ప్రకృతి సృష్టించే విపత్తులను ఎదుర్కోవడమనేది ఎవ్వరికీ సాధ్యమయ్యే
పని కాదు. ఈ విపత్తుల విధ్వంసం ఏ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందో ఊహించలేం. తుపానులు, వరదలు, సునామీలు, భారీ భూకంపాలు వంటి అత్యంత భయానక బీభత్సకర నేపథ్యాలకు అత్యద్భుతమైన గ్రాఫిక్స్ జోడించి తెరకెక్కించిన ఎన్నో డిజాస్టర్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొంది వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
సాన్ ఆండ్రీస్
కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో భూకంపం చోటు చేసుకుంటుంది. ఆకాశాన్ని తాకే అద్భుతమైన భవంతులు నేలమట్టం అవుతుంటాయి. వేల మంది మృత్యువాత పడుతుంటారు. అందులో రిస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. తన భార్యను, కూతురుని కాపాడుకునేందుకు ఆ పైలట్ చేసిన ప్రమాదకర జర్నీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. 2015లో విడుదలైన ఈ సినిమా 110 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా 474 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. పైలట్‌గా డ్వానే జాన్సన్ నటన కట్టిపడేస్తుంది.
ది ఇంపాజిబుల్
2004లో థాయిలాండ్‌కు చెందిన ఫ్యామిలీ క్రిస్మస్ హాలీడేస్‌లో భాగంగా టూర్‌కి వెళ్లారు. హాయిగా, జాలిగా ఎంజారు చేస్తున్న క్రమంలో సునామి అకస్మాత్తుగా సంభవించి అంతా నాశనం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనుగడ కోసం థాయిలాండ్ ఫ్యామిలీ చేసే పోరాట నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 2004లో సంభవించిన సునామి ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని దర్శకుడు జే.ఏ.బయోనా రూపొందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 45 మిలియన్ డాలర్లతో రూపొంది 180 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. విజువల్గానూ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక ఇందులో ప్రధాన పాత్రల్లో నవోమి వాట్స్, ఎవాన్ మెక్ గ్రెగర్, టామ్ హోలాండ్, సామ్యూల్ జోస్లిన్ నటన ఆద్యంతం అలరిస్తుంది.
ది వేవ్
నార్వేలోని గీరంగర్ ఫోర్ట్ ప్రాంతంలో అత్యంత భయంకర సునామి కారణంగా అక్కడ ప్రాంతం మొత్తం నేలమట్టం అవుతుంది. అయితే ఈ సునామిని పసిగట్టిన ఓ జియోలజిస్ట్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు?, తాను నిర్మించిన ప్రాజెక్ట్ ఎలా నేలమట్టమయ్యిందనే ఆసక్తికర, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. విజువల్స్, ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆడియెన్స్‌ని విశేషంగా ఆలరిస్తాయి. రోర్ ఉతాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రాల్లో ఘన విజయం సాధించింది.
క్లవర్ఫీల్డ్
ఆరుగురు స్నేహితులు ఓ రాత్రి న్యూయార్క్ సిటీలో ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటుంటారు. తమ ఆనందానికి అవధుల్లేవనేంతగా వారు ఎంజారు చేస్తుంటారు. ఇంతలో అనుకోకుండా భూమి కంపిస్తూ భారీ భవనాలు కూలిపోతుంటాయి. దీనికి కారణం భారీ రాక్షసులు. వారిని ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా. మాట్ రీవెస్ దర్శకత్వంలో ఫౌండ్ ఫూటేజ్ మాన్స్టర్ చిత్రంగా రూపొంది 2008లో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం 25 మిలియన్ డాలర్లతో రూపొంది 170 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. వీడియో రికార్డింగ్‌తో సినిమా తీయడం విశేషం.
