మార్లన్ బ్రాండో..యావత్ ప్రపంచం గర్వించదగ్గ అత్యద్భుతమైన నటుడు. స్టానిస్లేవిస్కీ యాక్టింగ్ సిస్టమ్ ప్రభావంతో నటనకే సరికొత్త భాష్యం చెప్పిన కథానాయకుడు. అత్యంత సహజ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, వారి మనసులపై చెరగని సంతకం చేసిన విలక్షణ నటుడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ రెబల్ యాటిడ్యూడ్తో తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకున్న దర్శక దిగ్గజం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని ఎన్నో సంచలన విజయాలతో చరిత్ర సృష్టించి, వెండితెర గాడ్‌ఫాదర్‌గా పేరొందిన మార్లన్ బ్రాండో గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
సోదరి ప్రభావంతో నటనపై ఆసక్తి..
1924లో ఏప్రిల్ 3న అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన ఒమహాలో మార్లన్ బ్రాండో జన్మించారు. తండ్రి మార్లన్ బ్రాండో సీనియర్ ఫెస్టిసైడ్, కెమికల్ ఫీడ్ తయారి సంస్థను నిర్వహించేవారు. తల్లి దోరాతి జులియా. బ్రాండోకు ఇద్దరు సొదరీమణులున్నారు. బ్రాండో చిన్నప్పుడు క్రిస్టియన్ సైంటిస్ట్‌గా పెరిగారు. తల్లి దోరాతి యాటిడ్యూడ్ చాలా భిన్నంగా ఉండేది. సిగరెట్లు తాగటం, కార్లు నడపడం, మగవారిలా డ్రెస్స్‌లు ధరించడం వంటి వాటితో అప్పట్లోనే చర్చలకు కేంద్రబిందువయ్యారు. నటుడు హెన్రీ ఫోండా నటుడిగా మారడానికి ఆమె ఎంతో సహకరించారట. మద్యానికి బానిసైన తల్లి విషయంలో బ్రాండో ఎప్పుడూ బాధపడేవారు. బ్రాండో తల్లిదండ్రులు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఆ టైమ్‌లో తల్లివద్దే ఉన్నారు. ఆ తర్వాత చికాగోకు షిప్ట్ అయ్యారు. ది లిబర్టీలోని ఓ సినిమా థియేటర్లో కొన్ని రోజులు పని చేశారు. బ్రాండోని చిన్నప్పుడు 'బడ్' అనే పిలిచే వారు.
ఆ టైమ్‌లో పక్క వీధిలో ఉండే వాలీ కాక్స్ పరిచయ మయ్యారు (కాక్స్ ఆ తర్వాత గొప్ప నటుడిగా ఎదిగారు). కాక్స్ చనిపోయేంత (1973) వరకు ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. తన మరో స్నేహితుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ జార్జ్ ఎంగ్లాండ్ 'బ్రాండో: ది డాక్యుమెంటరీ' పేరుతో 2007లో డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో చిన్నప్పుడు బ్రాండో జీవితాన్ని తెలిపారు. తన తండ్రి చదువుకున్న షట్టక్ మిలటరీ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత తన సోదరి జాకోలిన్ మాదిరి థియేటర్ చేసి యాక్టింగ్సైడ్ వెళ్ళాలనుకున్నారు. అమెరికన్ థియేటర్ వింగ్ ప్రొఫెషనల్ స్కూల్లో డ్రామా వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. జర్మన్ థియేటర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ బ్రాండోను బాగా ప్రభావితం చేశారు.
అత్యున్నత సంస్థలో శిక్షణ..
