వాస్తవ సంఘటనలకు అత్యద్భుత ఊహాశక్తిని జోడించి వెండితెరపై అద్భుతాలు సృష్టించిన ఎన్నో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. గ్రాండియర్ విజువల్స్‌తో ఆద్యంతం మెస్మరైజ్ చేసిన కొన్ని వెండితెర అద్భుత సైన్స్ ఫిక్షన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఆక్వామెన్
ఆక్వామెన్ సగం మనిషి, సంగం అట్లాంటీన ్(సముద్ర జీవికి జన్మించిన వ్యక్తి). సముద్రంతోపాటు భిన్న ప్రాంతాలకు, భిన్న రాజ్యాలకు ఆక్వామెన్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అండర్ వాటర్‌లో ఉన్న సామ్రాజ్యానికి కింగ్‌గా ఆక్వామెన్ ఎలా అవతరించారు? తన పుట్టుక రహస్యమేంటనే ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. విజువల్ వండర్‌గా దర్శకుడు జేమ్స్ వాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గ్రాండియర్ విజువల్స్ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలోని విజువల్స్ మైమరపిస్తాయి. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.147 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా 20వ స్థానంలో నిలిచింది. ఇక ఇందులో ఆక్వామెన్‌గా జాసన్ మోమో నటన కట్టిపడేస్తుంది.
మోర్టల్ ఇంజిన్స్
ఇది పోస్ట్ అపోకలిప్టిక్ అడ్వెంచరస్ చిత్రం. క్రిస్టియర్ రివర్స్ దర్శకత్వం వహించారు. అది పోస్ట్ అపోకలిప్టిక్(భవిష్యత్ ప్రపంచం) వరల్డ్. నగరాలు, రాజ్యాలు చక్రాలపై కదులుతుంటాయి. తమ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడులకు దిగుతుంటారు. దీన్ని ఆపేందుకు సూపర్ పవర్స్ కలిగిన ఇద్దరు కలుసుకుంటారు. వారిద్దరు కలిసి ఈ విపత్తుని ఆపేందుకు ఏం చేశారనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నగరాలు, అందమైన కోటలు సైతం చక్రాలపై కదిలే సన్నివేశాలు ఆద్యంతం కనువిందు చేస్తాయి. గతేడాది విడుదలైన ఈ విజువల్ వండర్‌లో హేరా హిల్మర్, రాబర్ట్ షీహన్, హూగో వీవింగ్, జిహాయి, రోనన్ రఫీనీ, లీలా జార్జ్ తదితరలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ విమర్శకుల మెప్పు పొందింది.
వెనమ్
అమెరికన్ సూపర్ హీరో చిత్రమిది. మార్వెల్, కొలంబియ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి రుబెన్ ఫ్లెచర్ దర్శకత్వం వహించారు. ఓ ప్రముఖ బయోలాజికల్ లైఫ్ ఫౌండేషన్ ఏలియన్ సింబయోట్తో మనుషులపై ప్రయోగాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ కవర్ చేయాలని భావిస్తాడు. ల్యాబ్‌కి వెళ్ళినప్పుడు అతనిలోకి ఓ ఏలియన్ సింబయోట్ చేరడంతో వెనమ్గా మారుతాడు. నెగటివ్ సింబయోట్తో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే వారిపై వెనమ్ చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. గతేడాది విడుదలైన ఈ సినిమాలో వెనమ్ పాత్రలో టామ్ హార్డీ, అతని ప్రియురాలిగా మిచెల్లె విలియమ్స్, విలన్‌గా రిజ్ అహ్మద్ నటించారు. వంద మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 855 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తాయి.
అరైవల్
అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ప్రపంచంలో 12 చోట్ల మిస్టీరియస్ ఏలియన్ యంత్రాలు భూమిపై దిగుతాయి. దీంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. ఏలియన్స్ వచ్చింది యుద్ధం చేయడానికా? శాంతి కోసమా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ భాషా శాస్త్రవేత్తని నియమిస్తారు. వాటితో ఆ శాస్త్రవేత్త జరిపిన మంతనాలేంటి? ఏలియన్స్ సైలెంట్‌గా ఉన్నాయా లేక విధ్వంసం సృష్టించాయా? అనేది సినిమా. డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వంలో 2016లో రూపొంది ఘన విజయం సాధించింది. 43 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 204 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో అమీ ఆడమ్స్, జెరెమీ రెన్నర్, ఫారెస్ట్ విటేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీ ఆడమ్ నటన మైమరపిస్తుంది. గ్రహాంతర వాసులతో, వాటి మేధస్సుతో కమ్యూనికేట్ చేసే సన్నివేశాలు, లాంగ్ షాట్స్, గ్రాండియర్ విజువల్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ సౌండ్ ఎడిటింగ్‌లో ఈ చిత్రం ఆస్కార్‌ని కైవసం చేసుకోవడం విశేషం.