ఇన్ టు ది స్టోమ్
ఒక్లాహామాలో గ్రాడ్యూయేట్ విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుతుంది. పట్టాలు పొందిన సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం. సుడిగాలులు (టోర్నడోలు) వెంటాడుతుంటాయి. అత్యంత భారీగా వీస్తున్న సుడిగాలులతో అక్కడి ప్రాంతమంతా విధ్వంసమవుతుంది. వాటి నుంచి తప్పించుకుని, ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు, జనం పడే స్ట్రగుల్స్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫౌండ్ ఫూటేజ్ డిజాస్టర్ చిత్రంగా దర్శకుడు స్టీవెన్ క్వాలె రూపొందించారు. భయానకమైన సన్నివేశాలే కాదు, మంత్రమగ్ధుల్ని చేసే విజువల్స్ ఇందులో హైలైట్. ప్రధాన పాత్రల్లో రిచార్డ్ అర్మిటేజ్, సారా వేనె కల్లీస్, మాట్ వాల్ష్ నటించి ఆకట్టుకున్నారు. ఇది 50 మిలియన్ డాలర్లతో రూపొంది 161 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
టైడల్ వేవ్
ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి బుసాన్ పట్టణంలో సముద్ర బీచ్ ప్రాంతంలో నివసిస్తుంటారు. వాళ్ళు తమ హాలీడేస్‌ని బాగా ఎంజారు చేస్తుంటారు. ఇంతలోనే వారికి సునామి బీభత్సం సృష్టించబోతుందనే వార్త అందుతుంది. అక్కడ నుంచి తప్పించుకోవడానికి కేవలం పది నిమిషాలే టైమ్ ఉంది. తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? ఈ క్రమంలో వాళ్ళు పడిన సంఘర్షణ ప్రధానంగా ఈ కొరియన్ డిజాస్టర్ చిత్రం రూపొందుతుంది. యూన్ జె క్యూన్ దర్శకత్వం వహించగా, జంటగా సోల్ క్యుంగ్ గు, హ జి వాన్ నటించారు. 2004లో సంభవించిన సునామీ బేస్డ్గా లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఉ్కతంఠభరితంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.
జియోస్టోమ్
వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. భూకంపాలు, తుఫాన్, భారీ సుడిగాలులు వీస్తుంటాయి. ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు గ్లోబల్ వాతావరణాన్ని కంట్రోల్ చేసే శాటిలైట్‌ని కనిపెట్టేందుకు ఓ శాస్త్రవేత్త చేసిన సాహసం ప్రధానంగా రూపొందిన చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ చిత్రంగా 2017లో విడుదలైన ఈ సినిమాకి డీన్ డెవ్లిన్ దర్శకత్వం వహించారు. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రంలో గెరార్డ్ బట్లర్,జిమ్ స్టర్గెస్, ఎడ్ హర్రీస్, అబీ కార్నిష్, రిచర్డ్ స్కిఫ్ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. 120 మిలియన్ డాలర్లతో రూపొందిన 222 మిలియన్ డాలర్లని వసూలు చేసి విజయం సాధించింది.
2012
ప్రభుత్వం వాతావరణ మార్పులకు సంబంధించిన ముందస్తు అంచనా వేసే పనిలో ఉంటుంది. త్వరలో ప్రమాదం పొంచి ఉందని ఓ రైటర్ చెబుతాడు. అతను రైటర్‌గా ఫెయిల్యూర్లో ఉన్న టైమ్ అది. దీంతో ఎవరూ పట్టించుకోరు. ఇంతలో సుడిగాలులు, భూకంపం వంటి భారీ విపత్తులు చోటు చేసుకుంటుంటాయి. దీంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆ రైటర్ పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్‌గా వచ్చిన ఈ సినిమా 2009లో విడుదలైంది. దీనికి రోలాండ్ ఎమ్మెరిచ్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 770 మిలియన్ డాలర్లను వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఇందులో రైటర్‌గా జాన్ కుసాక్, ఇతర పాత్రల్లో చివెటెల్ ఎజియోఫర్, అమాండా పీట్, తాండీ న్యూటన్ నటించి మెప్పించారు.
ది డే ఆఫ్టర్ టుమారో
వాతావరణ శాస్త్రవేత్త క్లైమెట్‌లో మార్పులు గమనించి తన కుమారుడిని చేరుకునేందుకు
బోట్లో ట్రెక్కి భయలుదేరుతాడు. ఇంతలోనే అనుకోని విపత్తు. టోర్నడోల బీభత్సం, నార్త్ అట్లాంటిక్ సముద్రం ఉప్పొంగుతుంది. దీంతో అక్కడి ప్రాంతమంతా నేల మట్టం కావడమేకాదు,
మొత్తం మంచు గడ్డగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో తమ మనుగడ కోసం శాస్త్రవేత్త, సాధారణ జనం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి రోలాండ్ ఎమ్మెరిచ్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్‌గా ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనని రాబట్టుకున్నప్పటికీ 125 మిలియన్ డాలర్లతో రూపొంది 544 మిలియన్ డాలర్లని వసూలు చేసి కమర్షియల్‌గా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. శాస్త్రవేత్తగా డెన్నీస్ క్వాడ్ నటించారు.
