కష్టాల బాల్యం నుంచి సినిమాటోగ్రాఫర్‌గా..
జాంగ్ యిమౌ చైనాలోని షాంగ్జి పట్టణంలో గ్జియాన్‌లో 1950, ఏప్రిల్ 2న జన్మించారు. జాంగ్ తండ్రి జాంగ్ బింగ్ జున్ డెర్మటాలజిస్ట్. చైనీస్ సివిల్ వార్ టైమ్‌లో నేషనల్ రివల్యూషనరీ ఆర్మీ అధికారిగా పనిచేశారు. తల్లి జాంగ్ గ్జియావోయు డాక్టర్‌గా పనిచేశారు. జాంగ్‌కు ఇద్దరు తమ్ముళ్ళు విమౌ, క్విమౌ ఉన్నారు. చిన్నప్పుడు జాంగ్ యిమౌ జీవితం చాలా కష్టంగానే సాగింది. 1960-70 కాలంలో కల్చరల్ రివల్యూషన్ కొనసాగుతున్న టైమ్‌లో జాంగ్ స్కూల్‌కి వెళ్తూనే, పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడేండ్ల పాటు ఫామ్ లేబర్‌గా, ఏడేండ్లపాటు కాటన్ టెక్స్టైల్ మిల్లో పనిచేశారు. అట్నుంచి పెయింటర్‌గా, ఆ తర్వాత స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. తన తొలి కెమెరాను సొంత డబ్బులతో కొన్నారు. అదే సమయంలో సినిమాలపై ఆసక్తితో బీజింగ్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయ్యారు. బోస్టన్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీలో డాక్టరేట్ పొందారు. యాలె యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీ పొందారు. గాంగ్జి ఫిల్మ్ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం లభించింది. 'వన్ అండ్ ఎయిట్', 'యెల్లో ఎర్త్' చిత్రాలకు పనిచేశారు. ఈ రెండు సినిమాలు విజయాలు సాధించాయి. 1985 తరుణంలో దర్శకుడు ఉ-టిన్మింగ్తో పరిచయం ఏర్పడింది. ఆయన రూపొందించిన 'ఓల్డ్ వెల్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడంతోపాటు ప్రధాన పాత్రలో నటించారు. దీనికిగానూ టోక్యో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు.
తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు..
సినిమాటోగ్రాఫర్‌గా సాధించిన అనుభవంతో దర్శకత్వంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా 1987లో 'రెడ్ సోర్ఘమ్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇందులో చైనీస్ నటి గాంగ్ లీ లీడ్ రోల్ పోషించారు. ఇది మంచి విజయాన్ని సాధించడంతోపాటు ఆర్ట్ పరంగా మంచి ఆదరణ పొందింది. ఇందులో కూడా జాంగ్ యిమౌ ఓ పాత్ర పోషించడం విశేషం. దర్శకుడిగా, నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. తదుపరి ప్రయత్నంగా 'కోడ్‌నేమ్ కౌగర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ చిత్రాల్లో ఇదో ప్రయోగం. 1989లో విడుదలైన ఈ సినిమాలో గె యు, గాంగ్ లీ జంటగా నటించారు. ఈ చిత్రం ఘోర పరాజయం చెందడంతోపాటు జాంగ్ దర్శకత్వంలోపై అనేక విమర్శలు వచ్చాయి. తన కెరీర్లోనే ఇదొక చెత్త సినిమాగా జాంగ్ అభిప్రాయపడ్డారు. అదే ఏడాది పీరియడ్ డ్రామా 'జు డౌ' చిత్రాన్ని రూపొందించారు. ఇందులోనూ మెయిన్ లీడ్‌గా గాంగ్ లీ నటించారు. ఇది పెద్ద విజయం సాధించి విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాదు చైనా నుంచి విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి చిత్రంగా నిలిచింది. 1990లో 'రైజ్ ది రెడ్ లాంటెర్న్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'వైవ్స్ అండ్ కాన్సుబిన్స్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ గాంగ్ లీ వరుసగా నాలుగోసారి జాంగ్ చిత్రంలో నటించారు. సినిమా విజయం జాంగ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పలు పత్రికలు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఈ సినిమా కూడా విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అంతేకాదు జాంగ్ యిమౌను చైనాలో అగ్ర దర్శకుల సరసన నిలబెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. గాంగ్ లీ కథానాయికగానే జాంగ్ 1992లో 'ది స్టోరీ ఆఫ్ క్వి జు' చిత్రాన్ని రూపొందించారు. న్యాయం కోసం ఓ మహిళ చేసే పోరాట నేపథ్యంలో సినిమా సాగుతుంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకుంది. జాంగ్ చిత్రాల్లో అవార్డును పొందిన తొలి సినిమా ఇది. ఆ తర్వాత ఎపిక్ చిత్రం 'టు లైవ్'ను తెరకెక్కించారు. చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్న ఈ సినిమా చైనాలో నిషేదానికి గురైంది. కానీ 1994లో కేన్స్‌లో ప్రదర్శితమై గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1995లో 'షాంగై ట్రైడ్' పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఇందులో గాంగ్లీ హీరోయిన్. ఆమెకిది జాంగ్‌తో ఏడో సినిమా. చైనా ఆధునిక జీవనాన్ని ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కిన 'కీప్ కూల్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్‌తో 'నాట్ వన్ లెస్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలందుకుంది. దర్శకుడిగా జాంగ్‌ను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ లయన్ అవార్డు వరించింది. అదే ఏడాది 'ది రోడ్ హోమ్' చిత్రాన్ని రూపొందించారు. జాంగ్ జియి ఇందులో హీరోయిన్. ఆమెకిది తొలి సినిమా. ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమాతో దర్శకుడిగా జాంగ్ యిమౌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
దగ్దర్శకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి..
2000లో ఆయన రూపొందించిన 'హ్యాపీటైమ్స్' సినిమా మంచి ప్రజాదరణ పొందింది. ఈ సినిమా బెర్లిన్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. 2002లో తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'హీరో' చిత్రాన్ని తెరకెక్కించారు. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా మొదట నార్త్ అమెరికాలో విడుదలైంది. రెండేండ్ల తర్వాత చైనాలో రిలీజ్ చేశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా జాంగ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మొదటి విదేశీ చిత్రంగా నిలిచింది. అలాగే ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 'హీరో' ఇచ్చిన విజయంతో మరో ఎపిక్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 2004లో 'హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగ్గర్స్' చిత్రాన్ని రూపొందించారు. జాంగ్ జియి, ఆండీ లాయి, టకేషి కనెషిరో వంటి అగ్ర నటులు నటించిన చిత్రమిది. ఇది అంతర్జాతీయంగా మంచి ప్రశంసలందుకుంది. ఈసినిమా తర్వాత తన పంథా మార్చి డ్రామా ప్రధానంగా 2005లో 'రైడింగ్ ఎలోన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్' సినిమాను రూపొందించారు. ఇందులో జపాన్ నటుడు కెన్ టకకురా నటించడం విశేషం. 2006లో పీరియడ్ ఎపిక్ చిత్రం 'కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్' చిత్రం దర్శకుడిగా జాంగ్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్‌కు పంపబడింది. కానీ నామినేట్ కాలేదు. ఆ తర్వాత వరుసగా 2007లో 'మూవీ నైట్', 2009లో 'ఏ ఉమెన్, ఎ గన్ అండ్ ఏ న్యూడిల్ షాప్', 2010లో 'అండర్ ది హాథోర్న్ ట్రీ', 2011లో 'ది ఫ్లవర్స్ ఆఫ్ వార్', 2014లో 'కమింగ్ హౌమ్', 2016లో 'ది గ్రేట్ వాల్', 2018లో 'షాడో' వంటి బ్లాక్ బస్టర్స్‌ను రూపొందించారు. దర్శకుడిగా చైనీస్ చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానంలో నిలిచారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి..
