అన్నే హాత్వే..
విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన హాలీవుడ్ స్టార్ కథానాయిక. ఇండ్రస్టీ వర్గాలు సెక్స్ సింబల్ ఇమేజ్‌ని ఆపాదించినా ఏమాత్రం లెక్కచేయని రెబల్ ఆర్టిస్ట్.నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరించింది.స్టార్ హీరోలకు దీటుగా అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా రికార్డ్ సృష్టించింది. బాలికల సంక్షేమం, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న రియల్ లైఫ్ కథానాయిక అన్నే హాత్వే గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ..
అన్నే జాక్వెలిన్ హాత్వే న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో నవంబర్ 12, 1982లో జన్మించారు. తండ్రి గెరాల్డ్, లేబర్ ఆటార్నీ. తల్లి కేట్, మాజీ నటి. వీరి ముగ్గురు సంతానంలో హాత్వే రెండో కూతురు. పెద్దన్నయ్య మైఖేల్, తమ్ముడు థామస్ ఉన్నారు. ఆరేండ్ల వయసులో తల్లి కేట్ 'లెస్ మిసెరబుల్స్'లో నటించారు. అది చూసిన అన్నేకి యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. అయితే అన్నేని సినిమా రంగంలోకి పంపించడం తల్లికి ఇష్టం లేదు. అంతేకాదు తల్లి కేట్ కూడా నటనకు ఫుల్స్టాప్ పెట్టారు. రోమన్ క్యాథలిక్‌లో స్ట్రాంగ్ వ్యాల్యూస్‌ని తనకి నేర్పించినప్పటికీ, నటనపై ఆసక్తితో వాటిని వదిలేశారు. మొదటి ప్రయారిటీగా యాక్టింగ్‌నే పెట్టుకున్నారు. గ్రాడ్యూయేషన్ టైమ్‌లోనే పలు నాటకాల్లో నటించారు. తొలిసారిగా మ్యూజికల్ కామెడీ 'వన్స్ అపాన్ ఏ మ్యాట్రెస్'లో నటించారు. తర్వాత 'జేన్ ఐర్', 'గిగి' వంటి నాటకాలతో మెప్పించారు. 1993లో అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్‌లో డ్రామా కోర్స్ చేశారు. ఇలా థియేటర్ కంపెనీ ది బారో గ్రూప్‌లో జాయిన్ అయిన తొలి టీనేజర్‌గా అన్నే నిలిచారు. దీంతోపాటు ఇంగ్లీష్ మేజర్, పొలిటికల్ సైన్స్ మైనర్‌గా మాస్టర్స్ చేశారు. యాక్టింగ్ సైడ్ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంగ్లీష్ టీచర్‌గాని లేదా సైకాలజిస్ట్గాని అవ్వాలనుకున్నారట. అన్నేకి అలనాటి తార జ్యూడీ గార్లాండ్ ఫేవరేట్ నటి.
గుర్తింపు తెచ్చిన ది ప్రిన్సెస్ డైరీస్..
ఫాక్స్ టెలివిజన్‌లో వచ్చే 'గెల్ రియల్' సిరీస్‌లో కాస్ట్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత అనేక ప్రయత్నాల ఫలితంగా 2001లో వచ్చిన 'ది ప్రిన్సెస్ డైరీస్' చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం దక్కింది. తొలి చిత్రమే గ్రాండ్ సక్సెస్ సాధించడంతో మంచి పేరు వచ్చింది. ఇదే ఏడాది 'ది ఆదర్ సైడ్ ఆఫ్ హెవెన్'లో నటించి మెప్పించారు. ఇది సంచలన విజయం సాధించి అన్నేకి మరింత గుర్తింపు తెచ్చింది. 'నికోలస్ నికుల్బే', 'ఎల్లా ఎన్‌చాంటెడ్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. తర్వాత 'ది ప్రిన్సెస్ డైరీస్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
గెట్ స్మార్ట్‌తో స్టార్ ఇమేజ్ సొంతం..