ఫ్లడ్
లండన్‌లో సముద్రం ఒప్పొంగుతుంది. భారీ తుఫాను సంభవించడంతో లండన్ నగరం మొత్తం నీటిమట్ట మవుతుంది. భారీ నష్టం సంభవించడంతోపాటు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. దాన్నుంచి బయటపడేందుకు ప్రభుత్వం, ప్రజలు ఏం చేశారు? ప్రభుత్వ తప్పిదాలను ప్రతిబింబించేలా భారీ డిజాస్టర్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. 2007లో విడుదలైన సినిమాకి టోనీ మైఖేల్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. రాబర్ట్ కార్లైట్, జెస్సాలిన్ గిల్సింగ్, టామ్ కర్టెనీ, జోన్నె వాల్లే ప్రధాన పాత్రలు పోషించారు.
ది హ్యాపెనింగ్
ఒక టీచర్, అతని భార్య, అతని స్నేహితుడు, స్నేహితుడి కూతురు ప్రకృతి విపత్తుని ఊహించలేకపోతారు. మిస్టరీగా ఆ విపత్తు వెంటాడుతుంది. అంతుచిక్కని ఆ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడేందుకు వారు చేసే సాహసం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. పోస్ట్ అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఎం.నైట్ షైమలన్ దర్శకత్వం వహించారు. 2008లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. 68 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం 164 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో మార్క్ వాల్బెర్గ్, జూయీ డెస్చానెల్, జాన్లెగిజామో, బెట్టీ బక్లీ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
పోసిడాన్
కొత్త సంవత్సరం సందర్భంగా దాదాపు రెండు వేల మంది పోసిడాన్ షిప్లో నార్త్ అట్లాంటిక్ ఓసియన్‌లో ప్రయాణిస్తూ కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సముద్ర మధ్యలోకి వెళ్ళాక భారీ సముద్ర అలలు ఓ ఉప్పెనలా ఎగిసి పడి వారు ప్రయాణిస్తున్న షిప్‌ని ముంచేస్తాయి. దీంతో అందులో ఉన్న వాళ్ళు మనుగడ కోసం, ప్రమాదం నుంచి బయట పడేందుకు, తమ వారిని కాపాడుకునేందుకు పడే స్ట్రగుల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ విధ్వంసం, అద్భుతమైన విజువల్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. వోల్ఫ్‌గ్యాంగ్ పీటర్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1972లో అదే పేరుతో వచ్చిన సినిమాకి రీమేక్. కర్ట్ రస్సెల్, జోష్ లుకాస్, రిచర్డ్ డ్రెఫస్, ఎమ్మీ రోస్సమ్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. 2006లో విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది.
ది కోర్
ప్రపంచానికి ఓ ప్రమాదం పొంచి ఉంది. ఉరుములతో కూడిన భారీ తుఫాను సంభవిస్తుంటుంది. ఉరుముల వల్ల సంభవించే శక్తి భూమిపై మెరుపుల రూపంలో పడుతూ ప్రపంచాన్ని సర్వ నాశనం చేస్తుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మెరుపుల శక్తిని భూమిలోకి న్యూక్లియర్ రూపంలో పంపించేందుకు సైంటిస్టుల బృందం భూమిలోకి డ్రిల్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మరి వారు సక్సెస్ అయ్యారా?, విధ్వంసం ఆగిందా, లేదా? అనేది సినిమా. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి జాన్ అమీల్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2003లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. ప్రధాన పాత్రల్లో ఆరాన్ ఎచార్ట్, హిలరీ స్వాంక్, డెల్రారు లిండో, స్టాన్లీ టుసీ నటించారు.
ది రోడ్
భారీ తుఫాను సంభవించడంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. భవనాలు, పంటపొలాలు..ఇలా అన్నీ సర్వనాశనం అవుతాయి. కొంత మంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అందులో తండ్రీ కొడుకులుంటారు. తాము బతికేందుకు చేసే పోరాటం, ప్రత్యర్ధులను ఎదుర్కోవడం, ప్రకృతితో చేసే పోరాటం వంటి అంశాల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కింది. జాన్ హిల్కోట్ దర్శకత్వం వహించారు. 2009లో విడుదలైన ఈ సినిమా మంచి విజువల్ ఫీస్ట్‌గా ఆకట్టుకుంది. ఇందులో తండ్రీ కొడుకులుగా విగ్గో మార్టెన్సెన్, కోడిస్మిత్ మెక్ ఫీ నటించారు.