సహజమైన అందాలను తన కెమెరాలో బంధించడం ఇమ్మాన్యూల్ లుబెజ్కీ ప్రత్యేకత. ఫ్రేమ్ బ్రైట్‌గా కనిపించేందుకు సహజంగా చాలా మంది కెమెరామెన్లు ప్రత్యేకమైన లైటింగ్ వాడుతుంటారు. కానీ దాన్ని ఇమ్మాన్యూల్ బ్రేక్ చేశారు. సూర్యుడి కాంతితోనే అందాలను ఒడిసిపట్టడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే లాంగ్ షాట్స్‌కు కేరాఫ్ కూడా. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎక్కువ నిడివిగల షాట్స్ తీయడంలోనూ దిట్టగా హాలీవుడ్‌లోనూ పాపులర్ అయ్యారు. స్టడీకామ్, త్రీ యాక్సెస్ గింబెల్ లేదా చేతితో కెమెరా పట్టుకుని చిత్రీకరించడంలోనూ అద్భుత ప్రతిభావంతుడు. ప్రతి సినిమాలో కొన్ని షాట్స్ అయినా సరే ఫర్ ఎవర్గా ప్రేక్షకులకు గుర్తుండిపోయే రీతిలో చిత్రీకరించాలని నిత్యం తపన పడుతుంటారు.
సినిమా రైటర్ స్ట్రగుల్స్, కెరీర్ మలుపులను తెలిపే కథాంశంతో తెరకెక్కిన 'ది హార్వెస్ట్' చిత్రం విజువల్గానూ ప్రత్యేకంగా నిలవడంలో ఇమ్మాన్యూల్ పాత్ర ఎంతో ఉంది. ఇందులో దర్శకుడు చెప్పదలచిన అంశాన్ని చాలా స్పష్టంగా, మరోవైపు ఉండాల్సిన సస్పెన్స్‌ను విజువల్‌గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. తన తండ్రి హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకున్న ఓ స్కూల్ విద్యార్థిని మానసిక క్షోభను తెలిపే కథాంశంతో తెరకెక్కిన 'ఏ లిటిల్ ప్రిన్సెస్' చిత్రంలో ఇమ్మాన్యూల్ ఉపయోగించిన కెమెరా షాట్స్, టెక్నిక్స్ హైలైట్‌గా నిలిచాయి. పాప ఎమోషన్స్‌ను ఒడిసి పట్టిన తీరు, వాటిని కెమెరాలో బంధించిన వైనం అమోఘమనే చెప్పాలి.
సూపర్‌నేచురల్ హర్రర్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం 'స్లీపీ హాలో'. ఈ సినిమాను పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో, ఓల్డ్ స్క్వైర్ అకాడమీ రేషియోలో షూట్ చేశారు. వైడ్ యాంగిల్ లెన్స్ వాడి ఏకవర్ణంలో చిత్రీకరించి ఆ తర్వాత ఎఫెక్ట్స్‌ను వాడారు. దీంతో అత్యంత సహజంగా, అద్భుతంగా విజువల్స్ వచ్చాయి. బ్రిటీష్ అమెరికన్ రొమాంటిక్ హిస్టారికల్ డ్రామా చిత్రం 'ది న్యూ వరల్డ్'లో విజువల్ గ్రాండ్‌గా, వైడ్ యాంగిల్ షాట్స్ రావడానికి ఇమ్మాన్యూల్ ఎంతో శ్రమ తీసుకున్నారు. దాని ఫలితమే సినిమా అద్భుతమైన విజువల్ వండర్‌గా, అద్భుత కళాఖండంగా నిలిచింది.
కెరీర్ ప్రారంభంలో అనేక ప్రయోగాల ఫలితంగా 2006లో వచ్చిన 'చిల్డ్రన్ ఆఫ్ మెన్' సినిమా నుంచి అనేక కొత్త టెక్నిక్స్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ సినిమాకు పలు విలక్షణమైన కెమెరా పద్ధతులను అవలంభించి తోటి సినిమాటోగ్రాఫర్లనూ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాదు ఇందులో రోడ్ సైడ్ సన్నివేశాలను చిత్రీకరించడానికి డాగ్గీకామ్ సిస్టమ్‌లో ప్రత్యేకమైన కెమెరా రిగ్‌ను వాడి షూట్ చేశారు. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలను ఏడు నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా చిత్రీకరించారు. చిన్న చిన్న ఐదు ఎడిట్స్ తప్ప ఈ సీన్ మొత్తాన్ని అదే విధంగా వాడారు.
స్పేస్ ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన 'గ్రావిటీ' చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు ఇమ్మాన్యూల్ కెమెరా పనితనం విజువల్ వండర్ని క్రియేట్ చేశాయి. స్పేస్ జర్నీ, అక్కడ చోటు చేసుకున్న ప్రమాదం, అనంతర పరిణామాలను కెమెరాలో బంధించిన తీరు అబ్బుర పరుస్తుంది. స్పేస్ సీన్స్‌ను సింగిల్ షాట్లో పూర్తిచేశారు. ఆడియెన్స్‌ను నిజంగానే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసి సినిమా విజయంలో కీలక భూమిక పోషించారు. ఫేడౌట్ అయిన ఓ సూపర్ స్టార్ స్ట్రగుల్‌ని తెలిపే కథాంశంతో వ్యంగ్య హాస్యంతో రూపొందిన 'బర్డ్‌మ్యాన్' చిత్రంలో కూడా 'గ్రావిటీ' చిత్రానికి వాడిన టెక్నిక్సే వాడారు. ఇమ్మాన్యూల్కి మరో ఆస్కార్‌ను తెచ్చిపెట్టిందీ చిత్రం. ఇక ఇమ్మాన్యూల్ కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రంలో 'ది రెవెనంట్' ప్రథమ స్థానంలో ఉంటుంది. సరిహద్దుల్లో గస్తీ కాసే ఓ సైనికుడు ప్రత్యర్థులతో, ఎలుగుబంటితో పాణం కోసం పోరాడిన నేపథ్యంలో రూపొందిన ఈచిత్రంలో వాడిన కెమెరా టెక్నిక్స్ అంతర్జాతీయ సినిమాలోనే మొదటిసారి కావడం విశేషం. మంచు పర్వతాలల్లో ఎలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ లైటింగ్తోనే ఈసినిమా మొత్తాన్ని చిత్రీకరించారు. అత్యంత ప్రతికూల పరిస్థితిలోనూ సీజీ వర్క్‌ను తగ్గించి, అత్యంత తక్కువ టైమ్‌లో కెమెరాతోనే ఎక్కువగా భాగం చిత్రీకరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సినిమాకి కెమెరా వర్క్‌తోపాటు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ఆర్ట్ విభాగాల్లోనూ ఆస్కార్లు దక్కాయి.
Authorization