ట్రినీ డర్హోమ్..అత్యద్భుతమైన విలక్షణ నటనతో వెండితెర ప్రేక్షకులతోపాటు బుల్లితెర ప్రేక్షకుల్నీ మంత్రముగ్దుల్ని చేసిన డెన్మార్క్ నటి. మూడు దశాబ్దాలుగా నటిగానే కాకుండా అద్భుతమైన గాయనిగా, లిరిక్ రైటర్‌గా అందరినీ అలరిస్తున్నారు. భిన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తూ ఆస్కార్‌ను కైవసం చేసుకున్న ట్రినీ డర్హోమ్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
బాల్యం నుంచే గాయనిగా..
ట్రినీ డర్హోమ్ 1972 ఏప్రిల్ 15న డెన్మార్క్‌లోని ఎడెన్స్ పట్టణంలో జన్మించారు. పాఠశాల విద్య అంతా అక్కడే సాగింది. చిన్నప్పుడే నటనపై ఆసక్తి ఉంది. పుట్టుకతోనే మధురమైన గొంతు ఆమె సొంతం. ఎనిమిదేండ్ల వయసులోనే ఆర్కెస్ట్రా వంటి కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. పదేండ్ల వయసున్నప్పుడు 'ఏ క్రిస్టమస్ కరోలో' అనే కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. పాపులర్ డెన్ ఫైన్క్సీ లాండ్స్బైలో ఈ ప్రదర్శన జరిగింది. 14ఏండ్ల వయసులో 1987లో 'ట్రైన్ అండ్ ది మూన్‌లైటర్స్' పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ గ్రూపులో భాగమయ్యారు. వీరిచ్చిన ప్రదర్శన మంచి ప్రజాదరణ పొందింది. అంతేకాదు సింగర్‌గా ట్రినీకి మంచి బ్రేక్ నిచ్చింది. డానిష్ మెలోడీ గ్రాండ్ ప్రిక్స్‌లో వీరి గ్రూప్ మూడవ స్థానంలో నిలవడం విశేషం. ట్రినీకి మంచి పాపులారిటీ రావడంతో ఆ తర్వాత సొంతంగా మ్యూజిక్ సాంగ్స్ రికార్డింగ్ చేయడం ప్రారంభించారు. ఆ పాటలు మంచి శ్రోతకాదరణ పొందాయి. 1991 నుంచి 1995 వరకు డానిష్ నేషనల్ స్కూల్ ఆఫ్ థియేటర్‌కు వెళ్ళారు.
మలుపు తిప్పిన 'ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్'..
తొలి ప్రయత్నంగా 'ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్' నాటకంలో నటించారు. అప్పట్లో అదొక పాపులర్ నాటకం. ఈ నాటకంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. దీంతో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. టీనేజ్ రొమాంటిక్ చిత్రం 'స్ప్రింగ్ఫ్లాడ్' తో నటిగా ఎంట్రీ ఇచ్చారు.
తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా బోడిల్ (డెన్మార్క్‌లో ఇచ్చే) అవార్డు వరించింది. అదే ఏడాది 'కాసానోవా' 'సెసిలియా' చిత్రాల్లో నటించారు. టీవీ ప్రొడక్షన్ 'హోసెక్రామ్మెరెన్'లో కీలక పాత్ర పోషించారు. దీంతో టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. 1996లో వచ్చిన 'ది గ్రేటెస్ట్ హీరోస్'లో హీరోయిన్గా మెప్పించారు. అలాగే 'షాడో ఆఫ్ ది క్లౌడ్స్'లో విభిన్న పాత్రలో నటించారు. యానిమేషన్ చిత్రం 'హెర్క్యులస్'కు డానిష్ వెర్షన్లో వాయిస్ అందించారు. ఈ క్రమంలో తొలిసారి 'డాగ్మె 95' చిత్రం 'ది సెలబ్రేషన్'లో నటించారు. 'డాగ్మె 95' అనేది ఫిల్మ్ మేకింగ్ పద్ధతి. తక్కువ బడ్జెట్లో, కొత్త మెళకువలతో సినిమాను చిత్రీకరించడం దీనిలోని ప్రత్యేకత. ఈ చిత్రంతో ట్రినీ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోయిన్ స్టేటస్..