ప్రముఖ పాపులర్ యాక్టర్ స్టెల్లా అడ్లర్ రికమండేషన్‌తో బ్రాండో రష్యాలోని అత్యంత ప్రతిష్టాత్మక యాక్టింగ్ స్కూల్ 'స్టానిస్లేవిస్కీ సిస్టమ్'కి వెళ్ళారు. యాక్టింగ్, గాత్ర శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ఈ టెక్నిక్స్‌ని అరుదైన నటీనటులు మాత్రమే ఫాలో అవుతారు. ఆ అరుదైన నటనను బ్రాండ్ నేర్చుకోవడం విశేషం. అలాగే ప్రముఖ ట్రైనర్ లీ స్ట్రాస్బెర్గ్ వద్ద కూడా పలు యాక్టింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. వీటన్నిటి మేళవించుకుని మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో అయ్యారు. అత్యంత సహజమైన నటన మెళకువలపై పట్టు సాధించారు. తొలుత పలు థియేటర్స్‌లో నటించారు. తల్లి మాదిరి రెబల్ యాటిడ్యూడ్ కారణంగా వివాదాల్లో ఇరుక్కున్నారు. దీని కారణంగా స్కూల్ ప్రొడక్షన్ రూపొందించే 'సేవిల్లె' నాటకంలో నటించే అవకాశాన్ని కోల్పోయారు. 1944లో బ్రాడ్వే సంస్థ రూపొందించిన డ్రామా 'రిమెంబర్ మామా'లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత పలు నాటకాల్లో నటించారు. వాటిలో 'ట్రక్లైన్ కేఫ్' తనకు మంచి పేరు తీసుకొచ్చింది. నాటక రంగంలో బ్రాండోను శిఖరాగ్రానికి తీసుకెళ్ళిన డ్రామా 'స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్'. 1947లో వచ్చిన ఈ నాటకంలో స్టాన్లీ కోవాల్స్కీ పాత్రలో మెప్పించారు. అదే సంవత్సరంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ రూపొందించే 'రెబెల్ వితౌట్ ఏ కాజ్' అనే చిత్రం కోసం బ్రాండోను ఆడిషన్ చేశారు. కానీ అందులో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ ఛాన్స్ పోయింది.
మూడేండ్ల తీవ్ర ప్రయత్నాలు..
మూడేండ్ల సినిమా ప్రయత్నాల ఫలితంగా 1950లో 'ది మెన్' చిత్రంలో నటించారు. ఫ్రెడ్ జిన్నెమన్న్ దర్శకత్వం వహించిన ఈసినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. అయితే ఇందులో తన పాత్ర కోసం నెల రోజు ఆసుపత్రిలో ఉన్నారు. తొలి చిత్రంతోనే గొప్ప నట లక్షణాలున్నాయని సినీ విశ్లేషకులు సైతం బ్రాండో నటనను ప్రశంసించారు. రియలిస్టిక్, స్పాంటేనియస్ అనే క్వాలిటీస్ ఇతర ఫిల్మ్ మేకర్స్‌కు బాగా నచ్చాయి. ఇక బ్రాండో నటించిన నాటకం ఆధారంగా అదే పేరుతో 'ఏ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్' చిత్రాన్ని 1951లో తెరకెక్కించారు. ఈ చిత్రంతో బ్రాండోని గొప్ప నటుడిగా అభివర్ణించారు. అంతేకాదు మేల్ సెక్స్ సింబల్ అనే ముద్రని సైతం ఆయనపై వేశారు. ఇందులో తన నటనకుగానూ ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. మెక్సికన్ తిరుగుబాటుదారుడు ఎమిలియానో జపాటా జీవితం ఆధారంగా రూపొందిన 'వివ జపాటా' చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. షేక్స్పియర్ నాటకం ఆధారంగా రూపొందిన 'జులియస్ సీజర్' చిత్రంలో మార్క్ ఆంటోని పాత్రలో అత్యద్భుత విలక్షణ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. బ్రాండో నటనా ప్రతిభను చాటిన చిత్రమిది. 1953లో వచ్చిన 'ది వైల్డ్ వన్' చిత్రం బ్రాండోను కల్చరల్ ఐకాన్ని చేసింది. రాక్ అండ్ రోల్ తరహా పాత్రలకు నెక్ట్స్ జనరేషన్‌కు రోల్ మోడల్‌గా బ్రాండో నిలిచారు. ఇదే సంవత్సరం ఆయనకు 'ఆర్మ్స్ అండ్ ది మ్యాన్' నాటకంలో నటించే ఆఫర్ వచ్చింది. దీని కోసం బ్రాండోకి భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. బ్రాండో నటించిన చివరి నాటకం ఇదే. 1954లో బ్రాండో 'ఆన్ ది వాటర్ఫ్రాంట్' చిత్రంలో నటించారు. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు పది మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అప్పట్లో అదో సంచలనం. అందుకుగానూ నిర్మాత సామ్ స్పీగల్ బ్రాండోకు లక్ష డాలర్లు ఆఫర్ చేశారు. ఇది 12 విభాగాల్లో ఆస్కార్‌కు పోటీపడగా ఎనిమిది ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా బ్రాండోను ఆస్కార్ వరించింది.
