ఎర్మాన్నో ఒల్మి..
కమర్షియల్ సినిమాకు గట్టి పోటీ ఇస్తూ సహజత్వానికి పెద్ద పీట వేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన దిగ్దర్శకుడు. ప్రకృతి, మనుషులు, వారి జీవన విధానం, మనుగడ కోసం చేసే పోరాటం ముఖ్యంగా రైతుల సంఘర్షణ వంటి తదితర అంశాలను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించి ఇటాలియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేశారు. దర్శకుడిగా, రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా తుదిశ్వాస వరకూ సినిమా కోసం శ్రమించి అందరితో శభాష్ అనిపించుకున్న ఎర్మాన్నో ఒల్మి గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
డాక్యుమెంటరీ డైరెక్టర్‌గా..
ఎర్మాన్నో ఒల్మి జులై 24న 1931లో జన్మించారు. స్వస్థలం ఇటలిలోని బెర్మాగో. మూడేండ్ల వయసులో ఒల్మి కుటుంబం ఇటలిలోని మిలాన్ నగరానికి మారింది. ఒల్మికి చిన్నప్పట్నుంచే సినిమాలంటే ఇష్టం. నటుడు కావాలనుకున్నారు. హైస్కూల్లో సైంటిఫిక్ క్లాస్‌లకు ఎక్కువగా హాజరయ్యేవారు. ఆ తర్వాత డ్రమటిక్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ కూడా తీసుకున్నారు. సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో తొలుత ఓ ఎలక్ట్రిక్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అట్నుంచి సినిమా మేకింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. తొలి ప్రయత్నంగా డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. పవర్ ప్లాంట్స్‌పై సొంత డబ్బుతో 16ఎం.ఎం. డాక్యుమెంటరీస్ను తీయడం ప్రారంభించారు. వాటికి మంచి ఆదరణ లభించింది. దీంతో వరుసగా 1952 నుంచి 1961 వరకు 40కిపైగా షార్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్, కంపెనీ డాక్యుమెంటరీలను రూపొందించారు. అందులో 'లా డిగా సుల్ ఘియాకియావో', 'ట్రీ ఫిలి ఫినో ఏ మిలానో', 'ఉన్ మెట్రో ఈ లుంగో కింకూ' వంటివి విశేషాదరణ పొందాయి.
దర్శకుడిగా తొలి సినిమా పరాజయం..
డాక్యుమెంటరీ నిర్మాణంతో సినిమాలపై, మేకింగ్‌పై పట్టు సాధించారు. అనేక విజయవంతమైన డాక్యుమెంటరీల అనంతరం తొలి ప్రయత్నంగా 'టైమ్ స్టుడ్ స్టిల్' అనే సినిమాను రూపొందించారు. 1958లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. దర్శకుడిగా తొలి సినిమా పరాజయం తర్వాత రెండేండ్ల గ్యాప్‌తో 'ఇల్ పోస్టో' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు కుర్రాళ్ళు తమ తొలి ఉద్యోగాన్ని ఎలా డీల్ చేశారనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. లిరేనానా డిటో, తులియో కెజిచ్, సాంట్రో పన్సేరి, మారా రివెల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 1961లో విడుదలై ఘన విజయం సాధించింది. దర్శకుడిగా ఎర్మాన్నో ఒల్మికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 1963లో 'ది ఫియాన్సిస్' చిత్రాన్ని రూపొందించారు. పోప్ జాన్ 23 జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది.
ప్రేక్షకులు మెచ్చిన దిగ్దర్శకుడు..