ది మేజ్ రన్నర్
పదహారేండ్ల థామస్ ఎలివేటర్ ద్వారా ఓ అడవిలో పడిపోతాడు. అక్కడ చుట్టూ కొంత మంది టీనేజ్ కుర్రాళ్ళుంటారు. కానీ థామస్‌కి గతం ఏదీ గుర్తుండదు. తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడున్నాననే సందిగ్ధంలో ఉంటాడు. అతనున్న ప్లేస్ ఓ దట్టమైన అడవి. మ్యాజికల్‌గా, భారీ వాల్స్‌తో నిర్మితమై ఉంటుంది. దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో థామస్ ఎలా తప్పించుకున్నాడు? తాను ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు? తనతోపాటు ఉన్న వారిని ఎలా కాపాడాడు? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు వెస్ బాల్ దర్శకుడిగా మారి రూపొందించిన అమెరికన్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. విశాలమైన అడవి, భారీ గోడల వంటి నిర్మాణాలు విజువల్‌గా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇందులో థామస్ పాత్రలో డైలన్ ఓ బ్రీన్ తనదైన నటనతో మెప్పించాడు. 2014లో విడుదలైన ఈ సినిమా 34 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 350 మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
47 రోనిన్
త్రీడీ పీరియడ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కొంత మంది సమురారు గ్రూప్ తాము గురువుగా భావించే చింషింగురాను వింత శక్తులు కలిగిన ప్రత్యర్థులు చంపేస్తారు. వారిపై రివేెంజ్ తీర్చుకోవడానికి దత్తత తీసుకున్న జపాన్-ఇంగ్లీష్ జాతికి చెందిన కై చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్స్ ఎపిసోడ్స్, గ్రాండియర్ విజువల్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా కై పాత్రలో కీను రీవెస్ నటన, యాక్షన్ ఆకట్టుకుంటుంది. కార్ల్ రించ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013లో విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచి విమర్శకులను సైతం మెప్పించింది.
స్నోపియర్సర్
అది 2031వ సంవత్సరం. వాతావరణంపై జరిగిన ప్రయోగం విఫలం చెంది ప్రపంచమంతా మంచు గడ్డగా మారిపోతుంది. కానీ స్నోపియర్సర్గా పిలవబడటమే ఓ ట్రైన్‌లోని మనషులు మాత్రమే మనుగడ సాధిస్తారు. సూపర్ పవర్ కలిగి ఆ ట్రైన్ ఇంజిన్ కారణంగా ప్రపంచమంతా చుట్టేస్తుంది. అయితే ట్రైన్ చివరి బోగిల్లో పేద వర్గాలు, ముందు భాగంలో ధనికులు ఉంటారు. వీరి మధ్య ఓ రివల్యూషనరీ గ్రూప్ ఉంటుంది. వారు చేసే పోరాటం ఏంటి? రోజులు గడిచే కొద్ది మనుగడ కోసం ఎలాంటి పోరాటం జరిగిందనే ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రాన్ని బాంగ్ జూన్ హో రూపొందించారు. 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో క్రిస్ ఇవాన్, సాంగ్ కాంగ్ హో, టిల్డా స్వింటన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్తదనంతో కూడిన విజువల్స్ ఆడియెన్స్‌ని కనువిందు చేస్తాయి.
