రాబర్ట్ డౌనీ జూనియర్..
ప్రపంచ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సూపర్‌హీరో. పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి పక్కా కేరాఫ్. అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరో.
వైవిధ్యమైన సినిమాలు, ప్రయోగాత్మక పాత్రలతో వెండితెరపై నట విశ్వరూపం చూపించిన అగ్ర కథానాయకుడు. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా ఇటు వెండితెర, అటు బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాబర్ట్ డౌనీ జూనియర్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
తండ్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభం..
రాబర్ట్ జాన్ డౌనీ జూనియర్ అమెరికాలోని న్యూయార్క్ మ్యాన్ హట్టన్‌లో 1965, ఏప్రిల్ 4న జన్మించారు. ప్రముఖ హలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత రాబర్ట్ డౌనీ సీనియర్ కుమారుడు. తల్లి ఎల్సీ అన్న్ కూడా నటి. తండ్రి రాబర్ట్ సీనియర్ డ్రగ్స్‌కి బానిసయ్యారు. ఆయనతోపాటు డౌనీ కూడా ఆ వాతావరణంలోనే పెరగాల్సి వచ్చింది. తండ్రి నటించిన పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు. తన ఐదేండ్ల వయసులో 'పౌండ్' చిత్రంలో అనారోగ్యానికి గురైన చిన్న అబ్బాయిగా కనిపించారు. నెక్ట్స్ 'ప్యాలెస్'లో కనిపించారు. ఇంగ్లాండ్‌లో క్లాసికల్ బ్యాలెట్ నృత్యం నేర్చుకున్నారు. న్యూయార్క్‌లో థియేటర్ నేర్చుకున్నారు. తల్లిదండ్రులు విడిపోవడంతో ఎలాగైనా సినిమాల్లో రాణించాలని న్యూయార్క్ వెళ్ళి యాక్టింగ్‌పై దృష్టి సారించారు. 1988లో వచ్చిన '1969' సినిమాలో ప్రముఖ నటుడు కీఫర్ సుతర్లాండ్తో కలిసి నటించారు. వీరిద్దరు మూడేండ్ల పాటు రూంమేట్స్ కావడం విశేషం. ఆ తర్వాత హాలీవుడ్‌కి మకాం మార్చారు.
నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన చాప్లిన్ సినిమా
డౌనీ హాలీవుడ్‌లోకి ఎంటర్ అయినప్పటికీ తొలుత పలు థియేటర్ పాత్రలు పోషించారు. పలు షార్ట్ లైవ్డ్ మ్యూజికల్స్లోనూ నటించారు. 1985లో టెలివిజన్ వెరైటీ షో 'సాటర్డే నైట్ లైవ్'లో భాగమయ్యారు. తన కామెడీ నటనకు విమర్శలు వచ్చాయి. అదే ఏడాది 'టఫ్ టఫ్' చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. ఇలా వరుసగా 'వీర్డ్ సైన్స్', 'ప్రెట్టీ ఇన్ పార్క్', 'బ్యాక్ టూ స్కూల్'లో చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. హీరోగా నటించిన తొలిచిత్రం 'ది పిక్ అప్ ఆర్టిస్ట్' బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. దీంతో రాబర్ట్ స్ట్రగులింగ్ యాక్టర్‌గా మారారు. 1987లో ఆయన నటించిన 'లెస్ దేన్ జీరో' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫస్ట్ టైమ్ ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇందులో మద్యానికి బానిసైన సంపన్న కుటుంబానికి చెందిన కుర్రాడిగా నటించారు. ఆ తర్వాత వరుసగా పెద్ద బడ్జెట్ చిత్రాల్లో భాగమయ్యారు. ఆయన నటించిన 'ఛాన్సెస్ ఆర్', 'ఎయిర్ అమెరికా', 'సోప్‌డిష్' చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. ఇక చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా రూపొందిన 'చాప్లిన్' చిత్రంలో చాప్లిన్ పాత్రలో నటించి మెప్పించారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందినా, చాప్లిన్ పాత్రలో రాబర్ట్‌కి విశేష ప్రశంసలు దక్కాయి. ఈ చాప్లిన్ పాత్ర కోసం, ఆయన హావభావాలను పలికించడం కోసం ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలోని ఆయన పాత్రకుగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. 