'ఇండియా', 'ఇన్ చైనా దే ఈట్ డాగ్స్', 'పి.ఓ.వి', 'బంగ్లా', 'ఓకే', 'ది టెన్త్ మ్యూస్', 'జెమిని' చిత్రాల్లో నటించి మెప్పించారు. 2004లో 'ఇన్ యువర్ హ్యాండ్స్' చిత్రంలో కేట్ పాత్రలో నటించారు. డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని తన నటనకు గానూ బోడిల్ అవార్డు, రాబర్డ్ అవార్డు వరించాయి. స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన 'ఫ్లైయిస్ ఆన్ ది వాల్' చిత్రం కూడా డర్హోమ్కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి కూడా బోడిల్ అవార్డు వరించింది. అదే ఏడాది వచ్చిన 'ఎన్ సోప్' చిత్రం నటిగా ట్రైన్ డర్హోమ్ను స్టార్‌ను చేసింది. మధ్యలో వచ్చిన 'ది బిగ్ డే', 'సోఫియా', 'ఇస్టెడ్జెడ్', 'స్కై మాస్టర్' చిత్రాలూ విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
అగ్ర హీరోలకు దీటుగా ఇమేజ్ సొంతం..
2006లో చేసిన 'ఆఫ్‌స్క్రీన్', 2007లో వచ్చిన 'డైసీ డైమాండ్' చిత్రాలు మంచి విజయం సాధించడంతో నటిగా మరో మెట్టు ఎక్కారు.
'డైసీ డైమాండ్'లో సపోర్టింగ్ రోల్లో మెప్పించారు. ఈ చిత్రానికి కూడా బోడిల్, రాబర్డ్ అవార్డులు వరించాయి. ఇలా వరుసగా 'లిటిల్ సోల్జర్', 'ఇన్ ఏ బెట్టర్ వరల్డ్', 'రూమ్ 304', 'రాయల్ ఎఫైర్', 'లవ్ ఈజ్ ఆల్ యు నీడ్', 'ది షూటర్', '3096', 'సమ్ వన్ యు లవ్', 'ది కట్', 'లాంగ్ స్టోరీ షార్ట్', 'ది కమ్యూన్', 'యు డిజప్పియర్', 'నికో 1988' చిత్రాలు నటిగా డర్హోమ్ను డెన్మార్క్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. హీరోలకు దీటుగా ఇమేజ్ను సొంతం చేసుకుని రాణిస్తున్నారు. విభిన్న పాత్రలతో తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మైమరపించారు. 2010లో వచ్చిన 'ఇన్ ది బెటర్ వరల్డ్' చిత్రం లోని తన పాత్రకుగానూ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు నామినేట్ అవడం విశేషం. డర్హోమ్ మంచి గాయకురాలు, లిరిక్ రైటర్ కూడా. ఎన్నో ఆల్బమ్స్‌లో తన మధురమైన గాత్రంతో పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్దుల్ని చేశారు. వరుసగా 'డాన్సె ఐ మానెస్కిన్', 'బ్లా అండ్ విడె స్ట్రిబర్', 'ఎట్ ఫ్రాస్సెంట్ ఎజెబ్లిక్', 'ఇట్స్ మ్యాజిక్', 'మిస్టర్.నైస్ గారు', 'డెన్ స్టోర్ డే' వంటి షోస్స్, ఆల్బమ్స్‌లో పాడారు. ఇందులో కామెడీ షో 'మిస్టర్.నైస్ గారు'లో తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఇది 62 వారాల పాటు డానిష్ మ్యూజిక్ చార్ట్స్ బాస్టర్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. అంతేకాదు మూడేండ్ల పాటు టాప్ 20లో నిలిచిందీ ఆల్బమ్. 64వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ మెంబర్‌గా పనిచేశారు.
