హా జీ వోన్..
అద్భుతమైన అందం, అత్యద్భుమైన అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన సౌత్ కొరియన్ స్టార్ కథానాయిక. అన్నింటికి మించి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ. అవయవదానంపై అందరిలోనూ విస్తృత అవగాహన కల్పిస్తున్న సామాజిక సేవకురాలు.
భిన్న పాత్రలు, సినిమాలతో అటు వెండితెర ప్రేక్షకులను, వైవిధ్యమైన టెలివిజన్ సిరీస్‌లతో ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న క్రేజీ కథానాయిక హా జీ వోన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
వంద సార్లు ఫెయిల్ అయినప్పటికీ..
హా జీ వోన్ అసలు పేరు జియోన్ హీ రిమ్. దక్షిణ కొరియాలోని సియాల్ పట్టణంలో 1978 జూన్ 28న జన్మించారు. సినిమాల్లో రాణించాలనేది వోన్ చిన్ననాటి కల. డంకాక్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. హైస్కూల్ చదువుకునే సమయంలోనే అవకాశాల కోసం పలు ఏజెన్సీలకు, స్టూడియోస్కి తన ఫొటోలను, ప్రొఫైల్ పంపించారు. దాదాపు వంద ఆడిషన్స్ ఇచ్చారు. అన్నింటిలోనే ఫెయిలే. దీంతో సినిమా ఛాన్స్ కలగానే మిగిలిపోయింది. తన మేనేజర్ ఇచ్చిన సలహా మేరకు హా జీ వోన్గా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రయత్నాల ఫలితంగా 1996లో టీనేజ్ డ్రామా నేపథ్యంలో సాగే 'నూ జనరేషన్ రిపోర్ట్: అడల్ట్స్ డోంట్ అండర్‌స్టాండ్ అజ్' టెలివిజన్ సీరియల్లో నటించారు. ఆ తర్వాత 'డ్రాగన్స్ టీయర్స్', 'డేంజరస్ లుల్లబై' వంటి సీరియల్స్‌లో ట్రబుల్డ్ టీనేజ్ గర్ల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
అతికష్టమ్మీద దక్కిన తొలి సినిమా ఛాన్స్..
2000లో తొలిసారి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'ట్రూత్ గేమ్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ నటుడు అహాన్ సంగ్ కీ హీరోగా నటించిన ఈ సినిమాలో వోన్ కథానాయికగా ఎంపిక అంతా ఆషామాషిగా జరగలేదు. దాదాపు 1500 మందిని విభిన్న కోణాల్లో ఆడిషన్ చేశాక ఫైనల్‌గా వోన్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఆమె నటించిన బైపోలార్ క్యారెక్టర్‌కు గ్రాండ్ బెల్ అవార్డు, బుసాన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు లభించాయి. అదే ఏడాది ప్రముఖ సౌత్ కొరియన్ దర్శకుడు అహాన్ బైయాంగ్ కీ దర్శకత్వంలో రూపొందిన 'నైట్మేర్' చిత్రంలో కథానాయికగా నటించారు. అలాగే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ చిత్రం 'డిట్టో'లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో సపోర్టింగ్ రోల్కిగానూ బ్లూ డ్రాగన్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'డిట్టో' చిత్రంలో నటించిన హీరో కిమ్ హ నియుల్తోనే కలిసి టెలివిజన్ సీరియల్ 'సీక్రెట్'లో ప్రతినాయిక పాత్రను పోషించారు. అందుకుగానూ ఉత్తమ నటిగా ఎంబీసీ డ్రామా అవార్డు దక్కించుకున్నారు. అలాగే బీయాక్కింగ్ ఆర్ట్స్ అవార్డుతోపాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరో టెలివిజన్ సిరీస్ 'బ్యూటిఫుల్ లైఫ్', అలాగే ప్రముఖ యువ నటుడు జి సంగ్‌తో కలిసి 'డేస్స్ ఇన్ ది సన్' టెలివిజన్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. రెండేండ్ల గ్యాప్‌తో మరోసారి దర్శకుడు అహాన్ బైయాంగ్ కీతో కలిసి హర్రర్ చిత్రం 'ఫోన్'లో కథానాయికగా నటించారు. ఈ సినిమా కొరియాలోనే కాదు, ఇటలీలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదే ఏడాది ప్రముఖ దర్శకుడు యూన్ జీ క్యూన్ దర్శకత్వంలో 'సెక్స్ ఈజ్ జీరో' చిత్రంలో పాపులర్ నటుడు ఇమ్ చాంగ్ జంగ్ సరసన నటించారు. ఈ సినిమా 2002లో విడుదలై అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూడవ సినిమాగా నిలిచింది.
