టామ్ హాంక్స్.. ఈ పేరు వినగానే పడి పడి నవ్వించే పాత్రలే కాదు, కన్నీటిపర్యంతం చేసే అద్భుతమైన భావోద్వేగభరిత పాత్రలూ గుర్తొస్తాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్. అసాధారణ బాక్సాఫీస్ కలెక్షన్లతో హాలీవుడ్‌తోపాటు యావత్ సినీ ప్రపంచాన్నే అత్యంత ప్రభావితం చేసిన నటుడు టామ్ హాంక్స్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
చిన్నప్పట్నుంచే నటనపై అమితాసక్తి..
టామ్ హాంక్స్ అసలు పేరు థామస్ జెఫ్రీ హ్యాంక్స్. 1956, జులై 9న, అమెరికా కాలిఫోర్నియాలోని కాంకర్డ్‌లో జన్మించారు. జనెట్ మార్లీన్, అమాస్ మెఫోర్డ్ హాంక్స్లు తల్లిదండ్రులు. వీరి ముగ్గురి సంతానంలో టామ్ చిన్నవారు. తండ్రి ఆసుపత్రిలో పనిచేసేవారు. తల్లి వంటలు చేసేవారు. వీరి తల్లిదండ్రులు 1960లో విడాకులు తీసుకున్నారు. పదేండ్ల వయసులో కాలిఫోర్నియాకు మకాం మార్చారు. విడాకుల తర్వాత మిగతా సోదరులంతా తల్లితో వెళ్తే, టామ్ మాత్రం తండ్రి దగ్గరే ఉన్నారు. టామ్ స్కూల్ స్టడీ అంత సవ్యంగా సాగలేదు. తొందరపాటు, ఆందోళన, భయం ఎక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులతో సరిగా ఉండలేకపోయేవారు. అదే సమయంలో మంచి బాలుడిగా, ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించేవాడిగా పేరుతెచ్చుకున్నారు. 1965లో తండ్రి చైనాకు చెందిన ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. వారితో కలిసి టామ్ పెరిగారు. టామ్‌కి చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో నటించారు. ప్రాథమిక విద్య అనంతరం చాబోట్ కాలేజ్‌లో థియేటర్ ఆర్ట్స్ చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి మారిపోయారు. నాటకాలకు కేటాయించిన అధిక సమయం తనకు డైలాగ్ డిక్షన్లోను, నటనలో వైవిధ్యాన్ని చూపించేందుకు ఎంతో ఉపయోగపడిందని టామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
థియేటర్ ప్రొడక్షన్లో లైటింగ్, సెట్ డిజైన్, స్టేజ్ మేనేజ్మెంట్, ప్రాంప్టింగ్పై అవగాహన వచ్చింది. అదే సమయంలో షేక్స్పియర్ నాటకం 'ది టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా'లో విలన్ పాత్రలో నటించి ఉత్తమ నటుడిగా క్రెవెలాండ్ క్రిటిక్స్ అవార్డును పొందారు. టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన టాప్ టెన్ కాలేజ్ డ్రాపౌట్ విద్యార్థుల్లో టామ్ ఒకరిగా నిలిచారు.
నాలుగేండ్ల పాటు ఒక్క సినిమా ఛాన్స్ రాలేదు..
1979లో న్యూయార్క్‌కి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించగా 1980లో 'హి నోస్ యువర్ ఎలోన్' చిత్రంలో చిన్న పాత్ర పోషించే వీలు దొరికింది. ఆ తర్వాత టెలివిజన్ చిత్రం 'మేజెస్ అండ్ మాన్స్టర్స్'లో పూర్తి స్థాయి హీరోగా నటించారు. ఏబీసీ టెలివిజన్ 'బోసమ్ బడ్డీస్'లో కిప్ విల్సన్ పాత్రను, 'ది లవ్ బోట్'లో రిక్ మార్టిన్గా మెప్పించారు. మొదటి సినిమా తర్వాత దాదాపు నాలుగేండ్లపాటు ఒక్క సినిమా ఛాన్స్ రాలేదు. కానీ నాటకాలు, టెలివిజన్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. 'టాక్సీ', 'హ్యాపీ డేస్', 'ఫ్యామిలీ టైస్' వంటి టెలివిజన్ సిరీస్‌లో మెప్పించారు.
