వెండితెరపై విజువల్ గ్రాండియర్‌కి, వండర్స్‌కి కేరాఫ్. సంచలన విజయాలు సాధించిన ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించి, మూసధోరణి కెమెరా పనితనానికి సరికొత్త టెక్నిక్స్ నేర్పిన దిట్ట. విజువల్ ట్రీట్‌కి పర్యాయపదంగా నిలిచి వరుసగా మూడు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఇమ్మాన్యూల్ లుబెజ్కీ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
చిన్నప్పట్నుంచే ఫొటోగ్రఫీపై అమితాసక్తి..
ఇమ్మాన్యూల్ లుబెజ్కీ అసలు పేరు ఇమ్యాన్యూల్ లుబెజ్కీ మోర్గెంస్టన్. నవంబర్ 30, 1964లో మిక్సికోలో యూదు కుటుంబంలో జన్మించారు. తండ్రి ముని లుబెజ్కీ నటుడు, నిర్మాత. నానమ్మది రష్యా. బోల్షివిక్ తిరుగుబాటు సమయంలో వీరి కుటుంబం చైనాకు వలస పోయింది. నానమ్మ హాలీవుడ్లో నటిగా రాణించాలని అమెరికాకు బయలుదేరగా, సరిహద్దుల్లోనే సైన్యం నిలిపివేయడంతో మెక్సికోలో స్థిరపడ్డారు. ఆమె అక్కడి వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు. అలా ఇమ్మాన్యూల్ మెక్సికో వ్యక్తిగా మారాడు. ఇమ్మాన్యూల్ ఫేస్ మేకలాగా ఉంటుందని స్నేహితులు ఆయన్ని 'ఎల్చివో'గా పిలుచుకునేవారు. చివో అంటే స్పానిష్‌లో మేక అని అర్థం. చిన్నప్పట్నుంచి ఇమ్మాన్యూల్కి కెమెరాలపై, ఫొటోగ్రఫీపై పిచ్చి. అందుకే సినిమాటోగ్రఫీలో సెంట్రో యూనివర్సిటీలో మాస్టర్ చేశారు. దర్శకుడు, నిర్మాత, రచయిత ఆల్ఫోన్సో కౌరాన్ తన క్లాస్మేట్. వీరు కలిసి తొలుత పలు లఘు చిత్రాలు తీశారు. అనంతరం సినిమాల కోసం విస్తృతంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క అవకాశమూ రాలేదు.
స్నేహితుల అండతో సినిమా నిర్మాణం
మెక్సికోలో చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. అక్కడి యూనియన్ ఆ టైమ్‌లో కొత్త వారికి అవకాశాలివ్వలేదు. అప్పుట్లో ఏడాదికి ఏడుగురుని మాత్రమే యూనియన్‌లోకి ఆహ్వానించేవారు. దీంతో తన ఛాన్స్ కోసం చాలా కాలంగా వేచి చూశారు. ఈ క్రమంలో పది మంది స్నేహితులు కలిసి సొంతంగా సినిమా తీయాలని భావించారు. అందరు దాదాపు ఏడువేల డాలర్లు పోగేసి సినిమా ప్రారంభించారు. అందులో ఇమ్మానుల్ కూడా ఓ నిర్మాత. 'ఎల్ కామినో లార్గోఏ టుజునా' పేరుతో ప్రయోగాత్మకంగా ఓ చిన్న సినిమా తీశారు. దీని వల్ల వచ్చిన డబ్బులతో మరిన్ని సినిమాలకు ప్లాన్ చేశారు. ఆ వెంటనే 'బాండిడాస్' పేరుతో మరో సినిమాను ప్రారంభించారు. దీనికి ఇమ్మాన్యూల్ సినిమాటోగ్రఫీ అందించారు. లూయిస్ ఎస్ట్రాడా దర్శకుడు. ఇది కూడా మంచి ఆదరణ పొందడంతో ఇమ్మాన్యూల్కి ఇతర దర్శకుల నుంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. 1980లో తొలుత టెలివిజన్ ప్రొడక్షన్స్‌లో పనిచేశారు. అనేక టెలివిజన్స్ను రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మెక్సికన్ ప్రభుత్వం సాయం చేసినప్పటికీ..
