అత్యద్భుత విలక్షణ పాత్రలకు కేరాఫ్ నిలిచిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్. కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటుతూనే సమాంతర చిత్రాల్లోనూ నటించి మెప్పించిన అరుదైన నటి. వెండితెర ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకుల్నీ ఫిదా చేసి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను కైవసం చేసుకున్న
జూలియన్నే మూర్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..!
నాటకాలతో నటనకు నాంది..
హాలీవుడ్లో మేటి నటిగా ప్రేక్షకుల మదిని దోచిన జూలియన్నే మూర్ 1960, డిసెంబర్ 13న అమెరికాలోని నార్త్ కరోలినాలో జన్మించారు. తండ్రి పీటర్ మూర్ స్మిత్ అమెరికా ఆర్మీలో పారాట్రూపర్. తల్లి అన్నా సైకాలజిస్ట్, సోషల్ వర్కర్. మూర్కు చెల్లి వాలెరియి, తమ్ముడు పీటర్ ఉన్నారు. తండ్రి ఉద్యోగం వల్ల తరచూ తమ నివాస ప్రాంతాలు మారాల్సి వచ్చేది. దీంతో మూర్ తన పాఠశాల విద్యను తొమ్మిది స్కూల్స్‌లో పూర్తి చేశారు. జెఈబీ స్టార్ట్ హై స్కూల్, ఫ్రాంక్ఫుర్ట్ అమెరికన్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మూర్ చదువుల్లో ముందుంటు మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో డాక్టర్ కావాలనుకున్నారు. యాక్టింగ్ వైపు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే అవిడ్ రీడర్‌గా పనిచేసే తరుణంలో నటనవైపు అడుగులు వేసేలా చేసింది. 'టార్టుఫ్', 'మోడియా' వంటి తదితర కొన్ని నాటకాలు మూర్కు మంచి పేరు తెచ్చాయి. మూర్ నటనా ప్రతిభను గమనించిన ఇంగ్లీష్ టీచర్ ప్రోత్సహించి థియేటర్ చేయించారు. మూర్ నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు. 1983లో బోస్టన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1985లో తొలిసారి టెలివిజన్‌లో నటించే ఛాన్స్ అందుకున్నారు. 'ది ఎడ్జ్ ఆఫ్ నైట్' టెలివిజన్ సిరీస్‌లో నటించి మెప్పించారు. అదే ఏడాది మరో సిరీస్ 'యాజ్ ది వరల్డ్ టర్న్స్'లో భాగమయ్యారు. ఇది మూర్ కెరీర్‌కి బ్రేక్ ఇచ్చింది. దీనికిగానూ డేటైమ్ ఎమ్మీ అవార్డు వరించింది. సీబీఎస్ మినీ సిరీస్ 'ఐ విల్ టేక్ మ్యాన్‌హట్టన్', నాటకం 'హామ్లెట్', టెలివిజన్స్ 'మనీ, పవర్, మర్డర్', 'ది లాస్ట్ టు గో', 'కాస్ట్ ఏ డెడ్లీ స్పెల్'లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
బుల్లితెర టు వెండితెర..
1990లో కొన్ని రోజులు స్టేజ్ డైరెక్టర్ ఆండ్రే గ్రెగరీతో కలిసి పలు నాటకాల్లోనూ నటించారు. అదే ఏడాది హర్రర్ కామెడీ 'టేల్స్ ఫ్రమ్ ది డార్క్ సైడ్: ది మూవీ' చిత్రంతో సినిమా రంగంలోకి అడుగిడారు. మమ్మీ బాధితురాలిగా నటించి మెప్పించారు. 1992లో నటించిన 'ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రాడిల్' చిత్రంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పేరు ప్రఖ్యాతులతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతోపాటు 'ది గన్ ఇన్ బెట్టీ లాస్ హ్యాండ్‌బ్యాగ్', ఎరోటిక్ థ్రిల్లర్ 'బాడీ ఆఫ్ ఎవిడెన్స్', జానీ డెప్తో కలిసి 'బెన్నీ అండ్ జూన్', హర్రీసన్ ఫోర్డ్, టామీ లీ జాన్స్లతో కలిసి 'ది ఫ్యూగిటివ్' చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించి తన నటనా పరిధిని విస్తరించుకున్నారు. 'అంకుల్ వన్యా' ప్రొడక్షన్లో ఫిల్మ్‌మేకర్ రాబర్ట్ ఆల్ట్‌మ్యాన్ మూర్ నటనకు ఇంప్రెసై తాను రూపొందించిన 'షార్ట్ కట్' చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో మూర్ అద్భుత నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. అవార్డులూ లభించాయి. ఈ సినిమా విజయంతో మూర్ గురించి చాలా మందికి తెలిసింది. ఆ తర్వాత ఏడాది 'వన్యా ఆన్ 42 స్ట్రీట్' చిత్రంలో నటించారు. మరోసారి ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. బోస్టన్ అవార్డును అందుకున్నారు. మెయిన్ హీరోయిన్గా 'సేఫ్' చిత్రంలో నటించారు. లో బడ్జెట్ చిత్రమిది. సినిమా కోసం చాలా వెయిట్ తగ్గారు.