అనుకోని పరిస్థితుల్లో దర్శకత్వ బాధ్యతలు..
అదే ఏడాది బయోగ్రాఫికల్ చిత్రం 'డిజైరీ'లో మెప్పించారు. తనకి స్క్రిప్ట్ నచ్చకపోయినా బలవంతంగా ఈ చిత్రంలో నటించారు. డాన్స్ ప్రధానంగా రూపొందిన 'గార్సు అండ్ డాల్స్', కామెడీ చిత్రం 'ది టీహౌస్ ఆఫ్ ది ఆగస్ట్ మూన్' చిత్రాలు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. టెక్నోకలర్ చిత్రం 'సయోనారా' చిత్రం బ్రాండోను మరో మెట్టు ఎక్కించింది. ఇది నాలుగు ఆస్కార్లను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత చేసిన సినిమా స్కోప్ వార్ డ్రామా 'ది యంగ్ లయన్స్', నాటకీయ ప్రధానంగా తెరకెక్కిన 'ది ఫుగిటివ్ కైండ్' యావరేజ్‌గా నిలిచాయి.
స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో 'వన్ ఎయిడ్ జాక్స్' చిత్రాన్ని ప్రారంభించారు. హీరోగా రియో పాత్రలో బ్రాండోను ఎంపిక చేసుకున్నారు. దర్శకుడితో చిత్ర నిర్మాత సంస్థకు ఏర్పడిన వివాదం కారణంగా స్టాన్లీ తప్పుకోవడంతో తప్పని పరిస్థితుల్లో మార్లన్ బ్రాండో దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకు గరు ట్రోస్పర్ సహకారం అందించారు. అయితే దర్శకత్వంపై బ్రాండోకు అంతగా అవగాహన లేకపోవడం, నటన విషయంలో రాజీపడకపోవడం వల్ల రీటేక్‌లు ఎక్కువగా చేయాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. 1961లో విడుదలైన ఈ సినిమా బాగా బిజినెస్ జరిగినప్పటికీ ఘోరంగా పరాజయం చెందింది. ఆ వెంటనే చేసిన ఎపిక్ హిస్టారికల్ డ్రామా 'ముటినీ ఆన్ ది బౌంటీ' చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
కెరీర్‌పై ప్రభావం చూపిన వరుస పరాజయాలు..
వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు తన కెరీర్‌పై ప్రభావాన్ని చూపించాయి. దీంతో సరైన పాత్రలు, కథా బలమున్న సినిమాలు కాకుండా తన నటనను నమ్మి ఒప్పుకున్న సినిమాలు, ఇతరుల కోసం చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అవి వరుసగా పరాజయం పాలవ్వడం ప్రారంభ మయ్యాయి. అందులో ఒకటి 'ది అగ్లీ అమెరికన్'. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకున్నా బాక్సాఫీసు వద్ద పరాజయం చవిచూసింది. వరుసగా 'బెడ్‌టైమ్ స్టోరీ', 'ది అప్పాలోసా', 'ఏ కౌంట్నెస్ ఫ్రమ్ హాంకాంగ్', 'ది నైట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే', 'మొరిటురి', 'రిఫ్లెక్షన్స్ ఇన్ ఏ గోల్డెన్ ఐస్', 'బర్న్', 'క్యాండీ', 'ది నైట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే' చిత్రాలు క్రిటికల్‌గా, కమర్షియల్‌గా వరుసగా పరాజయం చెందాయి. ఛార్లీ చాప్లిన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏ కౌంటెస్స్ ఫ్రమ్ హాంకాంగ్' సైతం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో తన ఇమేజ్, మార్కెట్ బాగా పడిపోయింది. పలు చిత్రాల కథలో జోక్యం చేసుకోవడం, రెబల్ మనస్తత్వంతో బ్రాండో నెగటివ్ కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు.