టైప్ కాస్ట్ రోల్స్‌కి తను ప్రారంభం నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగా 2005లో డ్రామా ప్రధానంగా రూపొందిన 'హవోక్'లో నటించారు. ఇందులో పలు సన్నివేశాల్లో న్యూడ్‌గా కనిపించారు. సినిమాకవి చాలా కీలకం కావడంతో అన్నే ఒప్పుకున్నారు. ఇదే ఏడాది ఆంగ్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రోక్‌బ్యాక్ మౌంటేన్'లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. సినిమా పెద్ద హిట్ కావడంతో మంచి పేరొచ్చింది. 2006లో 'ది డెవిల్ వియర్స్ ప్రడా' చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అన్నే కెరీర్లో భారీ బ్రేక్నిచ్చిందీ చిత్రం. ఇందులో ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా నటించారు. 'నాక్డ్ ఆప్' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ స్థానంలో మరో నటి కేథరిన్ హీగ్లేని ఎంపిక చేశారు. 2007లో నటించిన బయోలాజికల్ రొమాంటిక్ డ్రామా 'బికమింగ్ జానె' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 2008లో టెలివిజన్ సిరీస్ ఆధారంగా అదే పేరుతో రూపొందిన 'గెట్ స్మార్ట్' చిత్రం బ్లాక్ బస్టర్ సాధించడంతో అన్నేకి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇదే ఏడాది నటించిన 'రచెల్ గెట్టింగ్ మ్యారీడ్', 'ప్యాసింజర్స్' చిత్రాలు ఘోర పరాజయం చెందాయి. అయితే 'రచెల్ గెట్టింగ్ మ్యారీడ్' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. నెక్ట్స్ నటించిన 'బ్రైడ్ వార్స్' సైతం ఫ్లాప్ అయ్యింది. అయితే ఇది కమర్షియల్‌గా మంచి కలెక్షన్లని సాధించింది. ఇక నటిగా అన్నేని అగ్ర స్థానంలో నిలబెట్టిన చిత్రాలు 'వాలెంటైన్స్ డే', 'అలైస్ ఇన్ వండర్లాండ్'.
డార్క్ ఫాంటసీ అడ్వెంచర్‌గా వచ్చిన 'అలైస్ ఇన్ వండర్లాండ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందడటంతోపాటు ఏకంగా ఒక బిలియన్ డాలర్లని వసూలు చేసింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జానీ డెప్ సరసన నటించారామె. 2010లో వచ్చిన ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా 'లవ్ అండ్ అదర్ డ్రగ్స్'లో న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించారు. ఇది మంచి విజయాన్ని సాధించింది. 2011లో నటించిన 'వన్ డే' ఫర్వాలేదనిపించుకుంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హీరో చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' సంచలన విజయం సాధించింది. ఇలా వరుసగా 'లెస్ మిసెరబుల్స్', 'డాన్ జాన్' చిత్రాలతో నటిగా నిరూపించుకున్నారు.
నిర్మాతగా ఫెయిల్.. నటిగా వరుస విజయాలు..
కేట్ బార్కార్, ఫ్రోరులాండ్లని దర్శకులుగా పరిచయం చేస్తూ తనూ ఓ నిర్మాతగా మారి నటించిన చిత్రం 'సాంగ్ వన్'. ఇది బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. ఆ తర్వాత నిర్మాతగా ఏ సినిమాని నిర్మించలేదు. 2014లో నటించిన 'డాన్ పేయోట్' నిరాశ పరిచింది. అదే ఏడాది క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ఫిక్షన్ 'ఇంటర్స్టెల్లార్' భారీ బ్లాక్ బస్టర్ కావడంతో నటిగా అన్నే తిరుగులేని నటిగా ఎదిగారు. ఇలా వరుసగా 'ది ఇంటర్న్', 'అలైస్ త్రూ ది లుకింగ్ గ్లాస్', 'కోలోస్సల్', 'ఓసియన్స్ 8', 'సెరెనిటీ' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో హాలీవుడ్లో తిరుగులేని క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 'ది హస్టిల్', 'ది లాస్ట్ థింగ్ హి వాంటెడ్', 'డ్రై రన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 'ది క్యాట్ రిటర్న్స్', 'హూడ్వింక్డ్', 'రియో', 'రియో 2' వంటి యానిమేటెడ్ చిత్రాలకి వాయిస్‌ని అందించారు. 'వాలెంటినో: ది లాస్ట్ఎంపరర్', '10మౌంటేన్స్ 10 ఇయర్స్', 'గర్ల్ రైజింగ్' వంటి డాక్యుమెంటరీల్లోనూ భాగమయ్యారు. అన్నే 'ది ఉమెన్ ఇన్ వైట్', 'చిల్డ్రన్ అండ్ ఆర్ట్', 'ట్వెల్త్ నైట్', 'గ్రౌండెడ్', 'ది చిల్డ్రన్స్ మోనోలాగ్స్' వంటి నాటకాల్లో నటించారు. దీంతోపాటు 'గెట్ రియల్', 'హిట్ రికార్డ్ ఆన్ టీవీ', 'లిప్ సింక్ బ్యాటిల్', 'డాక్యుమెంటరీ నౌ'లో వంటి టెలివిజన్స్లోనూ నటించారు. అలాగే 'సాటర్డే నైట్ లైవ్' షోస్‌కి, 83వ ఆస్కార్ అవార్డుల వేడుకకి హోస్ట్‌గా వ్యవహరించారు. అన్నేలో మంచి సింగర్ కూడా ఉన్నారు. పలు ఆల్బమ్స్‌లో పాటలు పాడి ఆకట్టుకున్నారు. 'ఐ డ్రీమ్డ్ ఏ డ్రీమ్' అనే ఆల్బమ్‌లో పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. వీటితోపాటు అనేక పాటల ఆల్బమ్స్‌లో అతిథిగా మెరిసి మెస్మరైజ్ చేశారు.
