నటాలీ పోర్ట్మన్..
భిన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన
స్టార్ హీరోయిన్. నటిగా, రైటర్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆస్కార్ అందుకున్న ఆల్‌రౌండర్. జంతు హక్కులు, పర్యావరణ పరిరక్షణ,
పేదరిక నిర్మూలన, మహిళా సాధికారిత, బాలికల ఉన్నతి కోసం విశేష కృషి చేస్తున్న
అగ్ర కథానాయిక నటాలీ పోర్ట్మన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి..
జెరూసలెంలో 1981 జూన్ 9న నటాలీ పోర్ట్మన్ జన్మించారు. అసలు పేరు నెటా లీ హెర్ష్లాగ్. హోమ్ మేకర్ షెల్లీ, అవ్నెర్ హెర్ష్లాగ్ల ఏకైక కూతురు. తండ్రి అవ్నెర్ గైనకాలజిస్ట్. సిస్సెట్ హై స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన అనంతరం నటాలీ అమెరికన్ థియేటర్ డాన్స్ వర్క్‌షాప్‌లో మోడ్రన్ డాన్స్ నేర్చుకున్నారు. ఉస్దన్ సెంటర్ క్రియేటివ్ సైడ్, నటనలో ట్రైనింగ్ తీసుకున్నారు. హైస్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ కారణంగా తను నటించిన 'స్టార్ వార్స్: ఎపిసోడ్ 1- ది ఫాంటమ్ మెనేస్' ప్రీమియర్‌కి అటెండ్ కాలేదు. 1998లో ఇంటెల్ సైన్స్ టాలెంట్ రీసెర్చ్‌లో పాల్గొన్నారు. 2003లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యూయేట్ చేశారు. ఇజ్రాయిల్‌లోని హెబ్రూ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ కోర్స్ చేశారు. 2006లో కొలంబియా యూనివర్సిటీలో టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజమ్‌పై గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశారు. పోర్ట్మన్కి కొత్త భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, అరబిక్ భాషలను నేర్చుకున్నారు. పదేండ్ల వయసులో ఆమెకు చైల్డ్ మోడల్‌గా ఛాన్స్ వచ్చింది. కానీ నటి కావాలన్న లక్ష్యంతో యాక్టింగ్ సైడ్ వచ్చారు. ఆ టైమ్‌లోనే థియేటర్ క్యాంపులకు హాజరవుతుండేవారు. 1992లో 'రూత్‌లెస్' అనే మ్యూజిక్ షోలో నటించారు. స్కూల్లోనూ పలు నాటకాలు వేశారు.
అవకాశాలొచ్చినప్పటికీ గుర్తింపు రాలేదు..
1993లో నటాలీకు తొలి అవకాశం వచ్చింది. ల్యూక్ బెస్సన్ దర్శకత్వంలో రూపొందిన 'లియోన్: ది ప్రొఫెషనల్' చిత్రానికి ఆడిషన్ ఇచ్చి కథానాయికగా ఎంపియ్యారు. ఈ టైమ్‌లో తన గ్రాండ్ మదర్ నీ పోర్ట్మన్లోని పోర్ట్మన్ పేరును తన పేరుకు కలుపుకుని మొత్తంగా నటాలీ పోర్ట్మన్గా మారారు. తర్వాత వరుసగా 'హీట్', 'ఎవ్రీ వన్ సేస్ ఐ లవ్ యూ', 'మార్స్ ఎటాక్స్', 'బ్యూటిఫుల్ గర్ల్స్' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. 1996లో విలియమ్షేక్స్పీయర్స్ 'రోమియో ప్లస్ జూలియెట్'లో మెయిన్ హీరోయిన్గా మొదట నటాలీనే అనుకున్నారు. కానీ ఆ పాత్రకు ఆమె ఏజ్ సూట్ కాదని తీసేశారు.
స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన స్టార్‌వార్స్ సిరీస్..
1997లో 'స్టార్‌వార్స్ ప్రీక్వెల్ ట్రిలోజీ'లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో మొదటగా రూపొందిన 'స్టార్ వార్స్: ఎపిసోడ్ 1- ది ఫాంటమ్ మెనేస్'లో మెయిన్ హీరోయిన్గా ఎంపికైంది. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించారు. సినిమా సాధించిన భారీ విజయంతో హాలీవుడ్లో నటాలీకి మంచి గుర్తింపు లభించింది. వెంటనే రొమాంటిక్ చిత్రం 'ఎనీవేర్ బట్ హియర్' చిత్రంలో తనదైన అందంతో మెప్పించారు. 2000లో మాట్ విలియమ్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం 'వేర్ ది హార్ట్ ఈజ్' చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిశారు. 'జూలాండర్'లోని అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో 2002లో 'స్టార్‌వార్స్: ఎపిసోడ్ 2: ఎటాక్ ఆఫ్ ది క్లోన్స్' రూపంలో కెరీర్‌కి మరో బూస్టప్ వచ్చింది.
