- సిల్వెస్టర్ స్టాలోన్..
- తనదైన యాక్షన్ మార్క్‌తో
- వరల్డ్ సినిమాని అత్యంత ప్రభావితం
- చేసిన క్రేజీ యాక్షన్ హీరో.
- భారీ యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఆల్‌రౌండర్ సిల్వెస్టర్ స్టాలోన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
పుట్టుక దగ్గర్నుంచే బతుకుపై పోరాటం..
స్టాలోన్ జులై 6, 1946లో అమెరికా, న్యూయార్క్‌లోని హెల్స్ కిచెన్‌లో జన్మించారు. తండ్రి నటుడు, పోలో ఔత్సాహికుడు, హెయిర్ డ్రెస్సర్ ఫ్రాంక్స్టాలోన్ సీనియర్ కుమారుడు. తల్లి జాక్వెలిన్ స్టాలోన్. ఆమె డాన్సర్, మహిళా కుస్తీ పోటీల ప్రమోటర్‌గానూ పనిచేశారు. స్టాలోన్‌కి తమ్ముడు ఫ్రాంక్ స్టాలోన్ ఉన్నారు. ప్రసవం సమయంలో జరిగిన పొరబాట్ల వల్ల స్టాలోన్ పుట్టుకతోనే ముఖానికి సంబంధించి నరాల సమస్యతో పుట్టారు. దీని ప్రభావం వల్ల ఆయన మాట కూడా వణికినట్టు వస్తుంటుంది. దీన్ని అధిగమించటానికి స్టాలోన్ పుట్టుక దగ్గర్నుంచే పోరాటం చేశారు. లింకన్ హై స్కూల్, చార్లోట్టె హాల్ మిలటరీ అకాడమీలో స్కూల్ విద్యను, మియామి డాడె కాలేజ్, మియామి యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
దొంగగా మారిపోవాలనుకున్నప్పటికీ..
సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో రోజులు ఇబ్బంది పడ్డారు. చాలా రోజులపాటు ఇల్లు లేకుండా గడిపారు. దాదాపు మూడు వారాలు న్యూయార్క్ సిటీ పోర్ట్ ఆథారిటీ బస్ టెర్మినల్‌లో పడుకున్నానని ఓ ఇంటర్వ్యూలో స్టాలోన్ తెలిపారు. అంతేకాదు ఏమీ లేని పరిస్థితుల్లో సినిమా చేయడం, లేదంటే దొంగతనమైనా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. లక్కీగా సినిమా ఛాన్స్ రావడంతో తన కెరీరే మారిపోయింది. సినిమాల పరంగా 1969లో మొదటి ఛాన్స్ దక్కించుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన 'డాన్హిల్ రేసర్'లో దిగ్గజ నటుడు రాబర్డ్ రెడ్ఫోర్డ్తో కలిసి నటించారు. ఇందులో ఆయన రెస్టారెంట్ పాట్రోన్గా కనిపించారు. ఆ తర్వాత వచ్చిన 'ది పార్టీ ఎట్ కిట్టీ అండ్ స్టడ్స్' చిత్రంలో మెయిన్‌గా హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ చిత్రానికి ఆయన రోజుకి 200 డాలర్ల వేతనానికి పనిచేశారు. ఆ తర్వాత 'స్కోర్' చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. 1972లో 'నో ప్లేస్ టు హైడ్' చిత్రంలో నటించారు. ముందుగా ఇది 'రెబెల్' పేరుతో తెరకెక్కింది. ఇలా వరుసగా 'పిజియన్', 'బనానస్', 'క్లటె', 'ది ప్రిజనర్ ఆఫ్ సెకండ్ అవెన్యూ', 'మాష్' చిత్రాల్లో నటించారు. ఇక 1974లో వచ్చిన 'ది లార్డ్స్ ఆఫ్ ఫ్లాట్బుష్' చిత్రంలో సెకండ్ హీరోగా, 'ఫేర్వెల్, మై లవ్లీ', 'కపోన్', 'డెత్ రేస్ 2000' చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెరిశారు. ఆ తర్వాత 'మాండింగో', 'కన్నోంబాల్' చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించారు. పదికిపైగా సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు.
రాకీ అఖండ విజయంతో కెరీర్లో కీలక మలుపు..
