ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రధాన సమస్యల్లో టెర్రరిజం ఒకటి. దీన్నో పావుగా వాడుకుంటు కొన్ని దేశాలు తమ శక్తిని చాటుతుంటే, మరికొన్ని దేశాలు దీని వల్ల సర్వం కోల్పోతున్నాయి. ఇటీవల కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతి దాడి జరగడంతో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొని అందరినీ ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఆందోళన కేవలం భారత్, పాకిస్థాన్‌కే పరిమితం కాలేదు. విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సమస్యతో అల్లాడిపోతు శాంతి కోసం నిరీక్షిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం నేపథ్యంలో ఎన్నో సినిమాలు రూపొంది విశేష ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ఉగ్రవాద విశ్వరూపాన్ని చూపిన కొన్ని చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న షో..
క్లీన్ స్కిన్
ఓ ఆత్మహుతి బాంబర్ (టెర్రరిస్ట్) భారీ విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేశాడనే సమాచారం బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి అందుతుంది. సూసైడ్ బాంబర్‌ని పట్టుకునేందుకు ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలాంటి సాహసం చేసిందనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. టెర్రరిజం ప్రధానంగా బ్రిటీష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని హడి హజాయిగ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సీక్రెట్ ఏజెంట్‌గా సీన్ బీన్ నటించారు. అభిన్, గాలేయా, ఛార్లోట్టె రాంప్లింగ్, జేమ్స్ ఫాక్స్, టుప్సెన్స్ ఇతర ముఖ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
జీరో డార్క్ థర్టీ
2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ (ట్విన్ టవర్స్)పై ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకి చెందిన ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో 2996 మంది చనిపోగా, 6వేల మంది గాయాలపాలయ్యారు. పది మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది కేన్సర్ బారిన పడ్డారు. దీంతో పగబట్టిన అమెరికా అఫ్ఘనిస్తాన్ స్థావరాల్లో ఉన్న లాడెన్‌ని గుర్తించి మట్టుబెట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. 2011 మే 2న లాడెన్‌ని అమెరికా దళాలు చంపేశాయి. మహిళా దర్శకురాలు కాథ్రిన్ బిగ్లో దీనికి దర్శకత్వం వహించడం విశేషం. థ్రిల్లర్ ప్రధానంగా సాగే ఈ సినిమా 2012లో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం 40 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 132 మిలియన్ డాలర్ల వసూలు చేసింది. సౌండ్ ఎడిటింగ్‌లో ఆస్కార్‌ని కూడా అందుకుంది. ఇందులో జెస్సికా చస్టెయిన్, జాసన్ క్లార్క్, జోయెల్ ఎడ్గ్ర్టన్, కైల్ చాండ్లర్, మార్క్ స్ట్రాంగ్, క్రిస్ ప్రాట్, జేమ్స్ గాండోల్ఫిని ప్రధాన పాత్రల్లో నటించారు.
రెడ్ స్టేట్
ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు కలిసి సరదాగా ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఓ చర్చ్ దగ్గర కొంత మంది ఉగ్రవాదులు వీరితోపాటు అక్కడున్న కొన్ని కుటుంబాలను బందీలుగా చేస్తారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్ట్‌లని ఎదుర్కొనేందుకు ఈ ముగ్గురు టీనేజ్ గర్ల్స్ ఎలాంటి సాహసం చేశారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ అమెరికన్ ఇండిపెండెంట్ యాక్షన్ హర్రర్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కెవిన్ స్మిత్ విభిన్నమైన కథాంశంతో ఓ కొత్త తరహా టెర్రరిజం బ్యాక్‌డ్రాప్ సినిమాగా రూపొందించారు. జాన్ గుడ్‌మ్యాన్, మెలిస్సా లియో, మైఖేల్ పార్క్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలతోపాటు పలు ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది.
