ఫ్యాన్ బింగ్ బింగ్..
అగ్ర కథానాయకులకు దీటుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న చైనీస్ స్టార్ హీరోయిన్. గ్లామర్‌తో పాటు విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు, కమర్షియల్ టెలివిజన్ సిరీస్‌లతో అటు వెండితెర ప్రేక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న క్రేజీ కథానాయిక. హృద్రోగ సంబంధిత జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు భారీ ఆర్థిక సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్న ఫ్యాన్ బింగ్ బింగ్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
టెలివిజన్ సిరీస్‌లతో నట ప్రస్థానం ఆరంభం..
ఫ్యాన్ బింగ్ బింగ్ 1981 సెప్టెంబర్ 16న చైనాలోని షాండాంగ్ పట్టణంలో క్వింగ్డావో ప్రాంతంలో జన్మించారు. తల్లి జాంగ్ చునామి, తండ్రి ఫ్యాన్ టావో. షాంగైలోని గ్జీ జిన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. నటనపై ఆసక్తితో షాంగై థియేటర్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా తన 16 ఏండ్ల వయసులో టెలివిజన్‌లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. టెలివిజన్ సిరీస్ 'పవర్ఫుల్ ఉమెన్'లో చిన్న పాత్ర పోషించారు. 1999లో పాపులర్ సిరీస్ 'మై ఫెయిర్ ప్రిన్సెస్'లో నటించారు. ఇందులో వచ్చిన రెండు సీజన్స్‌లోనూ ఆమె నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు మంచి పేరు సంపాదించారు. దీంతో ఆమెకు ఓ భారీ ఆఫర్ వచ్చింది. చియుంగ్ యావో కంపెనీ ఆమెతో ఎనిమిదేండ్ల కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఆ సంస్థ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోవడంతో ఫ్యాన్ టైమ్ వృథా అయ్యింది. దాన్నుంచి తప్పుకున్నారు. అందుకుగానూ సదరు కంపెనీ ఫ్యాన్‌పై మిలియన్ యేన్స్(చైనా కరెన్సీ) పరువు నష్టం దావా వేశారు. అయితే చిన్న వయసులో ఒప్పందం కుదుర్చుకోవడం సరైనది కాదని కేవలం రెండు లక్షలు మాత్రమే ఫ్యాన్ చెల్లించేలా కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత 2000లో ఫ్యాన్ కాస్టింగ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. 'హుయి బ్రదర్స్' అనే ఎంటర్టైన్మెంట్ కంపెనీకి మేనేజర్ వాంగ్ జింగ్హువాతో ఆరేండ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ టైమ్‌లో చాలా టెలివిజన్స్ చేశారు. 2001లో 'యంగ్ జస్టిస్ బావో 11', 'రెండ్ పప్పీస్', 'ది ప్రౌడ్ ట్విన్స్' వంటి మొత్తంగా 17 టెలివిజన్ సీరియల్స్ చేశారు.
కెరీర్‌ని మలుపు తిప్పిన సెల్‌ఫోన్ సినిమా..
టెలివిజన్ సిరీస్‌లతో ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. 2001లోనే 'రీ యూనియన్' చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఓ రకంగా నటిగా సినీ తెరంగేట్రం చేసిన చిత్రమది. 2002లో 'ఫాల్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది వచ్చిన 'ది లయన్ రోర్స్' చిత్రం ఫ్యాన్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2003లో విడుదలైన 'డ్రాగన్ లాస్ 1:ది అండర్‌కవర్' చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. ఈ ఏడాది విడుదలైన 'సెల్ ఫోన్' భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ ఏడాది చైనాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తన నటనకుగానూ ఉత్తమ నటిగా హండ్రెడ్ ఫ్లవర్స్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో ఫ్యాన్ క్రేజీ కథానాయికగా మారారు. వరుసగా 'ది ట్విన్స్ ఎఫెక్ట్ 2', 'ఏ చైనీస్ టాల్ స్టోరీ', 'ఏ బ్యాటిల్ ఆఫ్ విట్స్' చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు.
వరుస విజయాలతో స్టార్ ఇమేజ్..
