గడిచిన ఆర్నెల్లలో హాలీవుడ్లో మిశ్రమ స్పందన లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అత్యధిక సినిమాలు విడుదలైనా బాక్సాఫీసు వద్ద మాత్రం మిశ్రమ ఫలితాలను రాబట్టుకున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు పరాజయం చెందడం గమనార్హం. ఇక ఎప్పటిలాగే పలు సైన్స్ ఫిక్షన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను కనువిందు చేశాయి. మహిళా ప్రధాన, హాస్యభరిత చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆకట్టు కున్నాయి. ఈ ఆర్నెల్లలో భారీ విజయాలు సాధించిన, డిజాస్టర్‌గా నిలిచిన పాపులర్ సినిమాలేంటో ఈ వారం 'షో'లో తెలుసుకుందాం.
అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్
మార్వెల్ సంస్థ నుంచి ఈ ఏడాది వచ్చిన చిత్రం 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'. మార్వెల్ సంస్థ నుంచి 19వ చిత్రంగా, 'అవెంజర్స్' సిరీస్ నుంచి 3వ సినిమాగా తెరకెక్కింది. భూమిపై దాడికి తెగబడుతున్న శత్రువు తానోస్ను ఎదుర్కొనేందుకు సూపర్ పవర్స్ కలిగిన ఏలియన్స్‌తో కలిసి అవెంజర్స్ టీమ్ చేసే పోరాట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఆంథోని రష్యా, జో రూసో సంయుక్తంగా సినిమాకు దర్శకత్వం వహించారు. గత చిత్రాల్లో నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్, క్రిస్ ఎవాన్స్, స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హీరో యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్‌లో విడుదలై సుమారు 400 మిలియన్ డాలర్లతో తెరకెక్కి రెండు బిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మొదటి చిత్రంగా, ఇప్పటి వరకు హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాల్గవ చిత్రంగా సరికొత్త రికార్డును సృష్టించింది.
బ్లాక్ ఫాంథర్
కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తర్వాత కింగ్ టి చల్లా తన వాకండా రాజ్యాన్ని తిరిగి వచ్చేస్తాడు. వాకండా టెక్నికల్‌గా చాలా ఆడ్వాన్డ్గా ఉన్న ఆఫ్రికన్ దేశం. తన దేశాన్ని మరింత బలంగా అభివృద్ధి చేస్తుంటాడు. కానీ తన తండ్రి చేసిన కొన్ని తప్పిదాల వల్ల అతని శత్రువుల పిల్లలు టి చల్లాను, అతన్ని రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఈశత్రువులను టి చల్లా, ఆయన టీమ్ ఎదుర్కొనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన 18వ అమెరికన్ సూపర్ హీరో చిత్రం ఇది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. టి చల్లా పాత్రలో చాడ్విక్ బోస్మాన్ నటించగా, మైఖేల్ బి.జోర్డాన్, టుపిటా న్లైంగ్వో, డానై గురిరా, మార్టిన్ ఫ్రీమాన్, డానియల్ కలుయా, లెటియా రైట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై విజయం సాధించింది.
దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, నటీనటుల నటన అంశాల్లో ప్రశంసలందుకుంది. 200మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.34బిలియన్ డాలర్లను వసూలు చేసింది.
జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్
హాలీవుడ్‌నే కాదు ప్రపంచ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సిరీస్ 'జురాసిక్ వరల్డ్'. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలొచ్చాయి. గత నెలలో ఐదవ సినిమా 'జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్' రూపొందింది. జే.ఏ.బయోనా దర్శకత్వం వహించారు. ఓ భారీ దీవిలో ఉంటున్న రాకాసి బల్లులు అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రమాదంలో చిక్కుకుంటాయి. వాటిని హీరో ఎలా కాపాడనేది కథాంశంతో విజువల్ వండర్‌గా రూపొందిందీ చిత్రం. క్రిస్ ప్రాట్, బ్రేసీ డల్లాస్, వాంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్‌లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే ఇది ఒక బిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటింది. ఇండియన్ మార్కెట్లోనే ఇది రూ.200కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం.
