షరాన్‌స్టోన్..
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన శృంగార తార.
మోడల్‌గా కెరీర్ ఆరంభించి హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా, అభిరుచిగల నిర్మాతగా అటు వెండితెర,
ఇటు బుల్లితెరపై తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టించుకుంది.అందరికీ విద్య అందుబాటులో ఉండటం కోసంస్కూళ్ళ నిర్మాణంతోపాటు ఎయిడ్స్ బాధితులకు భారీ ఆర్థిక సాయం చేసిన షరాన్ స్టోన్ గురించి
ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
మోడల్‌గా కెరీర్ ఆరంభం..
షరాన్ వోన్నె స్టోన్ అమెరికాలోని పెన్న్సీల్వానియాకు చెందిన మీడ్విల్లెలో 1958 మార్చ్ 10న జన్మించారు. తల్లి డోరాతి మేరీ అకౌంటెంట్. తండ్రి జోసెఫ్ విలియమ్ స్టోన్ 2 ఫ్యాక్టరీ వర్కర్, మ్యానిఫ్యాక్చరర్. స్టోన్‌కి అన్నయ్య మైఖేల్, తమ్ముడు ప్యాట్రిక్, చెల్లి కెల్లీ ఉన్నారు. పెన్న్సీల్వానియాలోని సీగర్ టౌన్ స్కూలో ప్రాథమిక విద్యను, ఎడిన్‌బరో యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఈ టైమ్‌లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ క్రాఫోర్డ్ కంట్రీ, మిస్ పెన్న్సీల్వానియా టైటిల్స్ గెలుచుకున్నారు. ఆ పోటీల్లో ఓ జడ్జ్ ఇచ్చిన సలహా మేరకు న్యూజెర్సీకి వచ్చి మోడల్‌గా ప్రయత్నాలు ప్రారంభించారు. న్యూయార్క్‌కి చెందిన ఫోర్డ్ మెడలింగ్ ఏజెన్సీకి సైన్ చేసి పలు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత 2016లో తన డిగ్రీ విద్యను పూర్తి చేశారు. కొన్ని రోజులకు మోడలింగ్‌కు స్వస్తి పలికి సినిమాలపై దృష్టిసారించారు.
సినిమాలు ఆదరణ పొందనప్పటికీ నటిగా మంచి గుర్తింపు..
మొదటగా వూడీ అలెన్ దర్శకత్వంలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. 1980లో ఆయన రూపొందించిన 'స్టార్‌డస్ట్ మెమొరీస్'లో చిన్న పాత్రలో మెరిశారు. పెద్దగా పేరు లేని పాత్ర. ఏడాది తర్వాత హర్రర్ చిత్రం 'డెడ్లీ బ్లెస్సింగ్'లో, 1982లో ఫ్రెంచ్ దర్శకుడు క్లాడె లెలౌచ్ రూపొందించిన 'లెస్ అన్స్ ఎట్ లెస్ ఆట్రీస్'లో నటించారు. ఇవి కూడా గుర్తింపు లేని పాత్రలే. 1983లో టెలివిజన్ సిరీస్ 'సిల్వర్ స్పూన్స్'తో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. దీంతోపాటు మరో సిరీస్ 'బే సిటీ బ్లూస్', 'రెమింగ్టన్ స్టీలె'లో నటించారు. 1984లో 'ఇర్రెకోన్సిలేబుల్ డిఫరెన్సెస్'లో ర్యాన్ ఓ నీల్, షెల్లె లాంగ్ వంటి వారితో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో విజయవంతమైన దర్శకుడు, రైటర్ భార్యగా ఫర్వాలేదనిపించుకున్నారు. 1985లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ 'కింగ్ సోలోమాన్స్ మైన్స్'లో పూర్తి స్థాయి హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో రిచర్డ్ చాంబెర్లైన్తో జోడీ కట్టారు. కానీ ఇది పరాజయం చెందింది. ఆ తర్వాత రిచర్డ్తోనే మరో అడ్వెంచరస్ 'అల్లాన్ క్వాటర్మైన్ అండ్ ది లాస్ట్ ఆఫ్ గోల్డ్'తోపాటు వరుసగా 'పోలీస్ అకాడమీ 4: సిటిజెన్స్ ఆన్ పెట్రోల్', 'కోల్డ్ స్టీల్', 'ఎబోవ్ ది లా', 'యాక్షన్ జాక్సన్', 'బిహైండ్ ది స్టార్స్', 'బ్లడ్ అండ్ సాండ్' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయి కథానాయికగా నటించినప్పటికీ ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తాచాటలేకపోయాయి. కానీ నటిగా షరాన్ స్టోన్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతోపాటు 'వార్ అండ్ రిమెంబరెన్స్' మిని సిరీస్‌లోనూ మెరిశారు.