తిరుగులేని స్టార్‌గా నిలబెట్టిన గాడ్‌ఫాదర్
1971లో వచ్చిన హర్రర్ చిత్రం 'ది నైట్ కామర్స్' విజయం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. ఇక 1972లో విడుదలైన 'ది గాడ్‌ఫాదర్' చిత్రం బ్రాండోను హాలీవుడ్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'గాడ్‌ఫాదర్'కి ముందు, తర్వాత అనేలా బ్రాండో కెరీర్ సాగింది. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. మాఫియా నేపథ్యంలో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం 6 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 280 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రమిదే కావడం విశేషం. అత్యంత గొప్ప చిత్రంగా అభివర్ణించబడింది. గ్యాంగ్‌స్టర్ జోనర్‌కి ఇదే పునాది వేసింది. ఈ సినిమా ప్రభావం తెలుగుతో సహా ప్రపంచంలోని అన్ని భాషా చిత్రాలపై పడింది. దీని ఫలితంగా గ్యాంగ్‌స్టర్ నేపథ్య చిత్రాలు కోకొల్లలుగా నిర్మితమయై సంచలన విజయాలు సాధించాయి. అంతేకాదు చాలా మంది దర్శకులుగా చిత్ర పరిశ్రమలోకి అడుగిడేందుకు ఈ చిత్రమే స్ఫూర్తి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉండటం విశేషం. ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్లను 'గాఢ్ ఫాదర్' సొంతం చేసుకుంది. కానీ బ్రాండో ఆస్కార్‌ను తిరస్కరించారు. తనను ఆదిమ అమెరికన్‌గా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆస్కార్‌ను తిరస్కరించారు. ఆ వెంటనే మరో బ్లాక్‌బస్టర్ 'లాస్ టాంగో ఇన్ పారిస్' చిత్రంలో నటించారు.
దీనికోసం అత్యధిక పారితోషికం అందుకున్నారు. 'సూపర్‌మ్యాన్'లో చిన్న పాత్ర పోషించారు. దీంతోపాటు వరుసగా 'అపోకలిప్సె', 'ఏ డ్రై వైట్ సీజన్', 'ది ఫ్రెష్మ్యాన్', 'దాన్ జువాన్ డె మార్కో', 'ది ఐలాండ్ ఆఫ్ డా.మోరియు', 'ది బ్రేవ్', 'ఫ్రీ మనీ', 'ది స్కోర్' చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు.
బ్రాండో తిరస్కరించిన చిత్రాలు..
గత అనుభవాల దృష్ట్యా సినిమాల ఎంపిక విషయంలో బ్రాండో తనదైన స్టయిల్ని ఫాలో అయ్యారు. దీని ఫలితంగా బ్రాండో ఎన్ని సినిమాల్లో నటించారో దాదాపు అన్ని సినిమాలను తిరస్కరించారు. వాటిలో 'హై నూన్', 'ది ఈజిప్టియన్', 'ది రెడ్ అండ్ ది బ్లాక్', 'ది కాంక్వెరర్', 'బెన్‌హార్', 'లారెన్స్ ఆఫ్ అరేబియా', 'డాక్టర్ జావాగో', 'బచ్ కాసిడీ అండ్ ది సండెన్స్ కిడ్', 'ది అరెంజ్మెంట్', 'ర్యాన్ డాటర్', 'చైల్డ్స్ ప్లే', 'ది గ్రేట్ గాట్స్‌బై', 'ది గాడ్‌ఫాదర్ 2', 'ఎక్వస్', 'సూపర్ మ్యాన్ 2', 'నైన్టీన్ ఎయిటీ ఫోర్', 'సాల్వేడర్', 'టక్కర్: ది మ్యాన్ అండ్ హిజ్ డ్రీమ్', 'ది అడ్వెంచరస్ ఆఫ్ బరోన్ ముంచాసెన్', 'ది ఫీల్డ్', 'అమెరికన్ హిస్టరీ ఎక్స్', 'స్లీపీ హలో', 'మాగ్నోలియా', 'స్కారీ మూవీ 2', 'మ్యాన్ ఆన్ ఫైర్' వంటి చిత్రాల నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. కథలు నచ్చకపోవడం, దర్శక, నిర్మాతలతో వివాదాలు, పారితోషికం సమస్యల కారణంగా ఆయన వైదొలిగారు. 'నోస్ట్రోమో', 'డ్రైవైన్ రాప్చర్', 'బిగ్ బగ్ మ్యాన్' చిత్రాలు పూర్తి కాలేదు. 'యాక్టర్స్ స్టూడియో', 'కమ్ ఔట్ ఫైటింగ్', 'ది గాడ్ ఫాదర్ సాగా', 'రూట్స్: ది నెక్ట్స్ జెనరేషన్స్' వంటి టెలివిజన్స్లోనూ నటించారు. అలాగే 'యు రాక్ మై వరల్డ్' అనే మ్యూజిక్ వీడియోలోనూ మెరిశారు. వీటితోపాటు 'కింగ్: ఏ ఫిల్మ్డ్ రికార్డ్ మాంట్గోమెరీ టు మెంఫిస్', 'రాహోని', 'హార్ట్స్ ఆఫ్ డార్క్నెస్: ఏ ఫిల్మ్ మేకర్స్ అపోకలిప్సే', 'లిసెన్ టు మీ మార్లన్' వంటి డాక్యుమెంటరీస్లోనూ నటించారు. 2004లో 'బిగ్ బగ్ మ్యాన్' అనే యానిమేషన్ చిత్రంలో మహిళగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రమే కాదు మహిళా పాత్రలో కనిపించిన చిత్రం కూడా ఇదే.
