సల్మా హయక్ అందం,అభినయంతో అత్యద్భుత భిన్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచి
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్. కమర్షియల్ సినిమాలతోపాటు సమాంతర (పార్లల్) చిత్రాల్లోనూ నటించి సత్తా చాటిన నాయిక. నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, రచయితగానూ ప్రేక్షకుల్ని, శ్రోతల్ని, పాఠకుల్ని అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మహిళల పై హింస, వలస దారులపై వివక్షపై స్ఫూర్తిదాయక పోరాటం చేసిన సల్మా హయక్ గురించి ఈ వారం దిస్తున్న
స్పెషల్ షో..
సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు..
సల్మా వర్గార్మ హయక్ జిమ్నెజ్గా మెక్సికోలోని వెరాక్రుజ్ పట్టణానికి చెందిన కోట్జాకోల్కస్లో 1966 సెప్టెంబర్ 2న జన్మించారు. సోదరుడు సమి ఫర్నీచర్ డిజైనర్. తల్లి డియానా మెడీనా గాయకురాలు, టాలెంట్ స్కౌట్ (ప్రతిభా అన్వేషకురాలు). తండ్రి సమీ హయక్ ఆయిల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవారు. ఆయనకు ఇండిస్టీయల్ ఎక్వీప్మెంట్ ఫామ్ కూడా ఉంది. లౌయిసియానాలోని ఆకాడమీ ఆఫ్ ది సాక్డ్ర్ హార్డ్ స్కూల్, రాంథాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత 12 ఏండ్ల వయసులో అమెరికాలోని క్యాథలిక్ స్కూల్‌కి వెళ్ళారు. ఆ తర్వాత మెక్సికోలోని ఓ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. చిన్నప్పట్నుంచి ఆమె డైస్లెక్సియా డిజార్డర్‌తో బాధపడేవారు. దీని వల్ల చదవడం, రాయడంలో ఆమెకు చాలా ఇబ్బంది ఏర్పడింది. జిమ్నాస్టిక్స్ ద్వారా దాన్ని అధిగమించారు. అలాగే యోగా సాధన చేశారు. సినిమా హీరోయిన్ కావాలనేది సల్మా చిన్ననాటి కోరిక. 'విల్లీ వాంకా అండ్ ది చాకోలేట్ ఫ్యాక్టరీ' సినిమాలో గెనె విల్డర్ నటనకు మంత్రముగ్ధురాలైన ఆమె సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారట. ఎన్నో స్ట్రగుల్స్ అనంతరం 23వ ఏట 1989లో 'టెరెసా' చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. దీని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దీంతో లాస్ ఏంజెల్స్‌కి వెళ్ళి అక్కడ నటిగా ప్రయత్నాలు ప్రారంభించారు.
మలుపు తిప్పిన మెక్సికన్ చిత్రం మిరాకిల్ అల్లే..
1991లో అమెరికన్ నటి, యాక్టింగ్ టీచర్ స్టెల్లా అడ్లర్ సమక్షంలో నటనలో శిక్షణ తీసుకున్నారు. అప్పటికీ ఆమెకి అంతగా ఇంగ్లీష్ రాదు. పైగా తడబాటు. కష్టపడి ఇంగ్లీష్‌పై పట్టు సాధించారు. 1994లో 'మై క్రేజీ లైఫ్' చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. అదే ఏడాది టెలివిజన్ ఫిల్మ్ 'రోడ్ రేసర్స్'లో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ వెంటనే మెక్సికోలో 'మిడాక్ అల్లే' (మిరాకిల్ అల్లే) చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇది సంచలన విజయం సాధించి అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. దీంతో సల్మాకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు హాలీవుడ్లో ఓ భారీ బంపర్ ఆఫర్‌ని కూడా తెచ్చిపెట్టింది. ప్రముఖ నటుడు ఆంటోనియో బండెరాస్ హీరోగా దర్శకుడు రాబర్డ్ రోడ్రిగ్జ్ రూపొందిన కాంటెంపరరీ వెస్టర్న్ యాక్షన్ చిత్రం 'డెస్పెరాడో'లో హీరోయిన్గా నటించారు. ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం 'ఫెయిర్ గేమ్', 'ఫోర్ రూమ్స్' చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు పోషించారు. ఆ వెంటనే 1996లో వాంపైర్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫ్రమ్ డస్క్ టిల్ డాన్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
జయాపజయాలకు అతీతంగా..
ఇక వరుసగా 'ఫాలో మి హోమ్', 'ఫ్లెడ్', 'ఫూల్స్ రష్ ఇన్', 'బ్రేకింగ్ అప్', 'సిస్టోలె డియస్టోలె' వంటి ఫెయిల్యూర్ చిత్రాల్లో నటించడంతో ఆమె కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. 1998లో మార్క్ క్రిస్టోఫర్ దర్శకత్వంలో ర్యాన్ ఫిలిప్పె హీరోగా వచ్చిన '54' చిత్ర విజయం ఆమెకు కొంత రిలీఫ్‌నిచ్చింది. అదే ఏడాది రాబర్ట్ రోడ్రిగ్జ్ రూపొందించిన 'ది ఫ్యాకల్టీ'తో మరో విజయాన్ని అందుకున్నారు.