1984లో రాన్ హోవర్డ్ దర్శకత్వంలో 'స్ల్పాష్' చిత్రంలో నటించారు. రొమాంటిక్ కామెడీ చిత్రమిది. ఈ చిత్రం సర్ప్రైజ్ హిట్ సాధించి టామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 'బ్యాచిలర్ పార్టీ'లో కీలక పాత్రలో నటించారు. ఇది కూడా అనూహ్యమైన విజయం సాధించింది. అదే ఏడాది 'ఫ్యామిలీ టైస్' టెలివిజన్ సిరీస్‌లో గెస్ట్ రోల్లో నటించారు. సినిమాల పరంగా వరుసగా 'ది మ్యాన్ విత్ వన్ రెడ్ షోయి', 'వాలంటీర్స్', 'ది మనీ పిట్' చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. 1986లో గ్యారీ మార్షల్ దర్శకత్వంలో 'నథింగ్ ఇన్ కామన్' సినిమాలో కామెడీ, డ్రామా తరహా పాత్రతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేదు. ఆ తర్వాత వచ్చిన కామెడీ చిత్రం 'డ్రాగెట్' ఫర్వాలేదనిపించుకుంది. దీంతో ఆయన్ని ఫిల్మ్ ఇండిస్టీ రోస్‌గా పిలిచేవారు.
'బిగ్'తో బిగ్ బ్రేక్..
1988లో వచ్చిన ఫాంటసీ కామెడీ 'బిగ్' టామ్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చింది. టామ్లోని నటనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రమిది. అయినప్పటికీ 'పంచ్‌లైన్', 'ది బర్బ్స్', 'జోయి వెర్సస్ ది వోల్కానో', 'ది బోనఫైర్ ఆఫ్ ది వానిటైస్' చిత్రాలు వరుసగా ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. 1989లో చేసిన 'టర్నర్ అండ్ హూచ్' చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యింది. అయితే ఈ చిత్రం వరకు టామ్ స్ట్రగులింగ్ కమెడీయన్‌గానే ఉండిపోయారు. టామ్ ఒక్కసారిగా స్టార్ కాలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. జయాపజయాలు నిత్యం అతన్ని పలకరిస్తూనే ఉన్నాయి. 1992లో చేసిన 'ఏ లీగ్ ఆఫ్ ధెయిర్ ఓన్' నటుడిగా కాస్త ఊరటనిచ్చింది. 1993లో చేసిన 'స్లీప్‌లెస్ ఇన్ సీటెల్', 'ఫిలడెల్ఫీయా' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. జోనాథన్ డెమ్మె దర్శకత్వంలో వచ్చిన 'ఫిలడెల్ఫియా' టామ్‌కు ఓ కొత్త రకమైన ఇమేజ్ను తెచ్చింది. ఇందులో ఆయన గే పాత్ర పోషించడానికి తన స్కూల్ క్లాస్ మేట్ జాన్ కిల్కర్సన్, హై స్కూల్ డ్రామా టీచర్ రాలీ ఫార్న్స్ వర్త్ కారణమని టామ్ చెప్పారు. అంతేకాదు ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్‌ను అందుకున్నారు. ఆ వెంటనే 'ఫారెస్ట్ గంప్' చిత్రంతో కెరీర్లో మరో బెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సాధించారు. రాబర్డ్ జెమెక్కిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 600 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా మరోసారి ఆస్కార్‌ను కైవసం చేసుకున్నారు. వెంటవెంటనే ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న రెండవ నటుడిగా టామ్ నిలిచారు. (స్పెన్సర్ ట్రేసీ 1937, 1938లో వెంటవెంటనే రెండు ఆస్కార్ అవార్డులనందుకున్నారు) 'స్ల్పాష్' వంటి హిట్‌ను అందించిన రాన్ హోవర్డ్ దర్శకత్వంలో మరోసారి 'అపోలో 13' చిత్రంలో నటించారు. 1995లో విడుదలైన ఈ సినిమా మంచి ప్రశంసలందుకుంది. యానిమేషన్ చిత్రం 'టారు స్టోరీ'లో షెరిఫ్ వూడీ పాత్రకు వాయిస్‌ను అందించారు.
