ప్రేమకథ లేని సినిమాని ఊహించుకోవడం అనితర సాధ్యం. ఒక్క ప్రేమ నేపథ్యంలోనే విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల సినిమాలు రూపొందాయంటే అతిశయోక్తి కాదు. భిన్న, వైవిధ్యమైన ప్రేమకథలు అశేష ప్రేక్షకలోకాన్ని మెప్పించడంతోపాటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఎవర్గ్రీన్ లవ్స్టోరీస్గా అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు మెచ్చిన కొన్ని ప్రేమకథా చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
హ్యాపీ యాక్సిడెంట్స్
రూబీ అనే అమ్మాయి బారు ఫ్రెండ్ సమస్యతో బాధపడుతుంది. ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసుకోవాలనుకుంటుంది. ఇంతలో సామ్ అనే కుర్రాడు పరిచయమవుతాడు. తను చాలా స్వీట్, మృధు స్వభావి, విభిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. వీరిద్దరు ప్రేమించుకోవాలనుకుంటారు. కానీ రూబీ అతని గతం గురించి ఆలోచిస్తుంటుంది. అతనేమో భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇలా విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగిందనేది ఆసక్తికరం. ఫెయిల్యూర్ రిలేషన్షిప్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమా 2000లో విడుదలైంది. బ్రాడ్ అండర్సన్ దర్శకత్వం వహించారు. రూబీగా మరిసా టోమీ, సామ్‌గా విన్సెంట్ డి ఆన్ఫ్రియో నటించి తమ నటనతో అబ్బురపరిచారు. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రేమకథలో భిన్నమైన ప్రేమకథగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సెరెండిపిటీ
ఓ జంట క్రిస్మస్ సీజన్ సమయంలో ఓ రాత్రి వేడుకలో అనుకోకుండా కలుసుకుంటారు. వారి మధ్య స్నేహం పెరిగి, ప్రేమగా మారుతుంది. ఒక్క రోజులోనే గాఢమైన ప్రేమికులుగా మారుతారు. తమ ప్రేమ నిజమైందో కాదో టెస్ట్ చేసుకోవాలనుకుంటారు. అందుకు గుర్తుగా కొన్ని వస్తువులు వదిలేస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు కలుసుకుంటారు. కలుసుకున్నాక వీరి ప్రేమ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఆద్యంతం ఆసక్తికరం. పీటర్ చెల్సమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్ కుసాక్, కేట్ బెకిన్సలే జంటగా నటించి మైమరపించారు. వీరి మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 2001లో రొమాంటిక్ కామెడీగా విడుదలై 28 మిలియన్ డాలర్లతో రూపొంది 77మిలియన్ డాలర్లని వసూలు చేసింది.
ది పెయింటెడ్ వీల్
1925కి చెందిన బ్రిటీష్ జంట ప్రేమ కథని తెలియజేసే చిత్రమిది. బ్రిటీష్‌కి చెందిన మధ్యతరగతి డాక్టర్, సంపన్న కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయి ఓ తప్పుడు కారణం వల్ల పెళ్ళి చేసుకుని, చైనాలోని ఓ అందమైన గ్రామీణ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ మరో వ్యక్తితో సంపన్న అమ్మాయి ప్రేమలో పడుతుంది. వాళ్ళిద్దరు కలిసి కొత్త జర్నీని ప్రారంభిస్తారు. తమ రిలేషన్‌ని అందంగా, గొప్పగా మల్చుకుంటారు. ఇంతలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల సమాహారమే ఈ చిత్ర కథ. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి జాన్ కుర్రాన్ దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన ఈ సినిమాలో నవోమి వాట్స్, ఎడ్వర్డ్ నార్టన్, లీవ్ స్క్రీబర్ ప్రధాన పాత్రలో నటించి మైమరపించారు. విజువల్ వండర్‌గా, అద్భుతమైన ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ వంటి పలు అవార్డులను గెలుచుకుంది.
స్వీట్ హోమ్ అలబమా
మిలేనీ న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనర్. ఆమె డిజైన్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. తను ఉండే ప్లేస్‌లో ఓ యంగ్ బిజినెస్మెన్ ఆమెకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమెకి అప్పటికే పెళ్లైంది. భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఏడేండ్ల క్రితమే డైవర్స్ పేపర్స్ పంపించింది. కొత్త లవ్ ప్రపోజల్ వచ్చాక తన భర్త నుంచి విడాకుల విషయం తేల్చుకునేందుకు ఇంటికి వెళ్తుంది. కానీ తన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. మరి ఆమెకి విడాకులు వచ్చాయా? తనకి లవ్ ప్రపోజ్ చేసిన వ్యక్తికి మిలేనీ ఓకే చెప్పిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. రొమాంటిక్ కామెడీగా 2002లో రూపొందిన ఈ సినిమాకి ఆండీ టెన్నాంట్ దర్శకత్వం వహించారు. ఇందులో మిలేని పాత్రలో రీసె విథర్స్పూన్, భర్తగా జోష్ లుకాస్, ప్రియుడిగా ప్యాట్రిక్ డెంప్సే నటించి ఆకట్టుకున్నారు. 30మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 180 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. పలు అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకోవడం విశేషం.