లెక్కలేనన్ని అవార్డులు..
బ్రాండో నట విశ్వరూపానికి లెక్కలేనన్ని అవార్డులు దక్కాయి. రెండు సార్లు (ఆన్ ది వాటర్ ఫ్రంట్, ది గాడ్ ఫాదర్) ఆస్కార్ అవార్డులు వరించాయి. ఎనిమిదిసార్లు నామినేట్ అయ్యారు. మూడు బ్రిటీష్ అకాడమీ అవార్డులు, నాలుగు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లభించాయి. బ్రాండో 1950 టైమ్‌లో గ్రేటెస్ట్ మేల్ స్టార్స్‌లో నాలుగవ స్థానంలో నిలిచారు. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 20వ శతాబ్దపు వంద గొప్ప నటుల్లో ఒకరిగా, వెరైటీ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ టెన్ కల్చరల్ ఐకాన్స్‌లో ఒకరిగా, అత్యంత ప్రభావితం చేయగల నటుడిగా, గౌరవాన్ని పొందే వ్యక్తిగా నిలిచారు. బ్రాండో ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా బాగా సంపాదించిన వ్యక్తులో టాప్ టెన్ బ్రాండో నిలవడం విశేషం. అలాగే రెబల్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్, కఠినమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రాజకీయాల్లోనూ చురుక్కుగానే పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
వ్యక్తిగతం వివాదాలమయం..
బ్రాండో కుటుంబ జీవితం సాఫీగా సాగలేదు. భార్యలు, ఫ్యామిలీ విషయంలో చాలా ఇబ్బందులు, వివాదాలు ఎదుర్కొన్నారు. మొదట ఐరీష్-అమెరికన్ నటి అన్నా కాష్ఫీని 1957లో వివాహం చేసుకున్నారు. రెండేండ్లకే విడాకులిచ్చారు. ఆ తర్వాత మెక్సికన్-అమెరికన్ నటి మొవిటా కాస్టనెడాను 1960లో పెళ్ళి చేసుకున్నారు. ఆమె నుంచి కూడా రెండేండ్లకే విడిపోయారు. ఫ్రెంచ్ నటి టారిటా టెర్రిపాయియాను 1962లో పెళ్ళి చేసుకుని 1972లో విడిపోయారు. విడాకుల తర్వాత హౌస్‌కీపర్ మారియా క్రిస్టినా రూజ్‌తో ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించారు. వీరికి కలిగిన ముగ్గురు పిల్లలతో మొత్తం 11 మంది పిల్లలు బ్రాండో సంతానం. ఇందులో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. డయాబెటిస్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చింది. వీటితోపాటు అనేక అనారోగ్య సమస్యలతో 2004 జులై 1న బ్రాండో గుండెపోటుతో చనిపోయారు. 1988లో బ్రాండో సోదరి జోకెలిన్ 'మార్లన్ బ్రాండో: ది వైల్డ్ వన్' డాక్యుమెంటరీలో యాక్టింగ్ స్కూల్‌కు సంబంధించిన అంశాలను రూపొందించారు. అలాగే 'బ్రాండో: ది డాక్యుమెంటరీ'ని 2007లో విడుదల చేశారు.
నట విశ్వరూపానికి ప్రతీకలు..