మహిళల హక్కుల కోసం పోరాటం..
చైల్డ్ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా పోరాడారు. మహిళలు, బాలిక హక్కుల కోసం పలు దేశాల్లో పర్యటనలు చేపట్టారు. బాలికలు, మహిళా సాధికారత కోసం 2010లో వరల్డ్ బ్యాంక్‌తో కలిసి 'ది గర్ల్ ఎఫెక్ట్' వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 'గర్ల్ రైజింగ్' అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. లెస్బియన్, గే, బైసెక్స్వుల్, ట్రాన్స్‌జెండర్స్(ఎల్జీబీటీ)ని సపోర్ట్ చేస్తూ విరాళాలు సేకరించారు. 2016లో యుఎన్ ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గానూ ఎంపికయ్యారు. పేరెంటల్ లీవ్ కోసం పోరాడారు. చిత్ర పరిశ్రమలో వేధింపులకి వ్యతిరేకంగా 300 మంది మహిళలు చేపట్టిన కార్యక్రమంలోనూ భాగమయ్యారు. 2017 వరకు నటించిన సినిమాలు 6.4 బిలియన్ డాలర్లని వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కథానాయికగా అన్నేని నిలబెట్టాయి. 2015-17 వరకు ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా అన్నేని పేర్కొంది. న్యూడ్‌గా, గ్లామరస్ పాత్రల్లో నటించడంతో శృంగార కథానాయికగానూ ముద్ర పడింది. అన్నే నటనకి అనేక అవార్డులు క్యూ కట్టాయి. రెండుసార్లు ఆస్కార్‌కి నామినేట్ కాగా, 'లెస్ మిసెరబుల్స్' చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ని గెలుచుకున్నారు. తనదైన స్టయిల్‌తో, యాటిట్యూడ్‌తో స్టార్ కథానాయికగా ప్రేక్షకుల్ని మనసుల్లో అన్నే సుస్థిర స్థానం సొంతం చేసుకుంది.
నట విశ్వరూపానికి వెండితెర రూపాలు
అందం, అభినయం, విలక్షణత్వం అన్నే హాత్వే సొంతం. గ్లామర్ తరహా పాత్రలే కాదు, సంఘర్షణతో కూడిన శక్తివంతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. నటించిన ప్రతి సినిమాలోనూ భిన్న పాత్రలతో అత్యంత సక్సెస్ఫుల్ కథానాయికగా ఎదిగారు. ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం 'ది ప్రిన్సెస్ డైరీస్'. టీనేజ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో యువరాణిగా, కలలు కనే అమ్మాయిగా, అమాయకత్వంతో కూడిన పాత్రలో ఆద్యంతం కడుపుబ్బ నవ్వించారు. అడ్వెంచర్ డ్రామా 'ది అదర్ సైడ్ ఆఫ్ హెవెన్'లో హీరోకి లవ్ ఇంట్రెస్ట్‌గా మెస్మరైజ్ చేశారు. ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన 'ఎల్లా ఎన్‌చాంటెడ్'లో దేవుడి బహుమతిగా పుట్టిన అమ్మాయి పాత్రలో విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు.