1976లో వచ్చిన 'రాకీ' సిల్వెస్టర్ స్టాలోన్ కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పింది. హాలీవుడ్ చిత్రసీమలో తిరుగులేని యాక్షన్ హీరోని చేసింది. జాన్ జి. అవిల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సిల్వెస్టర్ కథ అందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కేవలం ఒక మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా 225 మిలియన్లను వసూలు చేసింది. ఆ ఏడాది వచ్చిన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా ఆయనకు స్టార్ ఇమేజ్ వచ్చింది. అంతేకాదు అంతకు ముందెన్నడూ రాని ఓ గొప్ప క్రీడా చిత్రంగా దీన్ని విమర్శకులు, విశ్లేషకులు అభివర్ణించారు. 1975లో బాక్సర్స్ మహ్మద్ అలీ, చుక్ వెప్నర్ ఫైట్‌ను చూసి ఇన్స్పైర్ అయి దాదాపు మూడు రోజులు 20గంటలు ఏకధాటిగా కూర్చుని స్టాలోన్ ఈ చిత్ర కథని రాశారు. తన జీవితం ఆధారంగా ఈ కథ రాశారంటూ బాక్సర్ వెప్నర్ స్టాలోన్‌పై కేసు వేశారు. ఈ సినిమా పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ అందుకుంది. రెండేండ్ల గ్యాప్‌తో 'ఎఫ్.ఐ.ఎస్.టి' చిత్రంలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి స్టాలోన్ స్క్రీన్‌ప్లే అందించారు.
సంచలన దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు..
'రాకీ' ఇచ్చిన ఆనందంలో, స్క్రిప్ట్‌పై వచ్చిన పట్టుతో సొంతంగా దర్శకత్వం వహించాలని స్టాలోన్ భావించారు. అందులో భాగంగా 1978లో క్రీడా నేపథ్యంలోనే 'పారడైస్ ఎల్లే' చిత్రాన్ని తనే హీరోగా రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో తన కెరీర్‌ను మలుపు తిప్పిన 'రాకీ'కి సీక్వెల్‌ను తన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇది భారీ విజయాన్ని సాధించి తనని మళ్ళీ పుంజుకునేలా చేసింది. దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చి 'నైట్‌వాక్', 'ఎస్కేప్ టు విక్టరీ' చిత్రాల్లో నటించారు. 1982లో రైటర్‌గా, దర్శకుడిగా, హీరోగా 'రాకీ 3' చిత్రాన్ని రూపొందించారు. ఇది ఘన విజయం సాధించి, దర్శకుడిగా తన ప్రతిభను చాటింది. హీరోగా, రచయితగా, దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. బాక్సాఫీసు వద్ద దాదాపు 270 మిలియన్ డాలర్లను రాబట్టింది. అదే ఏడాది యాక్షన్ థ్రిల్లర్ 'ఫస్ట్ బ్లడ్'కి రచయితగా పనిచేస్తూ, హీరోగా నటించి మరోసారి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇది 'రాంబో' సిరీస్‌లో వచ్చిన మొదటి చిత్రం. నెక్ట్స్ ఇయర్ డాన్స్ ప్రధానంగా 'స్టేయింగ్ ఎలైవ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఫర్వాలేదనిపించుకుంది. 1984లో నటించిన మ్యూజికల్ కామెడీ 'రినెస్టోన్'తో మరో విజయాన్ని అందుకున్నారు. 1985లో 'రాకీ' సీక్వెల్లో భాగంగా 'రాకీ 4'ను రూపొందించారు. ఈ సినిమా సిల్వెస్టర్ హాలీవుడ్లో అగ్ర కథానాయకుడిగానే కాకుండా అగ్ర దర్శకుడిగా నిలబెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది.
పవర్ఫుల్ పంచ్‌లకు ప్రేక్షకులు ఫిదా..