జార్జ్ లుకాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎవాన్ మెక్ గ్రెగర్తో కలిసి నటించారు.
ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సాధించడంతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. హాలీవుడ్లో అత్యంత క్రేజీ కథానాయికగా నిలిచారు. ఆ తర్వాత న్యూయార్క్ పబ్లిక్ థియేటర్లో పలు నాటకాల్లోనూ నటించారు. 2003లో విడుదలైన ఎపిక్ వార్ చిత్రం 'కోల్డ్ మౌంటేన్'లో చిన్న పాత్రలో మెప్పించారు. 'స్టార్‌వార్స్' విజయం తెచ్చిన ఇమేజ్‌తో నటాలీ మెయిన్ స్ట్రీమ్ కథానాయికల జాబితాలో చేరారు. పలు భారీ అవకాశాలు క్యూ కట్టాయి. 2004లో చేసిన రొమాంటిక్ కామెడీ 'గార్డెన్ స్టేట్' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయితే అదే ఏడాది విడుదలైన మైక్ నికోలస్ చిత్రం 'క్లోజర్' బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇక 'స్టార్‌వార్స్ ట్రయాలజీ'లోని మూడో చిత్రం 'రివేంజ్ ఆఫ్ ది సిత్' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. జార్జ్ లుకాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నటాలీ హాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. తిరుగులేని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2005లో ఇజ్రాయిల్, బెల్జియం, ఫ్రెంచ్, స్పానిష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన 'ఫ్రీ జోన్', స్పానిష్, అమెరికా సినిమా 'గోయాస్ ఘోస్ట్స్' వంటి ఇండిపెండెంట్ చిత్రాల్లోనూ నటించి విలక్షణ నటిగా పేరుతెచ్చుకున్నారు.
చాలా దేశాల నటీనటులు, దర్శకులు రూపొందించిన ఆంథోలజీ ఫిల్మ్ 'పారిస్, జెట్ ఎమె'లో వివిధ పాత్రల్లో మెరిశారు. డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ 'వీ ఫర్ వెండేట్టా' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతోపాటు నటిగా నటాలీకి మరింత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2006 నుంచి సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. 2007లో రొమాంటిక్ డ్రామా 'మై బ్లూబెర్రీ నైట్స్', కామెడీ డ్రామా 'ది డార్జీలింగ్ లిమిటెడ్', ఫాంటసీ చిత్రం 'మిస్టర్ మగోరియమ్స్ వండర్ ఎంపోరియమ్'తోపాటు లఘు చిత్రం 'హోటల్ చెవలియర్'లో నటించారు. 2008లో నటించిన హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా 'ది అదర్ బోలెన్ గర్ల్' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది.
ఆస్కార్ అందుకున్న క్రేజీ కథానాయిక..
2009లో 'ది అదర్ ఉమెన్', 'న్యూయార్క్, ఐ లవ్ యూ', 'బ్రదర్స్' చిత్రాల్లో, 2010లో 'ఐయామ్ స్టిల్ హియర్', 'హెషర్', 'బ్లాక్ స్వాన్', 2011లో 'నో స్ట్రింగ్స్ అటాచ్డ్డ్', 'యువర్ హైనెస్', 'థోర్' చిత్రాల్లో నటించారు. సైకలాజికల్ హర్రర్ చిత్రంగా రూపొందిన 'బ్లాక్ స్వాన్'లో ప్రధాన పాత్రలో నటించి తన నట విలక్షణత చూపించారు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. నటిగా నటాలీకి ఆస్కార్‌ని తెచ్చిపెట్టింది. సూపర్ హీరో కథాంశంతో మార్వెల్ కామిక్స్‌లో వచ్చిన 'థోర్' సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇందులో తన పాత్రకు మంచి పేర్కొచ్చింది. రెండేండ్ల గ్యాప్‌తో 'థోర్'కి సీక్వెల్‌గా 'థోర్: ది డార్క్ వరల్డ్' చిత్రంలో నటించారు. ఇది కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 2015లో 'నైట్ ఆఫ్ కప్స్', 'ది హేడే ఆఫ్ ది ఇన్సెంటివ్ బాస్టర్డ్స్' 'ఏ టేల్ ఆఫ్ అండ్ డార్క్నెస్', 2016లో 'జానెగాట్ ఏ గన్', 'జాకీ', 'ప్లానెటేరియమ్' చిత్రాల్లో నటించారు. గతేడాది వచ్చిన 'సాంగ్ టు సాంగ్' మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇప్పటికే 'అన్నిహిలేషన్', 'వాక్స్ లక్స్', 'ది డెత్ అండ్ లైఫ్ ఆఫ్ ఎఫ్ డానోవన్' వంటి విభిన్నమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. నటాలీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాదు ఆర్ట్ ఫిల్మ్స్ చేశారు. దీంతోపాటు పలు టెలివిజన్స్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. 'సెసేమ్ స్ట్రీట్', 'సాటర్డే నైట్ లైవ్', 'ది అమెరికన్ జెనోసైడ్', 'ది సింప్సన్స్', 'ఆంగీ ట్రిబెకా' వంటి టీవీ షోస్‌లో నటించి ఆకట్టుకున్నారు.
