పారాసైట్ ఓ నిరుద్యోగ కుటుంబంలోని ఇబ్బందులను తెలియజేస్తుంది. కుటుంబంలో ఎవరికీ సరైన ఉద్యోగం లేదు. రోజువారి కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కానీ వారికి మాత్రం చాలా కోరికలుంటాయి. సంపన్నమైన, ఆద్యంతం కనువిందు చేసే ఉద్యానవనాల్లో జీవిస్తున్నట్టు ఊహించుకుంటారు. భ్రమల్లో బతికే వారికి అనుకోని సమస్యలు తలెత్తుతాయి. మరి దీంతో ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది?, సమస్యల నుంచి ఎలా బయపడ్డారనే కథ. ఈ సౌత్ కొరియన్ డార్క్ కామెడీ డ్రామా చిత్రానికి బాంగ్ జూన్ హౌ దర్శకత్వం వహించారు. బాంగ్ జూన్ హౌ, క్వాక్ సిన్ ఎయి, జాంగ్ యంగ్ హ్వాన్ సంయుక్తంగా నిర్మించారు. సాంగ్ కాంగ్ హౌ, లీ సన్ క్యూన్, చో యెయో జియంగ్, చోయి వూ షిక్, పార్క్ సో డమ్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. అత్యంత సహజమైన నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. సౌత్ కొరియన్ ప్రజల స్థితిగతులకు అద్దం పట్టే చిత్రమిది. అక్కడి ప్రజలకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, వారి చిన్న చిన్న ఆశలు, ఆనందాలు, కోరికలు, స్ట్రగుల్స్ వంటి అంశాలను వ్యంగ్య హాస్యంతో దర్శకుడు చూపించిన తీరు అద్భుతం. ఆద్యంతం సాగే నాటకీయత జ్యూరీ సభ్యుల్ని సైతం ఫిదా చేసి ప్రతిష్టాత్మక గోల్డెన్ పామ్ అవార్డుని అందుకునేలా చేసింది. అంతేకాదు ఈ సినిమాకి ఐదు నిమిషాలపాటు స్టాండింగ్ ఓవియేషన్ లభించింది. ఇది త్వరలో సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈచిత్ర దర్శకుడు గతంలో 'బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్', 'మెమరీస్ ఆఫ్ మర్డర్', 'ది హౌస్ట్', 'మదర్', 'స్నోపీర్సర్','ఓక్జా' వంటి చిత్రాలను రూపొందించారు.