దర్శకుడిగా, నిర్మాతగా, తిరుగులేని స్టార్‌గా..
వరుసగా భారీ విజయాలు అందుకున్న సమయంలో టామ్ హాంక్స్ దర్శకుడిగా మారి 'దట్ థింగ్ యు డు' చిత్రాన్ని రూపొందించారు. ఒక పాప్ బ్యాండ్ గ్రూప్ జయాపజయాలు ఎలా సాగాయనే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో గ్రూప్ సభ్యుల్లో ఒకరిగా టామ్ నటించారు. 1996లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత స్టీవెన్ స్పీల్బర్గ్ 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్రంలో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రమిది. ఎపిక్ వార్ డ్రామాగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎపిక్ సర్వైవల్ చిత్రం 'కాస్ట్ అవే'లో హీరోగా నటించడంతోపాటు నిర్మాతగా మారారు. రాబర్ట్ జెమెక్కిస్ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రమిది. 2000లో వచ్చిన ఈ సినిమా సైతం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాల విజయాలతో టామ్ హాంక్స్ తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. హీరోగా కంటిన్యూగా సక్సెస్‌లు సాధించారు.
వరుస విజయాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి..
'మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్' చిత్రానికి నిర్మాతగా సర్ప్రైజ్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నటుడిగా 'రోడ్ టు ప్రిడేషన్', 'క్యాచ్ మీ ఇఫ్ యు కెన్', 'ది లేడీకిల్లర్స్', 'కాని అండ్ కార్లా', 'ది టర్మినల్', 'ఎల్విస్ హ్యాజ్ లెఫ్ట్ ది బిల్డింగ్', 'ది పోలాస్ ఎక్స్‌ప్రెస్', 'ది డావిన్సి కోడ్', 'కార్స్', 'చార్లీ విల్సన్స్ వార్', 'ది సింప్సన్ మూవీ', 'ది గ్రేట్ బక్ హోవర్డ్', 'ల్యారీ క్రౌనె', 'ఏంజెల్స్ అండ్ డిమాన్స్', 'హవాయిన్ వెకేషన్', 'స్మాల్ ఫ్రై', 'ఎక్స్ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇక్రిడబుల్ క్లోజ్', 'క్లౌడ్ అట్లాస్', 'పార్టీసారస్ రెక్స్', 'కెప్టెన్ ఫిలిప్స్', 'సేవింగ్ మిస్టర్ బ్యాంక్స్', 'బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్', 'ఇతాకా', 'ఏ హోలోగ్రామ్ ఫర్ ది కింగ్', 'సల్లీ', 'ఇన్ఫెర్నో', 'ది సర్కిల్', 'ది పోస్ట్' చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తాను వాయిస్ అందించిన 'టారు స్టోరీస్'తోపాటు 'అపోలో 13', 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్', 'ది గ్రీన్ మైల్', 'క్యాచ్ మి ఇఫ్ యు కెన్', 'ది టర్మినల్', 'కెప్టెన్ ఫిలిప్స్', 'బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్', 'ఇన్ఫెర్నో', 'సల్లీ', 'ది పోస్ట్' చిత్రాలు సంచలన విజయం సాధించి టామ్ హాంక్స్ను హాలీవుడ్ దిగ్గజ నటుడిగా నిలబెట్టాయి. హాలీవుడ్‌నే కాదు, ప్రపంచ సినిమాను ప్రభావితం చేయగల నటుడిని చేశాయి. ఆయా చిత్రాల విజయాల్లో టామ్ నటన, ఇమేజ్ కీలక పాత్ర పోషించాయి. స్టార్ ఇమేజ్‌నే కాదు, విలక్షణ నటుడిగా యావత్ ప్రపంచం గర్వించదగ్గ నటుడిని చేశాయి.
స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో సినిమాలు..