కెరీర్‌ను మలుపు తిప్పిన టోటల్ రీకాల్ సినిమా..
దాదాపు పదేండ్ల పాటు 12 సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో ఆమె 1990లో అగ్ర నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ సరసన నటించిన సైన్స్ ఫిక్షన్ 'టోటల్ రీకాల్' భారీ విజయాన్ని అందుకుంది. స్టోన్ కెరీర్‌కి పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సక్సెస్ రావడంతో షరాన్ ఆనందానికి అవదుల్లేవు. దీంతోపాటు అవకాశాలూ అదే స్థాయిలో లభించాయి. ఏకంగా ఐదు ఆఫర్స్ ఒకేసారి వచ్చాయి. అలా 1991లో వరుసగా 'హీ సెడ్, షీ సెడ్', 'సెస్సర్స్', 'ఇయర్ ఆఫ్ ది గన్', 'డైరీ ఆఫ్ ఏ హిట్‌మ్యాన్', 'వేర్ స్లీపింగ్ డాగ్స్ లై' చిత్రాల్లో అందం, అభినయంతో మెప్పించారు. తన అందాలతో ఆడియెన్స్‌ను ఫిదా చేశారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.
బేసిక్ ఇన్స్టిక్ట్తో శృంగార తార ఇమేజ్..
ఇక 1992లో వచ్చిన ఏరోటిక్ థ్రిల్లర్ 'బేసిక్ ఇన్స్టిక్ట్' అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపింది. శృంగార ప్రధానమైన ఈ చిత్రంలోని పాత్రలో షెరాన్ అందాలకు, నటనకు మంత్రముగ్దులయ్యారు. న్యూడ్‌గా కనిపించాల్సి రావడంతో ఈ పాత్రలో నటించేందుకు చాలా మంది కథానాయికలు నో చెప్పారు. సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ స్టోన్‌కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పలు అవార్డులు కూడా వరించాయి. ఆ వెంటనే మరో ఏరోటిక్ థ్రిల్లర్ 'సిల్వర్'తోనూ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. దీంతో శృంగార తారగా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వరుసగా 'ఇంటర్సెక్షన్', 'ది స్పెషలిస్ట్', 'ది క్విక్ అండ్ ది డెడ్' చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఇందులో 'ది స్పెషలిస్ట్'లో సిల్వెస్టర్ స్టాలోన్‌తో కలిసి నటించారు. అంతేకాదు ఎమ్‌టీవీ అవార్డును సొంతం చేసుకున్నారు. 1995లో వచ్చిన 'క్యాసినో' షెరాన్ స్టోన్ కెరీర్లో పెద్ద బ్రేక్. కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రమిది. ఎపిక్ క్రైమ్‌గా రూపొందిన ఈ సినిమాకు మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించగా, రాబర్డ్ డీ నిరోతో కలిసి నటించడం విశేషం. ఇది బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
వరుస పరాజయాలతో కెరీర్లో ఒడిదుడుకులు..