నటుడిగా 'ఓల్డ్ వెల్', 'రెడ్ సోర్ఘమ్' చిత్రాలతోపాటు 'ఫైట్ అండ్ లవ్ విత్ ఏ టెర్రాకోట్టా వారియర్', 'కీప్ కూల్', 'ది గ్రాండ్ మాన్షన్ గేట్' చిత్రాల్లో నటించి నటుడిగా కూడా జాంగ్ యిమౌ మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా 'రెడ్ ఎలిఫెంట్', 'వన్ అండ్ ఎయిట్', 'యెల్లో ఎర్త్'తోపాటు 'ఓల్డ్ వెల్', 'ది బిగ్ పరేడ్' చిత్రాలకు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలు చేస్తూనే పలు స్టేజ్ ప్రొడక్షన్స్‌ని డైరెక్ట్ చేశారు. 1998లో 'టురాండాట్', డాక్యుమెంటరీ ఫిల్మ్ 'ది టురాండాట్ ప్రాజెక్ట్', అలాగే 'రైజ్ ది రెడ్ లాంటెర్న్'ను స్టేజ్ వర్షెన్‌లో డైరెక్ట్ చేశారు. దీంతోపాటు 'ఇంప్రెషన్' పేరుతో ఐదు ఔట్‌డోర్ ఫోక్ మ్యూజికల్ నంబర్స్‌ను రూపొందించారు. 'ది ఫస్ట్ ఎంపరర్' పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను నిర్మించారు. 1989లో జాంగ్ యిమౌ 16వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. జాంగ్ దర్శకత్వ ప్రతిభను మెచ్చి, ఆయన సినిమాల తీరుకు మెస్మరైజ్ అయిన చైనా ప్రభుత్వం ఆయనకు 2008లో బీజింగ్ సమ్మర్ ఒలంపిక్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. మనిషి సంఘర్షణ, అంతర్గత శాంతి ప్రధానంగా ఈ ఒలంపిక్స్‌ని ఆయన అత్యంత సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను 'పీబాడీ అవార్డును ఆయన దక్కించుకున్నారు. 2010లో యాలె యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది. చైనీస్ నటి గాంగ్ లీతో అత్యధిక సినిమాలు తీశారు. ఈ క్రమంలో ఆమెతో రొమాంటిక్ రిలేషన్ షిప్‌ను కొనసాగించారు. అలాగే ప్రొఫెషనల్‌గానూ ఇద్దరు బాగా దగ్గరయ్యారు. జాంగ్ 1978లో గ్జియావో హును పెళ్ళి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. పదేండ్ల తర్వాత విడిపోయారు. 2011లో డాన్సర్ చెన్ టింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే వన్ చైల్డ్ పాలసీను జాంగ్ అతిక్రమించడంతో చైనా ప్రభుత్వం ఆయనకు 1.2 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది.
జాంగ్ యిమౌ దర్శకత్వ ప్రతిభకు వెండితెర రూపాలు..
చైనా సినిమాల తీరులో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత జాంగ్ యిమౌదే. తన సినిమాల ద్వారా పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించారు. అయితే తన సినిమాల్లో చైనాను బలహీనంగా చూపించే ప్రయత్నం చేయడంతో పలు విమర్శలూ ఎదుర్కొన్నారు. ప్రేమ, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, విలేజ్ నేపథ్యం, సంస్కృతి, యుద్ధ నేపథ్యం, మార్షల్ఆర్ట్స్, క్రైమ్ ఇలా విభిన్న జోనర్ చిత్రాలను జాంగ్ తెరకెక్కించారు. మహిళ ప్రధానమైన సినిమాలతో మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగానూ జాంగ్ యిమౌ మంచి పేరు సొంతం చేసుకున్నారు. తన సినిమాల్లో కథానాయికదే పై చేయిగా ఉండటాన్ని ఆయన బాగా ఇష్టపడతారు. ఇక సినిమా మేకింగ్ పరంగానూ జాంగ్ యిమౌ శైలి చాలా వైవిధ్యంగా, వినూత్నంగా ఉంటుంది. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో అతి పెద్ద వైడ్ యాంగిల్స్‌తో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. సంస్కృతి, సంప్రదాయానికి ఆయన సినిమాల్లో పెద్ద పీట వేశారు. ఆయన సినిమాలన్ని అద్భుతమైన పెయింటింగ్స్‌ని తలపిస్తాయి. తొలి ప్రయత్నంగా ఆయన రూపొందించిన 'రెడ్ సోర్ఘమ్' చిత్రం దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. లిక్కర్ కంపెనీలో పనిచేసే ఓ మహిళ జీవితాన్ని, ఆమె సంఘర్షణను తెలిపే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సంపన్న వర్గాలు, పేద కూలీల జీవితాలను చూపించారు. వ్యంగాస్త్ర పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో 'కోడ్‌నేమ్ కౌగర్', భార్యగా అమ్ముడుపోయిన మహిళ జీవిత సంఘర్షణని తెలిపే చిత్రం 'జు డౌ' చిత్రాలు దర్శకుడిగా జాంగ్ యిమౌ టేకింగ్, కథ, కథనానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఓ సంపన్న కుటుంబ సమ్మేళనంలోని జీవిత వాస్తవికతను ప్రతిబింబించేలా 'రైజ్ ది రెడ్ లాంటెర్న్' చిత్రాన్ని, ఒక రైతును ఫారెస్ట్ అధికారి అనవసరంగా చితకబాదుతాడు. దీంతో తన భర్తకు న్యాయం చేయాలని రైతు భార్య చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో 'ది స్టోరీ ఆఫ్ క్వి జు' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహిళల తెగవను చూపించారు. 1940-70 వరకు ముప్పై ఏండ్లపాటు చైనాలో సంస్కృతికంగా అక్కడి కుటుంబాల్లో వచ్చిన మార్పు, జీవిన విధానంతో వచ్చిన మార్పులను ప్రతిబింబించే కథాంశంతో 'టు లైవ్' చిత్రాన్ని రూపొందించారు. యుద్ధ నేపథ్యంలో ఓ మహిళా పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.
