విన్ డీజిల్.. ఉత్కంఠ భరిత పోరాటాలకు, ఒళ్ళుగగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లకు కేరాఫ్.
'త్రిఫుల్ ఎక్స్', 'ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'ది క్రానికల్స్ ఆఫ్ రిడ్డిక్' వంటి తదితర సిరీస్ చిత్రాల్లోని విన్ డీజిల్ సాహసభరిత విన్యాసాలు ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు అద్భుతమైన కలెక్షన్ల వసూళ్ళతో వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ కింగ్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా అన్నింటికిమించి సాహసాలకు మారుపేరుగా విశేష ఆదరణ పొందిన విన్ డీజిల్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
స్వశక్తితోనే రాణింపు..
ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్న విన్ డీజిల్.. అసలు పేరు మార్క్ సింక్లెయిర్. తన స్నేహితుడొకరు విన్ డీజిల్‌గా మార్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అలమెడా కౌంటీలో 1967 జులై 18న జన్మించారు. విన్ కవలలు. తనకు పాల్ అనే సోదరుడున్నారు. తల్లి డెలోరా షెర్లీన్ ఆస్ట్రోలాగర్. విన్ తన తండ్రిని ఎప్పుడు కలవలేదు. తను ఎవరనేది కూడా తెలుసుకోలేదట. తల్లి సమక్షంలోనే పెరిగారు. సొంత గుర్తింపు, స్వశక్తితో ఎదగాలనే తపన, కసి చిన్నప్పట్నుంచే అలవడింది. అందుకోసం నిరంతరం కష్టపడ్డారు. థియేటర్ మేనేజర్‌గా, యాక్టింగ్ శిక్షణ అందించిన ఐర్వింగ్ హెచ్ విన్సెంట్‌ను తన పెంచిన తండ్రిగా భావిస్తుంటారు. డీజిల్ చిన్నప్పుడే నాటకాల్లో నటించారు. తొలుత 'డైనోసార్ డోర్' అనే నాటకంలో ఓ పాత్రను పోషించే అవకాశం వచ్చింది. కానీ దాన్నుంచి తొలగించడంతో తన సోదరుడు, అతని ఫ్రెండ్స్‌తో కలిసి ఆ థియేటర్‌ను ధ్వంసం చేయడంతో అదొక పెద్ద వివాదంగా మారింది. డీజిల్ న్యూయార్క్‌లోని హంటర్ కాలేజ్‌లో చేరారు. క్రియేటివ్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్‌కు సంబంధించిన అంశాలను ఇందులోనే నేర్చుకున్నారు. తనలో విభిన్న ప్రతిభ ఉందని, నటుడిగా తానేమిటో నిరూపించుకోవచ్చని కూడా తెలుసుకుంది ఈ కాలేజీలోనే కావడం విశేషం. సినిమా రంగంలోని రాణించడం కోసం ఎదురైన సవాళ్ళను అధిగమించేందుకు ప్రయత్నించారు. టీనేజ్‌గా ఉన్నప్పుడు 'బ్రేకిన్' అనే బ్రేక్ డాన్సింగ్ వీడియో చేశారు. 17ఏండ్ల వయసులో నైట్పబ్లో బౌన్సర్‌గా పనిచేశారు. డీజిల్ ఎప్పుడూ గుండుతో ఉంటారు. సినిమాల్లోనూ అలానే కనిపిస్తారు. కారణం బట్టతల.
సినిమా రంగం వైపు..
డీజిల్ తొలుత 1990లో 'అవేకెనింగ్స్' చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. పెద్దగా గుర్తింపు లేని పాత్ర అది. దీంతో సినిమా ఛాన్స్‌లు రాలేదు. ఛాన్స్‌ల కోసం చాలా ఆఫీసులు తిరిగారు. తనే రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, దర్శకుడిగా మారి షార్ట్ డ్రామా 'మల్టీ ఫేషియల్'ని 1994లో రూపొందించారు. కేవలం మూడు రోజుల్లో మూడు వేల డాలర్లతో రూపొందించిన షార్ట్ డ్రామా ఇది. అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా కేన్స్‌లోనూ ప్రదర్శితమ పేరొందిన పలువురు మేటి ఫిల్మ్ మేకర్స్‌ను ఆకట్టుకుంది. అయినప్పటికీ ఛాన్స్‌లు రాలేదు. ఇక లాభం లేదని భావించి మూడేండ్లు కష్టపడి అర్బన్ డ్రామా నేపథ్యంలో 'స్ట్రేస్' అనే సినిమాను రైటర్‌గా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా అన్నీ తానై రూపొందించారు. పూర్తి స్థాయి నటుడిగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఇందులో గ్యాంగ్ లీడర్‌గా మెప్పించారు. తొలి చిత్రమైనా నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. 1997లో విడుదలైన ఈ చిత్రం సండాన్స్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైంది. ఈ చిత్రాన్ని చూసి దర్శక దిగ్గజం స్టీవెన్ స్పెల్బర్గ్ తన 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్రంలో హీరోగా ఎంపిక చేశారు. ముఖ్యంగా 'మల్టీఫేషియల్'లో డీజిల్ భావోద్వేగంతో కూడిన విలక్షణ నటనను చూసి స్టీవెన్ ఫిదా అయ్యారట. 1998లో వచ్చిన ఈ ఎపిక్ వార్ చిత్రం 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్'లో యుద్ధ వీరుడిగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా విన్ డీజిల్‌ను స్టార్ హీరోను చేసింది. 1999లో వచ్చిన యానిమేటెడ్ చిత్రం 'ది ఐరన్ గెయింట్'లో టైటిల్ క్యారెక్టర్‌కు వాయిస్‌ను అందించారు. 2000లో వచ్చిన డ్రామా థ్రిల్లర్ 'బాయిలర్ రూమ్'లో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన సైన్స్ ఫిిక్షన్ 'పిచ్‌బ్లాక్' చిత్రం హీరోగా భారీ బ్రేక్‌నిచ్చింది.
ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ సిరీస్‌తో మలుపు..
ఇక డీజిల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం 'ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్'. రేసింగ్ ప్రధానంగా సాగే యాక్షన్ క్రైమ్ చిత్రమిది. ఇందులో పాల్ వాకర్, మిచెల్లె రోడ్రిగ్విజ్, జోర్డానా బ్రెవస్టర్, రికి యునె వంటి స్టార్స్‌తో కలిసి నటించారు. రాబ్ కోహెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం డీజిల్‌కు యాక్షన్ హీరోగా స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం ఫ్రాంచైజీగా ప్రారంభమవడం ఈ చిత్రం నుంచే కావడం విశేషం. మరో యాక్షన్ సిరీస్ 'త్రిబులెక్స్'లోనూ నటించారు. ఈ రెండు సిరీస్‌లు విన్ డీజిల్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టాయి. కమర్షియల్‌గా క్రేజీ స్టార్‌ను చేశాయి. ఆ తర్వాత వచ్చిన 'ది క్రానికల్ ఆఫ్ రిడ్డిక్'లో భాగమయ్యారు. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం చవిచూసినప్పటికీీ డీజిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత చేసిన క్రైమ్ డ్రామా 'నాక్రౌండ్ గార్సు', 'ఏ మ్యాన్ అపార్ట్' చిత్రాలు విన్ డీజిల్‌కు మంచి విజయాన్ని అందించాయి. ఈ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 2004లో వచ్చిన 'ది క్రానికల్స్ ఆఫ్ రిడ్డిక్: డార్క్ ఫ్యూరీ' యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో తన పాత్రకు వాయిస్ అందించారు.
తిరుగులేని యాక్షన్ స్టార్..
తనపై యాక్షన్ హీరోగా ముద్ర పడడంతో దాన్నుంచి బయట పడేందుకు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ 'ది ఫేసిఫియెర్' చిత్రంలో నటించారు. ఆడమ్ షాంక్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆధునిక వినోదభరిత చిత్రంగా అభివర్ణించబడింది. 2006లో కోర్డ్ రూమ్ కామెడీ క్రైమ్ డ్రామా 'ఫైండ్ మీ గిల్టీ' అనే ఫ్లాప్ చిత్రంలోనూ భాగమయ్యారు. అదే ఏడాది 'ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూయరిస్: టోక్కో డ్రిఫ్ట్' చిత్రంలో చిన్న పాత్రలో మెప్పించారు. రెండేండ్ల గ్యాప్‌తో 'బేబిలాన్ ఏ.డి' అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో మెరిశారు. ఏడాది తర్వాత మరోసారి తనను నటుడిగా అగ్ర స్థానంలో నిలబెట్టిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరీస్' నాల్గవ భాగంలో నటించారు. ఈ చిత్రం ద్వారే ఈ ఫ్రాంచైజీకి 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్' అనే పేరును స్థిరం చేశారు. దాన్నొక బ్రాండ్‌గా ప్రమోట్ చేశారు.