తిరుగులేని అగ్ర కథానాయిక..
కామెడీ డ్రామా 'రూమ్మేట్స్' లో మరోసారి సపోర్టింగ్ రోల్లో కనిపించారు.ఆ తర్వాత 1995లో వచ్చిన 'నైన్ మంన్త్స్' మూర్‌ను హాలీవుడ్లో అగ్ర కథానాయికగా నిలబెట్టింది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. సిల్వెస్టర్ స్ట్టాలోన్, ఆంటోనియో బాండెరాస్లతో కలిసి నటించిన 'అస్సాసిన్స్', 'సర్వైవింగ్ పికాస్సో' చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ది లాస్ వరల్డ్: జురాసిక్ పార్క్' చిత్రం మూర్ కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారారు. ఈ సినిమా అప్పట్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. 1997లోనే మరో సినిమా 'ది మిత్ ఆఫ్ ఫింగర్‌ప్రింట్స్'లో, 'చికాగో క్యాబ్' చిత్రంలో గెస్ట్‌గా నటించి మెప్పించారు. దీంతోపాటు 'బూగీ నైట్స్' చిత్రంలోనూ నటించారు. ఇందులో ఉత్తమ నటిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1998లో 'ది బిగ్ లెబౌస్కీ', 'సైకో'చిత్రాలు నటిగా మూర్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1999లో ఏకంగా ఐదు సినిమాలు 'కూకీస్ ఫర్చూన్', 'యాన్ ఐడియల్ హస్బెండ్', 'ఏ మ్యాప్ ఆఫ్ ది వరల్డ్', 'ది ఎండ్ ఆఫ్ ది ఎఫైర్'లో నటించి ప్రేక్షకుల్ని మెస్మరేజ్ చేశారు. 2000లో 'ది లేడీస్ మ్యాన్' చిత్రంలోని కీలక పాత్రలో మెరిశారు. 2001లో నటించిన ''హన్నిబాల్', 'ఎవల్యూషన్', 'వరల్డ్ ట్రావెలర్', 'ది షిప్పింగ్ న్యూస్' చిత్రాలలో 'హన్నిబాల్' చిత్రం ఘన విజయాన్ని అందించింది. మిగిలిన సినిమాలు సమాంతర కథాంశంతో ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉండటంతో అంతగా ఆదరణ పొందలేకపోయాయి.
2002లో 'ఫార్ ఫ్రమ్ హెవెన్', 'ది హవర్స్' చిత్రాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2004లో 'మారీ అండ్ బ్రూస్' చిత్రంలో నటించారు. అంతేకాదు దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడూసర్గానూ పనిచేశారు.
దట్ ఈజ్ మూర్ అనేలా..
