క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా జీవితాలను గడిపేస్తున్న సగటు ప్రేక్షకుడికి కాసింత వినోదాన్ని అందించే మాధ్యమాల్లో సినిమా చాలా ప్రధానమైనది. తమ సమస్యల లోకాన్ని మరచిపోయి ప్రేక్షకులు మనసారా హాయిగా నవ్వుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హాస్య ప్రధాన చిత్రాలు రూపొందాయి. అందరినీ కడుపుబ్బ నవ్వించడంతోపాటు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించిన ఎన్నో వినోద భరిత చిత్రాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని పడి పడి నవ్వుకునేలా చేసిన కొన్ని హాస్య భరిత ప్రధాన చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
పాప్‌స్టార్:
నెవర్ స్టాప్ నెవర్ స్టాపింగ్ పాపులర్ సింగర్, ర్యాపర్ కాన్నర్ తనదైన పాప్ సాంగ్స్‌తో,
ర్యాపర్ బ్యాండ్‌తో ప్రపంచ ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తుంటారు. అయితే తాను రూపొందించిన ఓ ఆల్బమ్ ఫెయిల్ అవుతుంది. దీంతో తన ఇమేజ్ మొత్తం పడిపోతుంది. పాపులారిటీ క్రైసిస్ ఎదుర్కొంటుంటాడు. అయినప్పటికీ తన స్టార్ స్టేటస్‌ని కొనసాగించేందుకు ఆయన ఏం చేశాడు? ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ హాస్యభరిత చిత్రానికి అకివ స్కాఫర్, జోర్మ టక్కోనె సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కాన్నర్ పాత్రలో ఆండీ సామ్బెర్గ్ నటించి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
నైబర్స్
ఓ జంటకి కొత్తగా బేబి జన్మిస్తుంది. తమ ముద్దుల బేబీతో వీరి జీవితం హాయిగా, సంతోషంగా సాగుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో వీరు ఉమ్మడిగా, గ్యాంగ్‌గా ఉన్న వారి నెయిబర్స్గా జీవించాల్సి వస్తుంది. నెయిబర్స్ రావడంతో వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిలో వచ్చిన కాన్ల్ఫిక్ట్ ఏంటనేది సినిమా. నికోలస్ స్టోలర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ప్రధాన చిత్రం 2014లో విడుదలైంది. కేవలం 18 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా 270 మిలియన్ డాలర్లని వసూలు చేసి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. ఇందులో జంటగా సేత్ రోగెన్, రోస్ బైర్నె నటించారు. సేత్రోగెన్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.
దిస్ ఈజ్ ది ఎండ్
ఫాంటసీ, డిజాస్టర్ కామెడీగా రూపొందిన చిత్రమిది. న్యూయార్క్ సిటీలో కొంతమంది స్నేహితులు ఓ రోజు రాత్రి పార్టీ చేసుకుంటుంటారు. అనుకోకుండా భూమి కంపించడం ప్రారంభమవుతుంది. తామున్న భవనం కూలిపోతుంది. ఆ తర్వాత భూమిలో భారీ రంధ్రాలు పడి అనేక మంది జనాలు చనిపోతారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆరుగురు స్నేహితులు ఓ గడిలో ఇరుక్కుపోతారు. అక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారనేది సినిమా కథ. ఆరుగురు వ్యక్తుల ఇబ్బందులు, వారు చేసే చేష్టలు కామెడీని పుట్టిస్తాయి. ఆద్యంతం హాస్యభరితంగా సాగే ఈ చిత్రానికి సెత్ రోగెన్, ఇవాన్ గోల్డ్బెర్గ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో నటించిన జేమ్స్ ఫ్రాంకో, జోనా హిల్, సెత్ రోగెన్, జే బారుచెల్, డాన్నీ మెక్ బ్రైడ్, క్రెగ్ రోబిన్సన్ కడుపుబ్బా నవ్వించారు. 32 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 126 మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ది వరల్డ్
స్కాట్ పిల్గ్రిమ్ రాక్ బ్యాండ్ మ్యూజీషియన్. తనదైన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు. కానీ అతనికి ఇప్పటికే ఏడుగురు లవర్స్ ఉంటారు. ఈ క్రమంలో తన డ్రీమ్ గర్ల్ పరిచయం అవుతుంది. ఆమెని ఎలాగైనా దక్కించుకోవాలని ఆశపడతాడు.ఆమెని ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన ఎక్స్ లవర్స్ రూపంలో ఏడు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనంతరం చోటు చేసుకున్న హాస్యభరిత సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ఎడ్గర్ వైట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2010లో విడుదలై మంచి విజయం సాధించింది. స్కాట్ పిల్గ్రిమ్ పాత్రలో మైఖేల్ కెరా నటన ఆద్యంతం అలరిస్తుంది.
