ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'అవేంజర్స్ : ఎండ్‌గేమ్' సినిమా గురించే అందరూ చర్చించుకుంటున్నారు. రోజు రోజుకి ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి తలపండిన సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దలకు వరకు అందర్నీ ఫిదా చేసి వరల్డ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ వసూళ్ళ సునామీకి పక్కా కేరాఫ్‌గా నిలిచిన సూపర్‌హీరో సిరీస్ 'అవేంజర్స్ : ఎండ్ గేమ్'తోపాటు ఈ సీరిస్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..!
'అవెంజర్స్' ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీసుని శాసిస్తున్న సినిమా సిరీస్. సినీ ప్రియులందరి మనసుల్ని దోచిన సిరీస్. వరల్డ్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న సిరీస్. తాజాగా విడుదలైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది.. ఒక స్టార్ హీరో తెరపై కనిపిస్తేనే ఊగిపోతాం. అదే ఇద్దరు స్టార్స్ ఒకేతెరపై సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మరి ఏకంగా ఆరుగురు సూపర్ హీరోలు ఒకేతెరపై నట విశ్వరూపం చూపిస్తే ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' సినిమాతో అదే అనుభూతి పొందుతున్నారు. వరల్డ్ సూపర్ హీరోస్ అందర్నీ ఒకే తెరపై చూసి పిల్లల నుంచి పెద్దల వరకు పరవశించిపోతున్నారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ అవెంజర్స్ సిరీస్ పుట్టు పూర్వోత్తరాలు, ఈ సిరీస్ సినిమాలు వసూళ్ళు చేసిన కలెక్షన్ల విశేషాల గురించి ఓసారి చూద్దాం..
'అవెంజర్స్' సిరీస్ గురించి చెప్పాలంటే ముందు మార్వెల్ స్టూడియో గురించి, అది క్రియేట్ చేసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పాలి. 2008లో ఇది ప్రారంభమైంది. ది వాల్ట్ డిస్నీ కంపెనీ దీని యాజమాని. ఇది 1993లో స్థాపించబడిన మార్వెల్ స్టూడియోలోని ఫిల్మ్ కంపెనీ. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రధానంగా సినిమాలు, టెలివిజన్, లఘు చిత్రాలు, వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌ని రూపొందిస్తుంది. అంతకు ముందే సూపర్ హీరోస్ ప్రధానంగా మార్వెల్ కామిక్ బుక్స్ వచ్చి విశేషంగా పాఠకాదరణ పొందాయి. ఈ చిత్రాలకు, టెలివిజన్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్నింటికీ కామిక్ బుక్సే ఆధారం.
సినిమాలు తీయడం ప్రారంభించాక తమ కథా వస్తువుగా సూపర్ హీరో కథాంశాలను ఎంచుకున్నారు. తొలి ప్రయత్నంగా 2008లో 'ఐరన్ మ్యాన్'ని రూపొందించారు. నిర్మాత కెవిన్ ఫీగ్, మార్వెల్ స్టూడియో స్థాపకుల్లో ఒకరైన ఎవి అరాడ్ కలిసి ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. 'ఐరన్ మ్యాన్'కి జాన్ ఫావ్రియు దర్శకత్వం వహించారు. ఐరన్ మ్యాన్‌గా హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. దీనికీ ఓ చరిత్ర ఉంది. మొదట ఈ ప్రాజెక్ట్‌ని 1990లో యూనివర్సల్ పిక్చర్స్, 20వ సెంచరీ ఫాక్స్, న్యూ లైన్ సినిమా కలిసి తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. దీంతో 2006లో ఈ కథ రైట్స్‌ని మార్వెల్ స్టూడియోస్ దక్కించుకుంది. దాన్ని డెవలప్ చేసి 2008లో రూపొందించారు. 140 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 585 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. భారీ విజయం సాధించడంతో వరుసగా 'ది ఇన్క్రెడిబుల్ హల్క్', 'ఐరన్ మ్యాన్ 2', 'థోర్', 'కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ అవెంజర్', 'మార్వెల్స్ ది అవెంజర్స్' చిత్రాలను రూపొందించారు. 2012లో 'ది అవెంజర్స్' సిరీస్ ప్రారంభమైంది.
మార్వెల్ సూపర్ హీరో సినిమాలను మూడు ఫేజ్‌లుగా రూపొందిస్తున్నారు. పైవి మొదటి ఫేజ్‌లో రాగా, రెండో దశలో 'ఐరన్ మ్యాన్ 3', 'థోర్: ది డార్క్ వరల్డ్', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్', 'గార్జియన్స్ ఆఫ్ ది గాలాక్సీ', 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్', 'ఆంట్ మ్యాన్' చిత్రాలను నిర్మించగా, మూడో దశలో 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్','డాక్టర్ స్ట్రేంజ్', 'గార్జియన్స్ ఆఫ్ ది గాలాక్సీ వోల్.2', 'స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్', 'థోర్: రాగ్నారాక్', 'బ్లాక్ పాంథర్', 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'ఆంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్', 'కెప్టెన్ మార్వెల్'తోపాటు తాజాగా వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ఉన్నాయి.
