మారియన్ కొటిల్లార్డ్..
హాలీవుడ్ స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తున్న ఫ్రెంచ్ కథానాయిక. భిన్న, వైవిధ్య, విలక్షణ, ప్రయోగాత్మక పాత్రలతోవెండితెరపై అత్యద్భుత నట విశ్వ రూపాన్ని చూపిన నటి. నటిగా, గాయనిగా, రిలిక్ రైటర్‌గా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.స్ఫూర్తిదాయక సామాజిక సేవకురాలిగా, పర్యావరణ ప్రేమికురాలిగా అందరి మన్ననలు పొందిన మారియన్ కొటిల్లార్డ్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..!
సినీ నేపథ్య కుటుంబం..
మారియన్ కొటిల్లార్డ్ సెప్టెంబర్ 30, 1975లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జన్మించారు. మారియన్కి సిమాన్ అనే మరో పేరు కూడా ఉంది. తండ్రి జీన్ క్లాడె కొటిల్లార్డ్ నటుడు, టీచర్, మిమె ఆర్టిస్ట్. తల్లి నిసీమా తీలాడ్ నటి, డ్రామా టీచర్. మారియన్కి కవల సోదరులు క్వెంటిన్, గీల్లామె ఉన్నారు. మంచి కళాపోషణ ఉన్న కుటుంబం కావడంతో మారియన్కి చిన్నతనం నుంచే కళలు, నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. నాన్నతో కలిసి పలు నాటకాల్లోనూ నటించారు. థియేటర్స్‌లో నటించిన తర్వాత టెలివిజన్స్‌లో నటించే అవకాశాలు పొందారు. తొలుత టెలివిజన్ 'హైలాండర్'లో మెరిశారు.
టాక్సీతో నటిగా తొలి విజయం..
1990 నుంచి పూర్తి స్థాయి యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది. పలు టెలివిజన్స్‌లో నటించారు. 1994లో 'ది స్టోరీ ఏ బారు హు వాంటెడ్ టు బి కిస్స్‌డ్' చిత్రంలో నటించారు. ఆమెకిది డెబ్యూ చిత్రం. ఆ తర్వాత 'మై సెక్స్ లైఫ్ ఆర్ హౌ ఐ గాట్ ఇన్టు యాన్ ఆర్య్గూమెంట్' చిత్రంలో నటించే అవకాశాన్ని పొందారు. ఇది 2006లో విడుదలైంది. ఇదే ఏడాది 'ది గ్రీన్ బ్యూటిఫుల్'లో నటించారు. ఈ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో మారియన్కి అంతగా పేరు రాలేదు. దీంతో మరోసారి 'క్లోయి' అనే టెలివిజన్ ఫిల్మ్‌లో నటించారు. 1998లో వచ్చిన కామెడీ చిత్రం 'టాక్సీ'తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఇందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతోపాటు సెసర్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'టాక్సీ 2', 'టాక్సీ 3' చిత్రాల్లోనూ నటించి నటిగా ఫ్రెంచ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో రొమాంటిక్ డ్రామా 'ఫ్యూరియా', అదే ఏడాది విడుదలైన 'వార్ ఇన్ ది హైలాండ్స్' మంచి విజయాల్ని సాధించాయి. అంతేకాదు లీడ్ రోల్ పోషించిన 'వార్ ఇన్ ది హైలాండ్స్' చిత్రం ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినేషన్‌కి పంపబడింది. ప్రముఖ దర్శకుడు గిల్లెస్ పాక్వెట్ బ్రెన్నర్స్ రూపొందించిన 'ప్రెట్టీ థింగ్స్'లో కవలలుగా నటించి అలరించారు. 2002లో 'ఏ ప్రైవేట్ ఎఫైర్'తో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఫ్రెంచ్ నుంచి హాలీవుడ్‌కి..
జయాపజయాలకి అతీతంగా తన నటనతో ప్రేక్షకులతోపాటు సినీ మేకర్ల దృష్టినీ ఆకర్షించారు. అందులో భాగంగా 2003లో హాలీవుడ్లో నటించే లక్కీ ఛాన్స్‌ని దక్కించుకున్నారు. తొలుత టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన 'బిగ్ ఫిష్'లో నటించారు. ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా మంచి విజయం సాధించడంతో మారియన్కి విశేష గుర్తింపు లభించింది. అదే ఏడాది ఫ్రెంచ్‌లో నటించిన 'లవ్ మీ ఇఫ్ యు డేర్' చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది. దీంతో మారియన్ కెరీర్ మరోమారు సక్సెస్ బాట పట్టింది. ఇందులోని నటనకు 2004లో కేన్స్‌లో చోపార్డ్ ట్రోఫీ అందుకున్నారు. ఈ ఏడాది తాను నటించిన ఫ్రెంచ్ రొమాంటిక్ వార్ చిత్రం 'ఏ వెరీ లాంగ్ ఎంగేజ్మెంట్' ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'ఇన్నోసెన్స్' సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇక 'కావల్సేడ్', 'లవ్ ఈజ్
ఇన్ ది ఎయిర్', 'మేరీ', 'బర్న్ట్ ఔట్', 'ది బ్లాక్ బాక్స్', 'ఎడీ', 'టోయి ఎట్ మొయి', 'డిక్కెనెక్' చిత్రాలు వరుస పరాజయాలు చెందాయి. 2006లో హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ రూపొందించిన 'ఏ గుడ్ ఇయర్' చిత్ర విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో రస్సెల్ క్రౌ, ఆల్బర్ట్ ఫిన్నేలతో కలిసి నటించారు.