వాట్ వి డు ఇన్ ది షాడోస్
ముగ్గురు వాంపైర్స్ (రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులు) కొన్ని వందల ఏండ్లపాటు చీకట్లో జీవిస్తుంటారు. వారు తమ జీవితంలో మార్పుని కోరుకుని, రెగ్యులర్ సొసైటీలో అందరిలా బతకాలనుకుంటారు. కానీ అనేక ఇబ్బందులు, సవాళ్ళు ఎదురవుతుంటాయి. మరి వాటిని ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా. రెగ్యులర్ లైఫ్‌లో వాళ్ళు పడే ఇబ్బందులు ఆద్యంతం నవ్విస్తాయి. హర్రర్ కామెడీగా రూపొందిన న్యూజిలాండ్ చిత్రానికి జెమైనె క్లామెంట్, టైకా వెయిటిటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2014లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఇందులో వాంపైర్స్ పాత్రల్లో జెమీనె క్లెమెంట్, టైకా వెటిటి, జోనాథన్ బ్రుగ్ నటించి ఆకట్టుకున్నారు.
విరు ఆర్ ది మిల్లర్స్
ఓ చిన్న తరహా పాట్ డీలర్ తన చుట్టూ ఉన్న వారిని కలుపుకుని ఓ ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తాడు. దాన్ని అడ్డు పెట్టుకుని మెక్సికో నుంచి అమెరికాకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అనంతరం వాళ్ళు చేపట్టిన జర్నీలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం కామెడీ ఎంటరటైనర్‌గా దర్శకుడు రాసన్ మార్షల్, తుర్బర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. డీలర్‌గా జాసన్ సుడీకిస్, ఆయన భార్యగా జెన్సీఫర్ అనిస్టర్, ఇతర ముఖ్య పాత్రల్లో విల్ పాల్టర్, ఎమ్మా రాబర్ట్స్, ఎడ్ హెల్మ్స్ నటించారు. జాసన్ చేసే కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. 2013లో విడుదలైన ఈ సినిమా 37 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 270 మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
ది వరల్డ్స్ ఎండ్
20 ఏండ్ల తర్వాత ఎపిక్ పబ్‌లో ఐదుగురు పాత స్నేహితులు కలుసుకుంటారు. అందరు కలిసి డ్రింకింగ్ మరతాన్ నిర్వహిస్తారు. ది వరల్డ్ ఎండ్ పబ్‌లో కొంత మంది ఏలియన్స్ వీరిపై దాడికి దిగుతుంటాయి. ఆ ఏలియన్స్‌ని వీరు ఎదుర్కొనే క్రమంలో చోటు చేసుకున్న హాస్యభరిత సన్నివేశాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. సైన్స్ ఫిక్షన్, కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకి ఎడ్గర్ వైట్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం హాస్యభరితంగా సాగుతూ అలరించే ఈ సినిమాలో సిమన్ పెగ్, నిక్ ఫ్రాస్ట్, పాడీ కన్సిడైన్, మార్టిన్ ఫ్రీమన్, ఎడ్డీ మార్సన్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ది నైట్ బిఫోర్
ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కలుసుకుంటారు. క్రిస్మస్ రాత్రి పార్టీ చేసుకుంటూ బాగా ఎంజారు చేస్తారు. ఆ పార్టీలో వీరి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర హాస్యభరిత పరిణామాల పరంపరే ఈ చిత్ర కథ. జోనాథన్ లెవైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలై మంచి విజయం సాధించింది. ముగ్గురు స్నేహితులుగా జోసెఫ్ గోర్డన్, సెత్ రోగెన్, ఆంటోని మాకీ నటించి తమదైన నటనతో కడుపుబ్బ నవ్వించారు.