రెడీ ప్లేయర్ వన్
భవిష్యత్‌లో భూమిపై చోటు చేసుకునే పరిణామాలను తెలిపే చిత్రమిది. 2045లో అధిక జనాభా కారణంగా భూమిపై కాలుష్యం, అవినీతి, వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. నివాసం భారంగా మారుతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా వర్చ్‌వల్ రియాలిటీ టెక్నాలజీతో తయారు చేయబడిన 'ఓహసిస్'(ఓంటోలాజికల్లీ ఆంథ్రోపోసెంట్రిక్ సెన్సారీ ఇమ్మెన్సివ్ సిమ్యులేషన్) అనే సరికొత్త ప్రపంచంలో వినోదం, ఎడ్యూకేషన్ పొందుతుంటారు. ఈ క్రమంలో ఓహసిస్ను తయారు చేసిన ఫౌండర్ చనిపోతాడు. దాన్ని కంట్రోల్ చేయడమనేది కష్టంగా మారడంతో ఓహసిస్లోనూ జరిగే పోరాటమే ఈ చిత్రం కథాంశం. స్టీవెన్ స్పెల్బర్గ్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. అద్భుతమైన విజువల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై 175మిలియన్ డాలర్లతో తెరకెక్కి 583 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇందులో టై షెరిడాన్, ఒలివియా కుక్, బెన్ మెండెల్సోన్, టి.జె.మిల్లర్, సిమన్ పెగ్, మార్క్ రైలాన్స్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించారు.
ఇన్‌క్రెడిబుల్స్ 2
ఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన వాటిలో 3డీ కంప్యూటర్ యానిమేషన్ సూపర్ హీరో చిత్రం 'ఇన్‌క్రెడిబుల్స్2' కూడా ఉంది. 'ది ఇన్‌క్రెడిబుల్స్' సిరీస్‌లో భాగంగా వచ్చిన రెండవ చిత్రమిది. బ్రాడ్ బర్డ్ దర్శకత్వం వహించారు. అతీత శక్తులు కలిగిన పార్ జనంలో తనపై నమ్మకాన్ని పొందడం కోసం రెగ్యులర్ మనుషుల వలే జీవితాన్ని గడుపుతుంటారు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. జూన్‌లో విడుదలైన ఈ సినిమా 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 781మిలియన్ డాలర్లను వసూలు చేసి విజయాన్ని సాధించింది.
డెడ్‌పూల్ 2
ఎక్స్‌మెన్ సిరీస్‌లో వచ్చిన 11వ చిత్రమిది. రెండేండ్ల క్రితం వచ్చిన 'డెడ్‌పూల్'కు సీక్వెల్. డేవిడ్ లిచ్ దర్శకత్వం వహించారు. కేఫ్టేరియా చెఫ్(డెడ్‌పూల్).. ఫాటల్ బోవిన్ ఎటాక్ తర్వాత తన ఆకారాన్ని కోల్పోయి అంధవికారంగా మారతాడు. తన చిరకాల కలను నెరవేర్చుకోవాలని తపిస్తాడు. ఈ క్రమంలో శత్రువైన టైమ్ ట్రావెలింగ్ సైనికుడు కేబుల్ నుంచి యంగ్ మ్యూటెంట్‌ను కాపాడటం కోసం డెడ్‌పూల్, తోటి సభ్యులు ఎక్స్ ఫోర్స్ టీమ్‌గా ఏర్పడి చేసే పోరాట నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ర్యాన్ రేనాల్డ్స్, జోష్ బ్రోలిన్, మొరెనా బక్కారిన్, జులియన్ డెన్నిసన్, జాజీ బెట్జ్, టి.జె.మిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సూపర్ హీరో చిత్రం మేలో రిలీజ్ అయి ఆకట్టుకుంది. 110మిలియన్ డాలర్లతో తెరకెక్కి 728 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
ర్యాంపేజ్
ప్రిమటాలాజిస్ట్ డేవిస్‌కి గొరిల్లాతో ఎంతో అనుబంధం ఉంటుంది. డేవిస్‌ను చిన్నప్పట్నుంచి భద్రంగా ఈ గొరిల్లా కాపాడుతుంది. జెనటిక్ ప్రయోగం చేసే క్రమంలో ఆ ప్రయోగం వికటించి కొన్ని జంతువులు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంటాయి. దీంతో గొరిల్లాతో కలిసి డేవిస్ చేసే పోరాట నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మాంస్టర్ చిత్రమిది. బ్రాడ్ పేటాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డేవిస్ పాత్రలో డ్వానే జాన్సన్ నటించారు. విజువల్ వండర్‌గా సినిమా ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, నటీనటుల నటన ప్రశంసలందుకుంది. ఏప్రిల్‌లో విడుదలై 120 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 425 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
ఏ క్వైట్ ప్లేస్