ది వెడ్డింగ్ డేట్
కేట్ ఎల్లీ సింగిల్ ఉమెన్. న్యూయార్క్‌లో నివసిస్తుంటుంది. సోదరి పెళ్ళి కోసం లండన్‌లోని తన సొంతింటికి వెళ్తుంది. అక్కడ తనను రెండేండ్ల క్రితం పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తి కనిపిస్తాడు. అతని వద్ద బిల్డప్ కోసం తనతోపాటు వచ్చిన ఎస్కార్ట్‌ని ప్రియుడిగా పరిచయం చేస్తుంది. అతనితో చనువుగా మెలిగే క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. మరి వీరి ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. రొమాంటిక్ కామెడీగా 2005లో రూపొందిన ఈ చిత్రం సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 15 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 47 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా సింగిల్ ఉమెన్‌గా కేట్ ఎల్లీగా డెబ్రా మెస్సింగ్, ప్రియుడిగా డెర్మాట్ ముల్రోనీల నటన అద్భుతంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని మెలి పెడతాయి.
గ్రిఫ్ఫిన్ అండ్ ఫోయినిక్స్
గ్రిఫ్ఫిన్ విడాకులు తీసుకొని ఒంటరిగా మాన్‌హట్టన్ నగరంలో జీవిస్తుంటాడు. తన ఛాతిలో క్యాన్సర్ గడ్డ ఉందని డాక్టర్ ద్వారా తెలుసుకుంటాడు. జీవించేది కొన్ని రోజులే. మరణం ఆలోచనల్ని అధిగమించడం కోసం పలు సామాజిక తరగతులకు హాజరవుతుంటాడు. అక్కడ ఓ అందమైన డీన్ అసిస్టెంట్‌కి ఇంప్రెస్ అవుతాడు. వీరి మధ్య స్నేహం, ప్రేమగా మారి, అది మరింత ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని తెలుసుకుంటాడు. చావు వారిని వెంటాడుతుంది. వీరి ప్రేమకథే చివరి ఛాన్స్. దీంతో ప్రతి క్షణాన్ని వారు అనుభవించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా దర్శకుడు ఎడ్ స్టోన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
హృదయాన్ని పిండేసే ఈ చిత్రం 2006లో విడుదలై భారీ విజయాన్ని సాధించడంతోపాటు విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా జంటగా డెర్మాట్ ముల్రోనీ, అమాండా పీట్ల నటన ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వారి ప్రేమలో మనల్ని పరిగెత్తిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మన తెలుగులో రూపొందిన 'గీతాంజలి' సినిమా గుర్తుకు రావడం విశేషం.
వానీ అండ్ జునా
వాని బ్యూటిఫుల్ యంగ్ యానిమేటర్, జునా స్క్రిప్ట్ రైటర్. ఇద్దరు మంచి ప్రేమికులు. చాలా ప్రశాంతంగా తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తుంటారు. అనుకోకుండా ఓ రోజు వాని స్నేహితురాలు వచ్చి, తన పాత ప్రేమని గుర్తు చేస్తుంది. వానికున్న గత ప్రేమ ఏంటీ? అది వీరి ప్రస్తుత ప్రేమ బంధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా చిత్రానికి యంగ్ గ్యున్ కిమ్ దర్శకత్వం వహించారు. వాని పాత్రలో కిమ్ హీ సన్, జునా పాత్రలో జూ జిన్ మోల నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
వాకింగ్ ది డెడ్
అది 1972. ఫీల్డింగ్ పీర్స్ కోస్ట్‌గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా రాజకీయాల్లో రాణించాలనేది అతని డ్రీమ్. అందులో భాగంగా 1973లో లా స్కూల్లో జాయిన్ అవుతాడు. అందులో సారా అనే ఆదర్శభావాలు కలిగిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇతరులకు సేవ చేయాలనే గుణం ఆమెది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. అనుకోకుండా చిలియన్ ప్రతిఘటన బృందం దేశంలో అల్లర్లకు పాల్పడుతుంది. ఈ దాడిలో సారా చనిపోతుంది. ప్రియురాలు చనిపోయిందన్న బాధలో పీర్స్ కుంగిపోతాడు. సారా తన చుట్టూనే ఉన్నట్టు భ్రమపడుతూ ఆమె కోసం పరిగెడుతుంటాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏంటి? తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. కీత్ గోర్డన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000లో విడుదలైంది. బిల్లీ క్రుడప్, జెన్నీఫర్ కన్నెలీ జంటగా నటించి మైమరపించారు. ముఖ్యంగా బిల్లీ నటన కట్టిపడేస్తుంది.