అవెంజర్స్ క్రియేషన్
ఈ చిత్రానికి రూపకర్త దర్శకుడు నిక్ ఫ్యూరీ. దీన్నొక క్రాస్ ఓవర్ చిత్రంగా రూపొందించాలని ప్లాన్ చేశారు. రెండు కంటే ఎక్కువ సూపర్ హీరోల పాత్రల ఆధారంగా సినిమాని రూపొందించడం దీని ప్రత్యేకత. ఇందులో ఐరన్‌మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా, హల్క్, బ్లాక్ విడో, హాకెయి పాత్రలని కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్లాన్ 2007 నుంచే జరిగింది. రచయిత జాక్ పెన్స్ అప్పట్నుంచే స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారు. 2010లో దర్శకుడు జోస్ వెడాన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యారు. స్క్రిప్ట్‌పై వర్క్ చేసి దర్శకత్వం వహించే బాధ్యతలు తనపై వేసుకున్నారు. గత సూపర్ హీరో చిత్రాల్లో నటించిన హీరోలు డౌనీ, ఎవాన్స్ హెమ్స్‌వర్త్, జోహన్సన్, రెన్నర్, హిడిల్సన్, జాక్సన్ తమ పాత్రల్లో యధాతథంగా నటించారు. 'హల్క్' చిత్రంలో నటించిన బ్రూస్ బాన్నర్ స్థానంలో మార్క్ రఫ్ఫాలో ఎంపికయ్యారు.
అవెంజర్స్
థోర్ బ్రదర్ 'లోకి' తన అత్యంత అతీత శక్తితో భూమిని తన అధీనంలోకి తెచ్చుకోవాలని, ఈ విశ్వంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తుంటాడు. అందుకనుగుణంగా విధ్వంసం సృష్టిస్తుంటాడు. అతన్ని ఆపడం అనివార్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఫిక్షన్ ప్రపంచంలో స్పై ఏజెన్సీకి డైరెక్టర్ అయిన నిక్ ఫ్యూరీ ఓ టీమ్‌ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాడు. అందుకు సూపర్ హీరోలైన ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా, హల్క్, బ్లాక్ విడో, హాకెయిలని టీమ్‌గా ఎంపిక చేసుకుంటాడు. వీరంతా కలిసి లోకిని ఎలా అడ్డుకున్నారు?, ఈ క్రమంలో చోటు చేసుకున్న భారీ యాక్షన్ సన్నివేశాల సమాహారమే 'ది అవెంజర్స్' కథ. 2012లో విడుదలైన తొలి చిత్రం 'ది అవెంజర్స్'లో ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, కెప్టెన్ అమెరికా పాత్రలో క్రిస్ ఇవాన్స్, హల్క్ పాత్రలో మార్క్ రఫ్ఫాలో, థోర్ పాత్రలో క్రిస్ హెమ్స్‌వర్త్, బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్, హాకెయి పాత్రలో జెరెమీ రెన్సర్, లోకీ పాత్రలో టామ్ హిడిల్స్టన్, నిక్ ఫ్యూరీ పాత్రలో సామ్యూల్ ఎల్ జాక్సన్ నటించారు. 2012 మే 4న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 220 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 1.519 బిలియన్ డాలర్ల(10540కోట్లు -ప్రస్తుత విలువల ప్రకారం)ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. విజువల్స్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. విశేష ప్రశంసలందుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుంచి ఏ ప్లస్ రేటింగ్‌ని అందుకుంది.
అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్
'ది అవెంజర్స్' సినిమా ఘన విజయం సాధించిన వెంటనే దీనికి సీక్వెల్‌ని రూపొందించ బోతున్నట్టు డిస్నీ ప్రకటించింది. జోస్ వెడాన్ మరోసారి దర్శకత్వం వహించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. 2013 జులై 20న దీనికి సబ్టైటిల్గా 'ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్' అని ప్రకటించారు. 2014 నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. మొదటి చిత్రంలో నటించే నటీనటులనే ఇందులో కూడా తీసుకున్నారు. కథ పరంగా సేమ్. సూపర్ హీరోలంతా కలిసి మనిషి మనగడనే సర్వనాశనం చేయడానికి వచ్చిన కొత్త విలన్ ఆల్ట్రాన్ని ఎదుర్కొనేందుకు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది 2015 మే 1న విడుదలైంది. దాదాపు 450 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు (9800కోట్లు) కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఐదవ సినిమాగా నిలిచింది. పలు ఇతర పురస్కారాలు అందుకుంది. అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ ఆడియెన్స్‌ని కనువిందు చేశాయి.
అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్
ఇది మార్వెల్ మూడో దశలో రూపొందిన చిత్రం. గాలాక్సీలో అత్యంత శక్తివంతమైన ప్రత్యర్థి థానోస్‌ని నిలువరించేందుకు మరోసారి అవెంజర్స్ బృందం (ఐరన్ మ్యాన్, హల్, బ్లాక్ విడో, అమెరికన్ కెప్టెన్, థోర్లతోపాటు స్పైడర్ మ్యాన్, బ్లాక్ ఫాంథర్) కలిసి చేసే యుద్ధమే ఈ సినిమా. కొత్త దర్శకులు ఆంటోనీ రూసో, జీయో రూసో కలిసి ఈ 'ఇన్ఫినిటీ వార్'కి దర్శకత్వం వహించారు. ఇందులో థానోస్ పాత్రలో బ్రోలిన్ నటించారు. 2018 ఏప్రిల్ 27 విడుదలై సంచలన విజయం సాధించింది. 400 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా రెండు బిలియన్ డాలర్లు (రూ.14000కోట్లు) కలెక్ట్ చేసి మరో సంచలనం క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్ళు రాబట్టిన నాల్గవ చిత్రంగా నిలిచింది. ఇండియాలోనూ ఇది సుమారు రూ.130కోట్ల వసూళ్ళని రాబట్టింది. విలన్ థానోస్ పాత్రకి రానాతో డబ్బింగ్ చెప్పించడంతో తెలుగు నేటివిటీని తీసుకొచ్చారు.
అవెంజర్స్: ఎండ్‌గేమ్
'అవెంజర్స్' సిరీస్‌లో 4వ సినిమా అలాగే ముగింపు చిత్రంగా 'ఎండ్‌గేమ్' వచ్చింది. ఆంటోని, జోయి రూస్సోలు మరోసారి ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ విలన్ థానోస్ దెబ్బకి కనిపించకుండా పోయిన సూపర్‌హీరోలు తిరిగి ఒక సమూహంగా ఏర్పడి థానోస్ అంతానికి పోరాటం చేయడమే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రాన్ని కూడా 2014లోనే ప్రకటించారు. మొదటగా దీన్ని 'ఇన్ఫినిటి వార్ 2'గా తీయాలనుకున్నారు. కథ ఇంతటితో క్లోజ్ కావడంతో 'ఎండ్‌గేమ్' అని నిర్ణయించారు. 356 మిలియన్ డాలర్లతో సినిమాన్ని తెరకెక్కించారు. గత నెల 26న ఈ సినిమా విడుదలైంది. దాదాపు 46 దేశాల్లో విడుదల కాగా, అమెరికాలో 4662 థియేటర్లలో, ఇండియాలో 2845 థియేటర్లలో, చైనాలో 608 థియేటర్లలో ఇలా మొత్తంగా పది వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. ఓపెనింగ్ నుంచే రికార్డ్లను కొల్లగొట్టడం ప్రారంభించింది. ఫస్ట్ డేనే ఇది వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.2200కోట్లు వసూలు చేసిందని అంచనా. చివరి చిత్రం కావడంతో సూపర్ హీరో సినీ లవర్స్ అంతా దీన్నొక భావోద్వేగభరిత చిత్రంగా భావించి చూసేందుకు బారులు కట్టారు. దానికి తగ్గట్టే అద్బుతమైన డైరెక్షన్, నటీనటులు అద్భుత నటన, వినోదం, ఎమోషన్స్, అబ్బురపరచే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ నిర్మాణ విలువల మేళవింపు సినిమాని సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రాచబాట వేశాయి. ఇప్పటి వరకు ఇది 1.9 బిలియన్ (రూ.13000కోట్లు) డాలర్లని వసూలు చేసింది. 'అవతార్'(2.78బిలియన్-సుమారు రూ.19వేల కోట్లు) రికార్డులను కొల్లగొట్టేందుకు దూసుకుపోతుంది. ఇండియాలో ఈ సినిమా సుమారు రూ.300కోట్లు వసూలు చేసింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత భారీ కలెక్షన్స్ రాబట్టిన ఘనత 'ఎండ్‌గేమ్'కే దక్కింది. థానోస్ పాత్రకి రానా వాయిస్ అందించడం, ఇండియా వెర్షన్లో ఏ.ఆర్.రెహ్మాన్ కంపోజ్ చేసిన ప్రమోషనల్ మార్వెల్ థీమ్ సాంగ్ సినిమాపై మరింత హైప్ పెంచింది. దీంతో ఇండియన్ బాక్సాఫీసుని కూడా ఈ సినిమా కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఐదో చిత్రంగా నిలిచింది. దీని కంటే ముందు 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'స్టార్‌వార్స్: ది ఫోర్స్ అవాకెన్స్', 'టైటానిక్', 'అవతార్' ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే ఇది 'అవతార్'ని బీట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Authorization