రచయిత, దర్శకురాలు, నిర్మాతగా సత్తా చాటిన ఆల్‌రౌండర్
నటాలీ అద్భుతమైన నటి మాత్రమే కాదు అత్యద్భుతమైన దర్శకురాలు కూడా. అంతకు మించి అభిరుచి గల నిర్మాత. 'ది అదర్స్ ఉమెన్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్‌గా పనిచేశారు. దీంతో వచ్చిన అనుభవంతో హ్యాండ్స్‌మ్ చార్లీ ఫిల్మ్స్' కంపెనీని స్థాపించి 'హెషర్' చిత్రాన్ని నిర్మించారు. చార్లీ అనేది తన కుక్క పేరు. అది చనిపోవడంతో దాని పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. నెక్ట్స్ 'నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశారు. ఆ తర్వాత 'ఏ టేల్ ఆఫ్ లవ్ అండ్ డార్క్నెస్' చిత్రంలో నటిస్తూ నిర్మించారు. అంతేకాదు రైటర్‌గా, దర్శకురాలిగానూ మారారు. దీనికంటే ముందే 'ఎవ్' అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతోపాటు 'ప్రైడ్ అండ్ ఫ్రీజుడీస్ అండ్ జాంబీస్' చిత్రాన్ని నిర్మించారు. 11 లఘుచిత్రాల మేళవింపుగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఆంథాలజీ 'న్యూయార్క్,ఐ లవ్ యు' చిత్రంలో 8వ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. 2007లో పాల్ మెక్ కార్ట్నీ రూపొందించిన మ్యూజిక్ వీడియో 'డాన్స్ టునైట్'లో నటించారు. అలాగే 'మెమొరీ ఆలోమోస్ట్ ఫుల్' ఆల్బమ్‌లోనూ మెరిశారు. 'బ్లాక్ స్వాన్'లో డాన్సర్, రాణిగా తన అద్బుతమైన నటనకు ఆస్కార్ అవార్డు అందుకుంది. బ్రిటీష్ అకాడమీ అవార్డు వరించింది. 'క్లోజర్', 'జాకీ' చిత్రాలకు ఆస్కార్‌కు, అలాగే బ్రిటీష్ అకాడమీ అవార్డ్‌కి కూడా నామినేట్ అయ్యింది. 'క్లోజర్', 'బ్లాక్స్వాన్' చిత్రాలకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు వరించాయి. పోర్ట్మన్ ఫోక్ సింగర్ దేవేంద్ర బ్యాన్హార్ట్తో బ్రేకప్ తర్వాత ఫ్రెంచ్ బ్యాలెట్ డాన్సర్ బెంజమిన్ మిల్లెపెయిడ్ని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అలెఫ్, కూతురు అమాలియా ఉన్నారు.
స్ఫూర్తినిచ్చే సేవా దృక్పథం..
నటాలీ పోర్ట్మన్ పూర్తి శాఖాహారి. జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారపదార్థాలను తీసుకోరు. అంతేకాదు జంతు హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు పలు నాటకాలు ప్రదర్శించారు. ఉగాండా, గాటెమాలా, ఈక్వడార్ వంటి దేశాలు తిరిగి పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎఫ్ఐఎన్సీఏ ఇంటర్నేషనల్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలకు స్వతహాగా ఉపాధి కల్పిస్తూ చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ మహిళా సాధికారతకు దోహదపడుతున్నారు. పేదరిక నిర్మూలనకు మైక్రోఫైనాన్స్ ప్రాధాన్యత, విలేజ్ బ్యాంకింగ్ కాంపెయిన్లను నిర్వహించారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి సపోర్ట్‌గా నిలిచారు. బాలికల ఉన్నతి కోసం 'ఫ్రీ ది చిల్డ్రన్' ఛారిటీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు.
'మీటూ' ఉద్యమానికి మద్దతుగా నిలిచి తన అనుభవాలను పంచుకున్నారు.
Authorization