డెన్మార్క్ చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర కథానాయికగా రాణిస్తున్న ట్రినీ డర్హోమ్ నటనకు డెన్మార్క్ ప్రేక్షకులే కాదు, ప్రపంచ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. అందం, అంతకుమించిన అభినయంతో మంత్రముగ్దుల్ని చేస్తూ మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న పాత్రలతో, విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న డర్హోమ్ నటనకు ప్రతిరూపాలుగా నిలిచిన చిత్రాల గురించి..
ది బిగ్గెస్ట్ హీరోస్
ఇద్దరు వైద్యులు కర్ట్సెన్, పీటర్ పేదరికాన్ని అనుభవిస్తుంటారు. వీరికి అడాప్ట్ చేసుకున్న ఓ కూతురు ఉంటుంది. బ్యాంక్ దొంగతనం చేసి వీళ్ళు స్వీడన్ పారిపోతారు. ఈ జర్నీ చేసే క్రమంలో వీరి మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించే కథాంశంతో కామెడీ డ్రామాగా థామస్ వింటర్బర్గ్ రూపొందించారు. కర్ట్సెన్, పీటర్ పాత్రలో థామస్ బో లార్సెన్, ఉల్రిచ్ థామ్సెన్ నటించారు. వీరి లవ్ ఇంట్రెస్ట్ పాత్రలో నటించిన ట్రినీ డర్హోమ్ నటన అద్భుతం.
సెలబ్రేషన్
ఇంట్లో తండ్రి 60వ పుట్టిన రోజు అంతా కలుస్తారు. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతా ఆనందంగా ఉన్న క్రమంలో తండ్రికి సంబంధించిన ఓ చెడు వార్త బయటికి వస్తుంది. తండ్రి లైంగికంగా వేధించాడనేది ఆ వార్త సారాంశం. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోతుంది. ఈ క్రమంలో ఈ వార్తకు, హోటల్లో పనిచేసే పియాకు సంబంధ మేంటనేది 'సెలబ్రేషన్' సినిమా. థామస్ వింటర్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పియా పాత్రలో తనదైన నటనతో డర్హోమ్ మెప్పించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు విశేష ప్రశంసలతోపాటు అవార్డులూ దక్కాయి.
ఇన్ చైనా దే ఈట్ డాగ్స్
ఇద్దరు సోదరుల క్రూరమైన జర్నీని, వారు చేసే బ్యాంక్ దొంగతనాల నేపథ్యంలో లస్సె స్పాంగ్ ఒల్సెన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ క్రైమ్ కామెడీ చిత్రం 'ఇన్ చైనా దే ఈట్ డాగ్స్'. ఇందులో వారి ప్రియురాలి పాత్రలో డర్హోమ్ అందం, అభినయం అందరినీ అలరిస్తుంది.
బంగ్లా
జర్మన్ సైనికుడు పాల్ పలు సమస్యలతో బాధపడుతూ తన పెద్దన్నయ్య మాక్స్ ఇంటికి వస్తాడు. అక్కడ అన్నయ్య ప్రియురాలు లెనేకు ఆకర్షితుడవుతాడు. ఆమెను అనుభవించా లనుకుంటాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. దీంతో కోపంతో రగిలిపోయిన పాల్ పలు చెడు ఘటనలకు పాల్పడతాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న సంక్లిష్ట అంశాల సమాహారంతో డ్రామా చిత్రంగా 'బంగ్లా'ను దర్శకుడు ఉల్రిచ్ కోహ్లెర్ రూపొందించారు. ప్రియురాలు లెనె పాత్రలో డర్హోమ్ నటన కట్టిపడేస్తుంది. అసాధారణమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలను పొందింది.