ఆస్కార్‌తో అంతర్జాతీయ ఇమేజ్..
2007లో ఫ్రెంచ్ సింగర్ ఎడిత్ పియాఫ్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 'లా వియి ఎన్ రోజ్'లో సింగర్‌గా నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఫ్రెంచ్‌లో ఇది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బెర్లిన్ అంతర్జాతీయ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సినిమా చూసిన వీక్షకులంతా మారియన్ నటనకి 15 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం విశేషం. ఇది చూసి మైల్డా క్వాల్లీ అనే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సంస్థ మారియన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్న ఫ్రెంచ్ నటిగా నిలిచారు. ఈ సినిమాతో ఆమెకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు 2008లో ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. 2009లో జానీ డెప్, క్రిస్టియన్ బాలె వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం 'పబ్లిక్ ఎనిమీస్' రూపంలో వచ్చింది. ఇది భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో మారియన్ మరింతగా ఫోకస్ అయ్యారు. ఇదే ఏడాది రిలీజ్ అయిన 'ది లాస్ట్ ఫ్లైట్' పరాజయం చెందగా, 'నైన్' ప్రశంసలందుకుంది. 2010లో 'ఇన్సెప్షన్' రూపంలో మరో భారీ బ్రేక్ దక్కింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో వంటి స్టార్ హీరోతో కలిసి నటించి మెప్పించారు. నాలుగు ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకున్న ఈ సినిమాతో మారియన్ అంతర్జాతీయంగా తిరుగులేని నటిగా ఎదిగారు. ఇలా వరుసగా 'లిటిల్ వైట్ లైస్', 'మిడ్నైట్ ఇన్ పారిస్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'ది ఇమ్మిగ్రాంట్', 'బ్లడ్ టైస్', 'టు డేస్, వన్ నైట్', 'మెక్బెత్', 'ఇట్స్ ఓన్లీ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్', 'ఫ్రమ్ ది లాండ్ ఆఫ్ ది మూన్', 'అలైడ్', 'అస్సాసిన్స్ క్రీడ్', 'రాక్ ఎన్ రోల్', 'ఇస్మాయిల్ ఘోస్ట్స్', 'ఏంజెల్ ఫేస్' వంటి చిత్రాల్లో నటించి ఫ్రెంచ్‌లోనే కాదు, హాలీవుడ్‌లోనూ అగ్ర నటిగా తనదైన ముద్ర వేశారు.
శ్రోతల్ని అలరించిన అద్భుత గాయని..
మారియన్ కొటిల్లార్డ్ నటి మాత్రమే కాదు శ్రోతల్ని అలరించిన అద్భుతమైన గాయని, రిలిక్ రైటర్ కూడా. 'ప్రెట్టీ థింగ్స్' చిత్రంలో 'లా ఫిల్లె డె జోయి' పాట పాడటంతోపాటు రచనలోనూ భాగమయ్యారు. దీంతోపాటు 'లా కొన్నె' పాటలో సింగర్‌గా నటించారు. 'లిసా' చిత్రంలో 'ఎల్ హమ్మె డి మౌర్' పాటని, 'ఏ ప్రైవేట్ ఎఫైర్'లో 'ఉనె ఎఫైరె ప్రైవె..' పాటని, 'ఎడీ'లో 'ఇట్ యాడ్ టు బి యు..', 'నైన్' చిత్రంలో 'మై హస్బెండ్ మేక్స్ మూవీస్', 'కార్డియాడ్' ఆల్బమ్‌లో 'ఫైవ్ థౌజండ్నైట్స్', 'హ్యాపీ క్రౌడ్' పాటలు ఆలపించడంతోపాటు నటించారు. కార్టియర్ క్యాంపెయిన్, లేడీ డియోర్ క్యాంపెయిన్స్‌లో పలు పాటలని ఆలపించారు. వీటితోపాటు 'పెటైట్ ఫిల్లె', 'నో రీజన్ టు క్రై ఔట్ యువర్ ఐస్', 'గివిన్ అప్', 'బెడ్స్ ఆర్ బర్నింగ్', 'మోడ్ దెన్ మీట్స్ ది ఐ', 'బ్రీత్ ఇన్', 'టేక్ ఇట్ ఆల్', 'ది ఐస్ ఆఫ్ మార్స్', 'లిలిస్ బాడీ', 'ది నెక్ట్స్ డే', 'స్నాప్‌షాట్ ఇన్ లాస్ ఏంజెల్స్' వంటి మ్యూజిక్ వీడియోలో మెరిశారు. అంతేకాదు మంచి డబ్బింగ్ ఆర్టిస్టు. తాను నటించిన చిత్రాలే కాదు, ఇతర సినిమాలకు ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో, ఇంగ్లీష్ వెర్షన్లో డబ్బింగ్ కూడా చెప్పారు.