1993లో 'హార్ట్ అండ్ సోల్స్' చిత్రంలో ఆల్‌ఫ్రీ వూడర్డ్, కైరా సెడ్విక్, 'షార్ట్ కట్స్' చిత్రంలో మాథ్యూ మోడైన్, జూలియానె మూర్లతో కలిసి నటించారు. 1994లో రొమాంటిక్ కామెడీ 'ఓన్లీ యు', బ్లాక్ కామెడీ 'నేచులర్ బోర్న్ కిల్లర్స్', 1995లో హిస్టారికల్ డ్రామా 'రీస్టోరేషన్', 'రిచర్డ్ 3', 1997లో కామెడీ డ్రామా 'టూ గర్ల్స్ అండ్ ఏ గారు', యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'యు.ఎస్.మార్షల్స్', డ్రామా చిత్రం 'బ్లాక్ అండ్ వైట్', యాక్షన్ థ్రిల్లర్ 'డేంజర్ జోన్', డ్రామా 'వన్ నైట్ స్టాండ్', రొమాంటిక్ కామెడీ 'హ్యూగో పూల్' వంటి బ్యాక్ టూ బ్యాక్ పలు విభిన్న కథా నేపథ్య చిత్రాల్లో నటించగా, ఇందులో 'నేచురల్ బోర్న్ కిల్లర్స్', 'టూ గర్ల్స్ అండ్ ఏ గారు' చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. 'యు.ఎస్.మార్షల్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రాబర్ట్ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రమిదే కావడం విశేషం.
కెరీర్‌ని ఒడిదుడుకుల్లో పడేసిన మాదక ద్రవ్యాలు
రాబర్ట్ డౌనీ జీవితం 1996 నుంచి 2001 వరకు దుర్భరంగా సాగింది. డ్రగ్స్‌కి బానిసవ్వడం, తరచూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేకమార్లు అరెస్ట్ అవ్వడం, కొకైన్, హెరాయిన్ వాడటం, అక్రమంగా తుపాకి కలిగి ఉండటం వంటి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాల నుంచి బయటపడేందుకు ట్రీట్మెంట్ ప్రొగ్రామ్స్కి వెళ్ళినా ప్రయోజం లేకుండాపోయింది. అయినా పోలీసులకు దొరికిపోవడంతో 1997లో కోర్ట్ ఆయనకి ఆరునెలల జైలు శిక్ష విధించింది. 1999లో మరోసారి డ్రగ్ టెస్ట్‌లో దొరకడంతో మూడేండ్లపాటు కాలిఫోర్నియా జైలుకి పంపించి, అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వరుస అరెస్ట్‌ల వల్ల సినిమాలు తగ్గాయి. కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో టెలివిజన్స్పై దృష్టి పెట్టారు. అంతకు ముందే ఆయన ఎన్బీసీ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ 'గాడ్, ది డెవిల్ అండ్ బాబ్'కి వాయిస్‌ని అందించారు. దీంతో టీవీ ఛాన్స్ వచ్చాయి. 2000లో 'అల్లీ మెక్ బీల్' అనే టెలివిజన్‌లో నటించారు. అదే సమయంలో సింగర్ వోండా షెపర్డ్ రూపొందించిన 'అల్లీ మెక్‌బీల్: ఫర్ వన్స్ ఇన్ మై లైఫ్' ఆల్బమ్‌లో 'ఎవ్రీ బ్రీత్ యు టేక్' అనే పాట పాడారు. ఆ టెలివిజన్‌లో నటనకి, ఈ పాటకి ఆయనకు విశేష ప్రశంసలు దక్కాయి. కొకైన్, వాలియమ్ అనే మెడిసిన్ వాడుతున్న కారణంగా 2000లో మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు నాలుగేండ్ల ఎనిమిది నెలలు శిక్ష పడింది. తర్వాత పెరోల్‌పై బయటకు వచ్చారు. మరోసారి 2001లో డ్రగ్స్ తీసుకున్నాడన్న నేపంతో అరెస్ట్ చేసి వెంటనే వదిలేశారు. వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన నటిస్తున్న టెలివిజన్ సిరీస్ 'అల్లీ మెక్ బీల్'లో రాబర్ట్ పాత్రని తిరిగి రాసి మరో నటుడితో నటింపచేశారు. మరోవైపు 'అమెరికాస్ స్వీట్‌హార్ట్స్' అవకాశం కూడా కోల్పోయారు. ఆ తర్వాత దర్శకుడు వూడీ అలెన్ తాను రూపొందించే సినిమా 'మెలిండా అండ్ మెలిండా'లో మొదటి కాస్టింగ్ రాబర్ట్‌ని అనుకున్నారు. కానీ ఆయనపై ఇన్య్సూరెన్స లేకపోవడంతో వద్దనుకున్నారు. ఇలా దాదాపు నాలుగైదేండ్లు రాబర్ట్ వరుసగా అరెస్ట్‌లు, జైలు శిక్షలతో గడిచింది. అయిన మధ్య మధ్యలో 'ఇన్ డ్రీమ్స్', 'ఫ్రెండ్స్ అండ్ లవర్స్', 'బౌఫింగర్', 'బ్లాక్ అండ్ వైట్', 'వండర్ బార్సు' చిత్రాల్లో నటించారు. 2001లో మెల్ గిబ్సన్ రూపొందించిన 'హామ్లెట్' స్టేజ్ డ్రామాలోనూ నటించారు.