టామ్ కెరీర్లో ఎక్కువగా స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్', 'ది టర్మినల్', 'క్యాచ్ మి ఇఫ్ యు కెన్', 'బ్రిడ్స్ ఆఫ్ స్పైస్', 'ది పోస్ట్' వంటి ఐదు చిత్రాలు, రాన్ హోవర్డ్ దర్శకత్వంలో ఐదు సినిమాలు 'స్ల్పాష్', 'అపోలో 13', 'ది దా విన్సి కోడ్', 'ఏంజెల్స్ అండ్ డెమాన్స్', 'ఇన్ఫెర్నో' చేశారు. క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వంలోనూ 'సల్లీ' చిత్రంలో నటించారు. 'క్యాచ్ మి ఇఫ్ యు కెన్' చిత్రంలో మరో అగ్ర నటుడు లియోనార్డో డికాప్రియోతో కలిసి నటించారు. దర్శకుడిగా 'దట్ థింగ్ యు డు'తోపాటు 'ల్యారీ క్రౌన్' చిత్రాలకు పనిచేశారు. 'మ్యాగ్నిఫిషెంట్ డిసోలేషన్: వాకింగ్ ఆన్ ది మూన్ 3డి' చిత్రానికి స్క్రీన్‌రైటర్‌గా, నెరేటర్‌గా, 'బియాండ్ ఆల్ బౌండరీస్' చిత్రానికి నెరేటర్‌గా పనిచేశారు. టామ్ హాంక్స్ 1998లో ప్లేటోన్ పేరుతో నిర్మాతగా మారి 'కాస్ట్అవే', 'మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్', 'కాన్నీ అండ్ కార్లా', 'ది పోలార్ ఎక్స్‌ప్రెస్', 'మాగ్నిఫిసెంట్ డిసోలేషన్: వాకింగ్ఆన్ది మూన్ 3డి', 'ది అంట్ బల్లీ', 'స్టార్టర్ ఫర్ 10', 'ఎవాన్ అల్మైట్', 'ఛార్లీ విల్సన్ వార్', 'మమ్మా మియా', 'సిటీ ఆఫ్ ఎంబర్', 'ది గ్రేట్ బక్ హౌవర్డ్'. 'మై లైఫ్ ఇన్ రెయిన్', 'వేర్ ది వైల్డ్ థింగ్స్ ఆర్', 'బియాండ్ ఆల్ బౌండరీస్', 'లారీ క్రౌనె', 'పార్క్‌లాండ్', 'ఇతకా', 'మై బిగ్ ఫ్యా గ్రీక్ వెడ్డింగ్ 2', 'ఏహౌలోగ్రామ్ ఫర్ దికింగ్','సల్లీ', 'ది సర్కిల్ చిత్రాలను నిర్మించారు. 12 నాటకాల్లో, 30కిపైగా టెలివిజన్ సిరీస్‌లో, రెండు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి మెప్పించారు.
భార్య కోసం మతాన్ని మార్చుకున్నారు..
హాంక్స్ 1978లో అమెరికన్ నటి సమంతా లెవెస్ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు కొలిన్ హాంక్స్ జన్మించారు. కొలిన్ కూడా నటుడిగానే రాణిస్తున్నారు. వీరికి మరో కూతురు ఎలిజబెత్ హాంక్స్ ఉన్నారు. 'బోసమ్ బడ్డీస్', 'వాలంటీర్స్' చిత్రాల్లో రీటా విల్సన్‌తో టామ్ నటించారు. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం పెరిగి ప్రేమగా మారింది. ఆ ప్రేమ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేలా దారితీసింది. సమంతా లెవెస్కు 1987లో విడాకులిచ్చారు. 1988లో రీటా విల్సన్‌ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు చెస్టర్ మార్లన్ హాంక్స్ 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్' చిత్రంలో విద్యార్థిగా నటించారు. విశేషమేమంటే విల్సన్ కోసం హాంక్స్ తన మతాన్ని కూడా మార్చుకున్నారు.
ఇటీవల తాను టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నట్టు టామ్ వెల్లడించారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌లను ప్రోత్సహించడంతోపాటు చమురుకు ప్రత్యామ్నాయాలను ఎంకరేజ్ చేశారు. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు సపోర్ట్ చేశారు.