'స్టానిస్లేవిస్కీ యాక్టింగ్ సిస్టమ్' ప్రభావతంతో మెథడ్ యాక్టింగ్‌కు కేరాఫ్‌గా నిలిచిన మార్లన్ బ్రాండో తన విలక్షణ నటనతో ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. ఎలాంటి పాత్ర అయిన సరే అవలీలగా పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. తన నటనతో ఆయా పాత్రలకు ప్రాణం పోసిన నటుడు. అత్యంత సహజ నటనే ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టింది. బ్రాండో పూర్తి స్థాయి పాత్రలో నటించిన చిత్రం 'ది మెన్'. డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సోల్జర్ పాత్రలో తన విలక్షణ నటనను కనబరిచారు. యుద్ధ సన్నివేశాల్లో బ్రాండో నటన అబ్బుర పరుస్తుంది. సినిమా స్కోప్ వార్ డ్రామా 'ది యంగ్ లయన్స్'లో జర్మనీకి చెందిన బోధకుడిగా సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నారు. డెమోక్రాట్స్, కమ్యూనిస్ట్‌ల మధ్య స్ట్రగుల్స్, గొడవల నేపథ్యంలో అడ్వెంచరస్‌గా రూపొందిన 'ది అగ్లీ అమెరికన్' చిత్రంలో అమెరికన్ అంబాసిడర్‌గా మెప్పించారు. కామెడీ చిత్రం 'బెడ్‌టైమ్ స్టోరీ'లో ఆర్మీ స్టేషన్లో పనిచేసే ఆపరేటర్‌గా, కన్నింగ్ మెంటాలిటీ కలిగిన వ్యక్తిగా వినోదం పండించారు. ఇక తొలిసారి హర్రర్ చిత్రం 'ది నైట్కామర్స్'లో గార్డెనర్‌గా భయానక పాత్రలో అలరించారు. బ్రాండోలోని మరో యాంగిల్ నటనను పరిచయం చేసిన చిత్రమిది. ఇటాలియన్ - ఫ్రెంచ్ వార్ డ్రామా చిత్రం 'బర్న్'లో బ్రిటీష్ సీక్రెట్ గవర్నమెంట్ ఏజెంట్‌గా ఆకట్టుకున్నారు. అప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన బ్రాండోకు 'ది గాడ్‌ఫాదర్' మరో మైలురాయి. ఆయన్ని వంద మెట్లు ఒకేసారి ఎక్కించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ గ్యాంగ్‌స్టర్, మాఫియా క్రైమ్ చిత్రంలో గాడ్ ఫాదర్ పాత్రలో మాఫియా కింగ్‌గా తనదైన విలక్షణ నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. బ్రాండోకు మంచి పేరు తెచ్చిన చిత్రం 'లాస్ట్ టాంగో ఇన్ పారిస్'. ఎరోటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో హౌటల్ ఓనర్‌గా, ప్లేబారుగా అలరించారు. వెస్టెర్న్ ఎపిక్ చిత్రం 'ది మిస్సోరి బ్రేక్స్'లో కఠినంగా వ్యవహరించే రక్షకుడిగా కనిపించారు. ఇక సూపర్ హీరో చిత్రం 'సూపర్‌మ్యాన్'లో సూపర్మ్యాన్కి తండ్రిపాత్రలో నటించారు. శత్రువుల నుంచి భూమిని కాపాడటం కోసం ఆయన చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. ఎపిక్ వార్ చిత్రం 'అపోకలిప్సె నౌ' చిత్రంలో అత్యున్నత ఆర్మీ అధికారిగా తన మ్యానరిజంతో మెప్పించారు. మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 'ది ఫార్ములా' చిత్రంలో చమురు సంస్థల అధిపతిగా తన మార్క్ యాక్టింగ్‌తో అందరినీ ఫిదా చేశారు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన 'ఏ డ్రై వైట్ సీజన్'లో లాయర్‌గా కనిపించారు. క్రైమ్ కామెడీ చిత్రం 'ది ఫ్రెష్మ్యాన్' చిత్రంలో 'గాడ్ ఫాదర్' పాత్రకు వ్యంగ్య అనుకరణ పాత్రలో నటించి నవ్వించారు. బ్లాక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన 'ఫ్రీ మనీ' చిత్రంలో ఖైదీ పాత్రలో నటించి కామెడీని పంచారు. ఇందులో అందరితో చీకొట్టించుకునే వ్యక్తిగా బ్రాండో నటన అద్భుతంగా ఉంటుంది. బ్రాండో నటించిన చివరి చిత్రం 'ది స్కోర్'. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాక్స్ అనే దొంగ పాత్రలో తనదైన నటనతో అందరినీ అలరించారు.
Authorization