సాండ్రా బుల్లాక్..
అందం, అభినయంతో వెండితెరపై తన నట విశ్వరూపంతో పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి పక్కా కేరాఫ్‌గా నిలిచిన అగ్ర కథానాయిక. స్టార్ హీరోలకు దీటుగా భారీ పారితోషికాన్ని అందుకున్న ఆస్కార్ విజేత. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ప్రేక్షకుల్ని అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక సేవలోనూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మనసున్న మహిళ సాండ్రా బుల్లాక్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభం
సాండ్రా బుల్లాక్ ఆల్జింగ్టన్ పట్టణంలోని వర్జీనియాలో 1964 జులై 26న జన్మించారు. ఆర్మీ అధికారి, వాయిస్ టీచర్ జాన్ డబ్ల్యూ బుల్లాక్, ఒపెరా సింగర్, వాయిస్ టీచర్ హెల్గా మిథిల్డె మేయర్ల కూతురు. బుల్లాక్ చిన్నతనంలో వోకల్ ఆర్ట్ నేర్చుకున్నారు. వాషింగ్టన్ లీ హై స్కూల్లో చదువుకునే రోజుల్లో థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1982లో గ్రాడ్యూయేట్ పూర్తయిన తర్వాత ఈస్ట్ కరోలినా యూనివర్సిటీలో చేరి డ్రామాలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఈ యూనివర్సిటీ తరపున నిర్వహించిన 'పీటర్ పాన్', 'త్రీ సిస్టర్స్' వంటి పలు థియేటర్స్‌లో నటించారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌లోని మ్యాన్హట్టన్కి మారి అక్కడ సినిమాల కోసం ఆడిషన్స్ ఇచ్చారు. న్యూయార్క్‌లో నటుడు సాన్ఫోర్డ్ మీస్నర్తో కలిసి యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్ళారు. గ్రాడ్యూయేట్ టైమ్‌లో స్టూడెంట్స్ రూపొందించిన చిత్రాల్లో నటించారు.
స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన తొలి సినిమా 'స్పీడ్'
స్టూడెంట్స్ ఫిల్మ్స్‌లో నటిస్తూ సినిమాలపై దృష్టి సారించారు. తొలుత 'నో టైమ్ ఫ్లాట్' చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో బుల్లాక్ నటనకి ప్రముఖ దర్శకుడు అలాన్ జె లెవీ ఇంప్రెస్ అయి తాను రూపొందించే టెలీఫిల్మ్ 'బోనిక్ షోడౌన్: ది సిక్స్ మిలియన్ డాలర్ మ్యాన్ అండ్ ది బోనిక్ ఉమెన్'లో ఛాన్స్ ఇచ్చారు. ఇలా వరుసగా పలు ఇండిపెండెంట్ చిత్రాల్లో నటించారు. 1993లో సైన్స్ ఫిక్షన్ ప్రధానంగా రూపొందిన 'డీమోలిషన్ మ్యాన్'లో సపోర్టింగ్ రోల్లో మెప్పించారు. దాదాపు దశాబ్దానికి పైగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న బుల్లాక్కి 1994లో యాక్షన్ థ్రిల్లర్ 'స్పీడ్' రూపంలో భారీ బ్రేక్ వరించింది. ఇందులో కీను రీవెస్తో కలిసి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. ఈ ఒక్క సినిమాతో బుల్లాక్ హాలీవుడ్లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ ఇయర్ 'వైల్ యు వర్ స్లీపింగ్'లో నటించి అందర్నీ అలరించింది. ఆమె ఛార్మింగ్ యాక్టింగ్‌కి యావత్ ప్రేక్షకులు, సినీ మేకర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రానికిగానూ ఆమె మొదటిసారి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో నటించిన థ్రిల్లర్ సినిమా 'ది నెట్'లోని నటనకి విశేష ప్రశంసలు దక్కాయి. 1996లో నటించిన క్రైమ్ డ్రామా 'ఏ టైమ్ టు కిల్' మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచి తన కెరీర్‌కి మరింత బూస్టప్ ఇచ్చింది. ఇందులో అగ్ర నటులు సామ్యూల్ ఎల్ జాక్సన్, మాథ్యూ మెక్ కానాఫీ, కెవిన్ స్పేసీలతో కలిసి ఆమె నటించారు. 'స్పీడ్' సీక్వెల్ 'స్పీడ్2: క్రూయిస్ కంట్రోల్' చిత్రానికి బుల్లాక్ ఏకంగా 11 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నారు. అంతకంటే ముందే 'టు ఇఫ్ బై సీ', 'ఇన్ లవ్ అండ్ వార్' చిత్రాల రూపంలో ఫెయిల్యూర్ చవిచూశారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా..