మలుపు తిప్పిన డెమో సినిమా
అప్పటి వరకు నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న హా జీ వోన్కు 2003లో వచ్చిన 'డెమో' చిత్రం మంచి బ్రేక్‌నిచ్చింది. అత్యధిక ప్రేక్షకులు చూసిన సినిమాగా నిలిచి వోన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో పోలీస్ డిటెక్టివ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతోపాటు ఎంబీసీ డ్రామా అవార్డు లభించింది. 2003లో వచ్చిన ప్రేమ కథా చిత్రం 'రివర్సల్ ఆఫ్ ఫర్చూన్' కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2004లో స్టార్ హీరో కిమ్ జీ వాన్ సరసన '100 డేస్ విత్ మిస్టర్ ఎరగంట్' చిత్రంలో నటించారు. అదే ఏడాది మరో టాప్ హీరో వాన్ సాంగ్ వూతో కలిసి రొమాంటిక్ కామెడీ 'లవ్, సో డివైన్'లో నటించారు. 2005లో వచ్చిన 'డాడీ లాంగ్ లెగ్స్' చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ పోషించారు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ చిత్రంలో నటిగా విశేష మెప్పుపొందడమే కాదు తనదైన నటనతో సినిమాను విజయపథంలో నడిపించారు. అదే ఏడాది మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా రూపొందిన 'డ్యూలిస్ట్' చిత్రంలో హీరోయిన్గా నటించారు. ఇందులో అగ్ర నటుడు కాంగ్ డాంగ్ వాన్తో కలిసి నటించడం ఓ విశేషమైతే, మరో జాతీయ నటుడు అహాన్ సంగ్కితో కలిసి తెరను పంచుకోవడం మరో విశేషం. 2007లో బాక్సింగ్ ప్రధానంగా తెరకెక్కిన 'మిరాకిల్ ఆన్ ఫస్ట్ స్ట్రీట్' వోన్‌ను విలక్షణ నటిని చేసింది. ఈ సినిమాతో నటిగా బాగా పాపులర్ అయ్యారు. 2008లో ఆమె నటించిన 'మిరాకిల్ ఆఫ్ ఏ గివింగ్ ఫూల్' చిత్రం, డిజాస్టర్ ప్రధానంగా 2009లో వచ్చిన 'టైడల్ వేవ్' చిత్రాలు భారీ విజయాల్ని సొంతం చేసుకుని నటిగా హా జీ వోన్‌ను మరో మెట్టు ఎక్కించాయి. అదే ఏడాది చేసిన 'క్లోజర్ టు హెవెన్' కూడా మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.
వరుస విజయాలతో అంతర్జాతీయ ఖ్యాతి..
'సెక్టర్ 7' చిత్రం చైనాలో ఘన విజయం సాధించి వోన్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టింది. కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఆమె నటించిన 'యాజ్ వన్', 'ది హంట్రెస్స్స్', 'క్రానికల్ ఆఫ్ ఏ బ్లడ్ మర్చెంట్', 'లైఫ్ రిస్కింగ్ రొమాన్స్' చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్స్‌గా నిలవడంతో సౌత్ కొరియాలో అగ్ర కథానాయికగా, స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గతేడాది వచ్చిన 'మ్యాన్‌హంట్' సినిమా కొరియాలోనే కాదు, చైనాలోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయంగా వోన్ మరింత బాగా పాపులర్ అయ్యారు.
దీంతోపాటు 'ఆల్ ఫర్ లవ్', 'సెక్స్ ఈజ్ జీరో 2', 'హిజ్ లాస్ గిఫ్ట్' చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు.
బుల్లితెర ప్రేక్షకులనూ మెస్మరైజ్ చేసిన కథానాయిక..
