విశేష ప్రేక్షకాదరణ పొందిన హలీవుడ్ శృంగార తార. నీటి పొదుపు గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న సామాజిక సేవకురాలు. వెండితెరతోపాటు బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఫిదా చేస్తున్న క్రేజీ కథానాయిక మేగాన్ ఫాక్స్ గురించి ఈ వారం అందిస్తున్న
స్పెషల్ షో..
మోడలింగ్ నుంచి సినిమా వైపు..
మేగాన్ ఫాక్స్ 1986లో మే 16న అమెరికాలోని టెన్నెస్సీ పట్టణానికి చెందిన ఓవాక్ రిడ్జ్‌లో జన్మించారు. గ్లోరియా డార్లెనె, ఫ్రాంక్లిన్ థామస్ ఫాక్స్ తల్లిదండ్రులు. తండ్రి పేరోల్ అధికారి. మూడేండ్ల వయసప్పుడే తండ్రి నుంచి తల్లి విడాకులు తీసుకోవడంతో తల్లి దగ్గరే ఫాక్స్ పెరిగారు. ఆ తర్వాత తల్లి టోనీ టోనాచియో అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. వీరి సంరక్షణలో ఫాక్స్, ఆమె చెల్లి పెరిగారు. ఫాక్స చిన్ననాటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగారు. సొంతంగా సంపాదించేంత వరకు తల్లి దగ్గరే ఉన్నారు. ఐదేండ్ల వయసులో డాన్స్, డ్రామాలో శిక్షణ తీసుకున్నారు. కమ్యూనిటీ సెంటర్స్‌లోని డాన్స్ క్లాస్‌లకు వెళ్లేవారు. పదేండ్ల వయసులో ఫ్లోరిడాకు మకాం మార్చినప్పటికీ అక్కడ కూడా తన శిక్షణ కొనసాగించారు. 13ఏండ్ల వయసులో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. సౌత్ కరోలినాలో పలు ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని విన్నర్‌గానూ నిలిచారు. ఈ క్రమంలో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. స్కూల్ కరస్పాండెంటెంట్ ప్రోత్సాహంతో లాస్ ఏంజెల్స్‌కు వెళ్ళారు.
కెరీర్ ప్రారంభంలో గుర్తింపులేని పాత్రలు..
లాస్ ఏంజెల్స్‌కి వెళ్ళాక సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. 15ఏండ్ల వయసులో తొలిసారి సినిమాలో నటించే ఛాన్స్ వరించింది. 'హాలీడే ఇన్ ది సన్'లో చిన్న పాత్రలో మెరిశారు. ఇది 2001లో డైరెక్ట్ డీవీడీ రూపంలో విడుదలైంది. ఆ తర్వాత వరుసగా 'వాట్ ఐ లైక్ ఎబౌట్ యు', 'టూ అండ్ ఏ హాఫ్ మెన్' అనే టెలివిజన్స్‌లో అతిథి పాత్రల్లో మెరిశారు. 2003లో 'బ్యాడ్ బార్సు 2' చిత్రంలో గుర్తింపు లేని పాత్రలో నటించారు.
సరైన అవకాశాలు రాక నిరాశతో ఉన్న సమయంలో 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ టీనేజ్ డ్రామా క్వీన్' రూపంలో అద్భుత అవకాశం ఫాక్స్‌ను వరించింది. లిండ్సే లోహన్ ప్రధాన నాయికగా నటించిన ఈ చిత్రంలో ఫాక్స్ సపోర్టింగ్ రోల్ పోషించారు. అప్పుడే ఏబీసీ ఛానెల్లో వచ్చే 'హోప్ అండ్ ఫెయిత్' టెలివిజన్ సిరీస్‌లో రెగ్యులర్ కాస్ట్గానూ ఎంపికయ్యారు. సీజన్ 2, 3ల్లో నటించారు.
మలుపు తిప్పిన 'ట్రాన్స్ఫార్మర్స్' సిరీస్..
దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఫాక్స్‌కి లీడ్ హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చింది. 2007లో వచ్చిన 'ట్రాన్స్ఫార్మర్స్' చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మెయిన్ హీరోకి ప్రియురాలి పాత్రలో నటించారు. ఈ చిత్ర విజయం ఫాక్స్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఫాక్స్ తనదైన నటన, అందంతో ఆకట్టుకోవడంతో 'ట్రాన్స్ఫార్మర్స్' సీక్వెల్స్‌లోనూ కథానాయికగా నటించే అవకాశాలొచ్చారు. 2009లో వచ్చిన 'ట్రాన్స్ఫార్మర్స్: రివేంజ్ ఆఫ్ ది ఫాలెన్'లోనూ మెయిన్ లీడ్ పోషించారు. అనంతరం దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో ఏర్పడిన వివాదం కారణంగా రెండో సీక్వెల్ నుంచి వైదొలిగారు. 'ట్రాన్స్ ఫార్మర్స్' చిత్రీకరణ టైమ్‌లో ఫాక్స్ దర్శకుడిని హిట్లర్‌తో పోల్చింది. అంత కఠినంగా వ్యవహరించేవాడట.
బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్..
'ట్రాన్స్ఫార్మర్స్' చిత్రం తర్వాత 'హౌ టు లాస్ ఫ్రెండ్స్ అండ్ ఎలియనేట్ పీపుల్', 'వోర్' చిత్రాల్లో నటించారు. ఇవి యావరేజ్ రిజల్ట్నిచ్చాయి. 'ట్రాన్స్ఫార్మర్స్' వంటి భారీ విజయం తర్వాత ఆమె నటించిన ఈ సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఫాక్స్ నిరాశ పడ్డారు. 2009లో 'జెన్నీఫర్స్ బాడీ'లో నటించారు. సూపర్ నేచురల్ హర్రర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషించి మెప్పించారు. ఇది ఫర్వాలేదని పించుకుంది. ఆ తర్వాత మరో సూపర్ నేచురల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జోనా హెక్స్'లో రెండు భిన్న పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా పరాజయం చెందింది. అంతేకాదు అత్యంత చెత్త సినిమాగా దీన్ని అభివర్ణించారు. అగ్రనటుడు మైఖీ రూకెతో కలిసి 'ప్యాషన్ ప్లే'లో నటించారు. 2010లో విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అదే ఏడాది వచ్చిన యానిమేషన్ చిత్రం 'నయా లెజెండ్ ఆఫ్ ది గోల్డెన్ డాల్ఫిన్స్'లో స్పిన్నర్ డాల్ఫిన్స్‌కు వాయిస్ అందించారు.
స్టార్ హోదాని తీసుకొచ్చిన చిత్రాలు..
2011లో రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఫ్రెండ్స్ విత్ కిడ్స్'లో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ఫాక్స్‌కు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. అలాగే 2012లో విడుదలైన బ్రిటీష్ - అమెరికన్ సినిమా 'ది డిక్టేటర్'లో కథానాయికగా తన సొంత పాత్రతోనే గెస్ట్ రోల్లో మెరిశారు. అదే ఏడాది ఆమె నటించిన కామెడీ చిత్రం 'దిస్ ఈజ్ 40' ఫాక్స్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండేండ్ల గ్యాప్‌తో సూపర్ హీరో చిత్రం 'టీనేజ్ మ్యూటంట్ నింజా టర్టిల్', 2016లో వచ్చిన 'టీనేజ్ మ్యూటంట్ నింజా టర్టిల్స్: ఔట్ ఆఫ్ ది షాడోస్' చిత్రాల్లో కథానాయికగా కీలక పాత్రలో మెరిశారు. ఈ రెండు చిత్రాలు హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాలతో ఫాక్స్ హాలీవుడ్లో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. ఎన్నో రోజులుగా సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఆమెకు ఈ రెండు చిత్రాలు కెరీర్‌ను మరో మలుపుతిప్పాయి. 'ట్రాన్స్ఫార్మర్స్' చిత్రాలను రూపొందించిన దర్శకుడు మైఖేల్ బే ఈ చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషం. ఫాక్స్ కెరీర్లో ఈ దర్శకుడి పాత్ర కీలకంగా ఉంది. ఓ రకంగా ఆమెను నటిగా అగ్ర స్థానంలోకి తీసుకొచ్చింది ఆయన సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వీడియో గేమ్ ఆధారంగా రూపొందుతున్న 'జెరోవిల్లె' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు 'థింక్ లైక్ ఏ డాగ్', కొరియన్ సినిమా 'బ్యాటిల్ ఆఫ్ జంగ్సా-రి9.15', 'నయా లెజెండ్ ఆఫ్ ది గోల్డెన్ డాల్ఫిన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
21వ శతాబ్దపు శృంగార తార..
