీషియన్‌కు 23ఏండ్ల టీనేజ్ అమ్మాయికి మధ్య అందమైన ప్రేమను ప్రతిబింబిస్తూ వూడీ అలెన్ రూపొందించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'మ్యాజిక్ ఇన్ ది మూన్లైట్'లో 23ఏండ్ల అమ్మాయిగా ఎమ్మా నటన మైమరపిస్తుంది. అస్తిత్వం కోల్పోయిన ఓ ప్రొఫెసర్ తన విద్యార్థితో ప్రేమలో పడటం వల్ల అతనిలో వచ్చిన మార్పు నేపథ్యంలో తెరకెక్కిన 'ఇర్రేషనల్ మ్యాన్' చిత్రంలో విద్యార్థినిగా ఆకట్టుకున్నారు. సూపర్ హీరో సినిమాలతో పాపులర్ అయిన హీరో తిరిగి తాను నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నం నేపథ్యంలో రూపొందిన సినిమా 'బర్డ్‌మ్యాన్'. ఇందులో హీరో కూతురిగా, డ్రగ్స్‌కి బానిసైన అమ్మాయిగా ఎమ్మా ఆకట్టుకున్నారు. 'అలోహ' చిత్రంలో మిలిటరీ కాంట్రాక్టర్ ప్రేమలో పడే ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించారు. ప్రేమ దూరమైనప్పుడు ఆమె ఎదుర్కొనే సంఘర్షణ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. 1973లో జరిగిన ప్రపంచ టెన్నీస్ ఛాంపియన్షిప్ ప్రధానంగా రూపొందిన 'బ్యాటిల్ ఆఫ్ ది సెక్సెస్' చిత్రంలో టెన్నీస్ స్టార్ బిల్లీ జీన్ కింగ్ పాత్రలో ఎమ్మా నటన ఇన్స్పైరింగ్గా సాగుతుంది. సాలీడు పురుగు కుట్టడంతో హీరో స్పైడర్‌మ్యాన్‌గా మారి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న విలన్‌ను ఎదుర్కొని, ఆపదల నుంచి ప్రజలను రక్షించే కథాంశంతో రూపొందిన 'స్పైడర్ మ్యాన్' చిత్ర సిరీస్‌లోని 'ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్', 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2'లో స్పైడర్ మ్యాన్‌కు లవర్‌గా ఎమ్మా నటించారు. స్పైడర్‌మ్యాన్ పాత్రలో ఎమ్మా స్టోన్ ప్రియుడు ఆండ్రూ గ్యారీఫీల్డ్ నటించడం విశేషం. ఈ చిత్రాలతో ఎమ్మా ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. డామియన్ చాజెల్లె దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ చిత్రం 'లా లా లాండ్' 2016లో విడుదలై సంచలన విజయం సాధించింది. మ్యూజికల్‌గా ఆకట్టుకుంటుంది. ఇందులో మియా, సెబాస్టియన్ మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి. మియా పాత్రలో ఎమ్మాస్టోన్, సెబాస్టియన్ పాత్రలో ర్యాన్ గోస్లింగ్ల నటన మైమరపిస్తుంది. ఈ చిత్రం 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై దర్శకత్వం, నటి, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఆస్కార్లు అందుకుంది. అలాగే ఉత్తమ నటిగా ఎమ్మాకు ఆస్కార్ దక్కింది.
Authorization