ఇన్ యువర్ హ్యాండ్స్
అన్న అనే మహిళా గ్రాడ్యూయేట్ పూర్తి చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. కేట్ సాయంతో ఓ జైలులో ఉద్యోగం సంపాదిస్తుంది. కేట్ అతీత శక్తులు కలిగిన మహిళ. మరి వీరి అనుబంధం ఎలా సాగింది?, ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర అంశాల సమాహారంతో ఆద్యంతం నాటకీయతగా తెరకెక్కిన చిత్రం 'ఇన్ యువర్ హ్యాండ్స్'. ఇందులో అతీత శక్తులు కలిగిన కేట్ పాత్రలో డర్హోమ్ నట విశ్వరూపం చూడొచ్చు. తన పాత్రలో ఆమె విభిన్న కోణాలను ఆవిష్కరించారు. ఇందులోని ఆమె నటనకు పలు అవార్డులు దక్కటం విశేషం.
ఏ సోప్
లేడీ బ్యూటీ క్లినిక్ ఓనర్, మానసిక ఒత్తిడిలో ఉన్న ట్రాన్స్‌జెండర్ మహిళకు మధ్య హింసాత్మకమైన, కల్లోలమైన అనుబంధం నేపథ్యంలో రూపొందిన డానిష్ మెలోడ్రామా కామెడీ చిత్రం 'ఏ సోప్'. ఇందులో క్లినిక్ ఓనర్‌గా, ప్రియుడు వదిలేసిన ప్రియురాలిగా డర్హోన్ నటించారు. ఆమె పలికించిన విభిన్న భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మహిళల సంఘర్షణకు అద్దం పట్టే ఈ చిత్రంలో డర్హోమ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
ఇన్ ఏ బెటర్ వరల్డ్
ఆఫ్రికా శరణార్థ శిబిరంలో ఉన్న రెండు డానిష్ కుటుంబాల జీవన సంఘర్షణను తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం 'ఇన్ ఏ బెట్టర్ వరల్డ్'. ఈ చిత్రంలో పెళ్లైన మహిళగా, భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకోవడంతో భర్త నుంచి విడిపోయేందుకు ప్రయత్నించే మహిళగా అద్భుత నటనతో డర్హోమ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ కావడం విశేషం.
ఏ రాయల్ ఎఫైర్
డెన్మార్క్ రాజు క్రిస్టియాన్-7 స్ట్రగుల్స్‌ను, యువరాణులతో ఆయన సాగించిన రొమాంటిక్ లైఫ్‌ను తెలిపే 'ఏ రాయల్ ఎఫైర్' చిత్రంలో డోవాగర్ రాణి జూలియా మారియా పాత్రలో డర్హోమ్ నటించారు. రాజుతోపాటు మరో డాక్టర్‌తో ఆమె సాగించిన అనుబంధం ఆకట్టుకుంటుంది. ఇందులో రాణిగా ఆమె అందం, అభినయం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. నికోలాజ్ అర్కెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అగ్ర నటులు మాడ్స్, అలిసియా, మిక్కెల్ నటించడం విశేషం.
లవ్ ఈజ్ ఆల్ యు నీడ్
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళ తన భర్తతో రొమాంటిక్ అనుబంధాన్ని, కూతురు పెళ్ళిలోని సందడిని, వారి ట్రావెలింగ్‌ను తెలిపే చిత్రం 'లవ్ ఈజ్ ఆల్ యు నీడ్'. స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబించే ఈ చిత్రంలో క్యాన్సర్ బాధితురాలిగా డర్హోమ్ నట విలక్షణత, భిన్న భావోద్వేగాలుతో మెస్మరైజ్ చేశారు. సుసాన్నె బియెర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం మంచి విజయం సాధించి డర్హోమ్కు మంచి పేరు తీసుకొచ్చింది.
ది కమ్యూన్..