రాజుల వద్ద ఆడిపాడుతూ వారిని ఎంటర్టైన్ చేసే నర్తకి హావాంగ్ జిని జీవితాన్ని ఆధారంగా రూపొందిన పీరియాడిక్ డ్రామా టెలివిజన్ సిరీస్ 'హవాంగ్ జిని'లో మెయిన్ లీడ్‌గా నటించారు. 'సీక్రెట్ గార్డెన్', 'ది కింగ్ 2 హార్ట్స్', 'ఎంప్రెస్ కి', 'ది టైమ్ వి వర్ నాట్ ఇన్ లవ్', 'హాస్పిటాలిటీ షిప్', 'ప్రొమెథెస్ : వార్ ఆఫ్ ఫైర్' వంటి సిరీస్‌ల్లో నటించి టీవీ రంగంలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాగే 'టీవీ ఎంటర్టైన్ మెంట్ టునైట్', 'గో గో విత్ సిస్టర్', 'గాలిలియో: అవేకెన్డ్ యూనివర్స్' వంటి షోస్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వోన్ రైటర్‌గా కూడా. 'ఎట్ దిస్ మూమెంట్', 'హా జీ వోన్స్ సీక్రెట్' పేరుతో రెండు పుస్తకాలు రాశారు. 'మదర్స్ డైరీ' పేరుతో రూపొందించిన సాంగ్‌తోపాటు 'హోమ్ రన్' ఆల్బమ్తోపాటు మరో రెండు సింగిల్స్‌లోనూ నటించారు. 'యు ఆర్ జోయి' అనే సాంగ్‌ను సొంతంగా రాశారు. 'హేవాడాల్ ఎంటర్టైన్మెంట్' పేరుతో సొంతంగా సినిమా ఎజెన్సీని ప్రారంభించారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర..
షూటింగ్లో గాయపడి ఎడమకన్ను దెబ్బతినడంతో ఒక డోనర్ తన కార్నియాను వోన్కి డోనేట్ చేశాడు.అప్పట్నుంచి అవయవదానంపై విస్తృత ప్రచారం చేశారు. పేద, వికలాంగ పిల్లలకు సాయం చేసేందుకు 'స్మైల్ ఫౌండేషన్' పేరుతో ఓ డొనేషన్ కంపెనీని రన్ చేశారు. 2012లో తాను రాసిన 'ఎట్ దిస్ మూమెంట్' పుస్తకం అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి అందజేశారు.
పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, చెవిటి, అంధుల ట్రీట్మెంట్కు సాయం చేశారు. 2016లో ఫెర్రీ విపత్తు బాధితులకు 100 మిలియన్ వోన్స్ డొనేట్ చేశారు. వోన్ చేసిన సేవా కార్యక్రమాలకుగానూ మూడు ప్రధానమంత్రి అవార్డులు, ఒక లేడీ 9 అవార్డు అందుకున్నారు. కొరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్ బెల్ అవార్డు, మూడు బ్లూ డ్రాగన్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఎంబీసీ డ్రామా అవార్డులు, ఎనిమిది బీక్సాంగ్ ఆర్ట్ అవార్డులతోపాటు అనేక ఇతర పురస్కారాలు వరించాయి.
విలక్షణ నటనకు వెండితెర రూపాలు..
దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్లో భిన్నమైన పాత్రలు చేసి హా జీ వోన్ ప్రేక్షకుల్ని విశేషంగా మెప్పించారు. ఏడుగురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు ఓ మిస్టరీ వల్ల చనిపోవడమనే ఇతివృత్తంతో హర్రర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'నైట్మేర్' చిత్రంలో ఏడుగురిలో ఒకరిగా ఆకట్టుకున్నారు. రెండు విభిన్న కాలాలు 1979, 2000లో ఇద్దరు విద్యార్థులు ఒకేలాంటి పరిస్థితులను ఎదుర్కొనడం, ఇద్దరూ ఒకే రేడియోలో మాట్లాడుకోవడమనే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డిట్టో'. ఇందులో వోన్ 1979లోని విద్యార్థినిగా విభిన్న భావోద్వేగాలను పలికించి ఆకట్టుకున్నారు. ఆధిపత్యం, దయ్యాల వల్ల ఓ ప్రేమ జంట ఎలాంటి క్లిష్టపరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొందనే ఇతివృత్తంతో రూపొందిన హర్రర్ సినిమా 'ఫోన్'. ఫోన్ కాల్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో జర్నలిస్ట్‌గా, విభిన్న భయానక ఫోన్ కాల్స్ ఎదుర్కొనే మహిళగా సంఘర్షణ ఎదుర్కొనే పాత్రలో వోన్ తనదైన విలక్షణ నటనతో అబ్బుర పరిచారు. ఓ యూనివర్సిటీ విద్యార్థుల అల్లరి, గొడవ, స్టడీ ఇలా విభిన్న అంశాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'సెక్స్ ఈజ్ జీరో'. ఇందులో ఇద్దరు సీనియర్ కుర్రాళ్ళకు, జూనియర్ అమ్మాయికి మధ్య ప్రేమ సాగే తీరు ఆద్యంతం ఆసక్తికరం. వోన్ జూనియర్ విద్యార్థినిగా గ్లామర్, అభినయం, అల్లరి నటనతో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ చిత్రం 'లవ్ సో డివైన్' చిత్రంలో ప్రియుడి కోసం అమెరికా అంతా వెతికే అమ్మాయిగా తనదైన నటనతో అలరించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా 'డాడీ లాంగ్ లెగ్స్' చిత్రంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా, ఎన్నో అవరోధాలు, మానసిక సంఘర్షణ ఎదుర్కొనే అమ్మాయి పాత్రలో హృదయాన్ని హత్తుకునే నటనతో మైమరపించారు.
మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా రూపొందిన 'డ్యూలిస్ట్' చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ యోధురాలిగా,
డిటెక్టివ్ పాత్రలో ఒళ్లుగగుర్పొడిచే యాక్షన్‌తో మంత్రముగ్దుల్ని చేశారు. ఓ గ్యాంగ్‌స్టర్‌ను మంచి వ్యక్తిగా మార్చే కథాంశంతో కామెడీ డ్రామాగా రూపొందిన 'మిరాకిల్ ఆన్ ఫస్ట్ స్ట్రీట్' చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌ను మంచిగా మార్చే బాక్సర్‌గా వోన్ నటించిన తీరు ఆద్యంతం అద్భుతం. మెంటల్లీ ఛాలెంజ్డ్ కుర్రాడి స్వచ్ఛమైన ప్రేమను తెలిపే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'మిరాకిల్ ఆఫ్ గివింగ్ ఫూల్' చిత్రంలో పియానిస్ట్‌గా, మానసిక సమస్యతో బాధపడుతున్న కుర్రాడికి ప్రేమికురాలిగా వోన్ మెస్మరైజ్ చేశారు. 2004లో వచ్చిన సునామి ఇతివృత్తంతో రూపొందిన మొదటి కొరియన్ డిజాస్టర్ చిత్రం 'టైడల్ వేవ్'లో ప్రేమ జంటగా నటించి ఆకట్టుకుంది.సముద్రంలో ఓ భయంకరమైన వింత జంతువుతో పోరాడే ఆయిల్ సిబ్బంది కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ హర్రర్ చిత్రం 'సెక్టర్ 7'లో వింత జంతువుతో పోరాడే సైనికురాలిగా వోన్ తనదైన యాక్షన్‌తో మెప్పించారు. 1991లో టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించిన కొరియన్ టీమ్ స్టోరీ ప్రధానంగా రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా 'యాజ్ వన్'లో క్రీడాకారిణిగా ఆకట్టుకున్నారు. హలీవుడ్ చిత్రం 'ఏ ఛార్లీస్ ఎంజెల్స్' ఆధారంగా యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా వచ్చిన 'ది హంట్రెసెస్' చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ యోధురాలిగా తనదైన యాక్షన్, కామెడీతో మంత్రముగ్దుల్ని చేశారు. రక్తాన్ని అమ్ముకుంటూ జీవనం సాగించే గ్రామీణ కుటుంబ స్థితుగతులను తెలిపే 'క్రానికల్ ఆఫ్ ఏ బ్లడ్ మర్చెంట్' చిత్రంలో గ్రామీణ అమ్మాయిగా నటించారు. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'లైఫ్ రిస్కింగ్ రొమాన్స్' చిత్రంలో సీరియల్ కిల్లర్‌పై మిస్టరీ నవల రాసే రైటర్‌గా అలరించారు.
క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మ్యాన్‌హంట్' చిత్రంలో హత్యలు చేసే
నేరస్థురాలిగా నటించారు.
Authorization