రాబర్ట్ డి నీరో..వెండితెర మాఫియా కింగ్. గ్యాంగ్‌స్టర్ పాత్రలకు పెట్టింది పేరు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించడంతోపాటు దర్శకుడిగా, నిర్మాతగానూ అద్భుతమైన చిత్రాలను రూపొందించి అందరినీ అలరించారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో సంచలన విజయాలు సాధించారు. ఉత్తమ నటుడిగా రెండు సార్లు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న రాబర్ట్ డి నీరో గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి..
రాబర్ట్ ఆంటోని డి నీరో జూనియర్‌గా న్యూయార్క్‌లోని మ్యాన్ హట్టన్ బరోలో 1943, ఆగస్ట్ 17న జన్మించారు. తల్లిదండ్రులు రాబర్ట్ డి నీరో సీనియర్, వర్జీనియా అడ్మిరల్ పెయింటర్స్. రాబర్ట్ రెండేండ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి తనని తాను గేగా ప్రకటించుకున్నారు. తల్లి దగ్గరే రాబర్ట్ పెరిగారు. ప్రాథమిక విద్య పబ్లిక్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఎలిజబెత్ ఐర్విన్ హై స్కూల్, లిటిల్ రెడ్ స్కూల్ హౌస్, హైస్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్, ప్రైవేట్ స్కూల్ మెక్ బర్నీ స్కూల్, రోడెస్ప్రెపరేటరీ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్యపూర్తి చేశారు. చిన్నప్పుడు తోటి పిల్లలతో కలిసి చిన్న పాటి స్ట్రీట్ గ్యాంగ్‌లను మెయింటేన్ చేసేవారు. పదేండ్ల వయసులో స్కూల్లో నాటకాలు వేశారు. ఆయన నటించిన మొదటి నాటకం 'ది విజార్డ్ ఆఫ్ ఓజ్'. ఇందులోని మంచి నటనతో అందరి దృష్టి ఆకర్షించారు. రాబర్ట్‌కు సినిమా పిచ్చి ఈ టైమ్‌లోనే మొదలైంది. నటనపై దృష్టి పెట్టడంతో అకాడమిక్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యారు. నటనపై దృష్టి పెట్టి హెచ్బి స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ చేశారు. లీ స్ట్రాస్బెర్గ్ యాక్టర్స్ స్టూడియోలో శిక్షణ తీసుకున్నారు.
మలుపు తిప్పిన మార్టిన్ స్కోర్సెస్ పరిచయం..
సినిమా ప్రయత్నాల్లో భాగంగా రాబర్ట్‌కు 20ఏండ్ల వయసులో 'ది వెడ్డింగ్ పార్టీ' (1963)చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా ఆలస్యంగా 1969లో విడుదలైంది. 1965లో 'ఎన్కౌంటర్' అనే లఘు చిత్రంలో నటించారు. అలాగే 'త్రీ రూమ్స్ ఇన్ మ్యాన్‌హట్టన్', 'లెస్ జెయునెస్లౌప్స్' చిత్రాల్లో అనామక పాత్రలు పోషించారు. మొదటి సినిమా దర్శకత్వం వహించిన బ్రెయిన్ డీ పాల్మా దర్శకత్వంలో వచ్చిన 'గ్రీటింగ్', అలాగే 'సామ్స్ సాంగ్' చిత్రాల్లో మంచి పాత్రలతో మెప్పించారు. చిన్న బడ్జెట్ చిత్రం 'బ్లడ్ మామ'తో నటుడిగా ఆకట్టుకున్నారు. 'బ్యాంగ్ ది డ్రమ్ స్లోలీ' చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఈ టైమ్‌లోనే ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్తో పరిచయం ఏర్పడింది. 1973లో వచ్చిన 'మీన్ స్ట్రీట్స్'లో చిన్న పాత్ర పోషించారు. ఇలా వరుసగా చిన్న చిన్న పాత్రలతో రాబర్ట్ అతి తక్కువ టైమ్‌లోనే మంచి నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 'గాడ్ ఫాదర్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ది గాడ్ ఫాదర్ పార్ట్ 2'లో గాడ్ ఫాదర్ విటో కోర్లియోన్ పాత్రలో నటించారు. ఇందులో అద్భుత నటనకుగానూ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అయితే ఆస్కార్ అవార్డును తీసుకోవడానికి రాబర్ట్ డి నీరో రాకపోవడం విశేషం. దీన్ని దర్శకుడు కొప్పోల అందుకున్నారు. ఈ సిరీస్‌లో మొదటి చిత్రం 'గాడ్ ఫాదర్'లో నటించిన మార్లన్ బ్రాండో ఇదే పాత్రకు ఆస్కార్‌ను అందుకోవడం మరో విశేషం.