రొమాంటిక్ కామెడీ 'ది ప్రిన్సెస్ డైరీస్ 2: రాయల్ ఎంగేజ్మెంట్' చిత్రంలోనూ యువరాణిగా ఫన్నీ తరహా పాత్రలో కామెడీని పండించారు. గ్యాంగ్‌స్టర్ లైఫ్ స్టయిల్ని, హిప్ హాప్ కల్చర్స్ని ప్రతిబింబించే కథాంశంతో క్రైమ్ డ్రామాగా రూపొందిన 'హవోక్' చిత్రంలో గ్యాంగ్ స్టర్స్ ప్రియురాలిగా శృంగార భరిత పాత్రతో అందరినీ ఫిదా చేశారు. ఇద్దరు యువకుల మధ్య లైంగికపరమైన, భావోద్వేగ పరమైన అనుబంధం, వారి జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'బ్రోక్ బ్యాక్ మౌంటేన్'లో ఈ యువకుల్లో ఒకరి ప్రియురాలిగా, సంఘర్షణతో కూడిన పాత్రలో మెప్పించారు. దీనికి ఆంగ్ లీ దర్శకత్వం వహించడం విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్ నేపథ్యంలో కామెడీ డ్రామాగా వచ్చిన 'ది డెవిల్ వియర్స్ ప్రడా' చిత్రంలో పెద్ద ఫ్యాషన్ మ్యాగజీన్ ఎడిటర్ దగ్గర పనిచేసే గ్రాడ్యూయేట్గా విభిన్న పాత్రలో కనువిందు చేశారు. యాక్షన్ స్పై కామెడీగా పీటర్ సెగల్ దర్శకత్వంలో వచ్చిన 'గెట్ స్మార్ట్'లో స్పై పాత్రలో ఆకట్టుకోవడంతో పాటు కడుపుబ్బా నవ్వించారు.
ఆద్యంతం నాటకీయంగా రూపొందిన 'రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్'లో స్మోకింగ్, మద్యానికి బానిసైన అమ్మాయిగా, రెబల్ యాటిట్యూడ్ కలిగిన అమ్మాయిగా సంఘర్షణ పూరిత పాత్రలో అబ్బుర పరిచారు. రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ 'ప్యాసింజర్స్'లో సైకోథెరపిస్ట్‌గా విలక్షణ పాత్రలో మైమరపించారు.
రొమాంటిక్ కామెడీ 'బ్రైడ్ వార్స్'లో స్కూల్ టీచర్‌గా ఫన్నీ నటనతో ఆద్యంతం హాస్యాన్ని పండించారు. గ్యారీ మార్షల్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా రూపొందిన 'వాలెంటైన్స్ డే'లో ప్రియురాలిగా, ఫోన్ సెక్స్ ఆపరేటర్‌గా గ్లామరస్ పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. జానీ డెప్ నటించిన డార్క్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం 'అలైస్ ఇన్ వండర్లాండ్'లో వైట్ క్వీన్‌గా విలక్షణ పాత్రలో మైమరిపించారు.
ఏరోటిక్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'లవ్ అండ్ అదర్ డ్రగ్స్'లో శృంగార భరిత పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్రిటీష్ ఆమెరికన్ రొమాంటిక్ డ్రామా 'వన్డే'లో ప్రియురాలిగా, సూపర్ హీరో చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్'లో క్యాట్ ఉమెన్‌గా, సూపర్ హీరోయిన్ తరహా పాత్రలో మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఇక ఆమెకి ఆస్కార్‌ని తెచ్చిపెట్టిన మ్యూజికల్ డ్రామా 'లెస్ మిసెరబుల్స్'లో ఫ్యాక్టరీ వర్కర్‌గా, వ్యభిచార బాధితురాలిగా నటించి మెప్పించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామా 'డాన్ జాన్' చిత్రంలో కీలక పాత్రలో, అద్భుత విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ 'ఇంటర్స్టెల్లార్'లో సైంటిస్ట్‌గా, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన 'ది ఇంటర్న్'లో కార్పొరేట్ సీఈవోగా అలరించారు. ఇందులో ఆమె రాబర్ట్ డీ నిరోతో కలిసి నటించడం విశేషం. 'అలైస్ ఇన్ వండర్లాండ్'కి సీక్వెల్‌గా వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ 'అలైస్ థ్య్రూ ది లుకింగ్ గ్లాస్' చిత్రంలో వైట్ క్వీన్‌గా మరోసారి మంత్రముగ్ధుల్ని చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ 'కోలోస్సల్'లో నిరుద్యోగి రైటర్‌గా, ఆల్కహాల్‌కి బానిసైన అమ్మాయిగా, స్ట్రగులింగ్ పాత్రలో మైమరపించారు. మహిళా ప్రధానంగా రూపొందిన దోపీడీ నేపథ్య కామెడీ 'ఓసియస్స్ 8' చిత్రంలో పాపులర్ నటిగా, నియో నాయిర్ థ్రిల్లర్ 'సెరినిటీ'లో భర్తచే వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిగా ఆకట్టుకున్నారు.
Authorization