1999లో వచ్చిన 'ది వెలసిటీ ఆఫ్ గ్యారీ' పరాజయం చెందగా, కెవిన్ స్మిత్ దర్శకత్వంలో
బెన్ అఫ్లెక్, మాట్ డామన్ హీరోలుగా రూపొందిన 'డోగ్మా', విల్ స్మిత్, కెవిన్ క్లినె హీరోగా
వచ్చిన 'వైల్డ్ వైల్డ్ వెస్ట్' చిత్రాలు భారీ విజయాలను సాధించి సల్మా కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించాయి. ఇదే ఏడాది నటించిన మెక్సికన్ చిత్రం 'నో వన్ రైట్స్ టు ది కోలోనెల్' మిశ్రమ స్పందన రాబట్టుకుంది. 2000లో ఆమె నటించిన 'టైమ్‌కోడ్', 'లివింగ్ ఇట్ అప్', 'చైన్ ఆఫ్ ఫూల్స్', 'హోటల్', 'ఇన్ ది టైమ్ ఆఫ్ ది బట్టర్‌ఫ్లైస్' వంటి వివిధ దేశాల ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయినప్పటికీ నటన పరంగా సల్మాకు
విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అగ్రనటిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..
2002 సల్మా కెరీర్లో మరుపురాని సంవత్సరం. మెక్సికన్ పెయింటర్ ఫ్రిదా కాలో జీవితం ఆధారంగా రూపొందిన 'ఫ్రిదా' చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. జులియా టామోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో ఆమె ఫ్రిదా పాత్రలో అద్భుత నటనతో ప్రపంచ ప్రేక్షకుల్ని మెప్పించారు. అనేక అవార్డులను అందుకున్నారు. ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యారు. అంతర్జాతీయంగా నటిగా మంచి గుర్తింపు పొందారు.
ఆ తర్వాత వరుసగా 'స్పై కిడ్స్ 3డి: గేమ్ ఓవర్', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో', 'ఆఫ్టర్ ది సన్‌సెట్', 'ఆస్క్ ది డస్ట్', 'బండిడాస్', 'లోన్లీ హార్ట్స్', 'ఎక్రాస్ ది యూనివర్స్', 'సర్య్కూడు ఫ్రీక్: ది వాంపైర్స్ అసిస్టెంట్', 'గ్రోన్ అప్స్', 'అమెరికానో',
'లా చిస్పా డె లా విడా', 'సావేజెస్', 'హియర్ కమ్స్ ది బూమ్', 'గ్రోన్ అప్స్ 2',
'ఎవిర్లీ', 'సమ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్', 'టేల్ ఆఫ్ టేల్స్', 'సెప్టెంబర్స్ ఆఫ్ షిరాజ్', 'బీట్రిజ్ ఎట్ డిన్నర్', 'హౌ టు బి ఏ లాటిన్ లవర్', 'ది హిట్మ్యాన్స్ బాడీగార్డ్',
'ది హమ్మింగ్‌బర్డ్ ప్రాజెక్ట్' చిత్రాలో విభిన్న పాత్రలు పోషించారు.
ఇందులో 'స్పై కిడ్స్ 3డీ: గేమ్ఓవర్', రాబర్డ్ రోడ్రిగ్జ్ దర్శకత్వంలో వచ్చిన 'వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో', 'గ్రోన్ అప్స్', ఒలివర్ స్టోన్ 'సేవేజెస్', 'హియర్ కమ్స్ ది బూమ్', 'గ్రోన్ అప్స్ 2', 'హౌ టు బి ఏ లాటిన్ లవర్', 'ది హిట్మాన్స్ బాడీగార్డ్' చిత్రాలు
ఘన విజయం సాధించి సాల్మాని హాలీవుడ్లో అగ్రనటిగా నిలబెట్టాయి.
అంతేకాదు వివిధ దేశాల సమాంతర సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.
దీంతోపాటు 'ముప్పెట్స్ మోస్ట్ వాంటెడ్'లో గెస్ట్‌గా, 'ది పైరేట్స్! ఇన్ యాన్ అడ్వెంచర్ విత్ సైంటిస్ట్స్', 'పస్ ఇన్ బూట్స్', 'కహ్లిల్ గిబ్రాన్ ది ప్రోఫెట్', 'సౌసేట్ పార్టీ' సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారు. 'వి-డే: అంటిల్ ది వాయిలెన్స్ స్టాప్స్'
అనే డాక్యుమెంటరీలో మెరిశారు. ప్రస్తుతం 'డ్రంక్ పేరెంట్స్',
'లిమిట్ పేరెంట్స్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
నిర్మాత.. దర్శకురాలు..సింగర్..