1998లో వచ్చిన డ్రామా చిత్రం 'హౌప్ ఫ్లోట్స్' కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పనిచేయడం విశేషం. ఇదే ఏడాది ఆమె నికోల్ కిడ్మన్తో కలిసి నటించిన ఫాంటసీ రొమాంటిక్ కామెడీ 'ప్రాక్టికల్ మ్యాజిక్' సైతం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. 1999లో బెన్ అఫ్లెక్‌తో కలిసి 'ఫోర్సెస్ ఆఫ్ నేచర్' చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించడంతో బుల్లాక్కి కొంత ఊరట కలిగింది. ఆ తర్వాత 'గన్ షై'తో పరాజయాన్ని, '28 డేస్స్'తో యావరేజ్‌ని, 'మిస్ కాంగెనియాలిటీ'తో బ్లాక్ బస్టర్‌ని, 'మర్డర్ బై నంబర్స్', 'డివైన్ సీక్రెట్ ఆఫ్ ది యాయా సిస్టర్ హుడ్'లతో వరుస ఫ్లాప్స్‌ని, 'టూ వీక్స్ నోటిస్', 'క్రాష్'తో భారీ విజయాల్ని, 'లవర్‌బారు', 'మిస్ కాంగెనియాలిటీ 2: ఆర్మ్డ్ అండ్ ఫ్యాబులస్'లతో పరాజయాల్ని, 'ది లేక్ హౌస్'తో మరో ఘన విజయాన్ని, 'ఇన్‌ఫేమస్'తో పరాజయాన్ని, 'ప్రేమోనిషన్'తో హిట్‌ని, 'ది ప్రపోజల్'తో సంచలన విజయాన్ని, 'ఆల్ ఎబౌట్ స్టీవ్'లతో హిట్‌ని అందుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఆస్కార్ విజేతని చేసిన ది బ్లైండ్ సైడ్
2009లో వచ్చిన బయోగ్రాఫికల్ స్పోర్ట్ డ్రామా 'ది బ్లైండ్ సైడ్' సినిమా సాండ్రా బుల్లాక్ని కెరీర్ పరంగా, నటన పరంగా అగ్ర స్థానంలో నిలబెట్టింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ ఓహర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా కేవలం 29 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 310 మిలియన్ డాలర్ల వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. మైఖేల్‌కి తల్లి పాత్రలో బుల్లాక్ నటించారు. విలక్షణ నటనతో ఆమె ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుని హాలీవుడ్‌తోపాటు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యారు. 'ఎక్స్ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇంక్రిడిబుల్ క్లోజ్'తో యావరేజ్ విజయాన్ని, బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ 'ది హీట్'తో భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది నటించిన సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గ్రావిటీ' ఆమె కెరీర్లో మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఆల్ఫోన్సో క్వారోన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జార్గ్ క్లూనీతో కలిసి నటించి విశ్వరూపం చూపించారు. ఈ చిత్రానికి గానూ ఆమె ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. ఇది ఏడు విభాగాల్లో ఆస్కార్‌ని సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల పరంగా 130 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 723 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. బుల్లాక్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కామెడీ డ్రామా 'అవర్ బ్రాండ్ ఈజ్ క్రైసిస్'తో ఫ్లాప్‌ని చవిచూసింది. గతేడాది నటించిన హీస్ట్ కామెడీ 'ఓసియన్ 8'తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. చివరగా చేసిన 'బర్డ్ బాక్స్' క్రిటికల్‌గా ప్రశంసలందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది.
దర్శకురాలిగా, నిర్మాతగా..
బుల్లాక్ అద్భుతమైన నటి మాత్రమే కాదు, దర్శకురాలిగానూ ప్రతిభ చాటారు. 1998లో 'మేకింగ్ సాండ్ విచెస్' అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. దీనికి తనే రైటర్, నిర్మాత కూడా. ఇది పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌ల్లో ప్రశంసలందుకుంది. దీంతోపాటు తన అభిరుచి మేరకు నిర్మాతగా మారారు. నిర్మాణంపై అనుభవం కోసం మొదటిసారి 'హౌప్ ఫ్లోట్స్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 'గన్ షై', 'మిస్ కాంగ్నియాలిటీ', 'మర్డర్ బై నంబర్స్', 'టూ వీక్స్ నోటీస్', 'మిస్ కాంగ్నియాలిటీ 2: సీక్రెట్స్ ఆఫ్ ది యా యా సిస్టర్హుడ్', 'ఆల్ అబౌట్ స్టీవ్', 'ది ప్రపోజల్', 'అవర్ బ్రాండ్ ఈజ్ క్రైసిస్', 'బర్డ్ బాక్స్' చిత్రాలను నిర్మించారు. ఇక ఆమె 'ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్', 'మినీయన్స్' వంటి యానిమేటెడ్ చిత్రాలకు, 'ది ప్రైమ్ మినిస్టర్స్: ది పయనీర్స్' వంటి డాక్యుమెంటరీలకు వాయిస్‌ని అందించారు. వెండితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతోపాటు బుల్లితెరపై నటించి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా తనదైన అద్బుత నటనతో ఫిదా చేశారు.
