లియోనార్డో డికాప్రియో..ఈ పేరు వినగానే ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'టైటానిక్' సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఎన్నో భిన్న చిత్రాల్లోని అద్భుతమైన విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఆస్కార్ విజేత. నటుడిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పర్యావరణ ప్రేమికుడిగా, సామాజిక సేవకుడిగా
రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నలియోనార్డో డికాప్రియో గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
నట విశ్వరూపం చూపించారు. బాలనటుడిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం..
లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో 1974 నవంబర్ 11న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించారు. కామిక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, కామిక్స్ ఆర్టిస్టు జార్జ్ డికాప్రియో, లీగల్ సెక్రెటరీ ఐర్మిలిన్ల ఏకైక తనయుడు. ఏడాది వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో డికాప్రియో అమ్మ దగ్గరే పెరిగాడు. కొడుకుని పోషించేందుకు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. యుసిఎల్ఏ ల్యాబ్ స్కూల్, జాన్ మార్షల్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. నాలుగేండ్లపాటు లాస్ ఏంజెల్స్ సెంటర్ ఫర్ ఎన్రిచ్ స్టడీస్ కోసం జాయిన్ అయ్యారు. కానీ మధ్యలోనే మానేసి జనరల్ ఈక్వెలెన్సీలో డిప్లొమా చేశారు. డికాప్రియో చిన్నతనం ఎక్కువగా మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే సాగింది. డికాప్రియో సినీజీవితం బాలనటుడిగానే ప్రారంభమైంది. తన ఐదేండ్ల వయసులో బాలల టెలివిజన్ సిరీస్ 'రాంపర్ రూమ్'లో నటించే ఛాన్స్ వచ్చి మిస్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్, చిన్న చిన్న ఎడ్యూకేషనల్ చిత్రాల్లో నటించారు. 1989లో టెలివిజన్ షో 'ది న్యూ లస్సీ'లో రెండు ఎపిసోడ్స్‌లో కనిపించారు. 1990 తర్వాత టెలివిజన్స్‌లో రెగ్యులర్‌గా నటించే అవకాశాలు వచ్చాయి. 'ది ఔట్‌సైడర్స్'లో, 'సాంటా బర్బరా'లో నటించి ఆకట్టుకున్నారు. మరో టెలివిజన్ ఫిల్మ్ 'పారెంతూడ్' తనకు మంచి బ్రేక్ ఇచ్చింది. దీనికి యంగ్ ఆర్టిస్టు అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 'ఫన్ హౌస్' అనే గేమ్ షోలోనూ నటించారు. ఇందులో నీటిలో ఓ స్టంట్‌ను స్వయంగా చేశాడు. అది పూర్తి చేసుకుని వస్తుంటే ఫిష్ అతనిపై దాడి చేయడంతో ఓ పన్ను ఊడిపోయింది.
కెరీర్లో బిగ్ బ్రేక్ ఇచ్చిన రోమియో ప్లస్ జూలియెట్..