2007లో 'హుయి బ్రదర్స్' కంపెనీ నుంచి బయటకు వచ్చి సొంతంగా 'ఫ్యాన్ బింగ్‌బింగ్ స్టూడియో'ని స్థాపించారు. 2007లో ఎనిమిది సినిమాల్లో నటించారు. అందులో 'ది మాట్రిమోనీ' చిత్రానికిగానూ గోల్డెన్ హార్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'ది మ్యాట్రిమోనీ'తోపాటు 'లాస్ట్ఇన్ బీజింగ్' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. దీంతో చైనీస్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో 'కుంగ్ ఫు హిప్ హాప్', 'హోమ్ రన్', 'డిజైర్స్ ఆఫ్ ది హార్ట్' చిత్రాల్లో నటించగా, 'డిజైర్స్ ఆఫ్ ది హార్ట్' చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 2009లో వరుసగా నాలుగు చిత్రాలు 'షింజుకు ఇన్సిడెంట్', 'సోషియా రివేంజ్', 'వీట్', 'బాడీగాడ్స్ అండ్ అస్సాసిన్స్'లలో నటించగా నాలుగూ భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఫ్యాన్‌ను అగ్ర నటిని చేశాయి. 2010లో నటించిన హిస్టారికల్ ఎపిక్ 'సాక్రిఫైస్' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. అదే ఏడాది వచ్చిన 'ఫ్యూచర్ ఎక్స్ కాప్స్', 'ఈస్ట్ విండ్ రైన్', 'చాంగ్క్వింగ్ బ్లూస్' చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. 2011లో ఆమె నటించిన చిత్రాలు ఫ్యాన్ జీవితాన్నే మార్చేశాయి. 'స్ట్రెచ్', 'షావోలిన్', 'బుద్దా మౌంటేన్', 'ది ఫౌండింగ్ ఆఫ్ ఏ పార్టీ', 'మై వే', అలాగే 2012లో నటించిన 'డబుల్ ఎక్స్పోజర్', 'లాస్ట్ ఇన్ థాయిలాండ్' చిత్రాలు ఘన విజయాలను నమోదు చేసుకుని ఫ్యాన్‌కు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు, పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాదు హాలీవుడ్లో ఛాన్స్‌లు దక్కేలా చేశాయి. 'బుద్దా మౌంటేయిన్' చిత్రం టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్లో, 'మై వే' సినిమా కేన్స్, టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నాయి. ఇక 90వ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాల సమయంలో 'షావోలిన్' విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ ఏడాది పొందిన సక్సెస్‌లతో ఫోర్బ్స్ ప్రకటించిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఫ్యాన్ నిలవడం విశేషం.
హాలీవుడ్‌లోనూ తనదైన మార్క్..
అంతకుముందు వచ్చిన విజయాలతో హాలీవుడ్ పాపులర్ సిరీస్ 'ఐరన్ మ్యాన్ 3'లో నటించే అవకాశం ఫ్యాన్‌కి లభించింది. 2013లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ చిత్రాల్లో మోస్ట్ క్రేజీయస్ట్ సిరీస్‌ల్లో ఇదొకటి. ఇందులో ఆమె నటించినది చిన్న పాత్రే అయినా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా 'ఎక్స్‌మెన్: డేస్స్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్', 'ది పీనట్స్ మూవీ', 'డిస్పికేబుల్ మీ 3' వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి అక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అత్యద్భుతమైన అభినయంతో హాలీవుడ్‌లోనూ తనదైన మార్క్‌తో ప్రేక్షకుల్ని అలరించారు. హాలీవుడ్ సినిమాలు చేస్తూనే చైనా చిత్రాల్లోనూ నటించి అలరించారు. ఆ తర్వాత వరుసగా 'ది వైట్ హైర్డ్ విచ్ ఆఫ్ ల్యునర్ కింగ్డమ్', 'లేడీ ఆఫ్ ది డైనాస్టీ', 'ఎవర్ సిన్స్ విరు లవ్', 'స్కిప్‌ట్రేస్', 'లీగ్ ఆఫ్ గాడ్స్', 'ఐ యామ్ నాట్ మాడమె బోవరి', 'లెజెండ్ ఆఫ్ రావాగింగ్ డైనాస్టీస్', 'స్కైహంటర్', 'ది లేడీ ఇన్ ది పొట్రెయిట్', 'ది ఫేసెస్ ఆఫ్ మై గెనె' చిత్రాల్లో నటించి నటిగా తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం 'ది పర్ఫెక్ట్ బ్లూ', 'సెల్‌ఫోన్ 2', '355', 'ది కింగ్స్ డాటర్', 'వైట్ స్పారో' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
విశేష శ్రోతకాదరణ పొందిన పాప్ సింగర్..