ఓ కుటుంబం అనుకోని పరిస్థితుల్లో ఫారెస్ట్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తుంటుంది. అక్కడ కనిపించని శక్తి(దెయ్యం) ఏదో తిరుగుతుంటుంది. వీరు ఏమాత్రం శబ్ధం చేసినా అది వెంటాడి చిత్ర హింసలు పెట్టి చంపేస్తుంది. అదేంటనేది వారికీ తెలియదు. దీంతో వారంతా నిశబ్దంగా ఎలా జీవనం సాగించారు. శబ్ధం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే ఇతివృత్తంతో హర్రర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. జాన్ క్రాసిన్స్కీ దర్శకుడు. ఇందులో ఆయన, ఆయన భార్య ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం. ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందిప్రశంసలందుకుంది. కేవలం 20 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 331 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఓసియన్ 8
ఎనిమిది మంది మహిళలు న్యూయార్క్‌లోని ఓ వేడుకలో అసాధ్యమైన వజ్రాల నగలను అత్యంత తెలివితో, పక్కాప్లానింగ్‌తో కొట్టేయడమనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. దొంగతనం నేపథ్యంలో హాస్యభరితంగా ఈచిత్రాన్ని దర్శకుడు గ్యారీ రోస్ రూపొందించారు. 'ఓసియన్' సిరీస్‌లో భాగంగా వచ్చిన నాల్గవ చిత్రమిది. స్టీవెన్ స్టీల్బర్గ్ నిర్మించడం విశేషం. మహిళా ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం జూన్‌లో విడుదలై 70 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 247 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇందులో సాండ్రా బుల్లోక్, కేట్ బ్లాంచెట్, అన్నే హాత్వే, మిండీ కిల్లింగ్, సారా పాల్సన్, అవాక్వాఫినా, రిహన్నా ప్రధాన పాత్రల్లో నటించి అందం, అభినయంతో ఆకట్టుకున్నారు.
లైఫ్ ఆఫ్ ది పార్టీ
హాలీవుడ్లో వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాల్లో 'లైఫ్ ఆఫ్ ది పార్టీ' ఒకటి. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి బెన్ ఫాల్కోనె దర్శకత్వం వహించారు. విడాకులు పొందిన ఓ మహిళ తాను మధ్యలో ఆపేసిన డిగ్రీని పూర్తి చేయాలని భావిస్తుంది. తన కూతురుతో కలిసి కాలేజ్‌కి వెళ్తుంది. తన కూతురి స్నేహితులతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆమె చేసే కామెడీ ఆద్యంతం నవ్విస్తుంది. మేలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ముప్పై మిలియన్ డాలర్లతో తెరకెక్కి 64 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తల్లి పాత్రలో మెలిస్సా మెక్ కార్తీ, కూతురు పాత్రలో మోలీ గార్డన్ నటించారు.
ఐ ఫీల్ ప్రెట్టీ
ఎంతో భయంతో, అభద్రతా భావంతో, ఇబ్బందులతో జీవితాన్ని గడుపుతున్న ఓ అమ్మాయి గాయం కారణంగా ఒక్కసారిగా మారిపోతుంది. మహిళా సాధికారతకు కేరాఫ్‌గా, శక్తివంతంగా తయారవుతుంది. చాలా డేర్‌గా, బోల్డ్‌గా ఉంటూ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలో చోటు చేసుకున్న అనుకోని పరిణామాల నేపథ్యంలో అబ్బి కోV్ా్న, మార్క్ సిల్వెస్టీన్ సంయుక్తంగా ఈ కామెడీ చిత్రాన్ని రూపొందించారు. కడుపుబ్బా నవ్వించే ఈ లో బడ్జెట్ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా 32 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 88 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమ్మాయి పాత్రలో అమీ స్కుమర్ నటించారు. ఆమె నటనకు విశేష ప్రశంసలు దక్కాయి.
ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్
ఓ లిరిక్ రైటర్, గాయకుడు, మ్యూజిషియన్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పాటల రూపంలో రాసుకుంటూ పాపులర్ సింగర్‌గా, మ్యూజిషియన్‌గా ఎదిగే ఇతివృత్తంతో అత్యంత స్ఫూర్తివంతమైన ఓ సింగర్ బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఎర్విన్ బ్రదర్స్ ఆండ్రూ,జాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సింగర్, మ్యూజిషియన్ పాత్రలో జే.మైఖేల్ ఫిన్లీ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. మార్చిలో విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు మిలియన్ డాలర్లతో తెరకెక్కి 85 మిలియన్ డాలర్లను సాధించింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యూజికల్ హిట్స్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది.