తిరుగులేని వరుస విజయాలు..
'మీన్ స్ట్రీట్స్' చిత్రం తర్వాత దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో వరుసగా 'టాక్సీ డ్రైవర్', 'న్యూయార్క్, న్యూయార్క్', 'రేజింగ్ బుల్', 'ది కింగ్ ఆఫ్ కామెడీ', 'గుడ్ ఫెల్లాస్', 'కేప్ ఫీయర్', 'కాసినో' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఘన విజయాన్ని సాధించాయి. విజయవంతమైన కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఐర్విన్ వింక్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గిల్టీ బై సస్పీషియస్' చిత్రంలో మార్టిన్, రాబర్ట్ కలిసి నటించడం విశేషం. రాబర్ట్ కెరీర్లో 'టాక్సీ డ్రైవర్' చిత్రం కీలక పాత్ర పోషించింది. ఆయన కెరీర్‌ను ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో ఆయన ఐకానిక్ నటన విశేష ప్రశంసలందుకుంది. స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఉత్తమ నటుడిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1976లో చేసిన '1900', 'ది లాస్ట్ టైకూన్' చిత్రాలు నటుడిగా రాబర్ట్‌ను మరో మెట్టు ఎక్కించాయి. వరుసగా విభిన్న నేపథ్యాలకు చెందిన చిత్రాల్లో నటించి మెప్పించారు. వియత్నాం వార్ నేపథ్యంలో రూపొందిన 'ది డీర్ హంటర్' మరో మెట్టు ఎక్కించింది. ఆ తర్వాత 1980లో కామెడీ తరహా చిత్రాలతో మెప్పించారు. వాటిలో 'బ్రెజిల్', 'మిడ్నైట్ రన్', 'అనలైజ్ ధిస్', 'మీట్ ది పేరెంట్స్', 'మీట్ ది ఫాకర్స్', 'ట్రూ కన్ఫెషన్స్', 'ఫాలింగ్ ఇన్ లవ్', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ అమెరికా', 'ది మిషన్', 'ఏంజేల్ హార్ట్', 'ది అన్టచబుల్ట్స్', 'అవేక్నింగ్స్', 'మేరీ షేల్లేస్ ఫ్రాకెస్టిన్', 'హీట్', 'ది ఫ్యాన్', 'స్లీపర్స్', 'వాగ్ ది డాగ్', 'జాకీ బ్రౌన్', 'రోనిన్', 'ఫ్ల్రాలెస్' వంటి చిత్రాలున్నాయి. ఈ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.
దర్శకుడిగానూ ప్రేక్షకుల్ని మెప్పించారు..
1993లో 'ది బార్సు లైఫ్'లో నటించే టైమ్‌లోనే 'ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్' చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో ఆయన దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు సాగించారు. దీంతో 'ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్' చిత్రాన్ని వదులుకున్నారు. ఆ పాత్రలో క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించడం విశేషం. ఇక తను దర్శకుడిగా మారుతూ క్రైమ్ డ్రామా 'ఏ బ్రాంక్స్ టేల్' చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు ఓ ప్రధాన పాత్రలో తనే నటించారు. ఓ వైపు 'ది బార్సు లైఫ్'లో నటిస్తూనే దర్శకత్వం వహించడమనేది ఆయనకు కత్తిమీద సాములా నిలిచింది. 1997లో సిల్వెస్టర్ స్టాలోన్, హార్వీ కీటెల్, రే లాయిట్టా వంటి నటులతో కలిసి క్రైమ్ డ్రామా 'కాప్ ల్యాండ్'లో నటించారు. తన చిరకాల స్నేహితుడు అల్ పసినోతో కలిసి 'హీట్' చిత్రంలో నటించారు. 2000లో బయోగ్రాఫికల్ చిత్రం 'మెన్ ఆఫ్‌హానర్' మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2002లో '9 బై 11' దాడుల నేపథ్యంలో తెరకెక్కిన డాక్యుమెంటరీలో కనిపించారు. 