2008లో ఫ్యాన్ బీజింగ్‌లో ఆర్ట్ స్కూల్‌ను ప్రారంభించారు. దీనికి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తూ, నిర్వహణ బాధ్యతలను తన తల్లిదండ్రులకు అప్పగించారు. వెస్ట్ మూవీ గ్రూప్ ఆర్ట్ సెంటర్‌కి ఫ్యాన్ లీడర్‌గా వ్యవహరించారు. తన ప్రొడక్షన్లో 'రోగ్ స్నో' అనే టెలివిజన్‌ను రూపొందించారు. అందులో కూడా నటించారు. చైనాకు చెందిన లెజెండరీ డాన్సర్ బాయి గ్జియాన్యంగ్ జీవితం ఆధారంగా 'ది లాస్ట్ నైట్ ఆఫ్ మేడమ్ చిన్' పేరుతో ఓ టెలివిజన్ సిరీస్‌ను రూపొందించారు. దీంతోపాటు 'ది ఇంప్రెస్ ఆఫ్ చైనా' అనే మరో టెలివిజన్‌ను నిర్మించారు. ఈ రెండింటిలోనూ నటించారు. ఫ్యాన్ విశేష శ్రోతకాదరణ పొందిన పాప్ సింగర్ కూడా. ఫ్యాన్‌కి పాటలు పాడటం ఇష్టం. అంతకు ముందు ప్రైవేట్‌గా పాడినప్పటికీ 2005లో దాన్ని అధికారికం చేశారు. 'జస్ట్ బిగన్' పేరుతో ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్‌కు నిర్మాతగా, కంపోజర్‌గానూ పనిచేశారు. అప్పటి వరకు లేని ఓ వెరైటీ జోనర్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత సింగిల్స్ పాడటం, ఈవెంట్స్‌లో పాల్గొని మ్యూజిక్ షోస్ నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లోనూ ఫ్యాన్ ముందున్నారు. చెన్ లిజీతో కలిసి 'హార్ట్ అలీ' పేరుతో ఓ సంస్థను స్థాపించి, పుట్టుకతో హృదయ సంబంధిత జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయించారు. తరచు టిబెట్‌లో పర్యటిస్తూ హృదయ సంబంధ జబ్బులతో బాధపడుతున్న వెయ్యిమంది పిల్లలను గుర్తించి ఆపరేషన్స్ నిర్వహించారు. దీనికి అవసరమైన ప్రత్యేకమైన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఫ్యాన్ ఏర్పాటు చేశారు. షాంగై, టిబెట్ ప్రాంతాల్లో తన క్యాంపులు ఏర్పాటు చేసి విస్తృతమైన సేవలు అందిస్తున్నారు.
అవార్డులు, గౌరవాలు, వివాదాలు..
ఫ్యాన్ బింగ్ బింగ్ నటనకు అనేక పురస్కారాలు లభించాయి. 'సెల్ ఫోన్' చిత్రానికి హండ్రెడ్ ఫ్లవర్స్ అవార్డు', 'ది మ్యాట్రిమోని' చిత్రానికి గోల్డెన్ హార్స్ ఫిల్మ్ అవార్డు, 'లాస్ట్ ఇన్ బీజింగ్' చిత్రానికి యురాసియా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, 'బుద్దా మౌంటేయిన్' చిత్రానికి బీజింగ్ కాలేజ్ స్టూడెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఇలా అనే పురస్కారాలు ఆమెను వరించాయి. ఫ్యాన్ సినిమాలు ఎక్కువగా కేన్స్‌లో ప్రదర్శితమయ్యాయి. అంతేకాదు ఆమె లోరియల్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా పనిచేశారు. దీంతో ఇటీవల ప్రతిఏడాది కేన్స్‌లో మెరుస్తూ వీక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. ఆమె దుస్తులను విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియమ్ సేకరించి భద్రపరుస్తుంది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లోనూ ఫ్యాన్ మైనపు విగ్రహాన్ని ఉంచారు.64వ కేన్స్ ఫెస్టివల్లో ఆమె ధరించిన దుస్తులను వేలం పాట వేయగా వచ్చిన డబ్బును తన ఛారిటీ 'హార్ట్ అలీ'కి ఇచ్చేశారు. 2012లో ఉత్తమ దుస్తులు ధరించిన జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. అదే ఏడాది ఎస్వైర్ మేగజీన్ ప్రకటించిన ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎల్లీ అనే లైఫ్ స్టయిల్ మెగజీన్కు చెందిన స్టయిల్ అవార్డును సొంతం చేసుకున్నారు. పన్ను ఏగవేతదారుల జాబితాలో ఈ ఏడాది ఫ్యాన్ పేరు కూడా ఉంది. చైనా ప్రభుత్వానికి ఫ్యాన్ దాదాపు 129 మిలియన్ డాలర్ల ట్యాక్స్ కట్టాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్ గత కొన్ని నెలలుగా అజ్ఞాతంగా ఉంటున్నారు. అయినప్పటికీ చైనా ప్రభుత్వం ఆమెని ట్రేస్ చేసి కట్టాల్సిన ట్యాక్స్‌కి సంబంధించి వివరణ కోరింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టులో విచారణ కూడా జరుగుతోంది.
