జు జీ హ్యూన్ కొరియన్ చిత్రపరిశ్రమతోపాటు హాలీవుడ్‌ని సైతం ప్రభావితం చేసిన అద్భుతమైన నటి. వైవిధ్యమైన సినిమాలు, విలక్షణ పాత్రల్లోని జు జీ నటనకు ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి లేదు. కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే వరుస బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన నటిగా జు జీదే రికార్డ్. అలాగే స్టార్ హీరోలకు దీటుగా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగానూ రికార్డ్ క్రియేట్ చేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా మెరిసి ప్రేక్షకుల్ని అలరించారు. అంతేకాదు కొరియన్ టెలివిజన్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్‌ని తీసుకొచ్చిన నటిగానూ జు జీ మంచి గుర్తింపు పొందారు. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించి అందరినీ మెస్మరైజ్ చేసిన జు జీ హ్యూన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
జు జీ హ్యున్ అసలు పేరు వాంగ్ జీ హ్యున్. ఇంగ్లీష్ పేరు గీయన్నా జున్. 1981, అక్టోబర్ 30న సౌత్ కొరియాలోని సియోల్ నగరంలో జన్మించారు. తనకి ఫ్లైట్ హోస్ట్ (విమాన సహయకురాలు) కావాలని ఉండేది. అయితే జు జీ చూడ్డానికి స్లిమ్‌గా, అందంగా, పొడువుగా ఉండటంతో తల్లిదండ్రులు, స్నేహితులు, సోదరుడు జు జీను మోడల్‌గా ట్రై చేయమని, సినిమా రంగంలోకి వెళ్ళమని ప్రోత్సహించారు. దీంతో ఆ దిశగా అడుగులు వేశారు. ఓసారి విమాన ప్రయాణంలో జరిగిన ఓ ఘటన తర్వాత విమాన సహయకురాలవ్వాలనే తన కలను వదిలేశారు. అయితే 16ఏండ్ల వయసులో తన హైస్కూల్ ఫ్రెండ్ జు జీని ఓ ఫొటోగ్రాఫర్‌కు పరిచయంచేశారు. ఆయన తీసిన ఫొటోల ఆధారంగా మోడల్ అయ్యారు. అప్పట్నుంచి తన స్టేజ్ నేమ్‌గా అసలు పేరును జు జీ హ్యున్గా మార్చుకున్నారు.
మోడలింగ్ నుంచి స్టార్ హీరోయిన్గా..
1997లో తొలిసారి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించారు. తొలి ప్రయత్నంగా ఎకోలా మ్యాగజైన్ మోడల్‌గా కనిపించారు. సామ్సాంగ్ మై జెట్ ప్రింటర్‌తో కమర్షియల్ యాడ్స్ మోడల్‌గా బాగా పాపులర్ అయ్యారు. దీంతో టీవీల్లో నటించే ఛాన్స్‌లు వచ్చాయి. 1998లో 'ఫాసినేట్ మై హార్ట్' అనే టెలివిజన్ సిరీస్‌లో నటించారు. ఏడాదిలోనే సినిమాల్లో నటించే ఛాన్స్ వరించింది. 1999లో 'వైట్ వాలెంటైన్' అనే కొరియన్ రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారు. డాన్సులు, యాక్టివ్నెస్, యాటిట్యూడ్ ఎక్స్‌ప్రెషన్స్‌లో అతి తక్కువ టైమ్‌లో ఓ ఐకాన్‌గా మారిపోయారు. 2000లో వచ్చిన 'ఇల్ మారె'(ది సీ) చిత్రంలో నటించారు. సముద్ర తీరంలో సాగే మెలో డ్రామా చిత్రమిది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించడం, హీరోయిన్గా అద్భుత నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు ఇమేజ్ వచ్చింది. ఆ నెక్ట్స్ ఏడాది చేసిన కామెడీ చిత్రం 'మై సాస్సీ గర్ల్'తో జు జీకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా కొరియన్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. హాంకాంగ్‌లోనూ రెండువారాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈచిత్రంతో జు జీ పాన్ ఏసియా స్టార్‌డమ్‌ను సంపాదించారు. చైనీస్ లాంగ్వేజ్ మార్కెట్లోనే పెద్ద స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఘననీయమైన ప్రజాదరణ పొందారు. అంతేకాదు ఆమెను 'నేషన్స్ ఫస్ట్ లవ్' అని పిలుచుకునేవారు. దీంతో అనేక మల్టీనేషన్ కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని పోటీపడ్డాయి.