స్ఫూర్తిదాయక పర్యావరణ ప్రేమికురాలు..
మారియన్ది గొప్ప దాతృత్వ గుణం. అంతే కాదు మంచి పర్యావరణ ప్రేమికురాలు కూడా. మాడ్ ఫాంటెనారు ఫౌండేషన్ అనే ఎన్జీవో తరపున మహా సముద్రాలను కాపాడటం గురించి, అమేజాన్ ఫారెస్ట్‌లో నివసించే ఆదివాసీయులు, ప్రజల సంస్కృతి సంప్రదాయల రక్షణ, వారి హక్కుల కోసం పోరాడే అసోసియేషన్ వేయాంగా అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ది హార్ట్ ఫౌండ్ సంస్థకి సపోర్ట్‌గా నిలిచారు. వాతావరణ మార్పులకి సంబంధించి క్లైమేట్ జస్టీస్ కోసం బెడ్స్ ఆర్ బర్నింగ్ పేరుతో నిర్వహించిన పలు షోస్‌లో సాంగ్స్ పాడి అలరించారు. పిల్లల్లో ఆటిజమ్ పోగొట్టేందుకు గోల్డెన్ హ్యాట్ ఫౌండేషన్ తరపున ప్రముఖ నటి కేట్ విన్స్లేట్ రాసిన పుస్తకం 'ది గోల్డెన్ హ్యాట్: టాకింగ్ బ్యాక్ టు ఆటిజమ్'లో తన వంతు చిత్రాలు అందించారు. పులుల సంరక్షణ కోసం, గ్రీన్‌పీస్ కోసం 'ది అమేజాన్స్ సైలెంట్ క్రైసిస్' పేరుతో యానిమేటెడ్ వీడియోని రూపొందించారు. పారిస్‌లో టెర్రరిస్ట్ ఎటాక్ సమయంలో తన వంతు సాయం అందించారు. మారియన్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. దాదాపు 300 మ్యాగజైన్స్ కవర్ పేజీల్లో ప్రచురితమయ్యారు. 'ఉమెన్ ఆఫ్ ది డెకేడ్'గా వోగ్ పారిస్ అభివర్ణించింది. 2016లో గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ నటిగా నిలిచారు. అంతేకాదు తన సినిమాలతో వరల్డ్ వైడ్‌గా 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం.
మెస్మరైజ్ చేసే విలక్షణ పాత్రలు
మారియన్ అత్యద్భుత నటి. విభిన్న పాత్రలతో విలక్షణ నటిగా పేరుతెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలే కాదు, యాక్షన్ రోల్స్, సంఘర్షణ పడే పాత్రలు, కామెడీ, ఎమోషనల్ రోల్స్‌లోనూ నటించి ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆమె నటించిన తొలి చిత్రం రొమాంటిక్ డ్రామా 'ది స్టోరీ ఆఫ్ ఏ బారు హు వాంటెడ్ టు బి కిస్డ్', డ్రామా చిత్రం 'మై సెక్స్ లైఫ్ ఆర్ హౌ ఐ గాట్ ఇన్‌టూ యాన్ ఆర్గ్యూమెంట్'లో కాలేజ్ విద్యార్థిగా, 'టాక్సీ'లో హీరోకి ప్రియురాలిగా, అసంతృప్తితో ఉండే పాత్రలో మెప్పించారు. తన నటనతో హాస్యాన్ని పండించారు. వార్ డ్రామాగా రూపొందిన 'వార్ ఇన్ ది హైలాండ్స్'లో సైనికురాలిగా ప్రధాన పాత్రలో మెస్మరైజ్ చేశారు. రొమాంటిక్ డ్రామా 'ఫ్యూరియా'లో ఎలియా అనే భిన్న పాత్రలో ఆకట్టుకున్నారు. మరోసారి కామెడీ చిత్రం 'టాక్సీ2'లో ప్రియురాలిగా అలరించారు. యుద్ధ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా 'లిసా'లో టైటిల్ పాత్రలో యువరాణిగా అబ్బురపరిచారు. నాటకీయ ప్రధానంగా రూపొందిన 'ప్రెట్టీ థింగ్స్'లో పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కవలలుగా నటించి మైమరపించారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్