ఎబౌట్ టైమ్
టిమ్ అనే కుర్రాడు తన 21 ఏండ్ల వయసులో తమ ఫ్యామిలీకి ఉన్న టైమ్ ట్రావెల్ సీక్రెట్ గురించి తెలుసుకుంటాడు. తాను టైమ్ ట్రావెల్‌తో జర్నీ చేస్తాడు. తనకు నచ్చిన టైమ్‌లోకి, నచ్చిన వ్యక్తుల వద్దకు వెళ్తాడు. వారితో ట్రావెల్ అవుతాడు. ముందు జరిగే మిస్టేక్స్ జరగకుండా తండ్రి సలహాలతో పర్ఫెక్ట్ లైఫ్‌ని నిర్మించే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. రొమాంటిక్ కామెడీగా విజువల్ ట్రీట్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రిచర్డ్ కర్టీస్ రూపొందించారు. టిమ్ పాత్రలో డామ్నాల్ గ్లీసన్ నటించారు. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
మ్యాన్ ఆఫ్ స్టీల్
'సూపర్ మ్యాన్' సిరీస్‌లో భాగంగా వచ్చిన చిత్రమిది. క్లర్క్ కెంట్ సూపర్ మ్యాన్. తన కుమారుడి కోసం ఏలియన్ ప్రపంచం నుంచి భూమిపైకి వచ్చి సాధారణ జీవితాన్ని గడుపుతాడు. కానీ ఏలియన్ వరల్డ్‌లో చోటు చేసుకున్న ప్రమాదకర పరిస్థితుల రీత్యా మరోసారి ప్రపంచానికి తానేంటో తెలియజేయాల్సిన టైమ్ వస్తుంది. దీని కోసమై తాను ఏం చేశాడనేది సినిమా. జాక్ సిండర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ అబ్బురపరుస్తాయి. సూపర్ మ్యాన్ విన్యాసాలకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయి. సూపర్ మ్యాన్ పాత్రలో హెన్రీ కావిల్ నటించారు. 225 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 668 మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
వరల్డ్ వార్ జెడ్
అమెరికన్ అపోకలిప్టిక్ యాక్షన్ హర్రర్ చిత్రమిది. అత్యంత రాక్షస స్వభావం కలిగిన జాంబీ పాండెమిక్ (ఓ రకమైన రాక్షస స్వభావం కలిగిన మనుషులు) జనాలపై దాడి చేసి చంపేస్తూ తమ జాతిగా మార్చుకుంటారు. ఈ రేసింగ్‌లో అమెరికాకు చెందిన ఉద్యోగి గెర్రీ లానె కుటుంబం మనుగడ కోసం డెడ్లీ రేసింగ్‌లో పరిగెత్తాల్సి వస్తుంది. మరి వారి నుంచి తమ కుటుంబాన్ని గెర్రీ ఎలా కాపాడుకున్నాడు?, వారిని అంతం చేయడంలో ఆయన పాత్రేంటి అనే ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. మార్క్ ఫోస్టర్ రూపొందించిన ఈ సినిమాలో గెర్రీ పాత్రలో బ్రాడ్ పిట్ నటించారు. ఆయన నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్‌తోపాటు విజువల్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. 260 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 540 మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
లూపర్
టైమ్ ట్రావెల్ బేస్డ్గా సాగే చిత్రమిది. జోయి కిరాయి హంతకుడు. కొంత మంది కిరాయి హంతకులు ఓ సిండికేట్‌గా ఏర్పడతారు. వరుస హత్యలకు పాల్పడుతుంటారు. హత్యలు చేసి ఎలాంటి ఆధారాలు కూడా దొరక్కుండా చేయడంలో జోయి ఎక్స్పర్ట్. ఈ క్రమంలో ఓ హత్య విషయంలో తాను టైమ్ ట్రావెల్లో భాగంగా వెనక్కి రావాల్సి వస్తుంది. దీంతో ఏం జరిగిందనేది సినిమా. రియాన్ జాన్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు కనువిందు చేసే విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. యువ జోయి పాత్రలో జోసెఫ్ గార్డన్, ఓల్డ్ జోయి పాత్రలో బ్రూస్ విల్స్ నటించి మెప్పించారు. 2012లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ది హ్యాబిట్: యాన్ అన్ ఎక్స్పెక్టెడ్ జర్నీ..
ఎపిక్ హై ఫాంటసీ అడ్వెంచరస్ చిత్రమిది. 'ది హ్యాబిట్' చిత్ర సిరీస్‌లో భాగంగా వచ్చిన మొదటి చిత్రం. ఓ కల్పిత రాజ్యానికి శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. వారిని ఎదుర్కోవాలంటే బలమైన సైన్యం కావాలి. ఈ నేపథ్యంలో ఆ రాజ్యానికి చెందిన మంత్రగాడు బిల్బో బ్యాగ్గిన్స్ని నియమించి, ప్రత్యర్థులను ఎదుర్కొనే విధంగా తయారు చేస్తారు. బాగా పిరికి వాడైనా బిల్లో తన 13 మంది యుద్ధ వీరులకు నాయకత్వం వహించే క్రమంలో చోటు చేసుకున్న కామెడీ ప్రధానంగా రూపొందిన చిత్రమిది. యాక్షన్ కామెడీతో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించారు. 2012లో విడుదలైన ఈ సినిమా బిలియన్ డాలర్లని వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 35వ చిత్రంగా నిలిచింది.
Authorization