1977లో రూపొందించిన 'ది ట్రీ ఆఫ్ వూడెన్ క్లాగ్స్' చిత్రం ఎర్మాన్నో ఒల్మి కెరీర్లో ఓ మాస్టర్ పీస్‌గా నిలిచింది. విశేష ప్రేక్షకాదరణతో గొప్ప విజయాన్ని సాధించింది. కేన్స్‌లో ప్రదర్శితమై గోల్డెన్ పామ్ అవార్డునందుకుంది. అలాగే స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ స్టోరీ, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో సైతం అవార్డులనందుకుంది. ఆ తర్వాత ఐదేండ్ల గ్యాప్‌తో 1983లో 'వాకింగ్, వాకింగ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత 1987లో తెరకెక్కించిన 'లాంగ్ లైవ్ ది లేడీ', 'మిలానో 83' చిత్రాలూ అఖండ విజయం సాధించాయి. 'లాంగ్ లైవ్ ది లేడీ' సినిమా ఫిప్రెస్సి ప్రైజ్‌ను, గోల్డెన్ లయన్ అవార్డును గెలుచుకుంది. 1988లో డ్రామా నేపథ్యంలో రూపొందించిన 'ది లెజెండ్ ఆఫ్ ది హో డ్రింకర్' చిత్రం సైతం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ రెండు చిత్రాలు దర్శకుడుగా ఒల్మిని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. 'ది లెజెండ్ ఆఫ్ ది హోలీ డ్రింకర్' వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ లయన్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత వరుసగా 1993లో ఫాంటసీ డ్రామా 'ది సీక్రెట్ ఆఫ్ ది ఓల్డ్ వూడ్స్', 1994లో టెలివిజన్ ఫిల్మ్ 'జెనిసిస్: ది క్రియేషన్ అండ్ ది ఫ్లడ్', 2001లో వార్ డ్రామా 'ది ప్రొఫెషన్ ఆఫ్ ఆర్మ్స్', 2003లో అడ్వెంచరస్ డ్రామా 'సైనింగ్ బిహైండ్ స్క్రీన్స్', 2007లో నాటకీయ ప్రధానంగా 'వన్ హండ్రెడ్ నెయిల్స్', 2011లో డ్రామా ప్రధానంగా 'ది కార్బోర్డ్ విలేజ్', 2014లో మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 'గ్రీనరీ విల్ బ్లూమ్ ఎగైన్' చిత్రాలను రూపొందించారు. వాస్తవికతకు కేరాఫ్‌గా నిలిచిన ఈ సినిమాలు భారీ విజయాలు సాధించి ఇటాలియన్ సినీ చరిత్రలో మైలు రాళ్లుగా నిలిచిపోయాయి. అంతేకాదు ఎర్మాన్నో ఒల్మిని దిగ్గజ దర్శకుడిని చేశాయి. దర్శకుడిగానే కాదు, రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగంలో కూడా ఆయన నిష్ణాతుడు. 'ది ట్రీ ఆఫ్ వూడెన్ క్లాగ్స్', 'వాకింగ్ వాకింగ్', 'లాంగ్ లైవ్ ది లేడీ', 'ది లెజెండ్ ఆఫ్ ది హోలీ డ్రింకర్' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రతిభకు దక్కిన అపూర్వ పురస్కారాలు..
'ది ప్రొఫెషన్ ఆఫ్ ఆర్మ్స్' చిత్రానికి ప్రతిష్టాత్మక డేవిడ్ డి డోనటెల్లో అవార్డును అందుకున్నారు. అలాగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆయన్ని 2008లో గోల్డెన్ లయన్ పురస్కారంతో సత్కరించింది. 'ఇల్ పోస్టో', 'ది లెజెండ్ ఆఫ్ ది హో లీ డ్రింకర్', 'ది ప్రొఫెషన్ ఆఫ్ ఆర్ట్స్' చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా డేవిడ్ డి డోనటెల్లో అవార్డులు, అలాగే రెండు నాట్స్రో డి అర్గెంటో అవార్డులు, ప్రతిష్టాత్మక లియోపార్డ్ పురస్కారం వరించింది. 'ఇల్ పోస్టో' టైమ్‌లో హీరోయిన్ లోరెడానా డెట్టోని పెళ్ళి చేసుకున్నారు. ఓ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ ఒల్మి ఈ ఏడాది మే 5న అనారోగ్యంతో కన్నుమూశారు.
ఎర్మాన్నో ఒల్మి సహజత్వానికి పెద్ద పీట వేశారు. నియో రియలిస్టిక్ చిత్రాలకు కేరాఫ్‌గా, ఆద్యుడిగా నిలిచారు. ఇటాలియన్ సినిమాకి సరికొత్త రూపాన్నిచ్చారు. రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాల కథాంశాలతోనూ సినిమాలు తీసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు.