1970లో డానిష్‌లో తమ స్వేచ్ఛ, వ్యక్తిగత కోరికలు, సంఘీభావం, సహనం వంటి అంశాలతో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణను తెలిపే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'ది కమ్యూన్'. ఈ చిత్రంలో హక్కుల కోసం పోరాడే మహిళగా డర్హోమ్ నటించారు. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే అనేక అవార్డులూ ఆమెను వరించాయి. ముఖ్యంగా డెన్మార్క్ ప్రతిష్టాత్మక సిల్వర్ బీర్ అవార్డు లభించింది. అలాగే ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డును, రాబర్డ్ అవార్డును డర్హోమ్ అందుకున్నారు.
నట విశ్వరూపానికి మరికొన్ని నిదర్శనాలు..
పదేండ్ల అమ్మాయి నాటాషాను కిడ్నాప్ చేయడంతో ఆమె తల్లి పడే మానసిక సంఘర్షణ, కూతురుని కాపాడుకోవడం చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రం '3096'. ఈ చిత్రంలో తల్లి పాత్రలో డర్హోమ్ పలికించిన భావోద్వేగాలు హృదయానికి హత్తుకుంటాయి. లాస్ ఏంజెల్స్‌కు చెందిన పాపులర్ సింగర్, లిరిక్ రైటర్ విజయవంతమైన జర్నీని తెలిపే కథాంశంతో రూపొందిన 'సమ్ వన్ యు లవ్' చిత్రంలో మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూసర్‌గా డర్హోమ్ కీలక పాత్రలో మెప్పించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న భర్తను కాపాడుకోవడం కోసం, తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను బ్యాలెన్స్ చేసే క్రమంలో ఓ టీచర్ అనుభవించే సంఘర్షణను తెలిపే కథాంశంతో 'యు డిజప్పీయర్' చిత్రం రూపొందింది. ఇందులో టీచర్ పాత్రలో డర్హోమ్ నటన ప్రేక్షకులను కంట తడిపెట్టిస్తుంది. తన సినిమా బాగా ఆడాలని అదృష్టం కోసం అన్వేషించే ఓ హీరోయిన్ విచిత్ర కథను తెలిపే చిత్రం 'ఆఫ్ స్క్రీన్'. ఈ చిత్రంలో డర్హోమ్ సపోర్టింగ్ రోల్ చేసి మెప్పించారు. గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలోని డర్హోమ్ నటన అత్యంత సహజంగా ఉంటుంది. నటి కావాలనుకునే ఓ అమ్మాయి జర్నీని, సంఘర్షణను, భావోద్వేగాలను, విషాదాన్ని తెలిపే చిత్రం 'డైసీ డైమాండ్'. ఈ చిత్రంలో యానిమేషన్ చిత్ర దర్శకురాలిగా డర్హోమ్ కనిపించి అలరించారు. అద్భుతమైన నటన ప్రదర్శించి చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇద్దరు వ్యక్తుల కథను రెండు కోణాల్లో ఆవిష్కరించిన చిత్రం 'ట్రబుల్డ్ వాటర్'. ఈ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా, జైలు నుంచి వచ్చిన భర్తతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించిన ఆగెస్ పాత్రలో డర్హోమ్ మెప్పించారు. 'ది లెజెసీ', 'సెసిలియా', 'టాక్సీ', 'ఎడ్డెర్కోప్పెన్', 'టార్బెన్ టోబెన్', 'ది ఫైరీటెలర్'లో వంటి టెలివిజన్ సిరీస్‌ల్లో నటించిన బుల్లితెర ప్రేక్షకులనూ మైమరపించారు. అలాగే 'రోబోర్ట్స్', 'హ్యాపీ ఫీట్', 'సన్ షైన్ బ్యారీ అండ్ ది డిస్కో వార్మ్స్' వంటి తదితర ఇతర భాషా చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించి ప్రేక్షకులను అలరించారు.
Authorization