భారీ అంచనాలు అందుకునే క్రమంలో..
జు జీ నటించే సినిమాలపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు పెరిగాయి. ఆ భారీ అంచనాలతో జు జీ ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2003లో ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ది అన్ఇన్వైటెడ్' చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది, కానీ బాక్సాఫీసు వద్ద పరాజయం చవిచూసింది. అయినప్పటికీ తన పాపులారిటి ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్‌లో నిత్యం ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తూ ఉంది. ఆ తర్వాత 'మై సాస్సీ గర్ల్' చిత్ర దర్శకుడు క్వాక్ జాయి యంగ్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ 'విండ్ స్ట్రక్' చిత్రంలో నటించారు. ఇందులో జు జీ పాత్ర, 'మై సాస్సీ గర్ల్'లోని పాత్ర ఒకేలా ఉందనే విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఈ చిత్రం జపాన్‌లో మంచి ఆదరణ పొందింది. 2005లో అత్యధిక సంపాదన, అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటిగా, నిర్మాతలను అత్యంత ప్రభావితం చేయగల నటిగా కొరియాలో అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పాపులర్ నటుడు జంగ్ వూ సంగ్‌తో కలిసి 'డైసీ' చిత్రంలో మెరిశారు. 'ఇంటర్నల్ ఎఫైర్స్' దర్శకుడు ఆండ్రూ లాయి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది.
హాలీవుడ్‌లోనూ సంచలనం..
2006 తర్వాత జు జీ హాలీవుడ్ బంపర్ ఆఫర్ అందుకున్నారు. తొలి ప్రయత్నంగా 'బ్లడ్: ది లాస్ట్ వాంపైర్' చిత్రంలో నటించారు. జపాన్‌కు చెందిన యానిమేషన్ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో జు జీ మార్షల్ ఆర్ట్స్ యుద్ధ యోధురాలిగా నటించారు. దీని కోసమై దాదాపు మూడు నెలలు శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రంతోనే ఆమెను 'గీయన్నా జు జీ'గా పిలవడం ప్రారంభించారు. అప్పటి వరకు కొన్ని పాత్రలకే పరిమితమైన జు జీ నటనలోని మరో కోణానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2010లో పాపులర్ చైనీస్ నటి లి బింగ్బింగ్తో కలిసి 'స్నో ఫ్లవర్ అండ్ ది సీక్రెట్ ఫ్యాన్' చిత్రంలో నటించారు. బెస్ట్‌సెల్లింగ్ నవల ఆధారంగా వేనె వాంగ్ రూపొందించిన చిత్రమిది. ఇందులో సంఘర్షణ పడే అమ్మాయిగా ఓ భిన్న పాత్రలో జు జీ మెప్పించారు. అలా హాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించారు.
తనదైన మార్క్‌తో కొరియన్ సినిమాలు..
మళ్ళీ జు జీ తిరిగి కొరియన్ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 2012లో 'ది థీవ్స్' చిత్రంలో నటించారు. చోయి డాంగ్ హూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ సినిమా కొరియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. నెక్ట్స్ స్పై థ్రిల్లర్ 'ది బెర్లిన్ ఫైల్' సినిమా చేశారు. 2013లో వచ్చిన ఈ చిత్రం కూడా భారీ విజయంతో జు జీకి స్టార్ హీరోయిన్గా అగ్రస్థానంలో నిలబడింది. కొరియాలో తిరుగులేని అగ్ర నటిగా పేరొందింది. రెండ్లేండ్ల గ్యాప్‌తో 'అస్సాస్సినేషన్' చిత్రంలో నటించారు. గూఢచారి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సైతం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జు జీ తనదైన మార్క్్తో కొరియన్ సినిమాలను ప్రభావితం చేసింది.