ఈ సినిమాకు డీజిల్ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రాన్ని 'లాస్ బాండోలరోస్' పేరుతో లఘు చిత్రంగా డీజిల్ అన్నీ తానై తీశారు. రెండేండ్ల గ్యాప్‌తో 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్' ఫ్రాంచైజీలోని ఐదవ చిత్రం 'ఫాస్ట్ ఫైవ్'లో నటించడంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. అదే ఏడాది 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్ 6' విడుదలై విశేష ఆదరణ పొందింది. ఈ క్రమంలో రూపొందిన సూపర్ నేచురల్ చిత్రం 'ది లాస్ట్ విచ్ హంటర్'లో హీరోగా, వార్ డ్రామా 'బిల్లీ లైన్న్స్ లాంగ్ హాఫ్‌టైమ్ వాక్'లో సపోర్టింగ్ రోల్లో మెప్పించారు. ఈ సినిమాలతో యాక్షన్ హీరోగా అగ్ర స్థానానికి చేరుకున్నారు. నెక్ట్స్ 'రిడ్డిక్' చిత్రాన్ని నటిస్తూ నిర్మించారు. 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ'లో గ్రూట్ పాత్రకు వాయిస్ అందించారు. 2015లో వచ్చిన 'ఫ్యూరియస్ 7' చిత్రం డీజిల్ ఇమేజ్ను మరోసారి నిరూపించింది. యాక్షన్ ఎంటర్టైనర్ 'త్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జెండర్ కేజ్'లో నటించారు. నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఓ పాత్రలో మెరవడం విశేషం. ఆ తర్వాత 2017లో 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్' ఫ్రాంఛైజీలో వచ్చిన 8వ సినిమా 'ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూయరిస్' చిత్రం డీజిల్‌ను తిరుగులేని యాక్షన్ హీరోను చేసింది. ఈ గ్యాప్‌లో మార్వెల్స్ సంస్థ నుంచి వచ్చిన 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ వోల్ 2', 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' చిత్రాల్లో గ్రూట్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన 'అవెంజర్స్' ఫ్రాంచైజీలో వస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు. వీటితోపాటు 'ది క్రానికల్ ఆఫ్ రిడ్డిక్: ఎస్కేప్ ఫ్రమ్ బచ్చర్ బే', 'వీలామ్యాన్', 'ది క్రానికల్స్ ఆఫ్ రిడ్డిక్: అసాల్ట్ ఆన్ డార్క్ అథెనా' వంటి వీడియో గేమ్స్‌కు వాయిస్ ఓవర్ అందించారు.
అలరించే అద్భుత వాయిస్..
విన్ డీజిల్‌కు వాయిస్ పెద్ద అసెట్. ఆయన కంఠం హాలీవుడ్లో బాగా పాపులర్. అందుకే పలు వీడియో గేమ్, యానిమేషన్ చిత్రాలకు వాయిస్‌ను అందించారు. టెలిఫోన్లో కూడా ఆయన వాయిస్ వస్తుంటుంది. పలు చిత్రాల్లోని పాత్రలకు కూడా వాయిస్‌ను అందించిన విషయం విదితమే. 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్' చిత్రంలో నటించిన కోస్టార్ మిచెల్లె రోడ్రిగ్విజ్ని ప్రేమించినప్పటికీ మెక్సికన్ మోడల్ పలోమా జిమెనెజ్ను 2007లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి కూతురు హనియా రిలే, కుమారుడు విన్సెంట్ సింక్లియర్, కూతురు పాలిన్ జన్మించారు. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్'లో నటించిన మరో నటుడు పాల్ వాకర్, డీజిల్ మంచి స్నేహితులు. పాల్ వాకర్ 2013లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం విదితమే. అతని గుర్తుగా తన చిన్నకూతురికి పాలిన్ పేరు పెట్టారు. 2006 తర్వాత డీజిల్ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి ఆయనెప్పుడూ వ్యక్తిగత విషయాలను ఎక్కడా బహిర్గతం చేయలేదు. 'ఒన్ రేస్ ఫిల్మ్స్', 'రేస్ట్రాక్ రికార్డ్స్', 'టిగన్ స్టూడియోస్' వంటి నిర్మాణ సంస్థలను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. యాక్షన్ హీరోగా ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన విన్ డీజిల్‌ను పలు అవార్డులు వరించినప్పటికీ చెప్పుకోదగ్గ ప్రతిష్టాత్మక పురస్కారాలేవి రాకపోవడం గమనార్హం.
యాక్షన్ ఓన్లీ..
