ప్రస్తుతం సౌత్ కొరియా చిత్ర పరిశ్రమలో అత్యంత క్రేజీ స్టార్‌గా, యువతరం కలల రాణిగా రాణిస్తున్న పార్క్ ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె కెరీర్ టీవీ రంగం నుంచే ప్రారంభమైనా సినిమాల్లోనూ భిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'లవ్ ఫోబియా'. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో కీలక పాత్రలో పార్క్ నటించారు. ఇక పూర్తి స్థాయి హీరోయిన్గా నటించిన చిత్రం 'ఎవిల్ ట్విన్'. ఓ ప్రమాదం కారణంగా ఇద్దరు కవల బాలికల్లో ఒకరు చనిపోతే, మరొకరు కోమాలోకి వెళతారు. 10 ఏండ్ల తర్వాత కోమా ఆ బాలిక బయట పడుతుంది. కానీ ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు పోతాయి. అందుకు కారణం ఎవరు?, దెయ్యంగా మారి వెంటాడుతున్న మరో అమ్మాయి ఎవరనేది సినిమాలో ఆసక్తికరం. ఇందులో కవలల పాత్రల్లో పార్క్ నటించి ఆకట్టుకున్నారు. దెయ్యంగా ఆమె ప్రదర్శించిన నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది. తమకి నచ్చిన అమ్మాయిని, లేక అబ్బాయిని ప్రేమలో పడేసేందుకు ఇబ్బంది పడుతున్న యువతకి ప్రేమలోని మెళకువలను నేర్పేందుకు ఓ సంస్థ ఏర్పడుతుంది. వారికి టెక్నిక్స్ నేర్పించి ప్రేమని సఫలం చేసే క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారంగా రూపొందిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'సైరానో ఏజెన్సీ. ఇందులో ప్రేమికులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ 'సౖౖెరానో ఏజెన్సీ'లో ట్రైన్ చేసే అమ్మాయిగా పార్క్ తనదైన మెచ్యూర్డ్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు.
ఓ మర్డర్ కేసు, రేప్ కేసుతో శిక్ష పడి జైల్లో ఉన్న మతిస్థిమితంలేని తండ్రికి, అతని కూతురికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రం 'మిరాకిల్ ఇన్ సెల్ నెంబర్ 7'. ఇందులో మతిస్థిమితం కోల్పోయిన తండ్రికి కూతురిగా అడల్ట్ పాత్రలో, కిడ్నాప్ చెర నుంచి బయటపడ్డ ఇన్నోసెంట్ అమ్మాయిగా పార్క్ నటన కట్టిపడేస్తుంది. ఇద్దరు మోడ్రన్ టైలర్స్ రాజకుమారుడు, రాజకుమారిలకీ నవ్యమైన రాజదుస్తులు డిజైన్ చేస్తూ మన్ననలు పొందుతుంటారు. ఈ క్రమంలో ఓ యువ టైలర్ రాజకుమారి మెప్పుపొందుతాడు. కానీ దీని వెనుక ఇద్దరు మహిళల మధ్య ఓ అంతర్యుద్ధమే జరుగుతుంది. ఆ అంత్యర్ధుమేంటి అనే ఆసక్తికర కథాంశంతో 'ది రాయల్ టైలర్' చిత్రం రూపొందింది. ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాణిగా పార్క్ నటన మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఓ ఫర్నీచర్ డిజైనర్ ప్రతి రోజు ఉదయం ఒక్కో శరీరాకృతితో నిద్ర లేస్తుంటాడు. ఓ రోజు యువకుడిగా, మరో రోజు అమ్మాయిగా, మరో రోజు వృద్ధుడిగా, ఇలా విభిన్న దేహాలతో అందరిని ఆశ్చర్య పరుస్తున్న అతన్ని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే ఇతివృత్తంతో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది బ్యూటీ ఇన్సైడ్'లో ఓ విభిన్న పాత్రలో అతిథిగా మెరిశారు.
వ్యక్తిగత ఘర్షణల కారణంగా అన్నదమ్ములు విడిపోతారు. తమ్ముడు జ్యూడో ప్లేయర్. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నప్పుడు గాయమై శాశ్వతంగా కంటిచూపుని కోల్పోతాడు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని విడిపోయిన అన్న భావిస్తాడు. అయితే తనకి కాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో తమ్ముడిని రియో ఒలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలపడం కోసం అన్న పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో రూపొందిన కామెడీ డ్రామా 'మై అన్నోయింగ్ బ్రదర్'. ఇందులో అథ్లెట్‌కి ప్రియురాలిగా తనదైన అందం, అభినయంతో పార్క్ మెప్పించారు. సంపన్న వ్యాపారవేత్త కుమార్తె ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. దాన్నుంచి బయటపడేందుకు జరిగే న్యాయ పోరాటం, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా 'హార్ట్ బ్రోకెన్డ్' చిత్రంలో హత్య కేసులో ఇరుక్కున అమ్మాయిగా పార్క్ తన నట విశ్వరూపం చూపించారు. ఓ చెడ్డ అబ్బాయికి మంచి అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథాంశంతో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ 'వన్ పర్ఫెక్ట్ డే'లో ప్రియురాలి పాత్రలో పార్క్ అలరించారు.
Authorization