ప్రధానంగా యదార్థ సంఘటనలు, వాస్తవానికి దగ్గరగా ఉండే కథాంశాలను ఎంచుకోవడంతోపాటు మనిషి భిన్న స్వభావాలను, బహిర్గతంగా, అంతర్గతంగా మనిషి తీరుతెన్నులను ప్రతిబింబించే ప్రయత్నంలో ఒల్మి అఖండ విజయం సాధించారు. ఆయన రూపొందించిన కొన్ని వైవిధ్యభరిత చిత్రాల సరళిని ఓసారి పరిశీలిద్దాం..
ఐఎల్ పోస్టో
ఇద్దరు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి స్థానంలో స్థిరపడాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాల్లో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లేంటి?, తమ తొలి ఉద్యోగాన్ని ఎలా డీల్ చేశారనే ఇతివృత్తంలో రూపొందిన చిత్రం 'ఐఎల్ పోస్టో'. డ్రామా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఒల్మి టేకింగ్ హైలైట్‌గా నిలిచింది. ప్రధాన పాత్రల్లో లిరేనానా డెట్టో, తులియా కెజిచ్ నటన ఆకట్టుకుంటుంది. విద్య, ఉద్యోగాల తీరుతెన్నులను ప్రతిబింబించిన ఈ సినిమా అత్యంత సహజంగా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.
ది ఫియన్స్
మిలాన్‌లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి గియోవాన్ని తనకు కాబోయే భార్య కోసం, బాగా డబ్బు సంపాదించడం కోసం సిసిలీ పట్టణానికి వెళతాడు. అక్కడ తన కాబోయే భార్యతో చాలా సంతోషంగా గడుపుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు వారి మధ్య ఎలాంటి వివాదాలకు దారి తీశాయి?, చివరికి వీరు పెళ్ళి చేసుకున్నారా? లేదా అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'ది ఫియన్స్'. ఇటలీలోని ఉద్యోగం, ప్రేమ విషయంలో వారు ఫేస్ చేస్తున్న పరిస్థితులకు ప్రతిబింబింగా నిలిచేలా ఒల్మి ఈ చిత్రాన్ని డ్రామా నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. కార్లో కాబ్రిని, అన్నా కాంజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
ఏ మ్యాన్ నేమ్డ్ జాన్
23వ పోప్ జాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం 'ఏ మ్యాన్ నేమ్డ్ జాన్'. పోప్ జాన్ చిన్నప్పట్నుంచి పెరిగే విధానం, ఓర్పు, సహనంతో ఎదిగిన వైనం, ఆయన జీవిత గమనం, ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన పోరాటం, ఆయన జీవితంలో ఎదుర్కొన ఒడిదుడుకులకు వెండితెర రూపమిచ్చారు. అత్యంత నాటకీయంగా రూపొందించిన ఈ సినిమా సైతం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇందులో రాడ్ స్టీగర్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.
ది ట్రీ ఆఫ్ వూడెన్ క్లాగ్స్
ఒల్మి కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రం 'ది ట్రీ ఆఫ్ వూడెన్ క్లాగ్స్'. ఇటలి దేశంలోని రైతు సమస్యలను, బతుకు పోరాటంలో పేదల సంఘర్షణను, అదే సమయంలో సంపన్నులు, సినిమా సెలబ్రిటీల జీవన విధానాన్ని, జీవన వ్యత్యాసాలను అత్యద్భుతంగా, అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించారు. 1978లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇటలి ప్రజల బతుకుచిత్రంగా నిలిచి అందరినీ అలరించింది. విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులనూ దక్కించుకుంది. లుయిగి ఓర్నాగి, ఫ్రాన్సెస్కా మొర్గి, ఒమర్ బ్రిగ్నోలి, ఆంటోనియా ఫెరారి ప్రధాన పాత్రల్లో అలరించారు.