పదేండ్ల తర్వాత తొలుత ఆయన 'సోలో కాన్ టు పారెజా' అనే సినిమాకు పనిచేశారు. ఫిల్మ్ స్కూల్లో పరిచయమైన ఆల్ఫోన్సో కౌరాన్ దీనికి దర్శకుడు. ప్రారంభంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెక్సికన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి పూర్తి చేశారు. అయినప్పటికీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మెక్సికన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈ సినిమాను అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలో పలు అవార్డులను కూడా దక్కించుకుంది. ఇందులో విజువల్స్‌కి మంచి పేరొచ్చింది. సినిమాటోగ్రఫీ విభాగంలో పలు అవార్డులకు నామినేట్ అయ్యింది. ఆ తర్వాత 1992లో 'లైక్ వాటర్ ఫర్ చాకోలేట్' చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. ఆల్ఫోన్సో ఆరౌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వీరికి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో 1993లో కేవా రోసెన్ఫెల్డ్ తెరకెక్కించిన 'ట్వంటీ బక్స్', అలెజాండ్రో పెలయో దర్శకత్వంలో 'మిరోస్లావ', డేవిడ్ మార్కోనీ దర్శకత్వంలో 'ది హార్వెస్ట్' వంటి మూడు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. ఇందులో 'ట్వంటీ బక్స్' అమెరికన్ ఇండిపెండెంట్ సినిమా. ఈ చిత్రాల విజయాలు సినిమాటోగ్రాఫర్‌గా ఇమ్మాన్యూల్కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అంతేకాదు ఇమ్మాన్యుల్ కెమెరా పనితనం, టెక్నాలజీలోని ఆయన ప్రతిభ గురించి అందరికి తెలిసేలా చేశాయి.
అద్భుత సినిమాటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ గుర్తింపు..
1994లో అమెరికన్ సినిమా 'రియాలిటీ బైట్స్'కు పనిచేసే అవకాశం వచ్చింది. బెన్ స్టిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 1995లో ఆల్ఫోన్సో అరౌ దర్శకత్వంలో వచ్చిన 'ఏ వాక్ ఇన్ ది క్లౌడ్స్' చిత్రానికి పనిచేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వడంతో అందరి దృష్టిని ఇమ్మాన్యూల్ ఆకర్షించారు. ఆల్ఫోన్సో కౌరాన్ దర్శకత్వంలో మరోసారి 'ఏ లిటిల్ ప్రిన్సెస్'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఫాంటసీ డ్రామాగా అదే ఏడాది వచ్చిన ఈ సినిమా భారీ ఫెయిల్యూర్ అయినప్పటికీ దర్శకుడితోపాటు, సినిమాటోగ్రాఫర్‌గా ఇమ్మాన్యూల్కు మంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. దీంతో ఈ సినిమా ఆయన్ని కెమెరామెన్‌గా మరో మెట్టు ఎక్కించింది. మైక్ నికోల్స్ దర్శకత్వంలో 'ది బర్డ్ కేజ్', మార్టిన్ బ్రెస్ట్ దర్శకత్వంలో 'మీట్ జియో బ్లాక్' చిత్రాలకు వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాలూ భారీ విజయాలను సాధించాయి. 1998లోనే ఆల్ఫోన్సో కౌరాన్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్'కి కూడా ఇమ్మాన్యూలే సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాతో వీరి అనుబంధం మరింత బలపడింది.
1999లో టిమ్ బర్టన్ దర్శకత్వంలో వచ్చిన 'స్లీపీ హలో' చిత్రం ఇమ్మాన్యుల్ కెరీర్‌నే మలుపు తిప్పింది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతో ఆస్కార్‌కు మరోసారి నామినేట్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమా ఆరు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కావడంతో ఇమ్మాన్యూల్పై ఇతర అగ్ర దర్శకుల దృష్టి పడింది. ఆ తర్వాత 2000లో రోడ్రిగో గార్సియా దర్శకత్వంలో 'థింగ్స్ యూ కెన్ టెల్ జస్ట్ బై లుకింగ్ ఎట్ హర్', 2001లో మైఖేల్ మాన్న్ దర్శకత్వంలో 'అలీ' సినిమాకు, ఆల్ఫోన్సో కౌరాన్తో నాలుగోసారి 'వై టు మామా టంబీన్', 2003లో బో వెల్చ్ దర్శకత్వంలో 'ది క్యాట్ ఇన్ ది హ్యాట్' చిత్రాలకు పనిచేశారు. ఇవి ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ ఇమ్మాన్యూల్కి సినిమాటోగ్రాఫర్‌కి మంచి గుర్తింపు తెచ్చాయి. 2004లో నీల్స్ ముల్లెర్ దర్శకత్వంలో వచ్చిన 'ది అస్సాస్సినేషన్ ఆఫ్ రిచర్డ్ నిక్సన్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా నిర్మాతగానూ మారారు. తన స్నేహితుడు, దర్శకుడు ఆల్ఫోన్సో కౌరాన్ ఈ సినిమాను నిర్మించడంతో తను కూడా భాగమయ్యారు. బ్రాడ్ సిల్బెర్లింగ్ దర్శకత్వంలో 'లెమోనీ స్నిక్కెట్స్ ఏ సిరీస్ ఆఫ్ అన్ ఫార్చ్నేట్ ఈవెంట్స్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి సినిమా విజయంలో భాగమయ్యారు.
వరుసగా మూడు ఆస్కార్లు..