అత్యంత శక్తివంతమైన మహిళ..
బుల్లాక్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీతోపాటు అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. టైమ్ మ్యాగజీన్ 2010లో ప్రకటించిన వంద మంది అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు, 2010లో పీపుల్ మేగజీన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. 2011లో అదే మ్యాగజీన్ ప్రకటించిన మోస్ట్ బ్యూటిపుల్ కథానాయికల్లో 12వ ర్యాంక్‌ని దక్కించుకున్నారు. 2013లో ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకటించిన వినోద రంగంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అభివర్ణించింది. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్ వీక్లీ అదే ఏడాది ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రశంసించింది. 2014లో ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన నటీమణుల జాబితాలో రెండో ర్యాంక్‌ని దక్కించుకుని టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. 2015లో మరోసారి పీపుల్ మ్యాగజీన్ అత్యంత అందమైన మహిళగా వర్ణించింది. 2010 నుంచి 2014 మధ్య కాలంలో హాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగానూ నిలిచారు. ఎమర్జెన్సీ సర్వీస్ అందిస్తున్న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థకి ఒక మిలియన్ డాలర్ల చొప్పున ఐదు సార్లు డోనేట్ చేశారు. 2004లో ఇండియాలో సునామి సంభవించిన టైమ్‌లోనూ తన వంతు సాయం అందించారు. 2010లో హయాతి భూకంపం సంభవించినప్పుడు మరో మిలియన్ డాలర్లు అందించారు. టెక్సాస్‌లో హరికేన్ కారణంగా సర్వం కోల్పోయిన సందర్భంగా రెండేండ్ల క్రితం ఓ మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు. మెక్సికోలో పరిశ్రమల వల్ల భూగర్భజలాల కాలుష్యంపై ఇతర నటీనటులతో కలిసి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2013లో తాను చేస్తున్న సేవాలకుగానూ ఫేవరేట్ హ్యూమనిటేరియన్ అవార్డుని అందుకున్నారు. వృత్తిపరంగా ప్రపంచ స్థాయి గౌరవాన్ని దక్కించుకున్న బుల్లాక్ వ్యక్తిగత జీవితం ఒడిదుడుగులతో సాగింది. అయినప్పటికీ ఓ అబ్బాయిని, అమ్మాయిని బుల్లాక్ దత్తత తీసుకోవడం విశేషం. వెండితెరపై నట విశ్వ రూపం..
అందం, అభినయంతో అందర్నీ మెస్మరైజ్ చేస్తూ హాలీవుడ్ అగ్ర నటిగా రాణిస్తున్న సాండ్రా బుల్లాక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్షన్ థ్రిల్లర్ 'హ్యాంగ్మెన్'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి హీరోకి ప్రియురాలి పాత్రలో కాసేపు మెరిశారు. ఆ తర్వాత కామెడీ చిత్రాలు 'ఏ ఫూల్ అండ్ హిజ్ మనీ', 'హు షాట్ పటకంగో', రొమాంటిక్ కామెడీ 'లవ్ పోషన్ నంబర్ 9', సైకలాజికల్ థ్రిల్లర్ 'ది వానిషింగ్', కామెడీ సినిమా 'వెన్ ది పార్టీస్ ఓవర్', కామెడీ డ్రామా 'ది థింగ్ కాల్డ్ లవ్', సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'డీమాలిషన్ మ్యాన్', అడ్వెంచరస్ డ్రామా 'ఫైర్ ఆన్ ది అమేజాన్', రొమాంటిక్ డ్రామా 'వ్రెస్లింగ్ ఎర్నేస్ట్ హెమింగ్వే' వంటి దాదాపు పది సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించినప్పటికీ అవి అంతగా గుర్తింపునివ్వలేదు. కెరీర్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'స్పీడ్'లో బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకునేందుకు స్ట్రగుల్ పడే ప్రయాణీకుల్లో ఒకరిగా అద్భుత నటనతో మెప్పించారు. 