1991లో తొలి సారి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. క్రిస్టినే పీటర్సన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ హర్రర్ కామెడీ 'క్రిట్టర్స్ 3'లో నటించారు. ఏడాది గ్యాప్ తర్వాత 'పాయిజన్ ఎవీ' చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత 'ది బార్సు లైఫ్' చిత్రంలో అగ్ర నటుడు రాబర్డ్ డీ నిరోతో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 400 మంది టీనేజ్ కుర్రాళ్ళను ఆడిషన్ చేయగా ఫైనల్‌గా డికాప్రియో ఎంపిక కావడం విశేషం. ఆయనకిది మేజర్ సినిమా. నెగటివ్ తరహా పాత్రలో మెప్పించాడు. దీంతో మంచి గుర్తింపుతోపాటు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. జానీ డెప్తో కలిసి అదే ఏడాది 'వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్' చిత్రంలో నటించారు. ఇందులోని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 1995లో షరాన్ స్టోన్, గెనె హ్యాక్‌మ్యాన్, రస్సెల్ క్రౌ, రాబర్ట్ బ్లూస్సమ్లతో కలిసి 'ది క్విక్ అండ్ ది డెడ్' అనే అమెరికన్ వెస్ట్రన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులోనూ ఆయనది మేజర్ రోలే. 1995లోనే వచ్చిన 'టోటల్ ఎక్లిప్సె'లో ఓ లీడ్ రోలో మెప్పించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పాత్రకు ముందుగా రివర్ ఫోనిక్స్‌ను అనుకున్నారు. కానీ అతని అకాల మరణంతో ఆ స్థానంలో డికాప్రియోను ఎంపిక చేశారు. ఇదే సంవత్సరం విడుదలైన మూడో సినిమా 'ది బాస్కెట్ బాల్ డైరీస్'లో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆరేండ్లలో దాదాపు ఆరు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో 1996లో వచ్చిన రొమాంటిక్ క్రైమ్ స్టోరీ 'రోమియో ప్లస్ జూలియెట్' డికాప్రియో కెరీర్లో తొలి బ్రేక్. ఇది కేవలం 14 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 147 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంతేకాదు డికాప్రియో నటించిన పూర్తి స్థాయి హీరో పాత్ర ఇదే కావడం విశేషం. ఆ వెంటనే రాబర్డ్ డీ నిరోతో కలిసి 'మార్విన్ రూమ్' చిత్రంలో నటించారు. ఇది పెద్దగా ఆదరణ పొందలేదు.
టైటానిక్‌తో అంతర్జాతీయంగా స్టార్ డమ్..
1997 తన కెరీర్లో మరుపురాని సంవత్సరం. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'టైటానిక్' ఈ ఏడాదిలోనే విడుదల కావడం విశేషం. టైటానిక్ షిప్ విషాధ నేపథ్య ప్రేమ కథతో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది. జాక్ డ్వాసన్ పాత్రలో డికాప్రియో నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ చిత్రంతో డికాప్రియో అంతర్జాతీయంగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుని క్రేజీ స్టార్‌గా నిలిచారు. ఇది అత్యధికంగా 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై ఏకంగా 11 అవార్డులను గెలుచుకున్న విషయం విదితమే. నెక్ట్స్ ఇయర్ మరో భారీ విజయం సాధించిన 'ది మ్యాన్ ఇన్ ది ఐరన్ మాస్క్' చిత్రంలో భాగమయ్యారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అదే ఏడాది వూడీ అలెన్ రూపొందించిన 'సెలెబ్రిటీ'లో చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత డ్రామా చిత్రం 'ది బీచ్'లో నటించారు. ఇది కమర్షియల్‌గా మంచి విజయం సాధించినప్పటికీ క్రిటికల్‌గా విమర్శలెదుర్కొంది. దీంతోపాటు ఇండిపెండెంట్ లఘు చిత్రం 'డాన్స్ ప్లమ్'లోనూ నటించారు. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కింది. బెర్లిన్ అంతర్జాతీయ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. 2002లో కూడా రెండు బ్లాక్ బస్టర్స్‌లో భాగమయ్యారు. అందులో ఒకటి 'క్యాచ్ మీ ఇఫ్ యు కెన్'. స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన చిత్రమిది. ఇందులో టామ్ హ్యాంక్స్, క్రిస్టోఫర్ వాకెన్లతో కలిసి నటించారు. ఇక ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో 'గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్' చిత్రంలో నటించారు. ఎపిక్ పీరియడ్ డ్రామాగా ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వీరి కాంబినేషన్లో ఇది తొలి సినిమా. మొత్తంగా ఆరు సినిమాలు వచ్చాయి. ఆ వెంటనే వరుసగా మార్టిన్ దర్శకత్వంలోనే 'ది యావియేటర్', 'ది డిపార్టెడ్' చిత్రాల్లో నటించారు. ఈ రెండూ సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. 2006లోనే ఎడ్వర్డ్ జ్విక్ దర్శకత్వంలో వచ్చిన 'బ్లడ్ డైమండ్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో 'బాడీ ఆఫ్ లైస్', స్యామ్ మెండీస్ దర్శకత్వంలో 'రివల్యూషనరీ రోడ్', మార్టిన్ స్కోర్సెస్ రూపొందించిన 'షట్టర్ ఐలాండ్', క్రిస్టోఫర్ నోలన్ 'ఇన్సెప్షన్', క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వంలో 'జె ఎడ్గర్', క్వెంటిన్ టారాంటియో తెరకెక్కించిన 'జాంగో అన్చైన్డ్', బజ్ లుహర్మాన్ దర్శకత్వంలో 'ది గ్రేట్ గాట్స్‌బై', మార్టిన్ స్కోర్సెస్ 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్', అలెజాండ్రో ఇనార్రిటు రూపొందించిన 'ది రివనెంట్' వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌లో నటించి హాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం నటిస్తున్న 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో అమెరికా మాజీ అధ్యక్షుడు థీడోర్ రూజ్వెల్ట్ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'రూజ్వెల్ట్' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
అభిరుచిగల నిర్మాతగానూ సక్సెస్..