సోలో: ఏ స్టార్ వార్స్ స్టోరీ
వాల్ డిస్నీ రూపొందించిన 'స్టార్ వార్స్ అంథోలాజీ' సిరీస్‌లో భాగంగా వచ్చిన చిత్రమిది. 2016లో వచ్చిన 'రోగ్ వన్'కి సీక్వెల్. క్రిమినల్ అండర్‌వరల్డ్‌లో దోపిడీకి పాల్పడే క్రమంలో శత్రు మూకలను ఎదుర్కొనేందుకు చెవ్బక్కా, లాండో కాల్రిషియన్తో కలిసి హ్యాన్ సోలో చేసే సాహసోపేతమైన పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. రాన్ హౌవర్డ్ దర్శకుడు. 'స్టార్‌వార్స్'లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయం చవి చూసింది. హ్యాన్సోలో పాత్రలో ఆల్డెన్ ఎన్రిచ్, లాండో కార్లిషియన్ పాత్రలో డోనాల్డ్ గ్లోవర్ నటించారు.
ఏ వ్రింకిల్ ఇన్ టైమ్
అంతరిక్షంలో తన తండ్రి తప్పిపోతాడు. అతని ఓ మాయా లేడి బంధిస్తుంది. తప్పిపోయిన తన సైంటిస్ట్ తండ్రిని కనిపెట్టేందుకు ముగ్గురు పిల్లలు ఓ మహిళా సహాయంలో చేసే సాహసోపేత పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఓ కొత్త లోకంలోకి వెళ్ళిన వారంతా మహా అద్భుతానికి లోనవుతారు. ఆడియెన్స్‌ను కొత్త ప్రపంచంలో విహరింప చేస్తారు. ఈ సైన్స్ ఫాంటసీ అడ్వెంచరస్ చిత్రానికి అవా డువెర్నే అనే మహిళా దర్శకురాలు దర్శకత్వం వహించారు. మార్చిలో విడుదలైన ఈ సినిమా 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొంది కేవలం 132 మిలియన్ డాలర్లను వసూలు చేసి బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసింది. ఇందులో స్లామ్ రీడ్, ఆప్రా వినిఫ్రే, రీసీ విథర్స్పూన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ది హారికేన్ హీస్ట్
బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ది హారికేన్ హీస్ట్'. తరలిస్తున్న అమెరికన్ ట్రెజరీకి చెందిన 600మిలియన్ డాలర్ల డబ్బును 600 కిలోమీటర్ల పరిధిలో పక్కా ప్లానింగ్‌తో దొంగిలించడమనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. ఓ వైపు సముద్రపు భారీ హారికేన్స్ అలల తాకిడి నేపథ్యంలో ఈ భారీ దొంగతనం చేయడమనేది సినిమాలో ఆసక్తికరమైన, ఉత్కంఠభరిత అంశం. రాబ్ కోహెన్ దర్శకత్వం వహించగా, టాబీ కెబెల్, మ్యాగీ గ్రేస్, ర్యాన్ క్వీటన్, మెలిస్సా బోలోనా, రాల్ఫా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. 30మిలియన్ డాలర్లతో తెరకెక్కి 15 మిలియన్ డాలర్లనే వసూలు చేసింది.
అన్హిలేషన్
ఒక బయోలజిస్ట్ మహిళా భర్త ఫారెస్ట్‌లోకి వెళ్ళి కనిపించకుండా పోతాడు. అతన్ని వెతకడానికి రక్షణ దళాలతోపాటు ఆమె కూడా వెళ్తుంది. భర్తను వెతికే క్రమంలో ఓ భయానక శక్తిని కనిపెడతారు. దాన్నుంచి వారు ఎలా బయటపడ్డారు, అన్న కథాంశంతో ఈ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హర్రర్ చిత్రం తెరకెక్కింది. అలెక్స్ గార్లాండ్ దర్శకుడు. మార్చిలో విడుదలై 55 మిలియన్ డాలర్లతో తెరకెక్కి కేవలం 42 మిలియన్ డాలర్లను వసూలు చేసి డిజాస్టర్‌గా మిగిలింది. బయోలజిస్ట్ పాత్రలో నటాలియా పోర్టమన్ నటించారు.
Authorization