'లాస్ ఆఫ్ ఎట్రాక్షన్', 'ది ఫర్‌గటెన్', 'ట్రస్ట్ ది మ్యాన్', 'ది ప్రైజ్ విన్నర్ ఆఫ్ డెఫియన్స్, ఓహియో', 'ఫ్రీడమ్లాండ్', 'చిల్డ్రన్ ఆఫ్ మెన్', 'నెక్ట్స్', 'సావేజ్ గ్రేస్', 'ఐ యామ్ నాట్ థేర్', 'ఈగల్ ఐ', 'బ్లైండ్నెస్', 'ది ప్రైవేట్ లైవ్స్ ఆఫ్ పిప్పా లీ', 'ఏ సింగిల్ మ్యాన్', 'క్లోయి', 'ది కిడ్స్ ఆర్ ఆల్ రైట్స్ షెల్టర్', 'క్రేజీ, స్టూపిడ్, లవ్', 'బీయింగ్ ఫ్లైన్', 'వాట్ మెస్సీ న్యూ', 'డాన్ జాన్', 'ది ఇంగ్లీష్ టీచర్', 'క్యారీ', 'నాన్ స్టాప్', 'మ్యాప్స్ టు ది స్టార్స్', 'స్టిల్ ఎలైస్', 'ది హంగర్ గేమ్స్: మాకింగజరు- పార్ట్ 1', 'సెవెంత్ సన్', 2015లో ఫ్రీహెల్డ్', 'ది హంగర్ గేమ్స్: మాకింజరు -పార్ట్ 2', 'వండర్ స్ట్రక్', 'సుబర్బికాన్', 'కింగ్స్‌మ్యాన్: ది గోల్డెన్ సర్కిల్', 'గ్లోరియా బెల్' చిత్రాల్లోని భిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి దట్ ఈజ్ మూర్ అనిపించు కున్నారు. అంతేకాదు హాలీవుడ్లో తిరుగులేని కథానాయికగా స్థిరపడిపోయారు. ఇందులో కమర్షియల్ సినిమాలతో పాటు పలు ఇండిపెండెంట్ చిత్రాలు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆమె 'బెల్ కాంటో', 'ది ఉమెన్ ఇన్ ది విండో', 'ఆఫ్టర్ ది వెడ్డింగ్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాఠకులు మెచ్చిన రైటర్..
మూర్ నటిగానే కాదు, రైటర్‌గానూ హలీవుడ్లో పాపులర్ అయ్యారు. ఎక్కువగా బాలలకు సంబంధించిన పుస్తకాలు రాశారు. మొదటి ప్రయత్నంగా 'ఫ్రెక్లెఫేస్ స్ట్రాబెర్రీ' పేరుతో 2007లో విడుదల చేసిన పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. అప్పట్లో ఈ పుస్తకాన్ని బెస్ట్ సెల్లర్‌గా న్యూయార్క్ టైమ్స్ వర్ణించింది. అత్యంత సరళమైన భాషలో ఆద్యంతం ఆకట్టుకునే సెమీ ఆటోబయోగ్రాఫికల్ కథలను రాశారు. ఇందులో బాలికల కథలే ఎక్కువగా ఉండటం మరో విశేషం. వీటికి మంచి ఆదరణ లభించడంతో ఈ సిరీస్‌లో ఆరు పుస్తకాలు 'ఫ్రీక్లేఫేస్ స్ట్రాబెర్రీ అండ్ ది డాడ్డ్బాల్ బుల్లి' (2009), 'ఫ్రీక్లేఫేస్ స్ట్రాబెర్రీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్' (2011), 'మై మామ్ ఈజ్ ఏ ఫారెనర్, 'బట్ నాట్ టు మీ' (2013), 'ఫ్రీక్లెఫేస్ స్ట్రాబెర్రీ: బ్యాక్‌ప్యాక్స్' (2015), 'ఫ్రీక్లెఫేస్ స్ట్రాబెర్రీ : లంచ్, ఆర్ వాట్స్ దట్?' (2015), 'ఫ్రీక్లెఫేస్ స్ట్రాబెర్రీ: లూస్ టూత్' (2016), 'ఫ్రీక్లెఫేస్ స్ట్రాబెర్రీ అండ్ ది రియల్లీ బిగ్ వాయిస్' (2016) పుస్తకాలు రాసి రైటర్‌గా గొప్ప పేరు సంపాదించారు. అయితే చివరి బుక్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు.