అండర్‌వరల్డ్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'షాంగై ట్రైడ్'తో జాంగ్ యిమౌ తన విభిన్న ప్రతిభను చాటుకున్నారు. ఆధునిక చైనాను ప్రతిబింబిస్తూ బుక్ సెల్లర్ కుర్రాడి ప్రేమను తెలిపే కథాంశంతో బ్లాక్ కామెడీగా 'కీప్ కూల్' చిత్రాన్ని రూపొందించారు. 'ది స్టోరీ ఆఫ్ క్వి జు' తర్వాత చైనాలో వస్తున్న ఆధునిక పోకడలను ఎత్తిచూపుతూ జాంగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గ్రామీణ పేదరికానికి, అర్బన్ జీవితానికి మధ్య ఉన్న తేడాను తెలిపే కథాంశంతో 'నాట్ వన్ లెస్' చిత్రాన్ని, తండ్రి మరణించడంతో తల్లి పడే వేదన నేపథ్యంలో ఓ కుర్రాడు తన గత జీవితాన్ని రికాల్ చేసుకునే కథాంశంతో 'ది రోడ్ హౌమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రాజెడీ ప్రధానంగా రొమాంటిక్ కామెడీ డ్రామాగా 'హ్యాపీ టైమ్స్'చిత్రాన్ని, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో చైనా మొదటి రాజు కథను తెలిపే కథాంశంతో హిస్టరీ యాక్షన్ అడ్వెంచర్‌గా 'హీరో', 'హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డాగ్గర్స్' చిత్రాన్ని తెరకెక్కించారు.
అనారోగ్యంతో ఉన్న కుమారుడి కోసం తండ్రి పడే సంఘర్షణ నేపథ్యంలో 'రైడింగ్ ఎలోన్ ఫర్ థౌజెండ్స్ ఆఫ్ మైల్స్' చిత్రాన్ని, చైనాలోని సాంస్కృతిక విప్లవ బ్యాక్‌డ్రాప్‌లో రెండు విభిన్న ఆర్థిక నేపథ్యాలకు చెందిన అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమను తెలిపే కథాంశంతో 'అండర్ ది హాథోర్న్ ట్రీ' సినిమాని, 1937లో జపాన్ సైన్యం దాడి చేస్తున్న క్రమంలో కొంత మంది మహిళలను రక్షించేందుకు ఓ చర్చ్ పాదర్ చేసే సాహసం నేపథ్యంలో 'ది ఫ్లవర్స్ ఆఫ్ వార్' చిత్రాన్ని, చైనా కల్చరల్ రివల్యూషన్ టైమ్‌లో ఓ మహిళ సంఘర్షణను తెలిపే కథాంశంతో 'కమింగ్ హౌమ్' సినిమాని, యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ప్రధానంగా 'ది గ్రేట్ వాల్' సినిమాను, హిస్టారికల్ డ్రామా ప్రధానంగా 'షాడో' చిత్రాన్ని తెరకెక్కించారు.
విశ్వ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని ఈ చిత్రాలన్ని దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా జాంగ్ యిమౌ ప్రతిభకు మచ్చుతునకలుగా నిలిచాయి.
Authorization