5 టు 7
24ఏడ్ల కుర్రాడు ఔత్సాహిక రైటర్‌గా రాణిస్తుంటాడు. మొదటి చూపులోనే 33ఏండ్ల ఫ్రెంచ్ మహిళ అందానికి ముగ్ధుడవుతాడు. ఆమెకి అప్పటికే పెళ్లైంది. అయినప్పటికీ అతని ప్రేమలో పడుతుంది. వీరిద్దరు రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి 7 గంటల మధ్య కలుసు కుంటుంటారు. మరి వీరు కలుసుకునేందుకు ఆ మహిళ భర్త ఎందుకు అనుమతి ఇచ్చాడు?. అనంతరం ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది. విక్టర్ లెవిన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో ప్రేమలోని నిజాయితీని, రిలేషన్‌కి ఏజ్‌తో సంబంధం లేదనేది, రిలేషన్షిప్ విషయంలో ఇప్పటి తరం ఆలోచనలు మారాలనే కథాంశంతో రూపొంది విశేషంగా ఆకట్టుకుంది. 24 ఏండ్ల రైటర్‌గా ఆంటోన్ యెల్చిన్, 33ఏండ్ల మహిళగా బెరెనైస్ మర్లోల నటన మైమరపిస్తుంది. 2014లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు కమర్షియల్గానూ మంచి విజయాన్ని అందుకుంది. పలు అవార్డులని సొంతం చేసుకుంది.
రిమెంబరెన్స్
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో పోలాండ్‌లో గల జర్మన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో బందీగా ఉన్న జూవిష్ ప్రియురాలు హన్నాని జర్మన్ సైనికుడు ఎంతో సాహసభరితంగా కాపాడి అక్కడ్నుంచి తప్పిస్తాడు. కానీ యుద్ధంలో ఆ సైనికుడు చనిపోయాడని ఆమె భావిస్తుంది. దీంతో తన దేశం వెళ్ళి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. 30 ఏండ్ల తర్వాత న్యూయార్క్‌లో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆ సైనికుడు తన వార్ జ్ఞాపకాలను, ప్రేమని పంచుకుంటుంటాడు. అది చూసిన హన్నా తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. మరి లేట్ వయసులో ఈ ఇద్దరు కలుసుకున్నారా? వీరి సుదీర్ఘ ప్రేమ ఏ తీరం చేరిందనేది సినిమా. పమేలా కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ జర్మన్ రొమాంటిక్ వార్ డ్రామా 2011లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. గొప్ప ప్రేమని ప్రతిబింబించింది. హన్నా పాత్రల్లో అలైస్ డైయర్(యంగ్), డాగ్మర్ మాంజెల్(ఓల్డ్), సైనికుడిగా మటెస్జ్ డమీస్కీ నటించారు.
ఇఫ్ ఓన్లీ
యువ బిజినెస్‌మ్యాన్ ఐయాన్, మ్యూజిషియన్‌గా రాణిస్తున్న సమంత ప్రేమలో పడతాడు. వీరిద్దరు తక్కువ టైమ్‌లోనే గాఢ ప్రేమికులుగా మారతారు. అంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో వీరి ప్రేమ జీవితం విషాదాంతంగా ఎలా ముగిసిందనే కథాంశంతో ఫాంటసీ లవ్ కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. దీనికి గిల్ జంగర్ దర్శకత్వం వహించారు. 2004లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రధాన పాత్రల్లో జెన్నీఫర్ లవ్ హెవిట్, పాల్ నికోల్స్ నటన అబ్బురపరుస్తుంది.
లవ్ అండ్ అదర్ డ్రగ్స్
మ్యాగీ.. స్వేచ్ఛగా జీవించే స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. ఎవరినీ లెక్క చేయదు. జామీ.. కన్నింగ్ మెంటాలిటీ కలిగిన ప్లేబారు. తను వయాగ్ర సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని సందర్భంలో మ్యాగీ, జామీ కలుసుకుంటారు. ప్రేమలో పడతారు. మనసులే కాదు, శారీరకంగానూ దగ్గరవుతారు. తక్కువ సమయంలోనే అత్యంత గాఢ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఎడ్వర్డ్ జ్వీక్ దర్శకత్వం వహించిన ఈ ఏరోటిక్ రొమాంటిక్ కామెడీ డ్రామా 2010లో విడుదలైంది. ఇందులో మ్యాగీగా అన్నె హాత్వే, జామీగా జేక్ గైలెన్హాల్ నటన, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తాయి.