ట్రైన్వ్రెక్
అమీ టీనేజ్ యువతి. తన తండ్రి చేసిన తప్పు కారణంగా ఫ్యామిలీ జీవితంపై విరక్తి చెందుతుంది. దీంతో సరదాగా తిరగడం, ఎంజారు చేయడం, నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం వంటి చెడు అలవాట్లకు బానిసై ఇష్టారాజ్యంగా చేస్తుంటుంది. ఇలా సాగుతున్న టైమ్‌లో ఆమెను ఓ కుర్రాడు సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. దీంతో ఆమెలో వచ్చిన మార్పేంటనే కథాంశంలో ఆద్యంతం హాస్యభరితంగా సినిమా రూపొందింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా దర్శకుడు జుడ్ అపాటౌ తెరకెక్కించారు. ఇందులో అమీ పాత్రలో అమీ స్కమర్, మంచి వ్యక్తిగా బిల్ హడర్ నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అమీ నటన ఆద్యంతం అలరిస్తుంది. 2015లో విడుదలైన ఈ సినిమా కేవలం 35 మిలియన్ డాలర్లతో రూపొంది 140 మిలియన్ డాలర్లని వసూలు చేసి సత్తా చాటింది.
22 జంప్ స్ట్రీట్
అమెరికన్ బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ చిత్రమిది. 2012లో వచ్చిన '21 జంప్ స్ట్రీట్'కి సీక్వెల్‌గా రూపొందింది. ఇద్దరు పోలీస్ అధికారులకు ఓ కాలేజ్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని పట్టుకునే డ్యూటీ పడుతుంది. వారు ఆ కాలేజ్‌కి అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా విద్యార్థులుగా వెళ్తారు. డ్రగ్స్ సప్లయర్స్‌ని కనిపెట్టే ప్రాసెస్‌లో చోటు చేసుకున్న హాస్యభరిత సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు 80 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 332 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఇందులో కామెడీ పోలీసులుగా జోనా హిల్, చిన్నింగ్ టటుమ్ నటన ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుంది.
ది ఫైనల్ గర్ల్స్
చనిపోయిన స్ట్రీమ్ క్వీన్‌గా పేరుగాంచిన పాపులర్ నటి కూతురు మాక్స్. ఆమె తన స్నేహితులతో కలిసి తన తల్లి నటించిన హర్రర్ సినిమా 'క్యాంప్ బ్లడ్‌బాత్'ని చూస్తుంటారు. సినిమా నడుస్తున్న క్రమంలో థియేటర్లో మంటలు చెలరేగుతాయి. దీంతో వీళ్ళు అక్కడ మాయా కిల్లర్ ట్రాప్‌లో ఇరుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళినా తన తల్లి నటించిన సినిమా సన్నివేశాలే కళ్ళ ముందు జరగడం, తమని చంపేందుకు ఆ కిల్లర్ వెంటాడటం జరుగుతుంటాయి. తల్లి చనిపోయిన బాధలో మాక్స్ స్నేహితులతో కలిసి ఏం చేశారనే ఆసక్తికర, హాస్యభరిత, భయానక సన్నివేశాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. దీనికి టాడ్ స్ట్రాస్ షుల్సన్ దర్శకత్వం వహించారు. మాక్స్ పాత్రలో టైస్సా ఫార్మిగా, స్నేహితులుగా అలెగ్జాండర్ లుడ్విగ్, నినా డాబ్రెవ్, అలియా షాకట్, థామస్ మిడిల్డిచ్, నటిగా మాలిన్ అకెర్మన్ నటించి ఆకట్టుకున్నారు. 2015లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్‌ని పొందడం విశేషం.