2004లో వచ్చిన కామెడీ చిత్రం 'మీట్ ది ఫాకర్స్'లో, 2007లో 'స్టార్‌డస్ట్'చిత్రంలో నటించి మెప్పించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించినప్పటికీ, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. 2006లో 'ది గుడ్ షేఫార్డ్' చిత్రానికి దర్శకత్వం వహించాలని ప్లాన్చేసుకుంటున్న టైమ్‌లోనే 'ది డిపార్టెడ్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తనకు వరుసగా సక్సెస్‌లు అందించిన మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమది. అయినప్పటికీ ఆ చిత్రంలో నటిస్తూనే తన సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలూ విజయం సాధించి రాబర్ట్‌ను తిరుగులేని నటుడిగా, దర్శకుడిగా నిలిపాయి. వరుసగా 'ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్', 'మాచెటె', 'స్టోన్', 'లిటిల్ ఫాకర్స్', 'కిల్లర్ ఎలైట్', 'లిమిట్లెస్', 'న్యూయార్ ఎవ్', 'మాన్వల్ ది ఎమోర్ 3', 2012లో 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్', 'ఫ్రీలాన్సర్స్', 'రెడ్ లైట్స్', 'బీయింగ్ ప్లైన్' చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించారు. 2013లో కామెడీ చిత్రం 'ది బిగ్ వెడ్డింగ్', యాక్షన్ థ్రిల్లర్ 'కిల్లింగ్ సీజన్', కైమ్ కామెడీ 'ది ఫ్యామిలీ', కామెడీ చిత్రం 'లాస్ట్ వేగాస్', క్రైమ్ బ్లాక్ కామెడీ చిత్రం 'అమెరికన్ హస్టిల్', స్పోర్ట్స్ కామెడీ 'గ్రడ్జ్ మ్యాచ్', 2014లో యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్యాగ్ మ్యాన్', 2015లో కామెడీ డ్రామా 'ది ఇంటర్న్', క్రైమ్ థ్రిల్లర్ 'హీస్ట్', బయోగ్రాఫికల్ కామెడీ డ్రామా 'జారు', 2016లో కామెడీ నేపథ్యంలో 'డర్టీ గ్రాండ్‌పా', బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ చిత్రం 'హ్యాండ్ ఆఫ్ స్టోన్', కామెడీ డ్రామా 'ది కమెడియన్' వంటి విభిన్న కథా చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు. హాలీవుడ్లో తిరుగులేని నటుడిగా ఎదిగి రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ 'ది వార్ విత్ గ్రాండ్‌పా', 'ది ఐరిష్‌మ్యాన్' చిత్రాల్లో నటిస్తున్నారు. తన కెరీర్లో 'షార్క్ టేల్', 'ఆర్థర్ అండ్ ది ఇన్విసిబిల్స్' చిత్రాలకు వాయిస్ ఇచ్చారు. 'ది ఆడిషన్', 'ఎల్లిస్' వంటి లఘు చిత్రాల్లో నటించారు.
ఉత్తమాభిరుచిగల నిర్మాతగానూ అలరించారు..
ఐదు దశాబ్దాల కెరీర్లో నటుడిగా 96 చిత్రాల్లో నటించారు. నటుడిగా విలక్షణ ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగానూ సినిమాపై తనకున్న అభిరుచి చాటుకున్నారు. దాదాపు 20కిపైగా చిత్రాలను 'ట్రైబెకా ప్రొడక్షన్స్'పేరుతో నిర్మించారు. 'కేప్ ఫీయర్', 'థండర్హార్ట్', 'మిస్స్ట్రెస్', 'ఏ బ్రాంక్స్ టేల్', 'పాంథర్', 'ఫ్లాలెస్', 'స్టేజ్ బ్యూటీ', 'ది గుడ్ షెప్పర్డ్', 'లిటిల్ ఫ్లాకర్స్', 'వారియర్ క్వీన్', 'ది ఐరిష్‌మ్యాన్' చిత్రాలున్నాయి. పది చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. 'సాటర్డే నైట్ లైవ్', 'ఎక్స్‌ట్రాస్', 'సెసామ్ స్ట్రీట్', '30 రాక్', 'ది వైజార్డ్ ఆఫ్ లైస్' వంటి టెలివిజన్స్లోనూ, 16 డాక్యుమెంటరీల్లోనూ నటించారు.
