భారతీయ సినిమా మార్కెట్‌ని ఆక్రమించే క్రమంలో హాలీవుడ్ సినిమా రోజు రోజుకి బలపడుతూ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ప్రాంతీయ భాషల్లోకి అనువాదమై 'మన సినిమా' అనే భావనకు భారతీయ ప్రేక్షకుల్ని తీసుకురావడంలో హాలీవుడ్ సక్సెస్ అయ్యింది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో హాలీవుడ్ విసిరిన పంజాకి భారతీయ సినిమా ప్రమాదంలో పడిందనే హెచ్చరికలు ఇటీవల వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చెప్పకనే చెప్పింది. మన భారతీయ సినిమా మార్కెట్‌ను హాలీవుడ్ సినిమా దాదాపుగా ఆక్రమించేసిన ప్రస్తుత తరుణంలో ఓ హాలీవుడ్ సినిమా ఇండియాలో విడుదలవుతోందంటే.. మన నిర్మాతలు తమ తమ సినిమాల విడుదల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదేండ్లలో హాలీవుడ్ సినిమాల సక్సెస్ రేటు ఇండియాలో 5-7% ఉంటే, అది ఇప్పుడు 10 శాతానికి పైగా పెరిగింది. సూపర్ హీరోస్, యానిమేషన్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో విపరీతమైన గిరాకీ ఉంది. మనకు ముఖ్యమైన సీజన్లు, పండుగలు, ఇతర ప్రత్యేక హాలీడేస్‌ని దృష్టిలో పెట్టుకుని, పక్కా ప్లానింగ్‌తో విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌తో హాలీవుడ్ సినిమాల్ని విడుదల చేసి, మన సినిమాల కలెక్షన్లను ఎగరేసుకు పోతున్నారు. తాజాగా వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' దెబ్బకి 'జెర్సీ', 'కాంచన3' చిత్రాలు కుదేలయ్యాయి.
అంతే కాదు, ఈసినిమా విడుదలవుతున్న కారణంగానే ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన మహేష్‌బాబు 'మహర్షి'ని మే 9కి మార్చారు. ఇలా బడా హీరోల భారీ సినిమాలకే కాదు ప్రాంతీయ సినిమాలు, ముఖ్యంగా చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సీజన్లపై మనకున్న ఎమోషన్స్‌ని క్యాష్ చేసుకోవడానికి హాలీవుడ్లో కంటే ముందుగా మన ఇండియాలో సినిమాల్ని విడుదల చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటెజీలో భాగంగా మన సెలబిట్రీలతోనే ఆయా చిత్రాల్లోని పాత్రలకు ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. దీంతో అవి కూడా మన సినిమాలే అనే భావనకు ప్రేక్షకులొచ్చేస్తున్నారు. ఆ ఫీలింగ్‌కి మన ప్రేక్షకులు రాబట్టే 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' రూ.300కోట్లు, 'జంగిల్ బుక్' చిత్రం దాదాపు రూ.253 కోట్లు, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' రూ.172 కోట్లు, 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' రూ.130కోట్లు, 'జురాసిక్‌పార్క్' రూ.165కోట్లు, 'అవతార్' రూ.145కోట్లు, 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్' రూ.111కోట్లు, 'జురాసిక్ వరల్డ్: ఫాలెన్కింగ్డమ్' రూ.100కోట్లు, 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్' రూ.96 కోట్లు, '2012'రూ.94కోట్లు, 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2' రూ.90కోట్లు, 'కెప్టెన్ మార్వెల్' రూ.84కోట్లు, 'లైఫ్ ఆఫ్ ఫై' రూ.80కోట్లు, 'టైటానిక్' రూ.77కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.మన భారతీయ సినిమాల్లో యూనివర్సల్ కాన్సెప్ట్స్, కథలో కంటెంట్, క్వాలిటీ, ఆధునికత లేకపోవడం, కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలు వంటి తదితర కారణాలను హాలీవుడ్ సినిమా క్యాష్ చేసుకుని లాభపడుతోంది. దీనిపై పోరాడే తరుణం వచ్చిందని పలువురు ఫిల్మ్‌మేకర్స్, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, మన సినిమాలు కూడా ఓవర్సీస్లోనూ విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతున్నప్పుడు హాలీవుడ్ సినిమాలు మనదేశంలో విడుదలైతే తప్పేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Authorization