'ఏ ప్రైవేట్ ఎఫైర్'లో తప్పిపోయిన మహిళగా ఆకట్టుకున్నారు. కామెడీ ప్రధానంగా వచ్చిన 'టాక్సీ3'లో మరోసారి టాక్సీ డ్రైవర్ ప్రియురాలిగా, ప్రేమలో సంఘర్షణగా పడే అమ్మాయిగా ఆకట్టుకున్నారు. రొమాంటిక్ కామెడీ 'లవ్ మి ఇఫ్ యు డేర్'లో ఇద్దరు పిల్లల తల్లిగా మెప్పించారు. ఫాంటసీ కామెడీ డ్రామా 'బిగ్ ఫిష్'లో ప్రెగెంట్ మహిళగా సంఘర్షణ పూరిత పాత్రలో ఆశ్చర్యపరిచారు. మిస్టరీ డ్రామా 'ఇన్నోసెన్స్'లో డాన్స్ టీచర్‌గా మెప్పించారు. రొమాంటిక్ వార్ 'ఏ వెరీ లాంగ్ ఎంగేజ్మెంట్' చిత్రంలో ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో అద్భుతంగా నటించారు. కామెడీ చిత్రం 'లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్' ప్రియురాలిగా వినోదాన్ని పంచారు. థ్రిల్లర్ డ్రామా 'మేరీ'లో కీలక పాత్రలో మెప్పించారు. మిస్టరీ నేపథ్యంలో వచ్చిన 'ది బ్లాక్ బాక్స్'లో నర్స్‌గా, రొమాంటిక్ కామెడీ 'ఏ గుడ్ ఇయర్'లో లోకల్ కేఫ్ ఓనర్‌గా విభిన్న పాత్రల్లో అలరించారు. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా 'పబ్లిక్ ఎనిమీస్'లో బ్యాంకులను దొంగతనం చేసే జానీ డెప్‌కి ప్రియురాలిగా, సింగర్‌గా, అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా 'ది లాస్ట్ ఫ్లైట్'లో ప్రేమ కోసం సాహస జర్నీ చేసే మహిళగా, రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా 'నైన్'లో స్టార్ హీరోయిన్గా, ఫిల్మ్ మేకర్ భార్యగా మెస్మరైజ్ చేశారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ 'ఇన్సెప్షన్'లో ప్రొఫె˜షనల్ దొంగకి భార్యగా, అనారోగ్యంతో బాధపడుతూ సంఘర్షణ పడే మహిళగా మెప్పించారు. ఫాంటసీ కామెడీ 'మిడ్నైట్ ఇన్ పారిస్'లో ఒంపుడుగత్తెగా, సూపర్ హీరో చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్'లో ఎగ్జిక్యూట్గా, ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కిన 'ది ఇమ్మిగ్రెంట్' చిత్రంలో పాలిష్ కాథలిక్ వలసదారిగా, క్రైమ్ థ్రిల్లర్ 'బ్లడ్ టైస్'లో మద్యానికి బానిసైన వ్యభిచారిగా, ఇటాలియన్ డ్రామా 'టూ డేస్ వన్ నైట్'లో వర్కింగ్ క్లాస్ వైఫ్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా సంఘర్షణ, భావోద్వేగభరిత పాత్రలో మైమరపించారు. ట్రాజెడీ చిత్రం 'మెక్బెత్'లో లేడీ మెక్బెత్గా కుమారుడిని కోల్పోయిన తల్లిగా ఆకట్టుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వార్ థ్రిల్లర్‌గా రూపొందిన 'అలైడ్'లో కమాండర్ ప్రియురాలిగా, ఫ్రెంచ్ ప్రతిఘటనా యోధురాలిగా మెప్పించారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన 'అస్సాసిన్స్ క్రీడ్'లో సైంటిస్ట్‌గా, నాటకీయంగా తెరకెక్కిన 'ఏంజెల్ ఫేస్'లో కూతురి కోసం తప్పించే తల్లిగా ఆద్యంతం భావోద్వేగభరిత, సంఘర్షణాభరిత పాత్రలో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఎటువంటి పాత్రలోనైనా సరే పరకాయం ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని మైమరచిపోయేలా చేయటంలో మారియన్ కొటిల్లార్డ్ది ప్రత్యేక స్థానం అని వేరే చెప్పక్కర్లేదు.
Authorization