అన్ థింకబుల్
టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. అమెరికాలోని మూడు చోట్ల ఓ ప్రముఖ టెర్రరిస్ట్ సంస్థ న్యూక్లియర్ బాంబ్లను అమర్చుతుంది. ఆ విషయాలను ఓ టెర్రరిస్ట్ వీడియో రూపంలో వెల్లడిస్తాడు. అతన్ని పట్టుకుని నిజాలను రాబట్టి, బాంబ్స్ బ్లాస్ట్ జరగకుండా చేసేందుకు ఎఫ్‌బీఐ చేసే పోరాట నేపథ్యంగా ఈ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించారు. 2010లో విడుదలైన ఈ సినిమాకి గ్రెగర్ జోర్డన్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంలో సామ్యూల్ఎల్ జాక్సన్, మైఖేల్ సీన్, కార్రీ అన్నె మోస్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకి సరైన జస్టిఫికేషన్ లేదని, ఎన్నో ప్రశ్నలను మిగిల్చిన చిత్రంగా నిలిచిందని క్రిటిక్స్ పేర్కొన్నారు.
ఫెయిర్ గేమ్
అమెరికాలోని బుష్ ప్రభుత్వం టెర్రిరజం నెపంతో ఇరాక్‌పై వినాశకర దాడులకు దిగాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని ముందుగానే న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రైటర్ జోసెఫ్ తన పేపర్లో ఆధారాలతో సహా ప్రచురిస్తారు. అయితే జోసెఫ్ భార్య వలెరీ ప్లామె సీఐఏలో ఉద్యోగి. ఆమే తన భర్తకు ఈ విషయాలను లీక్ చేసిందని సీఐఏ ఆరోపిస్తుంది. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడం ప్రధానంగా సాగే చిత్రమిది. యదార్థ సంఘటనల ఆధారంగా జోసెఫ్ సి విల్సన్ రాసిన 'ది పాలిటిక్స్ ఆఫ్ ట్రూత్' పుస్తకం ఆధారంగా బయోగ్రాఫికల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డాగ్ లిమన్ దర్శకుడు. సీఐఏ ఉద్యోగిగా నవోమి వాట్స్, ఆమె భర్త పాత్ర విల్సన్ పాత్రలో సీయన్ పెన్ నటించి అబ్బురపరిచారు. ఇది మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకున్నప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకుంది.
గ్రీన్ జోన్
2003లో ఇరాక్‌పై అమెరికా దాడి ప్రధానంగా రూపొందిన చిత్రమిది. టెర్రరిస్ట్‌లు భారీ స్థాయిలో బాంబు దాడులకు పాల్పడుతున్నట్టు వార్త వచ్చిన నేపథ్యంలో అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్, అతని బృందం దాన్ని కనిపెట్టేందుకు చేసే పోరాటం నేపథ్యం, ఈ క్రమంలో చోటు చేసుకున్న మలుపుల ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందించారు. ఇరాక్‌లో బాంబ్ దాడుల్లో అమెరికా ప్రమేయం వంటి అంశాలను ఈ చిత్రం ప్రతిబింబించింది. పాల్ గ్రీన్‌గ్రాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌గా పేర్కొన్న ప్రాంతం ప్రధానంగా టెర్రరిస్టుల దాడులు, వారిని తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం చేసే పోరాటం ఆకట్టుకుంటాయి. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించిన మ్యాట్ డామన్ నటన ఆకట్టుకుంటుంది.
ఫోర్ లయన్స్
నలుగురు వ్యక్తులు టెర్రరిస్ట్‌లుగా మారి వరుసగా విధ్వంసాలకు పాల్పడాలనుకుంటారు. వాళ్ళు ట్రైన్ అయ్యే క్రమంలో బాంబులను తయారు చేయడం, వాటిని ఉపయోగించే క్రమంలో చోటు చేసుకున్న హాస్యభరిత సన్నివేశాల సమాహారంగా రూపొందిన చిత్రమిది. ఈ బ్రిటీష్ సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రానికి క్రిస్ మొర్రిస్ దర్శకత్వం వహించారు. ఇది అనేక వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయాన్ని సాధించింది. 2010లో సినిమా విడుదలై విశేష ఆదరణ పొందింది. ఇందులో రిజ్ అహ్మద్, కయవాన్ నోవాక్, నిగెల్ లిండ్సే, అషర్ అలీ ప్రధాన పాత్రల్లో నటించి ఆద్యంతం కనువిందు చేశారు.