టెలివిజన్ రంగంలోనూ క్రేజీ హీరోయిన్గా..
కొరియాలో టెలివిజన్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అందులో స్టార్స్ కూడా నటించడమే ఆ క్రేజ్‌కు కారణం. వాటికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. జు జీ హ్యున్ కెరీర్ తొలినాళ్ళ నుంచి టెలివిజన్ సిరీస్‌లో నటించారు. 1998లో 'ఫాస్సినేట్ మై హార్ట్' అనే టెలివిజన్ సిరీస్‌లో నటించారు. 1999లో పాపులర్ టెలివిజన్ సిరీస్ 'హ్యాపీ టుగెదర్'లో నటించారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఐదుగురు పిల్లల జీవితాల ప్రధానంగా రూపొందిన సిరీస్ ఇది. ఇందులో ఓ బాలికగా జు జీ నటించి అలరించారు. దాదాపు 14ఏండ్ల తర్వాత 2013లో మళ్ళీ 'మై లవ్ ఫ్రమ్ ది స్టార్' అనే టెలివిజన్ సిరీస్‌లో నటించారు. రొమాంటిక్ ఫాంటసీ స్టోరీ ప్రధానంగా సాగే టెలివిజన్ ఇది ఏడాది పాటు సాగి మంచి ఆదరణ పొందింది. రెండేండ్ల గ్యాప్‌తో 2016లో 'లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ'లో నటించారు.
మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ..
జు జీలో మరో కోణం ఉంది. మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ మెసిశారు. 1997లో 'విల్‌యు అండర్‌స్టాండ్', 1999లో 'ది బిగినింగ్ ఆఫ్ లవ్', 2000లో 'హే గర్ల్', 'లవ్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్', 2002లో 'లవ్ ఈజ్ ఆల్వేస్ థర్ట్సీ' లో నటించి అలరించారు.
విలక్షణ నటనకు వెండితెర రూపాలు..
జు జీ హ్యున్ అతి తక్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్గా ఎదిగారు. కొరియన్ సినిమాల్లోనే కాదు, ఏషియన్ చిత్ర పరిశ్రమ వ్యాప్తంగా ఆమె గణనీయమైన పాపులారిటీని సంపాదించారు. ముఖ్యంగా లవర్‌గా, స్ట్రగుల్స్ పడే అమ్మాయిగా, యుద్ధ నారీమణిగా
భిన్న పాత్రలతో మెప్పించి, మెస్మరైజ్ చేశారు. కుర్రకారు కలల కథానాయికగానూ పేరు తెచ్చుకున్నారు. పలు టీవీ సిరీస్‌ల అనంతరం జు జీ మొదటగా 'వైట్ వాలెంటైన్' చిత్రంలో నటించారు. బాలికగా, ప్రియురాలిగా అమాయకత్వంతో కూడిన నటనతో మెప్పించారు.
ఓ అమ్మాయి తన చిన్నతనాన్ని తిరిగి పొందే కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం 'ఇల్ మేర్'. ఒక అమ్మాయి సముద్ర తీరంలో ఉండే ఇంట్లో రెండేండ్లు నివసిస్తుంది. ఆ సముద్ర తీరంలో ఉండే ఓ మెయిల్ బాక్స్‌లో లెటర్స్ వేసేది. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన అబ్బాయికి ఆ లెటర్స్ దొరకడంతో ఆ లెటర్స్ రాసిన అమ్మాయి ఎవరో తెలియకుండానే ప్రేమలో పడతాడు. ఇద్దరూ పరస్పరం ఉత్తరాలు రాసుకుంటారు. చివరికి వీరి ప్రేమ ఎలా విషాద తీరం చేరుకుందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో జు జీ నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇద్దరి ప్రేమికుల జీవితాలను ఓ మ్యాజికల్ మెయిల్ బాక్స్ ఎలా నిర్ణయించిందనేది సినిమాలో ఆసక్తికరం. ఓ స్వచ్ఛమైన ప్రేమికురాలిగా, తనజీవితంలో ఏదో కోల్పోయిన అమ్మాయిగా జు జీ పలికించిన భావోద్వేగాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. లీ హ్యున్ సియుంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2000లో విడుదలై ఘనవిజయం సాధించింది.