2012లో హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిలిచారు. తనకు చిన్నప్పుడు వ్యోమగామి కావాలని ఉండేదని పలు నాసా కార్యక్రమాల్లో వెల్లడించారు. ప్రస్తుతం నేషనల్ స్పేస్ సొసైటీలో సభ్యుడిగా పనిచేస్తున్నారు.
అపోలో ప్రొగ్రామ్‌పై 'ఫ్రమ్ ది ఎర్త్ టు
ది మూన్'ను మిని సిరీస్‌ను నిర్మించారు. అలాగే చంద్రుడిపైకి ప్రయాణం నేపథ్యంలో
తెరకెక్కించిన 'మిగ్నిఫిషెంట్ డెసోలేషన్: వాకింగ్ ఆన్ ది మూన్ 3డి' చిత్రాన్ని నిర్మించారు.
నట విశ్వరూపానికి ప్రతీకలు..
కెరీర్ తొలినాళ్ళలో టామ్ ఎక్కువగా కామెడీ పాత్రలతో అలరించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భిన్న భావోద్వేగాలతో కూడిన చిత్రాలు, పాత్రలు చేశారు. శక్తివంతమైన పోలీస్ అధికారిగా, గేగా, యుద్ధవీరుడిగా, వ్యోమగామిగా, శాస్త్రవేత్తగా, థ్రిల్లర్ నేపథ్యంలో భయానక పాత్రలతో మెప్పించి, నటుడిగా తన పూర్తి నట విశ్వరూపం చూపించారు. ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం 'స్ప్లాష్'లో మత్స్యకన్య ప్రేమలో పడిన యువకుడిగా అలరించారు. కామెడీ ఎంటర్టైనర్ 'బ్యాచిలర్ పార్టీ' చిత్రంలో అల్లరిచిల్లరగా తిరిగే విద్యార్థిగా, 'వాలంటీర్స్' చిత్రంలో చెడు మార్గంలో తిరిగే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా, కామెడీ డ్రామా చిత్రాలు 'ది మనీ పిట్', 'నథింగ్ ఇన్ కామన్', 'గ్రాగెట్, 'బిగ్'లో కామెడీ పాత్రలతో ఆకట్టుకున్నారు. 'ఎవ్రీ టైమ్ వీ సే గుడ్‌బై' చిత్రంలో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా అలరించారు. 'పంచ్‌లైన్' చిత్రంలో భార్యకు హెల్ప్ చేసే భర్తగా కామెడీని పండించారు. 'ది బర్బ్స్'లో థ్రిల్లర్ తరహా పాత్రతో, 'టర్నర్ అండ్ హూచ్' చిత్రంలో బడ్డీ కామెడీ పోలీస్‌గా మెప్పించారు. సెటైరికల్ బ్లాక్ కామెడీ 'ది బోన్‌ఫైర్ ఆఫ్ ది వానిటీస్' వాల్ స్ట్రీట్ బాండ్ ట్రేడర్‌గా నవ్వించారు. 'స్లీప్‌లెస్ ఇన్ సీటిల్' చిత్రంలో భార్యను కోల్పోయిన భర్తగా ప్రేక్షక హృదయాలను కదిలించారు. ఎయిడ్స్‌పై మొదటిసారి వచ్చిన 'ఫిలడెల్ఫియా' చిత్రంలో కార్పొరేట్లకు చెందిన సీనియర్ అసోసియేట్‌గా స్వలింగ సంపర్కుడి పాత్రలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. యుక్త వయసుకు వచ్చినప్పటికీ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి అనుకోకుండా ఆర్మీ ఉద్యోగం పొందిన ఫారెస్ట్ గంప్గా 'ఫారెస్ట్ గంప్'లో తనదైన నటనతో కడుపుబ్బ నవ్వించారు. అమెరికన్ డాక్యుడ్రామా స్పేస్ అడ్వెంచర్ 'అపోలో 13'లో తెలివైన వ్యోమగామిగా సెటిల్డ్ నటనతో కనువిందు చేశారు.