అవార్డులు..ఘనతలు
దాదాపు రెండు దశాబ్దాల సినీ జీవితంలో మూర్కు ఎన్నో అవార్డులు, ఘనతలు దక్కాయి. 'స్టిల్ ఎలైస్' చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అలాగే 'బూగీ నైట్స్', 'ది ఎండ్ ఆఫ్ ది ఎఫైర్', 'ఫార్ ఫ్రమ్ హెవెన్', 'ది హవర్స్' చిత్రాలనుగానూ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఇక 'స్టిల్ ఎలైస్' చిత్రానికి బ్రిటీష్ అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతోపాటు అనేక ఇతర అవార్డులు దక్కాయి. అలాగే అనేక టెలివిజన్ పురస్కారాలు సైతం ఆమెను వరించాయి. వాణిజ్య తరహా, ఆర్ట్ సినిమా తరహా వైవిధ్యాన్ని ఒకే సినిమాలో చూపించగలరని పలు హాలీవుడ్ పత్రికలు ప్రశంసించాయి. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావితం చేయగల వంద మంది వ్యక్తుల్లో మంచి స్థానాన్ని సంపాదించారు.
ఒడిదుడుకుల వ్యక్తిగత జీవితం..
నాస్తికురాలైన జూలియన్నే మూర్ నటుడు, స్టేజ్ డైరెక్టర్ జాన్ గౌల్డ్ రుబిన్ను తొలుత పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో వీరు 1993లో విడిపోయారు. చిన్న వయసులో పెళ్ళి చేసుకోవడం వల్ల ఆ వివాహాన్ని నిలుపుకోలేకపోయానని మూర్ పలు సందర్భాల్లో తెలిపారు. ఆ తర్వాత 'ది మిత్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్' సినిమా చిత్రీకరణ టైమ్‌లో దర్శకుడు బార్ట్ ఫ్రెండ్లిచ్తో సహ జీవనం చేశారు. వీరికి కుమారుడు కలెబ్ ఫ్రెండ్లిచ్, కుమార్తె లివ్ ఫ్రెండ్లిచ్ ఉన్నారు. ఆ తర్వాత 2003లో వీరు అధికారికంగా వివాహం చేసుకున్నారు. రాజకీయంగాను మూర్ క్రియాశీలకంగా పనిచేశారు. 2008, 2012లో బరాక్ ఒబామాకు సపోర్ట్ చేశారు. గేల హక్కుల కోసం, గన్ కల్చర్‌ను నియంత్రించడానికి ఉద్యమం చేశారు. 'సేవ్ ది చిల్డ్రన్' నినాదానికి అంబాసిడర్‌గా వ్యవహరించారు.
వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో సాగినప్పటికీ వృత్తిగత జీవితం మాత్రం తనకెంతో సంతృప్తినిచ్చిందని, అద్భుతమైన విలక్షణ నటిగా ప్రేక్షక లోకం తనని గుర్తించడాన్ని అత్యంత ప్రత్యేకంగా, గౌరవంగా, గర్వంగా భావిస్తానని మూర్ చెప్పారు.
విలక్షణ పాత్రలకు ప్రేక్షకులు ఫిదా..
ఈ జనరేషన్లో అత్యంత ప్రతిభావంతమైన నటిగా జూలియన్నే మూర్ని అభివర్ణించారు. యాభై ఏండ్ల వయసులో ప్రామినెంట్ పాత్రల్లో నటించడమనేది కథానాయికల విషయంలో చాలా అరుదుగా ఉంటుంది. అయితే మూర్ ఇప్పటికీ కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. భారీ బడ్జెట్ చిత్రాల్లోనే కాదు, తక్కువ బడ్జెట్ చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నట విలక్షణతను చాటుకున్నారు. అలాగే సమాంతర (పార్లల్) సినిమానూ ప్రోత్సహించారు. సంఘర్షణ పడే మహిళా పాత్రల్లో మూర్ అధికంగా నటించారు. హుందాతనంతో కూడిన హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేయటం మూర్ ప్రత్యేకత. పాత్రల డిమాండ్ మేరకు నగంగానూ నటించారు. '90% నటనను నేను సెట్లోనే కనుకొన్నాను. పాత్రల నుంచే నాలోని నటనను బయటికి తీసుకు రాగలిగాను' అని మూర్ తెలిపారు.