లియోనార్డోకి నిర్మాణంపై ఆసక్తి పెరిగి 'ది అస్సాస్సినేషన్ ఆఫ్ రిచర్డ్ నిక్సాన్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. దీంతోపాటు 'ది యావియేటర్' చిత్రానికి కూడా ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి నిర్మాణంపై అవగాహన పెంచుకున్నారు. 2004లో అప్పియన్ వే ప్రొడక్షన్స్‌ను స్థాపించి 2007లో పలువురు ఇతర నిర్మాతలతో కలిసి 'ది లెవన్త్ అవర్' చిత్రాన్ని నిర్మించారు. ఇది ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత వరుసగా 'గార్డెనర్ ఆఫ్ ఈడెన్', 'ఆర్ఫాన్', 'రెడ్ రైడింగ్ హుడ్', 'రన్నింగ్ రన్నింగ్', 'ఔట్ ఆఫ్ ది ఫర్నేస్', 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్', 'బిఫోర్ ది ఫ్లడ్', 'లైవ్ బై నైట్', 'డెలిరియమ్', 'రాబిన్ హుడ్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు. 'ది ఇడెస్ ఆఫ్ మార్చ్', 'విరుంగా', 'క్యాచింగ్ ది సన్', 'కౌస్పిరేసీ', 'ది ఐవరీ గేమ్' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వీటిలో పలు ఇండిపెండెంట్ చిత్రాలు ఉండటం విశేషం. దీంతోపాటు పలు టెలివిజన్స్లోనూ నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది టీవీరంగమే కావడం విశేషం.
ఆస్కార్ అందుకున్న అగ్రనటుడు
లియోనార్డో డికాప్రియో నటనకు మొదట్నుంచి ప్రశంసలు దక్కాయి. పలు చిన్న చిన్న అవార్డులు కూడా వరించాయి. కానీ ఆస్కార్ అవార్డు కోసం దాదాపు రెండు దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. 1994లో విడుదలైన 'వాట్స్ ఈటింగ్ గిల్బెర్ట్ గ్రేప్' చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. మరో పదేండ్ల తర్వాత 'ది యావియేటర్' చిత్రానికి నటుడిగా ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. దీంతోపాటు 'బ్లడ్ డైమండ్', 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' చిత్రాలకు ఆస్కార్‌కు నామినేట్ అయినా నిరాశే ఎదురైంది. ఇక 2015లో తెరకెక్కిన 'ది రెవెనంట్' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను కైవసం చేసుకున్నారు. ఈ చిత్రానికే ఆస్ట్రేలియా అకాడమీ అవార్డు, బ్రిటీష్ అకాడమీ అవార్డు, మూడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందుకున్నారు. వీటితోపాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ని వరించాయి.
నిజ జీవితంలోనూ రొమాంటిక్ హీరో..