ఆ వెంటనే మరో రొమాంటిక్ కామెడీ చిత్రం 'మై సాస్సీ గర్ల్'లో నటించారు. అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడటం. ఆ ప్రేమను పొందేందుకు తప్పించే ఇద్దరు ప్రేమికుల జర్నీని తెలిపే ఈ చిత్రంలో ప్రియురాలిగా జు జీ నటన మెప్పిస్తుంది, మైమరపిస్తుంది, నవ్విస్తుంది. 2001లో విడుదలైన ఈ సినిమా కొరియన్ సినిమా చరిత్రలో సంచలనం. సినిమా విజయంలో జు జీ హ్యున్ కీలక పాత్ర పోషించారు. ఆమె లేకుండా సినిమా విజయం సాధ్యమయ్యేది కాదని సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంతో కుర్రకారు కలల రాణిగా జు జీ మారిందంటే అతిశయోక్తి కాదు. రెండేండ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సైకలాజికల్ హర్రర్ చిత్రం 'ది అన్ఇన్వైటెడ్'లో కథానాయికగా నటించారు. జియాంగ్ అనే వ్యక్తికి తన గతం గుర్తుండదు. తన ఫ్యామిలీ ఎవరనేది తెలియదు. అతను ఇద్దరు అమ్మాయిల హత్యను చూస్తాడు.
ఈ మర్డర్ కేసులో మరో సాక్ష్యం యియాన్. ఆమెకు దెయ్యం కనిపిస్తుంటుంది. అంతేకాదు
ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుంటుంది. ఈ క్రమంలో ఆమె జాయింగ్ మెమరీ తిరిగి పొందేందుకు హెల్ప్ చేస్తుంటుంది. అనంతరం చోటు చేసుకున్న భయానక పరిణామాల నేపథ్యంలో ఈచిత్రం రూపొందింది. ఇందులో మానసికంగా ఇబ్బంది పడే అమ్మాయి యియాన్గా జు జీ నటన ఆద్యంతం అలరిస్తుంది. ఓ వైపు భయపెడుతూనే ఆకట్టుకుంటుంది. ఏక కాలంలో ఆమె పలికించే భావోద్వేగాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందంతోనే కాదు, నటనలోనూ తానేంటో నిరూపించిన చిత్రమిది. నటిగా జు జీకి మంచి పేరు, గుర్తింపు తెచ్చింది. మరోసారి ప్రేమికురాలిగా 2004లో వచ్చిన 'విండ్ స్ట్రక్' చిత్రంలో జు జీ కనువిందు చేశారు. అందంతోపాటు అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. క్యుంగిజిన్, మ్యుంగ్వూ అనే ఇద్దరి ప్రేమికుల భగ ప్రేమను తెలిపే చిత్రమిది. కామెడీ, క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో జంటగా నటించిన జు జీ హ్యున్, హ్యుక్ జాంగ్ల నటన మనసుల్ని పిండేస్తుంది.