'రాకీ' ఫ్రాంచైజీలో వరుసగా నాలుగు యాక్షన్ సినిమాలతో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిల్వెస్టర్ 1982 నుంచి 'రాంబో' ప్రాంఛైజీలో భాగమయ్యారు. మొదటగా వచ్చిన 'ఫస్ట్ బ్లడ్'లో ఆయన హీరోగా నటించడంతో పాటు కథ కూడా ఆయనే అందించారు. ఆ తర్వాత 1985లో దీనికి సీక్వెల్‌గా 'రాంబో: ఫస్ట్ బ్లడ్ పార్ట్ 2' వచ్చింది. ఇది కూడా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. సిల్వెస్టర్‌కి యాక్షన్ హీరోగా ముద్ర వేసింది. దీంతోపాటు వరుసగా యాక్షన్ చిత్రాలు 'కోబ్రా', 'రాంబో 3', 'లాకప్', 'టాంగో అండ్ క్యాష్', 'రాకీ 5', 'క్లిఫాంజర్', 'డెమోలిషన్', 'ది స్పెషలిస్ట్', 'అస్సాసిన్స్', 'కాప్ ల్యాండ్', 'గెట్ కార్టర్', 'డ్రైవెన్', 'రాకీ బల్బోవా', 'రాంబో 4', 'ది ఎక్స్పెండబుల్1, 2, 3', 'బుల్లెట్ టు ది హెడ్', 'ఎస్కేప్ ప్లాన్', 'గ్రుడ్జ్ మ్యాచ్', 'రాకీ' సిరీస్‌లో భాగంగా వచ్చిన 'క్రీడ్', 'క్రీడ్ 2' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో హాలీవుడ్లో తిరుగులేని యాక్షన్ హీరోగా ఎదిగారు. యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచి విశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు.
బుల్లితెరనూ అలరించిన యాక్షన్ హీరో ..
వీటితోపాటు విభిన్న కథా నేపథ్య చిత్రాలు చేశారు. అందులో 'ఓవర్ ది టాప్', కామెడీ చిత్రం 'ఆస్కార్', 'స్టాప్ ఆర్ మై మామ్ విల్ షూట్', సైన్స్ ఫిక్షన్ 'జడ్జ్ డ్రెడ్', డిజాస్టర్ థ్రిల్లర్ 'డేలైట్', 'డి టాక్స్', 'అవెంజింగ్ ఏంజెలో', 'స్పై కిడ్స్ 3డీ: గేమ్ ఓవర్'లో ప్రధానంగా ఉన్నాయి. ఇవి సిల్వెస్టర్‌కి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేకపోయాయి. స్టాలోన్ని తిరుగులేని నటుడిగా నిలిబెట్టినవి 'రాకీ', 'రాంబో', 'ది ఎక్స్పెండబుల్' వంటి యాక్షన్ చిత్రాలే కావడం విశేషం. దీంతోపాటు 'యాన్ అలాన్ స్మితీ ఫిల్మ్: బర్న్ హాలీవుడ్ బర్న్', 'ది గుడ్ లైఫ్', 'టాక్సీ 3', బాలీవుడ్‌కి చెందిన 'కంబఖ్త్ ఇష్క్' చిత్రంలో, 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ వాల్ 2' చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. 'అంట్జ్', 'జూకీపర్', 'రచెట్ అండ్ క్లాంక్', 'యానిమల్ క్రాకర్స్' వంటి యానిమేషన్ చిత్రాలకు వాయిస్‌ను అందించారు. గతేడాది 'జాన్ జి అవిల్డ్సన్: కింగ్ ఆఫ్ ది అండర్డాగ్స్' డాక్యుమెంటరీలో నటించారు. ప్రస్తుతం 'ఎస్కేప్ ప్లాన్ 3: డెవిల్స్ స్టేషన్','రాంబో 5: లాస్ బ్లాడ్' చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో 'హంటర్' ఆధారంగా ఓ చిత్రాన్ని, 'ది ఎక్స్పెండబుల్' సిరీస్‌లోని నాలుగో చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టాలోన్ బుల్లితెరపై కూడా మెరిసి ఆకట్టుకున్నారు. అందులో 'పోలీస్‌స్టోరీ', 'కోజాక్', 'డ్రీమ్ ఆన్', 'లిబర్ట్సీ కిడ్స్', 'లాస్ వేగాస్', 'సాటర్డే నైట్ లైవ్', 'దిస్ ఈజ్ హజ్' వంటి టెలివిజన్స్‌లో నటించి మెప్పించారు.
అత్యద్భుత ప్రతిభ చాటిన ఆల్‌రౌండర్..
నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. రైటర్‌గా 'ది లార్డ్ ఆఫ్ ఫ్లాట్బుష్', 'రాకీ', 'ఎఫ్ఐఎస్టీ' చిత్రాలతోపాటు 'ర్యాంబో' సిరీస్‌కి, 'కోబ్రా', 'ఓవర్ ది టాప్', 'రినెస్టోన్', 'క్లిఫాంజర్', 'డ్రైవెన్', 'ఎక్స్పెండబుల్' సిరీస్‌కి, 'హౌమ్ఫ్రాంట్', 'క్రీడ్ 2' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఇక 2005లో 'స్లై మూవ్స్' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఇందులో ఫిట్నెస్, న్యూట్రిషన్, తన వ్యక్తిగత అంతర్గత విషయాలు, తన దృష్టికోణాన్ని తెలిపారు. స్టాలోన్లో మంచి గాయకుడున్నాడు. 'పారడైజ్ ఎల్లె' చిత్రంలో 'టూ క్లోజ్ టు పారడైజ్' అనే పాటని ఆలపించారు. 'రాకీ 4'లో 'టేక్ మీ బ్యాక్' అనే పాట, 'రినెస్టోన్'లో 'డ్రింకెన్స్టీన్..', 'స్టే ఔట్ ఆఫ్ మై బెడ్రూమ్', 'వోక్ అప్ ఇన్ లైవ్','స్వీట్ లావిన్' పాటలను, 'గ్రడ్జ్ మ్యాచ్'లో 'ది స్టార్ స్పాంగ్లెడ్ బ్యానర్' అనే పాటను పాడారు. తను దర్శకత్వం వహించిన 'స్టేయింగ్ ఎలైవ్' చిత్రంతో నిర్మాతగానూ మారారు. 'డ్రైవెన్' చిత్రాన్ని చిత్ర దర్శకుడు రెన్నీ హర్లీన్‌తో కలిసి నిర్మించారు. 'హౌమ్ ఫ్రాంట్', 'క్రీడ్', 'క్రీడ్2' చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం 'స్ట్రీట్ జస్టీస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు సీరియల్స్‌ని కూడా నిర్మించారు. ఈ ఏడాది 'బల్బోవా ప్రొడక్షన్' పేరుతో స్టూడియోను స్థాపించారు. పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, టెలివిజన్స్, సినిమాలు ఈ స్టూడియోలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'రాకీ' చిత్రాలకు సినిమాటోగ్రఫీ విభాగంలోనూ పనిచేశారు. 1980లో 'టైగర్ ఐ ప్రొడక్షన్స్' పేరుతో బాక్సింగ్ ప్రమోటర్‌గా పనిచేశారు.
గాయాలు.. వివాదాలు.. పురస్కారాలు..
యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన స్టాలోన్ చాలా వరకు సొంతంగానే యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేసేవారు. ఈ క్రమంలో అనేకసార్లు గాయాలపాలయ్యారు. 'రాకీ4'లో ప్రత్యర్థి చెస్ట్‌పై పంచ్ గట్టిగా ఇవ్వడంతో నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. 'ది ఎక్స్‌పెండబుల్స్'లోని పోరాట సన్నివేశంలో మెడకు గాయమైంది. దీంతో మెడ లోపల మెటల్ ప్లేట్ అమర్చారు. 'ఎస్కేప్ టు విక్టరీ' చిత్ర సమయంలో ప్రత్యర్థి పంచ్‌ను అదుపు చేసే క్రమంలో వేలు ఇరిగింది. ఇదిలా ఉంటే, స్టాలోన్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. స్టాలోన్ నటుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్‌లో నటించారు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద వందల కోట్లు కలెక్ట్ చేశాయి. కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు ఆయన కేరాఫ్. అయితే ఎన్నో భిన్న పాత్రలు పోషించినప్పటికీ ఒక్క ఆస్కార్ కూడా రాకపోవడం గమనార్హం. ఉత్తమ నటుడుగా, స్క్రీన్‌ప్లే విభాగంలో 'రాకీ', సహాయనటుడిగా 'క్రీడ్' చిత్రాలకు ఆస్కార్‌కు ఎంపికయ్యారు. బ్రిటీష్ ఆకాడమీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఎంపికయ్యారు. కానీ 'క్రీడ్' సినిమాకిగానూ స్క్రీన్‌ప్లే విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. దీంతోపాటు అనేక ఇతర అవార్డులు వచ్చాయి. షాశా క్రాక్‌ను స్టాలోన్ తొలుత పెళ్ళి చేసుకున్నారు (వీరి పిల్లలు సాగె మూన్బ్లడ్, సీయర్). తర్వాత మోడల్, నటి బ్రిగిట్టె నీల్సెన్ను వివాహం చేసుకున్నారు. పదేండ్ల గ్యాప్ తర్వాత మోడల్, వ్యాపారవేత్త జెన్నీఫర్ ఫ్లావిన్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లున్నారు.
Authorization