2005లో టెర్రెన్స్ మాలిక్ దర్శకత్వంలో పనిచేసిన 'ది న్యూ వరల్డ్' చిత్రం విశేష ఆదరణతోపాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి కూడా ఇమ్మాన్యూల్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఆల్ఫోన్సో కౌరాన్ దర్శకత్వంలో ఐదో సారి 'చిల్డ్రన్ ఆఫ్ మెన్'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీనికి గానూ ఆస్కార్‌తోపాటు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకూ నామినేట్ అయ్యారు. అనంతరం పాపులర్ దర్శకుడు అలెజాండ్రో గోంజలేజ్ ఇనార్రిటు దర్శకత్వంలో తొలిసారి 'టు ఈచ్ హిజ్ ఓన్ సినిమా'కు, జోయిల్ అండ్ ఎథన్ కోయిన్ రూపొందించిన 'బర్న్ ఆఫ్టర్ రీడింగ్', వరుసగా టెర్రెన్స్ మాలిక్ దర్శకత్వంలో 'ది ట్రీ ఆఫ్ లైఫ్', 'టు ది వండర్' చిత్రాలకు పనిచేశారు. ఈ రెండు చిత్రాలు అంతర్జాతీయ బాక్సాఫీసు వద్ద ఘన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆరోసారి అల్ఫోన్సో కౌరాన్ దర్శకత్వంలో 'గ్రావిటీ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి ఎట్టకేలకు ఆస్కార్‌ను అందుకున్నారు. ఆయనకు దక్కిన తొలి ఆస్కార్ ఇదే. మరోసారి ఆల్ఫోన్సోతో తనకున్న స్నేహబంధాన్ని చాటుకుందీ చిత్రం. 2014లో అలెజాండ్రో ఇనార్రిటు దర్శకత్వంలో 'బర్డ్‌మ్యాన్' చిత్రానికి, 2015లోనే అలెజాండ్రో దర్శకత్వంలోనే వచ్చిన 'ది రెవెనంట్' చిత్రాలకు వరుసగా ఆస్కార్లు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాలు ఇమ్మాన్యూల్ను అంతర్జాతీయంగా తిరుగులేని సినిమాటోగ్రాఫర్‌ని చేశాయి. ఆ తర్వాత రోడ్రిగో గార్సియా దర్శకత్వంలో రూపొందిన 'లాస్ట్ డేస్ ఇన్ ది డిసెర్ట్', టెర్రెన్స్ మాలిక్ తెరకెక్కించిన 'నైట్ ఆఫ్ కప్స్', 'సాంగ్ టు సాంగ్' చిత్రాలకు పని చేసి హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
తక్కువ మందితో ఎక్కువ సినిమాలు..
దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఇమ్మాన్యూల్ చాలా తక్కువ మంది దర్శకులతో పనిచేశారు. అందులో తన చిరకాల స్నేహితుడు దర్శకుడు ఆల్ఫోన్సో కౌరాన్తోనే ఆరు సినిమాలు చేశారు. టెర్రెన్స్ మాలిక్‌తో ఐదు సినిమాలు, ఆలెజాండ్రో ఇనార్రిటుతో మూడు సినిమాలు, రోడ్రిగో గార్సియాతో, ఆల్ఫోన్సో ఆరౌతో రెండేసి చిత్రాలకు పనిచేశారు. తన కెరీర్లో ఎనిమిది సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ కాగా మూడు ఆస్కార్లు వరించాయి. బ్యాక్ టూ బ్యాక్ మూడు సంవత్సరాల పాటు ఆస్కార్‌ను సొంతం చేసుకున్న మొదటి సినిమాటోగ్రాఫర్‌గా చరిత్ర సృష్టించారు.
2016లో ఇమ్మాన్యూల్ సినిమాటోగ్రఫీలో ప్రతిష్టాత్మకంగా భావించే రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ లుమియర్ పురస్కారం లభించింది. దీంతోపాటు అనేక ఇతర అవార్డులు ఆయన్ని వరించాయి. కెరీర్ ప్రారంభంలో పలు టెలివిజన్స్కి పనిచేసిన విషయం విదితమే. అందులో మూడేండ్లపాటు 'హౌరా మార్కేడ్' సిరీస్‌లోని మూడు సీజన్లు చేశారు. ఆ తర్వాత 'ఎల్ మోటెల్ డె లా మౌర్టె', 'ఫాలెన్ ఏంజెల్స్', 'రైట్ ది ఫ్యూచర్' వంటి టెలివిజన్ సిరీస్‌లకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో 'ఎజెర్సిసియో డె 20 అనో', 'మార్లెనె ఎన్ పారేడ్','కైఫాన్స్', 'ఫోబియా వై సాంటా సాబినా వంటి లఘు చిత్రాలు, చిన్న వీడియోలకు దర్శకత్వం కూడా వహించారు. ఇదంతా తను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో రాకముందు చేశారు. ఒకటి రెండు మ్యూజిక్ వీడియోలకు కూడా పనిచేశారు. ఇమ్మాన్యూల్ లక్కీ నెంబర్ 6. ఎందుకంటే తన స్నేహితుడు ఆల్ఫోన్సోతో ఆరు సినిమాలు తీయగా, తన ఆరవ ఆస్కార్ నామినేషన్ అవార్డుని తెచ్చిపెట్టింది. అందుకే తన అదృష్ట సంఖ్య ఆరుగా భావిస్తారు.
Authorization