కమ్‌బ్యాక్ తర్వాత కెరీర్లో కీలక మలుపు..
దాదాపు ఐదేండ్ల తర్వాత డ్రగ్స్ నుంచి బయటపడ్డారు. తిరిగి పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిసారించారు. సాంగ్ కంపోజర్ ఎల్టన్ జాన్ రూపొందించిన 'ఐ వాంట్ లవ్' వీడియోతో తిరిగి తన కెరీర్‌ని ప్రారంభించారు. ఇందులో నటించేందుకు 16 టేక్‌లు తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా చేసిన సీన్ అద్భుతంగా రావడంతో అంతా రాబర్ట్ ఈజ్ బ్యాక్ అనుకున్నారు. 'ఎయిర్ అమెరికా' సినిమా నుంచి మెల్ గిబ్సన్ ఆయనకు మంచి స్నేహితుడయ్యారు. ఆయన నటిస్తూ, నిర్మించిన 'ది సింగింగ్ డిటెక్టివ్'లో మెయిన్ కాస్ట్‌గా రాబర్ట్‌ని ఎంపిక చేశారు. మ్యూజికల్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో డిటెక్టివ్ నావెలిస్ట్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమా పరాజయం చెందినప్పటికీ రాబర్ట్ నటనకి విశేష ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'గోథిక', 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'లో నటించారు. ఇందులో ఆయన సరసన నటి సుసాన్ లెవిన్ నటించారు. ఈ సినిమాతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్ళి వరకు వెళ్ళింది. వరుసగా పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌ల్లో నటించారు. వాటిల్లో డ్రామా చిత్రం 'ఏ గైడ్ టు రికగ్నైజింగ్ యువర్ సెయింట్స్' ఫెయిల్ కాగా, హిస్టారికల్ డ్రామా 'గుడ్ నైట్ అండ్ గుడ్ లక్' మంచి విజయం సాధించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ఏ స్కానర్ డార్ల్కీ', రొమాంటిక్ డ్రామా 'ఫ్యూర్' , ఫ్యామిలీ కామెడీ 'ది షాగ్గీ డాగ్' థ్రిల్లర్ ప్రధానంగా వచ్చిన 'జోడియాక్', 'చార్లీ బార్ట్లెట్' వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుని మెయిన్ స్ట్రీమ్ హీరోగా గుర్తింపు పొందారు.
ఐరన్మ్యాన్తో అంతర్జాతీయ గుర్తింపు..