లియోనార్డో డికాప్రియో అనేక మంది కథానాయికలతో సంబంధాలు కొనసాగించారు. వారిలో బ్రిటీష్ సింగర్ ఎమ్మా బుంటన్, నటి బిజౌ ఫిలిప్స్, మోడల్స్ క్రిస్టెన్ జాంగ్, ఎమ్మా మిల్లర్, బ్రెజీలియన్ మోడల్ గిసెలె బండ్చెన్, ఇజ్రాయిల్ మోడల్ బార్ రెపీలి వంటి వారితో డేటింగ్ చేస్తూ నిజ జీవితంలోనూ ఆయన రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. ఇంకా పెళ్ళి చేసుకోని డికాప్రియో ప్రస్తుతం మోడల్ కమిలా మోరోన్రెతో డేటింగ్ చేస్తున్నారు. వీరి మధ్య 23 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉండటం విశేషం. ఓ హాలీవుడ్ పార్టీలో తప్పుగా ప్రవర్తించినందుకు మోడల్ అరెతా విల్సన్ డికాప్రియోను బలంగా బాటిల్‌తో కొట్టింది. ఆ ఘటనపై కేసు నమోదు కావడంతో విల్సన్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక రాజకీయ పరంగా 2004 ఎన్నికల్లో జాన్ కెర్రీకి సపోర్ట్ చేశారు. 2008 ఎన్నికల్లో బరాక్ ఒబామాకి సపోర్ట్ చేస్తూ 2300 డాలర్లు, 2012లో 5000 డాలర్లు విరాళంగా అందించారు.
సామాజిక సేవకుడు...పర్యావరణ ప్రేమికుడు..
1998లో లాస్ ఫెలిజ్లో 35వేల డాలర్లతో లియోనార్డో డికాప్రియో కంప్యూటర్ సెంటర్‌ని రూపొందించారు. ఇది లాస్ ఏంజెల్స్ పబ్లిక్ లైబ్రరీలో భాగంగా నిర్మించబడింది. 'బ్లడ్ డైమండ్' చిత్ర సమయంలో ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థలోని అనాథ పిల్లలతో పనిచేశారు. అది తన మనసును కదిలించిన సంఘటన అని తెలిపారు. అలాగే 2010లో హైతీ భూకంపం బాధితులకు ఒక మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన సంస్థ గ్లాడ్కు 61వేల డాలర్లు, గతేడాది సంభవించిన తుఫాను బాధితుల కోసం మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు. డికాప్రియో దేవుడిని నమ్మరు. కానీ పర్యావరణ ప్రేమికుడు. 'టైటానిక్' విజయం సాధించిన తర్వాత లియోనార్డో డికాప్రియో పేరుతో 1998లో ఓ ఫౌండేషన్‌ను స్థాపించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. భూమి వేడెక్కడం, పునరుత్పదక శక్తి వంటి అంశాలపై దాదాపు 40 దేశాల ప్రజలకు లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల ద్వారా అవగాహన కల్పించారు. దీనికి పలు అవార్డులను కూడా అందుకున్నారు. వన్యప్రాణి రక్షణ, స్థానిక అమెరికన్ల హక్కుల కోసం 2016లో దాదాపు 15.6మిలియన్ డాలర్లు అందించారు. అలాగే ఇతర పర్యావరణ సంస్థలు వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్, గ్లోబల్ గ్రీన్ యుఎస్ఏ, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్, నేచురల్ రీసోర్స్ డిఫెన్స్ కౌన్సిల్ వంటి సంస్థలకు తన వంతు సాయం అందిస్తున్నారు. రష్యన్ టైగర్ సమ్మిట్‌లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీకి మిలియన్ డాలర్లు అందించారు. ఆయన వద్ద ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ ఉన్నాయి. తన ఇంటి కోసం సోలార్ ఫ్లాంట్నే వాడుతున్నారు.
నట విశ్వరూపానికి వెండితెర రూపాలు..