ఈ ఏడాది విడుదలైన 'గ్లోరియా బెల్' చిత్రంలో యాభై ఏండ్ల వయసులో ప్రేమను కోరుకునే మహిళగా టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకున్నారు. యాక్షన్ స్పై కామెడీ చిత్రం 'కింగ్స్‌మ్యాన్: ది గోల్డెన్ సర్కిల్' చిత్రంలో వరల్డ్ డ్రగ్ డీలర్ వ్యవస్థాపకురాలుగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించారు. ఇందులో అద్భుతమైన యాక్షన్‌తో మైమరపించారు. బ్లాక్ కామెడీ డ్రామా 'సుబుర్బికాన్' చిత్రంలో కవలలుగా పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించి తన నటనా వైవిధ్యాన్ని చాటారు. అమెరికన్ మిస్టరీ డ్రామా చిత్రం 'వండర్ స్టక్' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఓ పాత్రలో మూగ పాత్రాభినయం చేశారు. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ చిత్రం 'ది హంగర్ గేమ్స్: మాకింగ్జరు-పార్ట్ 1, పార్ట్ 2'లో రెబల్ నాయకురాలు ప్రెసిడెంట్ అల్మా కాయిన్ పాత్రలో మెప్పించారు. పోరాట ఘట్టాల్లో మెస్మరైజ్ చేశారు. మూర్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టి హాలీవుడ్లో తిరుగులేని స్టార్‌ని చేశాయి.
ఇదిలా ఉంటే, మూర్‌ను విలక్షణ నటిగా అగ్ర స్థానంలో నిలబెట్టిన మరో చిత్రం 'స్టిల్ ఎలైస్'. ఇండిపెండెంట్ డ్రామా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా అద్భుత నటనతో ప్రేక్షక హృదయాలనే కాదు, ఆస్కార్ జ్యూరీ మనసుల్ని కొల్లగొట్టి ఆస్కార్‌ను అందుకున్నారు. మరో ఇండిపెండెంట్ సెటైరికల్ డ్రామా చిత్రం 'మ్యాప్స్ టు ది స్టార్స్'లో ఫేడౌట్ అయిన లెజెండరీ నటిగా మెప్పించారు. విమాన ప్రయాణం నేపథ్యంలో సాగే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ 'నాన్‌స్టాప్'లో ఓ ప్రయాణికురాలిగా కీలక పాత్ర పోషించారు. ఇక సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం 'క్యార్రీ' చిత్రంలో లైఫ్‌లో డిస్టర్బ్ అయిన, ఒంటరిగా ఉన్న తల్లిగా భావోద్వేగాన్ని పంచగా, రొమాంటిక్ కామెడీ 'ది ఇంగ్లీష్ టీచర్' చిత్రంలో ఇంగ్లీష్ టీచర్‌గా తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. మరో కామెడీ చిత్రం 'డాన్ జాన్'లో వయసు మళ్ళిన మహిళగా అలరించారు. డ్రామా చిత్రం 'వాట్ మైసీ న్యూ' చిత్రంలో రాక్ బ్యాండ్ సింగర్‌గా, ఆరేండ్ల పాపకు తల్లిగా వైవిధ్యమైన నటన కనబరిచారు. 'బీయింగ్ ఫ్లైన్' చిత్రంలో సంఘర్షణ ఎదుర్కొనే తల్లిగా దిగ్గజ నటుడు రాబర్ట్ డీ నీరోతో కలిసి నటించారు. రొమాంటిక్ కామెడీ చిత్రం 'క్రేజీ స్టుపిడ్ లవ్' చిత్రంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళగా నటించారు. హర్రర్ ప్రధానంగా రూపొందిన 'షెల్టర్' చిత్రంలో సైకాలజిస్ట్ డాక్టర్‌గా, భర్తను కోల్పోయిన మహిళగా అత్యద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు. కామెడీ డ్రామా 'ది కిడ్స్ ఆర్ ఆల్ రైట్స్' చిత్రంలో లెస్బియన్‌గా తన నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
పాత్ర ఏదైనప్పటికీ నూటికి నూరుపాళ్ళు ఆ పాత్రకి జీవం పోయటం మూర్ స్పెషాలిటీ. మూర్ పోషించిన అత్యద్భుతమైన విలక్షణ పాత్రలకు యావత్ ప్రేక్షకలోకం ఫిదా అయిపోయిందంటే ఆశ్చర్యం లేదు.
Authorization