అవార్డులు..అరుదైన పురస్కారాలు..
'ది గాడ్‌ఫాదర్ పార్ట్ 2'కుగానూ సహాయనటుడిగా ఒక ఆస్కార్, 'రేజింగ్ బుల్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా మరో ఆస్కార్ అందుకున్నారు. 2003లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ పురస్కారం వరించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు పొందారు. దీంతోపాటు అనేక ఇతర పురస్కారాలనూ దక్కించుకున్నారు. 1987లో 15వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు జ్యూరీ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగుసార్లు ప్రీమియర్ మ్యాగజైన్, రెండు సార్లు ఎంపైర్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది గొప్ప నటుల జాబితాలో నిలిచారు.
సరోగసి విధానంలో పిల్లలు..
రాబర్ట్ డి నీరో 'టాక్సీ డ్రైవర్' చిత్రంలో తనతో కలిసి నటించిన డయాన్నే అబోట్‌ను ప్రేమించి 1976లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి కూతురు డ్రెనా డి నీరో, కుమారుడు రాఫిల్ ఉన్నారు. గతంలో రాఫిల్ నటుడిగా కొనసాగి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. 1988లో డయాన్నే నుంచి విడిపోయారు. మోడల్ టూకీ స్మిత్‌తో రాబర్ట్ ఎక్కువ కాలం సహజీవనం చేశారు. సరోగసి ద్వారా కవల కుమారులను పొందారు. 1997లో నటి గ్రేస్ హైటవర్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి కుమారుడు ఎలైట్ ఉన్నారు. 1999లో గ్రేస్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కోర్టు నుంచి డైవర్స్ రాకపోవడంతో 2004లో మళ్ళీ కలిశారు. ఆ తర్వాత 2011లో వీరికి కూతురు హెలెన్ గ్రేస్ సరోగసి ద్వారా జన్మించారు. 2003లో రాబర్ట్ డీ నీరో కాన్సర్‌తో బాధపడ్డారు. ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అయ్యారు. రాబర్ట్‌కు భారీ ఆస్తులున్నాయి. అలాగే పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. 1998లో ఓ సినిమా షూటింగ్ టైమ్‌లో ఫ్రాన్స్ అధికారులు తనపై వ్యభిచార ఆరోపణలు చేశారు. దీంతో 2011 వరకు మళ్ళీ ఫ్రాన్స్‌లో షూటింగ్ జరపలేదు. అలాగే తన ఆస్తులకు సంబంధించి ట్యాక్స్ విషయం వివాదంగా మారింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోనూ చురుగ్గానే పాల్గొన్నారు.
నట విశ్వరూపానికి ప్రతీకలు
రాబర్ట్ డి నీరో అలనాటి నటి, యాక్టింగ్ టీచర్ స్టెల్లా అడ్లర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ప్రతిష్టాత్మక స్టానిస్లవ్స్కీ సిస్టమ్‌లో యాక్టింగ్ నైపుణాలను పొందారు. మార్లన్ బ్రాండో ఈ తరహా నటనలో శిక్షణ తీసుకున్న విషయం విదితమే. మెథడ్ యాక్టింగ్‌కి రాబర్ట్ పెట్టింది పేరు. ఈ పద్ధతి ద్వారా నటించే క్రమంలో బహ్యారూపకంగా, అంతర్గతంగా విలక్షణ నటనను ప్రదర్శిస్తారు. అత్యంత సహజంగా వీరి కనిపిస్తుంది. దీంతో నటనలో ఆయనొక బ్రాండ్‌గా నిలిచారు. ఇదొక విశేషమైతే రాబర్ట్ అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. తొలినాళ్ళలో ఎక్కువగా గ్యాంగ్‌స్టర్ చిత్రాలు చేశారు. 1987లో వచ్చిన 'ది అన్‌టచ్‌బుల్' కూడా గ్యాంగ్‌స్టర్ చిత్రమే కావడం విశేషం. ఇందులో ఆయన మాఫియా కింగ్ ఆల్ క్యాపోన్ పాత్రలో నటించారు. మాఫియా గ్యాంగ్ లీడర్‌గా డి నీరో నటన కట్టిపడేస్తుంది.