లోన్ సర్వైవర్
2005లో తాలిబన్ లీడర్ అహ్మద్ షాహద్ని పట్టుకునేందుకు అమెరికా ఆర్మీ మార్కస్ లుటెరెట్ నాయకత్వంలోని బృందం 'ఆపరేషన్ రెడ్ వింగ్స్' పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తారు. టెర్రరిస్టు బృందాన్ని ఏరివేసే క్రమంలో వాళ్ళు తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం వల్ల ఆపరేషన్ మొత్తం విఫలవుతుంది. ఫెయిల్యూర్ ఆపరేషన్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మార్కస్ రాసిన పుస్తకం ఆధారంగా బయోగ్రాఫికల్ వార్ డ్రామాగా దర్శకుడు పీటర్ బెర్గ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో మార్కస్ పాత్రలో మార్క్ వాల్బెర్గ్, టీమ్‌గా టేలర్ కిట్చ్, ఎమిలీ హిర్చ్, బెన్ పోస్టర్, ఎరిక్ బానా నటించారు.
అమెరికన్ స్నిప్పర్
అమెరికా మిలిటరీలోని అత్యంత శక్తివంతమైన సైనిక అధికారి క్రిస్ కైల్ జీవితం ఆధారంగా రూపొందించిన బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రమిది. ఉగ్రవాదులను ఎదుర్కొవడంలో క్రిస్ సూపర్ స్పెషలిస్ట్. నాలుగు ఆపరేషన్స్‌లో పాల్గొని దాదాపు 255 మంది ప్రత్యర్థులను అంతం చేసి రికార్డు సృష్టించారు. ఇరాక్ వార్ సమయంలోనే ఆయన క్రీయాశీలకంగా పనిచేశారు. ఆ యుద్ధంలోనే దాదాపు 160 మందిని మట్టుపెట్టారు. ఈ అంశాల ఇతివృత్తంగా క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈ చిత్రాన్ని 2014లో రూపొందించారు. క్రిస్ కైల్ పాత్రలో బ్రాడ్లీ కూపర్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. 58 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 548 మిలియన్ డాలర్లని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది.
డర్టీ వార్స్
అఫ్ఘనిస్తాన్‌లోని తీవ్రవాదులను ఏరివేసేందుకు అమెరికా మిలటరీ సైన్యం ఓ ఆపరేషన్ చేపడుతుంది. ఈ క్రమంలో సాధారణ ప్రజలు, ఇద్దరు గర్బిణీలు కూడా చనిపోతారు. అప్పట్లో వివాదాస్పదమైన ఈ ఘటన నేపథ్యంలో దర్శకుడు రిచర్డ్ రౌలే ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. జర్నలిస్ట్ జెరేమి స్కహిల్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా 'డర్టీ వార్స్: ది వరల్డ్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్' పుస్తకం రాశారు. దీని ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది 2013లో విడుదలై ప్రశంసలందుకుంది.
ది అన్నోన్ నోన్
అమెరికాకు చెందిన డిఫెన్స్ కార్యదర్శి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ జీవితం ఆధారంగా 2003లో ఇరాక్‌లో టెర్రరిస్టులను అంతం చేసేందుకు అమెరికా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లు, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ చిత్రం రూపొందింది. ఎర్రోల్ మొర్రిస్ దర్శకత్వం వహించిన ఈచిత్రం 2013లో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.
ఫ్రమ్ పారిస్ విత్ లవ్
పారిస్‌లోని అమెరికా ఎంబసీకి ఓ కొత్త అధికారి వస్తాడు. పారిస్‌లో వరుసగా బాంబ్ పేలుళ్ళు జరుగుతున్న నేపథ్యంలో టెర్రరిస్ట్‌ల దాడులని, బాంబ్ బ్లాస్ట్లని కనిపెట్టి, వారిని ఎదుర్కొనేందుకు అమెరికన్ స్పైతో కలిసి ఆ అధికారి చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ యాక్షన్ చిత్రానికి పీర్రె మోరెల్ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రధాన పాత్రల్లో జాన్ ట్రావోల్ట్, జోనాథన్ రైస్ మెయర్స్ నటించారు. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.
Authorization