వాకింగ్ వాకింగ్
ఇటలి దేశంలో వ్యక్తుల బాధ్యత, మనిషికి విజ్ఞాన శాస్త్రం ఉపయోగం, వారు నిర్వహించాల్సిన విధులను, తమ స్థితిగతులు మెరుగు పర్చుకోవడానికి వారు పాటించాలని పద్ధతులు, చేయాల్సిన పనులు తెలిపే కథాంశంతో ఓల్మి ఈ 'వాకింగ్ వాకింగ్' చిత్రాన్ని రూపొందించారు. సామాజిక బాధ్యతను ప్రతిబింబించే ఈ చిత్రం విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే ఇందులో సాధారణ వ్యక్తులే నటీనటులుగా నటించడం విశేషం. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఓల్మి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
ది లెజెండ్ ఆఫ్ ది హోల్ డ్రింకర్
తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి, తాను తాగడం కోసం, జీవనాన్ని కొనసాగించడం కోసం రోజూ ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటుంటాడు. ఇలా చాలా మంది దగ్గర అప్పులు చేస్తాడు. తిరిగి ఆ అప్పులు చెల్పించాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు?, అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందని తెలిపే చిత్రం 'ది లెజెండ్ ఆఫ్ ది హోల్ డ్రింకర్'. ఓ తాగుబోతు జీవిత గమనాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడిగా ఒల్మిని మరో మెట్టు ఎక్కించింది. అత్యంత సహజంగా ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కించి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టారు. ఇందులో ప్రధాన పాత్రలో రుట్జర్ హౌర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికవ్వడం విశేషం.
ది సీక్రెట్ ఆఫ్ ది ఓల్డ్ వుడ్స్
ఓ అడవికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామంలోని ఒక ఇంట్లో జనరల్ సెబాస్టియానో ప్రోకోలో నివసిస్తుంటారు. డబ్బు కోసం అడవిలోని చెట్లను నరికి కలపను అమ్ముకుంటుంటాడు. ఈ క్రమంలో అతనికి అడవిలో కొన్ని వింత శక్తులకు కనిపిస్తుంటాయి. మరి ఆ వింత శక్తులేంటి?, ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో రూపొందిన చిత్రం 'ది సీక్రెట్ ఆఫ్ ది ఓల్డ్ వుడ్స్'. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం విశేషంగా ఆదరణ పొంది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
జెనిసిస్: ది క్రియేషన్ అండ్ ది ఫ్లడ్
బుక్ ఆఫ్ జెనెసిస్ అనే పుస్తకం ఆధారంగా రూపొందించిన చిత్రం 'జెనిసిస్: ది క్రియేషన్ అండ్ ది ఫ్లడ్'. మనుషుల సృష్టి, మతాల ఏర్పాటు, వాటి మధ్య సంఘర్షణ, మనుషులకు, ప్రకృతికి మధ్య స్ట్రగుల్స్ ఇలా అనేక అంశాలను ప్రతిబింబించేలా, సమకాలీన పరిస్థితులకు అన్వయించి దర్శకుడు ఒల్మి టెలివిజన్ సినిమాగా దీన్ని ప్రయోగాత్మకంగా రూపొందించారు. అత్యంత సహజంగా, వాస్తవ దృశ్యాలను కళ్లకు కట్టేలా తెరకెక్కించి ప్రశంసలందుకున్నారు. ఇది టెలివిజన్ ఫిల్మ్ అయినప్పటికీ విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసల్ని పొందింది.
ది ప్రొఫెషన్ ఆఫ్ ఆర్మ్స్
1526లో ఇటలి ఎంపరర్ చార్లెస్ వి తమ రాజ్యంలోకి వచ్చిన జర్మన్ సైనికులపైకి తమ సైన్యాన్ని పంపిస్తాడు. గియోవన్నీ అనే కమాండర్ సారథ్యంలో వీరి సైన్యం యుద్ధానికి వెళ్తుంది. జర్మన్ సైన్యం దగ్గర తుపాకులు, మందు గుండు సామాగ్రి పుష్కలంగా ఉంటుంది. కానీ వీరు కత్తులు, కటారులతోనే యుద్ధానికి వెళ్తారు. ఈ నేపథ్యంలో వారిని ఎలా ఎదుర్కొన్నారనేది 'ది ప్రొఫెషన్ ఆఫ్ ఆర్మ్స్' కథ. గియోవన్నీ అనే కమాండర్ పాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రం హిస్టరీ వార్ డ్రామాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యంత సహజంగా జరిగే యుద్ధ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఒల్మి టేకింగ్ అత్యద్భుతం. ఇటాలియన్ సినీ చరిత్రలో ఇదొక గొప్ప చిత్రంగా నిలిచింది. గియోవన్నీ పాత్రలో క్రిస్టో జివ్కోవ్ నటించారు. ఈ సినిమా మంచి కలెక్షన్లతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
వన్ హండ్రెడ్ నెయిల్స్
ఓ యంగ్ ప్రొఫెసర్ బోలోనా యూనివర్సిటీలో పనిచేస్తుంటాడు. తనని తాను తెలుసుకునేందుకు ఆ ఫ్రొఫెసర్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఓ క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. దీని కోసమై ఇటలీలోని పో నది తీరంలో ఉన్న పాడుబడిన ఇంటిని నివాసంగా ఏర్పర్చుకుంటాడు. అక్కడ తానేం కనిపెట్టాడు?, తనకి ఎదురైన సంఘటనలేంటనేది 'వన్ హండ్రెడ్ నెయిల్స్' చిత్ర కథ. 2007లో విడుదలై ఈ చిత్రం కేన్స్‌లో ప్రదర్శితమై అవార్డులనందుకోవడం విశేషం.