ఆ తర్వాత ట్రాయాంగిల్ లవ్ స్టోరీ చిత్రం 'డైసీ'లో నటించారు. ఇంటర్‌పోల్ డిటెక్టివ్, ప్రొఫెషనల్ కిల్లర్, పెయింటర్ మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇద్దరు ప్రేమికుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా జు జీ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. స్లయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా సైతం మెప్పిస్తుంది. 'ఇంటర్నల్ ఎఫైర్' దర్శకుడు ఆండ్రూ లాయి 2006లో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. సూపర్‌మ్యాన్ లక్షణాలున్న ఓ వ్యక్తిని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ చేసే ప్రొడ్యూసర్ చూస్తుంది. అతనిపై స్టోరీ చేసే క్రమంలో అతని ప్రేమలో పడటం, ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర అంశాల సమాహారంగా 'ఏ మ్యాన్ హు వాస్ సూపర్‌మ్యాన్' చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఆధునిక కొరియన్ సమకాలీన అంశాలను చర్చిస్తుంది.
ఇందులో జు జీ హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ చేసే ప్రొడూసర్గా నటించి మెప్పించారు. జు జీ నటించిన మొదటి అంతర్జాతీయ సినిమా 'బ్లడ్: ది లాస్ట్ వాంపైర్'. జపాన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ హర్రర్, యాక్షన్ చిత్రమిది. ప్రజలపై దాడులకు తెగబడుతున్న రాక్షస మనుషులను ప్రభుత్వంలో పనిచేసే సగం మనిషి, సగం వాంపైర్ (రాక్షస లక్షణాలు) లక్షణాలున్న యుద్ధ యోధురాలు చేసే పోరాట నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. 2009లో వచ్చిన ఈ చిత్రానికి క్రిస్ నహాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యుద్ధ యోధురాలిగా జు జీ నటన ఆద్యంత మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆమె చేసే యుద్ధ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఇప్పటి వరకు అందం, అభినయంతోనే అలరించిన జు జీ ఈ చిత్రంతో పోరాట యోధురాలిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అలాగే చిత్ర విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇలా నటించిన ప్రతి చిత్రంలోనూ తన పాత్రకి సంబంధించి నటనలో వైవిధ్యాన్ని చూపించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు జు జీ.
స్టార్ హీరోలకు దీటుగా పారితోషికం..
జు జీ 2012లో బ్యాంక్‌లో పనిచేసే చోయి జూన్ హ్యుక్ను వివాహం చేసుకున్నారు. భారీ స్థాయిలో పెళ్ళి వేడుక జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెళ్ళి తర్వాత జు జీ వివాదాల్లో ఇరుక్కున్నారు.
తన ఫొటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు ఓ మ్యాగజైన్‌పై భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేశారు. 2009లో ఆమె ఫోన్ క్లోనింగ్‌కు గురైంది. దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'గియన్నా బై ట్రూ రిలీజియన్్' పేరుతో లగ్జరీ జీన్స్ బ్రాండ్‌ను ప్రారంభించారు. దీనిలో అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయ్యారు. పాపులారిటీ పరంగా మంచి ప్రశంసలందుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన కొరియన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో 8వ స్థానంలో నిలిచారు. 2015లో 4వ స్థానంలో నిలిచారు. కొరియన్ ఫేమస్ నటి కావడంతో పలు వాణిజ్య కంపెనీలు జు జీను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకునేందుకు పోటీపడ్డాయి. 2014లో జు జీకి భారీ డిమాండ్ ఏర్పడింది. వాటి ద్వారా అత్యధిక పారితోషికాన్ని పొందారు. హీరోలను వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచారు. 2016లో దాదాపు 14 కమర్షియల్స్‌కి పనిచేశారు. జు జీ నటనకు అనేక అవార్డులు లభించాయి. 'వైట్ వాలెంటైన్' చిత్రంలోని అద్భుత నటనకు ఉత్తమ నటిగా మూడు బీక్సాంగ్ ఆర్ట్స్ అవార్డులు, ఎనిమిది ఎస్బిఎస్ డ్రామా అవార్డులు, బ్ల్రూ డ్రాగన్ ఫిల్మ్ అవార్డులు, గ్రాండ్ బెల్ అవార్డులతోపాటు అనేక కొరియన్, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ప్రస్తుతం ప్రెగెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
Authorization