'వైల్ యు వర్ స్లీపింగ్' చిత్రంలో జీవితంపై ఆశలు లేని టికెట్ కలెక్టర్‌గా, 'ది నెట్'లో కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌గా, 'టు ఇఫ్ బై సీ' చిత్రంలో ప్రియురాలిగా, 'ఏ టైమ్ టు కిల్'లో డిఫెన్స్ మెంబర్‌గా మెస్మరైజ్ చేశారు. రొమాంటిక్ డ్రామా 'ఇన్ లవ్ అండ్ వార్'లో ఆర్మీ నర్స్‌గా, యాక్షన్ థ్రిల్లర్ 'స్పీడ్ 2: క్రూయిస్ కంట్రోల్'లో హైజాక్ అయిన జంటగా, నాటకీయ ప్రధానంగా తెరకెక్కిన 'హౌప్ ఫ్లోట్స్'లో తన భర్త వల్ల జీవితం గందరగోళంలో పడి సంఘర్షణ పడే పాత్రలో, ఫాంటసీ రొమాంటిక్ కామెడీ 'ప్రాక్టికల్ మ్యాజిక్'లో తన సిస్టర్తోనే ప్రేమలో పడే అమ్మాయిగా, రొమాంటిక్ కామెడీ 'ఫోర్సెస్ ఆఫ్ నేచర్'లో ఫ్రీ స్పిరిట్ కలిగిన అమ్మాయిగా, కామెడీ డ్రామా '28 డేస్'లో న్యూస్ పేపర్ కాలమిస్ట్‌గా, సామాజిక వేత్తగా, మహిళా ప్రధాన యాక్షన్ కామెడీ 'మిస్ కాంగినియాలిటీ'లో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా కామెడీ తరహా పాత్రలో నటించి ఆద్యంతం కనువిందు చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ 'మర్డర్ బై నంబర్స్'లో డిటెక్టివ్‌గా శక్తివంతమైన పాత్రలో, కామెడీ డ్రామా 'డివైన్ సీక్రెట్స్ ఆఫ్ ది యా యా సిస్టర్హుడ్'లో హాస్యభరిత పాత్రలో, రొమాంటిక్ కామెడీ 'టు వీక్స్ నోటిస్'లో నిత్యం ఆందోళనకు గురయ్యే ఇంటలిజెంట్ లిబరల్ లాయర్‌గా, డ్రామా చిత్రం 'క్రాష్'లో పెళ్లైన మహిళగా, హాస్యప్రధానంగా వచ్చిన 'మిస్ కాంగినియాలిటీ 2: ఆర్మ్డ్ అండ్ ఫేబులస్'లో మరోసారి ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా కామెడీ తరహా పాత్రలో నటించి కడుపుబ్బ నవ్వించారు. రొమాంటిక్ డ్రామా 'ది లేక్ హౌస్'లో తన ప్రేమని వెతుక్కునే ప్రేమికురాలిగా మంత్రముగ్ధుల్ని చేశారు. 'ఇన్ ఫేమస్'లో నవలా రచయిత్రిగా తనలోని విభిన్న నటనా ప్రతిభని చాటారు. 'ప్రెమోనిషన్' చిత్రంలో తన భర్త హత్యకి రివేంజ్ తీర్చుకునే మహిళగా అబ్బురపరిచారు. రొమాంటిక్ కామెడీ 'ది ప్రపోజల్'లో బుక్ పబ్లిష్ ఎడిటర్‌గా, రొమాంటిక్ తరహా పాత్రలో కనువిందు చేశారు. హాస్యభరిత చిత్రం 'ఆల్ అబౌట్ స్టీవ్'లో క్రాస్ వర్క్ పజిల్ రైటర్‌గా మరోసారి కామెడీని పంచి మెప్పించారు. ఇక తనకి ఆస్కార్‌ని తెచ్చిపెట్టిన బయోగ్రాపికల్ స్పోర్ట్స్ డ్రామా 'ది బ్లైండ్ సైడ్'లో ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ ఓవర్ తల్లిగా అత్యద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు. 'ఎక్స్ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇన్క్రీడిబుల్ క్లోజ్'లో తల్లిగా, 'ది హీట్'లో స్పెషల్ ఏజెంట్‌గా, 'గ్రావిటీ'లో సైంటిస్ట్‌గా, 'అవర్ బ్రాండ్ ఈజ్ క్రైసిస్'లో రిటైర్డ్ పొలిటికల్ కన్సల్టెంట్‌గా 'ఓసియన్ 8'లో ప్రొఫేషనల్ దొంగగా. 'బర్డ్ బాక్స్'లోని ప్రధాన పాత్రలోని నటనతో వెండితెర నట విశ్వరూపాన్ని చూపించారు.
Authorization