కెరీర్ పరంగా ఓ నిలకడ సాధించాక రాబర్ట్‌కి భారీ ఆఫర్స్ రావడం ప్రారంభమయ్యాయి. 2008లో ఆయన మొదటిసారి సూపర్ హీరో చిత్రం 'ఐరన్‌మ్యాన్'లో నటించే అవకాశం దక్కింది. అదే ఏడాది యాక్షన్ కామెడీ 'ట్రోపిక్ థండర్' చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ముఖ్యంగా మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో సినిమా 'ఐరన్‌మ్యాన్' కావడం విశేషం. ఇది 140 మిలియన్ డాలర్లతో రూపొంది 585 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్‌కి విశేష ప్రశంసలు దక్కాయి. ఆయా పాత్రలో ఆయన నటవిశ్వరూపం చూపించారు. దీంతో ఆయనకు హాలీవుడ్లో స్టార్ ఇమేజ్ వచ్చింది. 'ఐరన్‌మ్యాన్'కి సీక్వెల్‌గా వచ్చిన 'ఐరన్ మ్యాన్ 2'(2010), 'ఐరన్ మ్యాన్ 3'(2013)లోనూ నటించారు. ఇవన్నీ సంచలన విజయాలను సాధించాయి. 2009లో 'షెర్లాక్ హోమ్స్', 'ది సోలోయిస్ట్'లో నటించారు. ఇందులో 'ది సోలోయిస్ట్' ఘోర పరాజయం చెందింది. 'షెర్లాక్ హోమ్స్' మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కెరీర్ పరంగా రాబర్ట్‌ని మరో మెట్టు ఎక్కించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'షెర్లాక్ హోమ్స్: ఏ గేమ్ ఆఫ్ షాడోస్'లో మరోసారి టైటిల్ పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఇది కూడా మొదటి సినిమా మాదిరిగానే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 2010లో చేసిన 'లవ్ అండ్ డిస్ట్రస్ట్', 'డూ డేట్' సైతం మంచి ఆదరణ పొందాయి. 2012లో సూపర్ హీరోస్ అందరితో రూపొందించిన 'ది అవెంజర్స్'లో ఐరన్ మ్యాన్ పాత్రలో మెరిశారు. ఇది 220 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా ఒక 1.519 బిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. అంతకంటే ముందు 'టైటానిక్', 'అవతార్' చిత్రాలున్నాయి. 2014లో చేసిన 'చెఫ్', 'ది జడ్జ్' చిత్రాలతో కెరీర్ కాస్త రిలీఫ్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్', 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్', 'స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్', 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', ఇటీవల 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' వంటి వరుసగా సూపర్ హీరో చిత్రాల్లో నటించి హాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదిగారు. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగానూ నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో భాగమైన హీరోగానూ రికార్డు సృష్టించారు. 'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' ఇటీవల విడుదలై 2.7 బిలియన్ డాలర్లను సాధించి ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన 'ఆల్ స్టార్ వీకెండ్', 'ది వోయేజ్ ఆఫ్ డాక్టర్ డోలిటిల్' వంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి..
రాబర్ట్ 1985లో 'సాటర్ డే నైట్ లైవ్'తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ముస్సోలిని: ది అన్‌టోల్డ్ స్టోరీ', 'మిస్టర్: విల్లోబై క్రిస్టమస్ ట్రీ', 'ఆల్లీ మెక్ బీల్', 'ఫ్యామిలీ గారు' వంటి టెలివిజన్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్‌ని మెప్పించారు. 'డెడ్‌వెయిట్', 'లెతర్గీ', 'వాట్ఎవర్ వీ డు' వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో, 'ది లాస్ట్ పార్టీ', 'చార్లీ: ది లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ చార్లెస్ చాప్లిన్', 'ది ఔట్ సైడర్', 'హబర్ట్ సెల్బీ జూనియర్' వంటి డాక్యుమెంటరీల్లో మెరిశారు. రాబర్ట్ మంచి గాయకుడు కూడా. 'టూ మచ్ సన్', 'టూ గర్ల్స్ అండ్ ఏ గారు', 'ఫ్రెండ్స్ అండ్ లవర్స్', 'ది సింగింగ్ డిటెక్టివ్', 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' చిత్ర ఆల్బమ్స్‌లో పాటలు పాడారు. పలు ఆల్బమ్స్‌లో నటించి మెప్పించారు. ఇక 2010లో తన భార్య సుసాన్‌తో కలిసి 'టీమ్ డౌనీ' పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి మొదటి ప్రయత్నంగా 'ది జడ్జ్' చిత్రాన్ని నిర్మించారు. ఇది మంచి విజయం సాధించింది. 2008, 2012 నుంచి 15 వరకు వరుసగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కారు. టైమ్ మ్యాగజీన్ ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తిగా అభివర్ణించింది. ఆయన నటించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12.9 బిలియన్ డాలర్లను వసూలు చేశాయి. తమ సినిమాల ద్వారా అత్యధిక వసూళ్ళని రాబట్టిన స్టార్‌గా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. అంతేకాదు సూపర్ హీరో చిత్రాలకు కేరాఫ్‌గా, ఐరన్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక నటన పరంగా 'చాప్లిన్' చిత్రానికి, 'ట్రోపిక్ థండర్' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేట్ అయ్యారు.
Authorization