గెట్ హిమ్ టు ది గ్రీక్
ఇంగ్లీష్ రాక్ స్టార్ ఆల్డస్ స్నో ఫెయిల్యూర్లో ఉంటాడు. ఆరాన్ గ్రీన్ రికార్డ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని బాస్ తనకి రాక్‌స్టార్ ఆల్డస్ స్నోతో లాస్ ఏంజెల్స్‌లో ఓ లైవ్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేయించే టాస్క్‌ని అప్పగిస్తాడు. దాన్ని సాధ్యం చేసేందుకు వెళ్ళిన గ్రీన్ అక్కడ ఏం చేశాడు? పాప్ కల్చర్‌కి తను బానిసయ్యాడా? టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడా, లేదా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా రాక్ స్టార్‌ని తీసుకొచ్చే క్రమంలో గ్రీన్ చేసే నటన ఆద్యంతం నవ్విస్తుంది. నికోలస్ స్టాలర్ రూపొందించిన ఈ కామెడీ చిత్రం 2010లో విడుదలై మంచి విజయం సాధించింది. గ్రీన్ పాత్రలో జోనా హిల్, ఆల్డస్ పాత్రలో రస్సెల్ బ్రాండ్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.
ది ఇన్బిట్వీనర్స్ మూవీ
నలుగురు స్నేహితులు సామాజిక సమస్యలతో బాధ పడుతుంటారు. వారంతా కలిసి ఇంగ్లాండ్ నుంచి మాలియా హాలీడే టూర్ వెళ్తారు. ఈ వెళ్లే క్రమంలో ఏం జరిగింది? వీళ్ళు ఎలాంటి కొంటె పనులు చేశారనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది. బెన్ పాల్మర్ దర్శకత్వం వహించిన ఈ కమింగ్ ఏజ్ కామెడీ చిత్రం 2011లో విడుదలై ఘన విజయం సాధించింది. నలుగురు స్నేహితులుగా సిమన్ బర్డ్, జేమ్స్ బక్లీ, బ్లేక్ హిర్రిసన్, జియో థామస్ నటించి తనదైన నటనతో కడుపుబ్బ నవ్వించారు. దీనికి సీక్వెల్‌గా 2014లో 'ది ఇన్బిట్వీనర్స్ 2' రూపొందింది. డామన్ బీస్లే, ఐయిన్ మోర్రిస్ దర్శకత్వం వహించారు. ఈసారి నలుగురు స్నేహితులు ఆస్ట్రేలియాకు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఏం చేశారనేది ఆసక్తికరం, హాస్యభరితం. ఈ సినిమా కూడా భారీ విజయాన్నే నమోదు చేసుకుంది.
30 మినిట్స్ ఆర్ లెస్
ఇద్దరు పెద్దగా ఎక్స్‌పీరియెన్స్ లేని దొంగలు బ్యాంక్ రాబరీ చేసేందుకు ప్లాన్ చేస్తారు. అందుకుగానూ ఓ పిజ్జా డెలివరీ బారుని కిడ్నాప్ చేసి అతనికి బాంబ్‌లు అమర్చుతారు. అతన్ని బ్యాంక్‌కి పంపించి అందరిని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న హాస్యభరిత సన్నివేశాల, సంఘటనల సమాహారమే ఈ సినిమా. బ్లాక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి రుబెన్ ఫ్లెచర్ దర్శకత్వం వహించారు. 2011లో సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇందులో పిజ్జా డెలివరీ బారుగా జెస్సీ ఈసెన్‌బర్గ్, అతని స్నేహితుడిగా అజిజ్ అన్సారీ, దొంగలుగా డాన్నీ మెక్‌బ్రైడ్, నిక్ స్వార్డసన్ నటించి నవ్వించారు.
Authorization