అమెరికాకు చెందిన సెక్యురిటీ ఏజెన్సీలో పనిచేసి మోసాలకు పాల్పడి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన ఫ్రాంక్ అబగలె జీవితం ఆధారంగా రూపొందించిన క్రైమ్ డ్రామా చిత్రం 'క్యాచ్ మి ఇఫ్ యు కెన్'లో ఫ్రాంక్ను పట్టుకునే శక్తివంతమైన అధికారిగా టామ్ నటించి మెప్పించారు. సముద్రంలో విమానం కూలిపోవడంతో మనుగడ కోసం చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన 'కాస్ట్అవే' చిత్రంలో సముద్రంలో ఒంటరిగా పోరాడే వ్యక్తిగా టామ్ నటన, కనబర్చిన భావోద్వేగాలు ఆద్యంతం హృదయాన్ని హత్తుకుంటాయి. ఎయిర్ పోర్ట్‌నే నివాసంగా మార్చుకుని జీవితం సాగించిన వ్యక్తి కథాంశంతో తెరకెక్కిన 'దిటెర్మినల్' చిత్రంలో టామ్ అలరించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన 'రోడ్ టు పార్డిషన్' చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా టామ్ నట విలక్షణం అద్భుతం. 2009లో సోమాలియా సముద్ర దొంగలతో హైజాక్ చేయబడిన అమెరికా నౌకను కాపాడిన కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్ జీవితం ఆధారంగా రూపొందిన 'కెప్టెన్ ఫిలిప్స్'లో రిచర్డ్పాత్రలో టామ్ నటన అత్యద్భుతం. వార్ నేపథ్య చిత్రం 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్రంలో ఆర్మీ కెప్టెన్ మిల్లర్పాత్రలో మరోసారి తన విలక్షణ నటనను కనబరిచారు.
ఓ ప్రమాదకర మిస్టరీ చేధించే ఇతివృత్తంతో రూపొందిన 'ఇన్ఫెర్నో' చిత్రంలో మిస్టరీ చేధించే అధికారిగా టామ్ నటన ప్రశంసలందుకుంది. 150కిపైగా ప్రయాణికులను కాపాడిన ఎయిర్‌లైన్ కెప్టెన్ చార్లీ సులెన్బర్గ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సల్లీ' చిత్రంలో చార్లీ సులెన్బర్గ్గా మైమరపించారు. ఇక వియత్నం వార్ సమయంలో అమెరికా చేసిన కుట్రలకు సంబంధించిన 'పెంటగాన్ పేపర్స్'ను వాషింగ్టన్ పోస్ట్, ది న్యూయార్ టైమ్స్ పత్రికలు లీక్ చేయడం ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకుని అమెరికా ప్రభుత్వానికి, మహిళా పత్రికా అధినేతకు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో 'ది పోస్ట్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఎడిటర్‌గా టామ్ నటన ఆద్యంతం మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆయన 'గ్రేహౌండ్' చిత్రంలో నటిస్తున్నారు.
'ఫిలడెల్ఫియా', 'ఫారెస్ట్ గంఫ్' చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. 'బిగ్', 'ఫిలడెల్ఫియా', 'ఫారెస్ట్ గంఫ్', 'కాస్ట్అవే' చిత్రాలకుగానూ గోల్డెన్‌గ్లోబ్ పురస్కారం దక్కించుకున్నారు. దీంతోపాటు ఎనిమిది ఎమ్మా అవార్డులు, రెండు స్క్రీన్ యాక్టర్ గిల్డ్ పురస్కారాలు వరించాయి. ప్రతిష్టాత్మక డగ్లాస్ ఎస్ మారో పబ్లిక్ ఔట్రిచ్ అవార్డు, కెన్నెడీ సెంటర్ హోనర్స్ మెడల్, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాలు ఆయన్ని వరించాయి. అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్లను వసూలు చేయగల మూడవ నటుడిగా, విశేష అభిమానగణంగల నటుడిగా టామ్ నిలిచారు. ఆయన సినిమాలు వసూలు చేసిన కలెక్షన్లు 9 బిలియన్ డాలర్లు కావడం విశేషం.
Authorization