అమెరికా నేవీకి ఎంపికైనా మొదటి ఆఫ్రికన్ వ్యక్తి కార్ల్ బ్రాషెర్ జీవితం ఆధారంగా రూపొందిన 'మెన్ ఆఫ్ హానర్'లో ఆఫ్రికన్ వ్యక్తిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అమెరికా, వియత్నాం యుద్ధ సమయంలో చిన్న పట్టణంలో పారిశ్రామిక వాడల్లో నివసించే ప్రజలు పరిస్థితుల ఇతివృత్తంగా తీసిన 'ది డీర్ హంటర్' చిత్రంలో ఓ సైనికుడిగా రాబర్ట్ ఆలరించారు. మార్టిన్ స్కోర్సెస్ రూపొందించిన 'రేజింగ్ బుల్' చిత్రంలో బాక్సర్ జేక్ టా మొట్టా పాత్రలో మెప్పించారు. 'టాక్సీ డ్రైవర్' చిత్రం కోసం కొన్ని రోజులు టాక్సీ డ్రైవర్‌గానూ పనిచేశారు. 'న్యూయార్క్ న్యూయార్క్' చిత్రం కోసం సాక్సోఫోన్ నేర్చుకున్నారు. 2007లో వచ్చిన రొమాంటిక్ అడ్వెంచరస్ ఫాంటసీ 'స్టార్‌డస్ట్' చిత్రంలో మాయా రాజ్యానికి చెందిన కెప్టెన్ షేక్స్పీయర్ పాత్రలో కనువిందు చేశారు. న్యూయార్క్‌లో వరుసగా హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు ఇద్దరు డిటెక్టివ్స్ చేసే ప్రయత్నం నేపథ్యంలో రూపొందిన 'రైటస్ కిల్'లో డిటెక్టివ్‌గా ఆల్ పసినోతో కలిసి రాబర్ట్ డీ నీరో తన విశ్వరూపం చూపించారు. పెరోల్ అధికారి జాక్ మాబ్రీ త్వరలో రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ హత్యకేసు నిందితుడి ట్రాప్‌లో ఇరుక్కుంటాడు. దాన్నుంచి బయటపడేందుకు జాక్ చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన 'స్టోన్' చిత్రంలో పేరోల్ అధికారి జాక్ పాత్రలో నిరో నటన ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన మెంటర్, కిరాయి సైనికుడు విలన్ల చేతుల్లో అపాయంలో ఉండటంతో త్వరలో రిటైర్ కాబోతున్న ఏజెంట్ చేసే సాహసం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'కిల్లర్ ఎలైట్'. ఈ బ్రిటీష్-ఆస్ట్రేలియన్ చిత్రంలో మెంటర్, కిరాయి సైనికుడు రాబర్ట్ తన శిష్యుడిగా నటించిన జాసన్ స్టథన్తో కలిసి చేసే యాక్షన్ ఆకట్టుకుంటుంది. స్ట్రగులింగ్ రైటర్ ఓ కొత్త డ్రగ్‌ని తీసుకుని వందశాతం తన బ్రెయిన్‌ని ఉపయోగించి, పెద్ద సంపన్నుడిగా ఎదిగే కథాంశంతో రూపొందిన 'లిమిట్లెస్' చిత్రంలో రాబర్ట్ పెద్ద వ్యాపార వేత్త పాత్రలో మెప్పించారు. గొప్ప రైటర్ కావాలనుకునే కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పడే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన 'బీయింగ్ ప్లె˜ౖన్న్' చిత్రంలో ఇబ్బందులు పడే తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులను, తన మాజీ భార్యను వెతుక్కునే ఇతివృత్తంతో రూపొందిన భావోద్వేగ పూరిత రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్'లో తండ్రి పాత్రలో తనదైన నటనతో మెస్మరైజ్ చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ ఎంటర్టైనర్ 'ది ఫ్యామిలీ', 'అమెరికన్ హస్టిల్', 'ది బ్యాగ్ మ్యాన్', 'ది ఇంటర్న్' 'హీస్ట్', 'డర్టీ గ్రాండ్‌పా', 'హ్యాండ్స్ ఆఫ్ స్టోన్' 'ది కమెడియన్' వంటి తదితర చిత్రాల్లో రాబర్ట్ పోషించిన విలక్షణ పాత్రలు ఆయన నట విశ్వరూపానికి ప్రతీకలుగా నిలిచాయనటంలో అతిశయోక్తి లేదు.
Authorization