ఫాక్స్‌కి సినిమాల సక్సెస్ రేటు తక్కువే అయినప్పటికీ అందంతో విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాల్లోనే కాదు, పలు మ్యాగజైన్స్‌లో అందాలను ఆరబోసింది. దీంతో టైమ్స్ పత్రిక 21వ శతాబ్బపు శృంగార తారగా ఫాక్స్‌ను అభివర్ణించింది. 'హాలీవుడ్లో ప్రతి కథానాయికపై సెక్స్ సింబల్ ఉంటుంది. ఆ విషయంలో తప్పులేదు. దాన్ని మనం ఎలా ఉపయోగించు కుంటున్నామనేది ముఖ్యం' అని ఫాక్స్ పలు సందర్భాల్లో తెలిపింది. మీడియా సైతం ఫాక్స్‌ను ఏంజెలీనా జోలీతో పోల్చడంతో ఆమె ఇమేజ్ ప్రభావం ఫాక్స్‌పై చూపింది. 2002లో 'ఓసియన్ ఎవ్'తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'వాట్ ఐ లైక్ ఎబౌట్ యు', 'టూ అండ్ ఏ హాఫ్ మెన్', 'ది హెల్ప్', 'బాస్ గర్ల్', 'హోప్ అండ్ ఫెయిత్', 'రోబోట్ చికెన్', 'రోబోట్ చికెన్ డీసీ యూనివర్స్ స్పెషల్', 'వెడ్డింగ్ బ్యాండ్', 'న్యూ గర్ల్' వంటి టెలివిజన్స్తో బుల్లితెర ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. ఈ ఏడాది 'మిస్టరీస్ అండ్ మైత్స్ విత్ మేగాన్ ఫాక్స్' సీరియల్‌కు కో క్రియేటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే 2009లో మ్యూజిక్ వీడియో 'లవ్ ది వే యు లై', 'న్యూ పర్స్పెక్టివ్' పాటల్లో నర్తించి ఆకట్టుకున్నారు. 'టీనేజ్ మ్యూటంట్ నింజా టర్టిల్స్' చిత్రానికి గోల్డెన్ రాస్బెర్రీ అవార్డు, 'ట్రాన్స్ ఫార్మర్స్' చిత్రానికి గోల్డెన్ స్కోమ్స్ అవార్డు, స్క్రీమ్ అవార్డు, 'ట్రాన్స్ఫార్మర్స్: రివేంజ్ ఆఫ్ ది ఫాలెన్' చిత్రానికి టీన్ ఛాయిస్ అవార్డు, స్పైక్ వీడియో గేమ్ అవార్డు, స్క్రీమ్ అవార్డులు దక్కింది. పలు సేవా కార్యక్రమాలతోపాటు నీటి పొదుపు గురించి విస్తృత ప్రచారం చేస్తున్న అరుదైన కథానాయికగా ఫాక్స్ గుర్తింపు పొందారు.
Authorization