'క్యాసినో'తో వచ్చిన విజయం ఎన్నో రోజులు నిలవలేదు. ఆ తర్వాత నటించిన 'డైబోలిక్', 'లాస్ట్ డాన్స్', 'స్పేర్' చిత్రాల రూపంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 1998లో నటించిన బడ్డీ కామెడీ చిత్రం 'ది మైటీ' కాస్త ఊరటనిచ్చింది. 1999లో నటించిన 'గ్లోరియా', 'ది మ్యూస్', 'సింపాటికో' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి. 2000లో ఆల్ఫాన్సో అరౌ దర్శకత్వంలో వచ్చిన 'పికింగ్ అప్ ది పీసెస్' చిత్రంలో వూడీ అలెన్, డేవిడ్ స్వ్కీమ్మర్ వంటి వారితో నటించారు. ఇది ఫర్వాలేదనిపించుకుంది. 'బ్యూటిఫుల్ జోయి' విజయాన్ని అందుకోగా, 'కోల్డ్ క్రీక్ మ్యానర్', 'ఏ డిఫరెంట్ లోయాల్టీ' చిత్రాలు పరాజయం చెందాయి. 2004లో నటించిన 'సూపర్ హీరో' చిత్రం 'క్యాట్ఉమెన్'తో మంచి మరో బ్రేక్నందుకుంది. ఇది కలెక్షన్ల పరంగా అంతగా సత్తా చాటలేనప్పటికీ నటిగా షరాన్ అగ్ర స్థానంలో నిలబెట్టింది. తిరుగులేని స్టార్ ఇమేజ్ ఆమె సొంతమైంది. 'బ్రోకెన్ ఫ్లవర్స్', 'ఆల్ఫా డాగ్' చిత్రాలు మళ్ళీ నిరాశ పరిచాయి. 'బేసిక్ ఇన్సిస్ట్ 2'లో మరోసారి ఏరోటిక్ పాత్రలో నటించి తన అందచందాలతో, అద్భుత నటనతో యూత్ మతి పోగొట్టింది. ఆమె కీలక పాత్రలో నటించిన డ్రామా చిత్రం 'బాబీ' సైతం హిట్ ఖాతాలో పడింది. ఇక వరుసగా 'వెన్ ఏ మ్యాన్ ఫాల్స్ ఇన్ ది ఫారెస్ట్', 'ఇఫ్ ఐ యాడ్ నోన్ ఐ వాజ్ ఏ జీనియస్', 'ది ఇయర్ ఆఫ్ టు నో అజ్', 'ఫైవ్ డాలర్స్ ఏ డే', 'స్ట్రీట్స్ ఆఫ్ బ్లడ్','లార్గో వించ్ 2','బార్డర్ రన్', 'లవ్లేస్', 'గాడ్స్ బిహేవింగ్ బ్యాడ్లీ', 'ఫ్యాడింగ్ గిగోలో','లవ్ ఇన్ వేగాస్', 'ఏ గోల్డెన్ బారు', 'లైఫ్ ఆన్ ది లైన్', 'మదర్ అండ్ డాటర్స్', 'రన్నింగ్ వైల్డ్', 'ఆల్ ఐ విష్', 'ది డిజాస్టర్ ఆర్టిస్టు' చిత్రాల్లో కీలక పాత్రలో మెప్పించి హాలీవుడ్లో అగ్ర నటిగా పేరుతెచ్చుకున్నారు. కాకపోతే ఇందులో పరాజయం చెందిన చిత్రాలే ఎక్కువ. ప్రస్తుతం 'వాట్ ఏబౌట్ లవ్', 'ది టేల్ ఆఫ్ ది అల్లెర్గిస్ట్ వైఫ్','సన్నీ' చిత్రాలతోపాటు మార్టిన్ స్కోర్సెస్ చిత్రంలో నటిస్తున్నారు. 'ఆల్ ఐ విష్' వంటి పలు చిత్రాల్లో సహ నిర్మాతగా వ్యవహరించిన తన అభిరుచిని చాటుకున్నారు.
బుల్లితెర ప్రేక్షకులూ ఫిదా..
షరాన్ తొలుత సినీ రంగంలోకే అడుగుపెట్టినప్పటికీ టీవీ రంగంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 'నాట్ జస్ట్ అనదర్ ఎఫైర్'తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 'సిల్వర్ స్పూన్స్', 'బే సిటీ బ్లూస్', 'రిమింగ్టన్ స్టీల్', 'ది న్యూ మైక్ హమ్మర్', 'మాగమ్, పీఐ', 'క్యాలెండర్ గర్ల్ మర్డర్స్', 'ది వేగాస్ స్ట్రిప్ వార్', 'టి. జె. హూకర్', 'మిస్టర్ అండ్ మిసెస్ ర్యాన్','వార్ అండ్ రిమెంబ్రెన్స్', 'టీయర్స్ ఇన్ ది రెయిన్', 'ది ల్యారీ సాండర్స్ షో', 'ఇఫ్ థిస్ వాల్స్ కుడ్ టాక్ 2', 'హరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రయాన్', 'ది ప్రాక్టిస్', 'వాలే ఆఫ్ ది వోల్వ్స్', 'విల్ అండ్ గ్రేస్', 'హఫ్', 'లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్ యూనిట్', 'ఏజెంట్ ఎక్స్', 'మోసాక్' వంటి టెలివిజన్స్తో బుల్లితెరపై మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు. షరాన్ మంచి నటిగా కంటే చెత్త నటిగానే ఎక్కువ అవార్డులు అందుకున్నారు. 'ఇంటర్సెక్షన్', 'ది స్పెషలిస్ట్', 'బేసిక్ ఇన్సిక్ట్ 2' చిత్రాలకు గానూ వరస్ట్ నటిగా గోల్డెన్ రాస్బెర్రీ అవార్డు, 'బాబీ' చిత్రానికి ఎన్సెంబుల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, 'బేసిక్ ఇన్స్టిక్ట్' చిత్రానికి రెండు ఎంటీవీ అవార్డులు, 'ది ప్రాక్టిస్' చిత్రానికి ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుతోపాటు పలు ఇతర పురస్కారాలు వరించాయి.