మంచి కథలను ప్రోత్సహించడం సల్మాకు ఇంట్రెస్ట్. ఇందులో భాగంగా 1999లో 'వెంటానరోసా' పేరుతో ఓ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. మెక్సికన్ చిత్రం 'నో వన్ రైట్స్ టు ది కోలోనెల్'ని నిర్మించారు. 2002లో అద్భుత విజయం సాధించిన 'ఫ్రిదా' చిత్ర నిర్మాణంలోనూ భాగమయ్యారు. 2001లో 'ఇన్ ది టైమ్ ఆఫ్ ది బట్టర్‌ఫ్లైస్'ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. 2003లో దర్శకురాలిగానూ మారి 'ది మాల్డోనాడో మిరాకిల్' అనే షోటైమ్ మూవీని రూపొందించారు. దీనికిగానూ డే టైమ్ ఎమ్మీ అవార్డునందుకున్నారు. 2005లో మ్యూజిక్ వీడియో 'ప్రిన్స్'ను రూపొందించారు. 'అగ్లీ బెట్టీ' అనే టెలివిజన్ సిరీస్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 'కహ్లిల్ గిబ్రాన్స్ ది ప్రొఫెట్' చిత్రాన్ని నిర్మించారు. 'సెప్టెంబర్స్ ఆఫ్ షిరాజ్'కి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సల్మా నిర్మాత, దర్శకురాలే కాదు మంచి సింగర్ కూడా. 'డెస్పెరాడో' చిత్రంలో ఒక పాట కూడా పాడి శ్రోతల్ని ఆకట్టుకున్నారు. 'ఫ్రిదా', 'వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో', 'ఎక్రాస్ ది యూనివర్స్' చిత్రాల్లో పాటలు పాడి తన అద్భుతమైన గానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే 'టెరెసా', 'డ్రీమ్ ఆన్', 'ది సింబాడ్ షో', 'రోడ్రేసర్స్', 'ది హంచ్బ్యాక్', 'ఇన్ ది టైమ్ ఆఫ్ ది బట్టర్‌ఫ్లైస్', 'అగ్లీ బెట్టీ', '30రాక్' వంటి టెలివిజన్స్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.
స్ఫూర్తిదాయక సమాజ సేవకురాలు..
ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాన్సోయిస్ హెన్రీ పినాల్ట్ని పెళ్ళి చేసుకున్న హయక్ యూనిసెఫ్ తరఫున పనిచేశారు. పుట్టబోయే పిల్లలు ఎలాంటి అనారోగ్యంతో పుట్టకుండా తీసుకోవాల్సిన వాక్సిన్లపై అవగాహన కల్పించారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలపై హింసకు, వలసదారుల వివక్షపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. దీని కోసమై 25 వేల డాలర్లు డోనేట్ చేశారు. యాంటి డొమెస్టిక్ వయిలెన్స్ గ్రూప్స్‌కి యాభై వేల డాలర్లు విరాళంగా అందించారు. మహిళా హింసకు వ్యతిరేకంగా ఏర్పడ్డ 'వీడే' సంస్థలో బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. శిశువులకు అమ్మ పాలను ప్రోత్సహించారు. సల్మా చేస్తున్న సేవలకుగానూ వీహెచ్ 1 డు సమ్‌థింగ్ అవార్డును 2010లో అందుకున్నారు. 2014లో అఫ్ఘనిస్తాన్‌లో, 2015లో లెబనాన్‌లో మహిళా హక్కుల కోసం పోరాడారు. 'ఫ్రిదా' సినిమా టైమ్‌లో తనను నిర్మాత హార్వే వీన్‌స్టీన్ వేధించినట్టు గతేడాది హయక్ ఆరోపించారు. దీంతోపాటు పలు కాస్మోటిక్, బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్‌లకు అధికార ప్రతినిధిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. జ్యూస్ కంపెనీని స్థాపించారు. జ్యూస్‌కి సంబంధించి 'ది జ్యూస్ జనరేషన్: 100 రిసిప్స్ ఫర్ ఫ్రెష్ జ్యూసెస్, అండ్ సూపర్ ఫుడ్ స్మూథీస్' అనే పుస్తకాన్ని రాశారు. సల్మా నటనకు అనేక అవార్డులు వరించాయి. 2007లో హలీవుడ్లో అత్యంత శక్తివంతమైన లాటిన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల్లో నాలుగో స్థానం దక్కించుకున్నారు. అత్యంత సెక్సీయెస్ట్ కథానాయికగానూ నిలిచారు. 2008లో ఉమెన్ ఇన్ ఫిల్మ్ ల్యూసీ అవార్డునందుకున్నారు. 2011లో నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లీజన్ ఆఫ్ హోనర్ పురస్కారంతోపాటు ఈ ఏడాది వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్రాన్స్ జోజ్జాని అవార్డునందుకున్నారు.
Authorization