ప్రేక్షకుల్ని మెప్పించిన భిన్న పాత్రలు..
ఫ్యాన్ బింగ్‌బింగ్ అందంతోనే కాదు అద్భుతమైన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. విభిన్న పాత్రల్లో నటించి విశ్వ ప్రేక్షకులను అలరించారు. కంప్యూటర్ యానిమేటెడ్ మోషన్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా 'లెజెండ్ ఆఫ్ రావేజింగ్ డైనాస్టీస్1, 2' చిత్రాల్లో విభిన్న టెక్నికల్ శక్తులు కలిగిన పోరాట యోధురాలిగా ఆకట్టుకున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ చిత్రం 'ది ఫేస్ఆఫ్మై గెనె' చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ అయిన రైటర్‌కు పూర్వీకురాలిగా సరికొత్త పాత్రలో నటించి కనువిందు చేశారు. యుద్ధ ప్రధానంగా తెరకెక్కిన 'స్కై హంటర్' చిత్రంలో తీవ్రవాదుల గ్రూపును ఎదుర్కొనే చైనా సైనికురాలిగా ఫ్యాన్ నటన, ఆమె చేసే యాక్షన్ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటుంది. కామెడీ ప్రధానంగా రూపొందిన 'ఐ యామ్ నా మేడమె బోవరీ' చిత్రంలో గ్రామీణ కుటుంబానికి చెందిన అమ్మాయి, అమాయకత్వంతో కూడిన నటనతో నవ్వులు పూయించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. రొమాంటిక్ డ్రామా చిత్రం 'ది లేడీ ఇన్ ది పోట్రేయిట్' చిత్రంలో యువరాణిగా, పెయింటర్‌గా కనువిందు చేశారు. బడ్డీ కాప్ కామెడీ యాక్షన్ చిత్రం 'స్కిప్‌ట్రేస్' చిత్రంలో క్రైమ్ సిండికేట్‌కు చిక్కిన అందమైన అమ్మాయి పాత్రలో నటించారు. ఇందులో ఆమె జాకీ చాన్‌తో కలిసి నటించడం విశేషం. ఎపిక్ రొమాంటిక్ వార్ చిత్రం 'లేడీ ఆఫ్ ది డైనాస్టీ' సినిమాలో ప్రేమికురాలిగా నటించారు. మరో రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఎవర్ సిన్స్ విరు లవ్' చిత్రంలో సైతం భగ ప్రేమికురాలిగా ఆకట్టుకున్నారు. మార్షల్ ప్రధానంగా ఫాంటసీగా తెరకెక్కిన 'ది వైట్ హెయిర్డ్ విచ్ ఆఫ్ ల్యూనర్ కింగ్డమ్'లో టైటిల్ పాత్రలో మార్షల్ ఆర్ట్స్ యోధురాలిగా మెప్పించారు. తనదైన యాక్షన్‌తో మైమరపించారు. సూపర్ హీరో చిత్రం 'ఎక్స్‌మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్' చిత్రంలో పోర్టల్ క్రియేటర్‌గా, టెక్నీకల్ శక్తులు కలిగిన శక్తివంతమైన వారియర్‌గా నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ 'డబుల్ ఎక్స్పోజర్' చిత్రంలో సంఘర్షణ ఎదుర్కొనే అమ్మాయిగా మెప్పించారు. యుద్ధప్రధానంగా తెరకెక్కిన 'మై వే' చిత్రంలో చైనీస్ స్నిప్పర్గా నటించారు. 20వ శతాబ్దంలో చైనాలో నెలకొన్న పొలిటికల్ క్రైసిస్ నేపథ్యంలో తెరకెక్కిన 'ది ఫౌండింగ్ ఆఫ్ ఏ పార్టీ' చిత్రంలో అప్పటి నాయకురాలు ఇంప్రెస్ డౌగర్ లాంగ్యు పాత్రలో నటించారు. డ్రామా ప్రధానంగా వచ్చిన 'బుద్దా మౌంటేన్' చిత్రంలో ప్రేమికురాలిగా విభిన్న పాత్రలో ఆకట్టుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా తెరకెక్కిన 'షావోలిన్' చిత్రంలో యుద్ధ నాయకుడి భార్య పాత్రలో మెప్పించారు. ఇందులోనూ జాకీ చాన్ నటించారు. డ్రామా ప్రధానంగా తెరకెక్కిన 'స్ట్రెచ్' చిత్రంలో కీలక పాత్రలో నటించి అలరించారు.హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన 'సాక్రిఫైజ్' చిత్రంలో యువరాణిగా అత్యద్భుత నటనతో అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.
Authorization