సాఫీగా సాగని వ్యక్తిగత జీవితం..
నటిగా, మోడల్‌గా, నిర్మాతగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న షరాన్ వ్యక్తిగత జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. నిర్మాత మైఖేల్ గ్రీన్బర్గ్, విలియమ్ జె మెక్ డోనాల్డ్, బాబ్ వాగర్లతో స్నేహం పెళ్ళి వరకు వెళ్ళలేకపోయాయి. చివరకు ది సాన్‌ఫ్రాన్సిస్కో ఎక్జామినర్ వార్తా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫిల్ బ్రోన్స్టీన్ను పెళ్ళి చేసుకున్నారు. ఈ ఇద్దరు కలిసి అబ్బాయి రాన్ జోసెఫ్‌ను దత్తత తీసుకున్నారు. వీరి మధ్య గుర్తింపుకు సంబంధించిన బేధాభిప్రాయాల వల్ల 2004లో విడిపోయారు. ఆ తర్వాత స్టోన్ లయర్డ్ వోన్నె, క్విన్న్ కెల్లీ స్టోన్ అనే ఇద్దరబ్బాయిలని స్టోన్ దత్తత తీసుకున్నారు. 2001లో స్టోన్ బ్రెయిన్లో రక్త స్రావంతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత చికిత్స ద్వారా కోలుకున్నారు.
సెక్సీయెస్ట్ స్టార్స్ ఆఫ్ ది సెంచరీలో స్థానం..
షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్టిక్ట్', 'సిల్వర్', 'ది స్పెషలిస్ట్' వంటి చిత్రాల్లో అశ్లీలంగా కనిపించి సెక్స్ సింబల్‌గా పేరుతెచ్చుకుంది. ఫ్యాషన్ మ్యాగజీన్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కవర్ పేజీ ఫొటోలతో పాఠకుల మతి పోగొట్టారు. వోగ్, ప్లేబారుతోపాటు హర్సర్ బజార్ మ్యాగజీన్లకు న్యూడ్‌గా ఫొజులిచ్చి హాట్ టాపిక్‌గా మారారు. 1992లో పీపుల్ మ్యాగజీన్ ప్రకటించిన 50 మంది అత్యంత బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ జాబితాలో స్థానం సంపాదించారు. 1995లో ఎంపైర్ మ్యాగజీన్ ప్రకటించిన 100సెక్సీయెస్ట్ స్టార్ ఇన్ ఫిల్మ్ హిస్టరీ జాబితాలో ఒకరిగా, టాప్ 100 ఫిల్మ్ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో ఒకరిగా నిలిచారు. ప్లేబారు మ్యాగజీన్ ప్రచురించిన 25సెక్సీయెస్ట్ స్టార్స్ ఆఫ్ ది సెంచరీలో ఒకరిగా నిలిచారు.
పాపులారిటీతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 2006లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమన్ పెర్సెతో కలిసి ఇజ్రాయిల్‌లో శాంతి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పీస్ సమ్మిట్ అవార్డు అందుకున్నారు. ఆఫ్రికాలో 28 స్కూల్ బిల్డింగ్లు నిర్మించారు. టాంజానియా దేశంలో దోమల ఇబ్బంది నుంచి రక్షణ కోసం దోమ తెరలకు రెండు లక్షల యాభై వేల డాలర్లు ఇచ్చారు. అలాగే 2008లో చైనాలో భూకంపం సంభవించిన నేపథ్యంలో ఆ ఏడాది జరిగి కేన్స్‌లో దీనిపై అసభ్య పదజాలంతో మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు చైనాలో ఆమె మార్కెట్ పూర్తిగా పడిపోయింది. యాడ్స్ కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత క్షమాపణలు తెలిపారు.
Authorization