లియోనార్డో డికాప్రియో అత్యద్భుత నటనతో ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విభిన్న కథా నేపథ్య చిత్రాల్లో విలక్షణ నటనతో అబ్బురపరిచారు. ఆయన నటనకు ప్రతిబింబంగా నిలిచిన పలు చిత్రాల గురించి..హీరోగా తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'రొమియో ప్లస్ జూలియెట్'. టీనేజ్ జంట రోమియో, జూలియెట్ ప్రేమలో పడటం ఇష్టంలేని ఇరుకుటుంబ సభ్యుల మధ్య జరిగే ఫైటింగే ఈ చిత్ర కథాంశం. రొమాంటిక్ ట్రాజెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రోమియోగా మెస్మరైజ్ చేశారు. టైటానిక్ షిప్ విషాదం బ్యాక్‌డ్రాప్‌లో ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయికి, సాధారణ కుర్రాడికి టైటానిక్ షిప్లో పుట్టిన ప్రేమ నేపథ్యంలో రూపొందిన 'టైటానిక్' చిత్రంలో మధ్యతరగతి కుర్రాడు జాక్ పాత్రలో అందరినీ ఫిదా చేశారు. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా 'ది మ్యాన్ ఇన్ ది ఐరన్ మాస్క్'లో రాజుగా, సాధారణ వ్యక్తిగా రెండు పాత్రలో తన నట వైవిధ్యం చూపించి అలరించారు. అడ్వెంచరస్ రొమాంటిక్ డ్రామా చిత్రం 'ది బీచ్'లో ప్రయాణం ఇష్టపడే కుర్రాడిగా తనదైన భిన్న నటనతో మెప్పించారు. ఏకకాలంలో డాక్టర్‌గా, లాయర్‌గా, కో పైలట్‌గా ఉంటూ మోసాల్లో ప్రసిద్ధి చెందిన అమెరికాకు చెందిన ఫ్రాంక్ డబ్ల్యూ అబంగ్నాలె జీవితం ఆధారంగా రూపొంది 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్' చిత్రంలో మోసగాడు ఫ్రాంక్ పాత్రలో విలక్షణ నటనను ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. ఎపిక్ పీరియడ్ డ్రామాగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్' చిత్రంలో ఐరీష్ వలసదారుల నాయకుడిగా, అమెరికన్ బిజినెస్ మ్యాగెట్, ఇన్వెస్టర్, రికార్డ్సెట్టింగ్ పైటల్, ఇంజనీర్, దర్శకుడు, పిలాంథ్రపిస్ట్ హౌవర్డ్ హగ్స్ జీవితం ఆధారంగా రూపొందిన 'ది యావియేటర్' చిత్రంలో హౌవర్డ్ హగ్స్ పాత్రకు ప్రాణం పోశారు. గ్యాంగ్‌స్టర్‌గా రాణిస్తున్న పోలీస్ వైటీ బల్గర్, ఫ్రాడ్ ఎఫ్‌బీఐ ఏజెంట్ జాన్ కాన్నలీ జీవితం ఆధారంగా క్రైమ్ డ్రామాగా రూపొందిన 'ది డిపార్టెడ్' చిత్రంలో అండర్ కవర్ పోలీస్‌గా గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో మెప్పించారు. పొలిటికల్ వార్ థ్రిల్లర్‌గా రూపొందిన 'బ్లడ్ డైమండ్' చిత్రంలో డైమండ్ స్మగ్లర్‌గా, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆల్ సలీమ్‌ను పట్టుకునేందుకు సీఐఏ చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'బాడీ ఆఫ్ లైస్'లో సీఐఏ ఏజెంట్‌గా అద్భుతంగా నటించారు. తమ పిల్లలు పెరిగే క్రమంలో ఓ జంట మధ్య వచ్చే స్ట్రగుల్స్‌ను తెలిపే కథాంశంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన 'రివల్యూషనరీ రోడ్' చిత్రంలో స్ట్రగుల్ పడే భర్తగా మెప్పించారు. 'షట్టర్ ఐలాండ్', 'ఇన్సెప్షన్', 'జె ఎడ్గర్', 'జాంగో అన్చైన్డ్', 'ది గ్రేట్ గాట్స్‌బై', 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్', 'ది రెవెనంట్' వంటి తదితర చిత్రాల్లోని భిన్న పాత్రలతో నట విశ్వరూపం చూపించారు.