ది కార్డ్ బోర్డ్ విలేజ్
కొంత మంది ఆఫ్రికన్ శరణార్థులు ఇటలికి చేరుకుంటారు. అక్కడ త్వరలో మూసివేయడానికి సిద్ధంగా ఉన్న ఓ చర్చ్ దగ్గరగా ఉన్న గ్రామంలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. అందుకు ఆ చర్చ్ ఫాదర్ పర్మిషన్ కావాలి. తప్పని పరిస్థితుల్లో అతని ఆదేశాలను పాటించి నివాసం ఏర్పర్చుకోవాలి. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ ఫాదర్ ఏం చేశాడనేది 'ది కార్డ్బోర్డ్ విలేజ్' చిత్రంలో ఆద్యంతం ఆసక్తికరం. విశేష ఆదరణ పొంది పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం ద్వారా క్రిస్టియన్ ఫాదర్స్ వాస్తవంగా చేసే పనులను ప్రేక్షకులకు తెలియజేసింది.
గ్రీనరీ విల్ బ్లూమ్ ఎగైన్
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలి సైనికులు యుద్ధం చేయాల్సి వస్తుంది. అత్యంత మంచు కురిసే అసియాగో ప్లాలియు ప్రాంతంలో ఆ యుద్ధం జరుగుతుంటుంది. అక్కడ ఒక్క రోజు రాత్రి ఆ సైనికులు యుద్ధం ఎలా చేశారు?, వారు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపే చిత్రం 'గ్రీనరీ విల్ బ్లూమ్ ఎగైన్'. మైనస్ డిగ్రీల మంచులో ఏడారి పర్వత ప్రాంతంలో యుద్ధం చేయడం పెద్ద సాహసం.
ఆ సాహసం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలై ఘన విజయం సాధించింది. పలు అవార్డులనూ గెలుచుకుంది. ఇది ఒల్మి దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం.
సింగింగ్ బిహైండ్ స్క్రీన్స్..
చైనాకు చెందిన చింగ్ అనే మహిళా బందిపోటు సాహసగాథను తెలిపే చిత్రం 'సింగింగ్ బిహైండ్ స్క్రీన్స్'. చింగ్ భర్తను తన దగ్గర సహయకుడిగా పనిచేసే వ్యక్తే చంపేస్తాడు. దీంతో ఆమె వేశ్యా గృహాల్లో నివసిస్తుంటుంది. ఆ తర్వాత చైనా సముద్ర తీరంలో పైరేట్స్‌గా మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకుని అనంతరం తాను చేసే సాహస యాత్రే ఈ చిత్రం. స్టేజ్ డ్రామాను నిర్వహిస్తూ, వేశ్యగా ఆమెలోని ఆత్మ సంఘర్షణను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆద్యంతం కట్టిపడేసే కథనంతో హిస్టారికల్ మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2003లో విడుదలైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా విజువల్‌గా మంత్రమగ్దుల్ని చేస్తుంది. ఒల్మిని అగ్రదర్శకుల జాబితాలోకి చేర్చిన ఈ చిత్రంలో చింగ్ పాత్రలో జున్ ఇచికావా అద్భుతంగా నటించింది.
Authorization