ఒక పేద కుటుంబంలో జన్మించిన కుర్రాడు సంపన్న ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నోవా అనే కుర్రాడు అనుకోకుండా ధనవంతురాలైన అల్లీ ప్రేమలో పడతాడు. స్వేచ్ఛలేకుండా జీవిస్తున్న ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లీ తల్లిదండ్రులు ఆమెను ప్రియుడికి దూరంగా పంపిస్తారు. ఆ తర్వాత మూడేళ్లకు నోవా ఆర్మీలో జాయిన్ అవుతాడు. యుద్ధం చేసే క్రమంలో గాయపడ్డప్పుడు ట్రీట్ మెంట్ చేయడానికి అల్లీ వస్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ కలుసుకుని తమ ప్రేమను ఎలా నిజం చేసుకున్నారనేది సినిమా మిగిలిన కథ. మూడేండ్ల తర్వాత కలుసుకున్నప్పుడు ప్రేమ జంటలోని భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. దర్శకుడు నిక్ కాన్సవేటేస్ 2004లో తెరకెక్కించిన అమెరికన్ రొమాంటిక్ డ్రామాలో నోవా పాత్రలో ర్యాన్ గోస్లింగ్, అల్లీ పాత్రలో రాచెల్ మెక్ ఆడమ్స్ల నటన మనల్ని మైమరపిస్తుంది. 29 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 115మిలియన్ డాలర్లని వసూలు చేసింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుని ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీగా నిలిచిపోయింది.