విన్ డీజిల్ అన్నీ తానై రూపొందించిన 'స్ట్రే' చిత్రంలో గ్యాంగ్ స్టర్‌గా, డ్రగ్ డీలర్‌గా నటించారు. ఓ అందమైన అమ్మాయి వల్ల మంచి వాడిగా మారే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విన్ డీజిల్ గ్యాంగ్‌స్టర్‌గా, ప్రేమికుడిగా తనదైన నటనను పలికించి ఆకట్టుకున్నారు. అమెరికా పోలీస్ వ్యవస్థపై స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్రంలో పోలీస్ పాత్రలో విలక్షణ నటన కనబరిచారు. అమెరికాలోని ఓ దిగ్గజ కంపెనీ చేసే అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ తెరకెక్కిన 'బాయిలర్ రూమ్' చిత్రంలో ఓ ఉద్యోగిగా డీజిల్ అలరించారు. కాసేపు నవ్వులు పూయించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇక డేవిడ్ టోహి దర్శకత్వంలో తెరకెక్కిన 'పిచ్ బ్లాక్' చిత్రంలో ఆర్మీ క్రియేటర్‌గా, నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించారు. డీజిల్‌ను నటుడిగా అగ్ర స్థానానికి తీసుకెళ్ళిన సిరీస్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్'. ప్రపంచంలోనే అత్యంత పాపులర్, క్రేజీ ఫ్రాంచైజీ ఇది. కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2001లో ఈ ఫ్రాంచైజీ ప్రారంభమై ఇప్పటి వరకు 8 సినిమాలొచ్చాయి. 'టర్బో ఛార్జ్డ్ ప్రిల్యూడ్, లాస్ బాండోలర్స్' పేరుతో రెండు లఘు చిత్రాలు కూడా వచ్చాయి. విశేషమేమంటే సీరిస్‌లో నటించిన నటీనటులే ఈ లఘు చిత్రాల్లో కూడా నటించడం. ఇవి అమెరికా నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రాలు. ఒక అమెరికన్ ఫ్రాంఛైజీ సంస్థ చట్టవ్యతిరేకంగా వీధుల్లో కారు రేసింగ్ పోటీలు నిర్వహిస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకొని భారీ దోపిడీలు, మోసాలు, నేరాలు జరుగుతుంటాయి. దీని వెనకాల ఎవరున్నారనేది..? ఈ మోసాల గుట్టును తెలుసుకోవడం కోసం, ఎఫ్బిఐ ఒక సీక్రెట్ ఏజెంట్‌ను పంపిస్తుంది. ఆ అధికారి వీరితో కలిసి అక్కడి మోసాలను ఎలా కనిపెట్టారనేది ఈ సిరీస్ సినిమాల ఇతివృత్తం. అధికారి డోమినిక్ టోరిట్టో పాత్రలో విన్ డీజిల్ నటించారు. అతని స్నేహితుడు పాల్ వాకర్ 'బ్రెయిన్ ఓ కన్నర్'గా ఎఫ్బిఐ ఏజెంట్ పాత్ర పోషించారు. వీరి అద్భుతమైన నటనకు కారు రేసింగ్ తోడవ్వడంతో సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. వీటిలో విన్ డీజిల్ చేసే ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు, కారు రేసింగ్ ఈ సీరిస్‌లో కీలక భూమిక పోషిస్తున్నాయి. భవిష్యత్‌లో భూమిపై, ఆకాశంలో జరిగే పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'బేబిలాన్ ఏ.డి'లో స్మగ్లర్‌గా డీజిల్ నటన, యాక్షన్ ప్రేక్షకులను మైమరపిస్తాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రిడ్డిక్'లో నటించారు. 'రిడ్డిక్' సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడవ చిత్రమిది. గతంలో 'పిచ్ బ్లాక్', 'ది క్రానికల్స్ ఆఫ్ రిడ్డిక్' చిత్రాల్లోనూ టైటిల్ పాత్రలో డీజిల్ నటించారు. ఇందులో మరోసారి రిడ్డిక్ పాత్రలో ఏలియన్స్‌కు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా తన ఒళ్లుగగుర్పొడిచే నటనతో మెస్మరైజ్ చేశారు.
'ది లాస్ట్ విచ్ హంటర్' చిత్రంలో శక్తివంతమైన మనిషిగా, ఇరాక్, అమెరికా యుద్ధ నేపథ్యంలో సాగే వార్ డ్రామా చిత్రం 'బిలీ లైన్న్స్ లాంగ్ హాఫ్‌టైమ్ వాక్'లో మిలటరీ స్వ్కాడ్‌గా, 'త్రిబులెక్స్' సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడవ చిత్రం 'త్రిబులెక్స్: రిటర్న్స్ ఆఫ్ గ్జెండర్ కేజ్'లో సిఐఏ ఏజెంట్ గ్జెండర్ పాత్రలో మెరిసి అందర్నీ మెప్పించారు. 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వోల్ 2'. దర్శకుడు జేమ్స్ గున్న్ రూపొందిన ఈ సూపర్ హీరో యాక్షన్ సినిమాలో కీలక పాత్ర అయిన బేబీ గ్రూట్కు వాయిస్ అందించారు. ఈ గ్రూట్ చేసే కామెడీ ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' చిత్రంలో కూడా గ్రూట్ యానిమేషన్ పాత్రకు వాయిస్ అందించారు. డీజిల్ వాయిస్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్ విడుదలైన సినిమా రెండు బిలియన్ డాలర్లను వసూలు చేయడం విశేషం.
Authorization