నికోలస్ కేజ్..అటు కమర్షియల్, ఇటు ఆర్ట్ సినిమాలతో విశ్వ ప్రేక్షకుల్ని ఫిదా చేసిన లెజెండరీ యాక్టర్. అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆస్కార్ విజేత. పడి లేచిన కెరటానికి ప్రతీకగా స్ఫూర్తి దాయక సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన హాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ నికోలస్ కేజ్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
సినీ నేపథ్య కుటుంబమే అయినప్పటికీ..
నికోలస్ కిమ్ కొప్పోలా 1964 జనవరి 7న అమెరికా, కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ ప్రాంతంలో జన్మించారు. తండ్రి ఆగస్ట్ కొప్పోల ప్రొఫెసర్, సినీ ఎగ్జిక్యూటివ్, అడ్వకేట్. తల్లి జోరు వోగెల్సాంగ్ కొరియోగ్రాఫర్, డాన్సర్. ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల మేనమామ అవుతారు. నటి టాలియా షైర్ మేనత్త అవుతారు. వీరితోపాటు దర్శకులు రోమన్ కొప్పోల, సోఫియా కొప్పోల, నిర్మాత గియాన్ కార్లో కొప్పోల, నటుడు రాబర్ట్కార్మైన్, జాసన్ స్వ్కార్ట్మ్యాన్ తదితరులంతా బంధువులు కావడం విశేషం. దీంతో చిన్ననాటి నుంచే నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. నికోలస్ కుటుంబమే సినీ ఫ్యామిలీ కావడంతో చిత్ర రంగంలోకి అడుగుపెట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఆయనకు ఇద్దరు సోదరులు మార్క్ కొప్పోల, క్రిస్టోఫర్ కొప్పోల ఉన్నారు. మార్క్ న్యూయార్క్ రేడియోలో పనిచేస్తుండగా, క్రిస్టోఫర్ కొప్పోల దర్శకుడిగా రాణిస్తున్నారు. బెవెర్లీ హిల్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యని, యుసీఎల్‌ఏ స్కూల్ ఆఫ్ థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో థియేటర్ చేశారు. ఈ టైమ్‌లోనే 'గోల్డెన్ బాయ్' నాటకంలో నటించారు. ప్రముఖ నటుడు జేమ్స్ డీన్లా గొప్ప నటుడు కావాలని నికోలస్ కలలు కన్నారు. సినిమా అవకాశాలు ఇవ్వమని తన మామ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల వెంటపడేవారు. ఆయన అప్పటికే పెద్ద దర్శకుడు. మార్లన్ బ్రాండో, ఆల్ పసినో, గెనె హక్మన్, రాబర్డ్ డీ నిరోలతో సినిమాలు చేశారు. ఆయన సినీ వారసత్వాన్ని వ్యతిరేకించేవారు. దీంతో నికోలస్ తన పేరుని నికోలస్ కేజ్గా మార్చుకున్నారు. మార్వెల్ సూపర్ హీరో పాత్ర ల్యూక్ కేజ్‌ని స్ఫూర్తిగా తీసుకుని తన పేరుని మార్చుకున్నట్టు పలు ఇంటర్వ్యూలో నికోలస్ తెలిపారు.
అద్భుతమైన విజయాలు.. అయినా సక్సెస్ కోసం పడిగాపులు
నికోలస్ సినీ జీవితం చిన్న పాత్రతో ప్రారంభమైంది. 1982లో 'ఫాస్ట్ టైమ్స్ ఎట్ రిడ్మాంట్ హై'లో జడ్జ్ రీన్హౌల్డ్, సియాన్ పెన్లతో కలిసి నటించారు. నెక్ట్స్ ఇయర్ తన మామ రూపొందించిన 'ది ఔట్‌సైడర్స్'లో, 'రంబుల్ ఫిష్', 'పెగ్గీ సూయి గాట్ మ్యారీడ్' చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెరిశారు. ఇతర దర్శకులతో 'రేసింగ్ విత్ ది మూన్', 'ది కాటన్ క్లబ్', 'బర్డీ', 'ది బారు ఇన్ బ్లూ' చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 1987లో నటించిన రొమాంటిక్ కామెడీ 'మూన్‌స్ట్రక్' భారీ విజయాన్ని సాధించింది. దీంతో నటుడిగా నికోలస్కి మంచి గుర్తింపు లభించింది. ఇలా వరుసగా కల్ట్ క్లాసిక్ కామెడీ 'రైసింగ్ ఆరిజోనా', డేవిడ్ లించ్ సినిమా 'వైల్డ్ ఎట్ హార్ట్', మార్టిన్ స్కోర్సెస్ రూపొందిన పారామెడిక్ డ్రామా 'బ్రింగింగ్ ఔట్ ది డెడ్', రిడ్లీస్కాట్ తెరకెక్కించిన బ్లాక్ కామెడీ క్రైమ్ 'మ్యాచ్‌స్టిక్ మెన్' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలను అందుకున్నారు. 1991లో నటించిన ఏరోటిక్ థ్రిల్లర్ 'జాండలీ', బ్లాక్ కామెడీ 'వాంపైర్స్ కిస్', హాస్యభరిత చిత్రం 'నెవర్ ఆన్ ట్యూస్డే', ఇటాలియన్ డ్రామా 'టైమ్ టు కిల్', యాక్షన్ ప్రధానంగా డేవిడ్ గ్రీన్ దర్శకత్వంలో వచ్చిన 'ఫైర్ బర్డ్స్', 1992లో ఆండ్రూ బెర్గ్‌మ్యాన్ రూపొందించిన కామెడీ సినిమా 'హానీమూన్ ఇన్ వేగాస్' పర్వాలేదనిపించుకోగా, బడ్డీ కామెడీ యాక్షన్ సినిమా 'అమోస్ అండ్ ఆండ్రూ', క్రిస్టోఫర్ కొప్పోల రూపొందించిన 'డెడ్ఫాల్', 1993లో వచ్చిన నియో నాయిర్ చిత్రం 'రెడ్ రాక్ వెస్ట్', థ్రిల్లర్ 'కిస్ ఆఫ్ డెత్', క్రైమ్ కామెడీ 'ట్రాప్డ్ ఇన్ పారడైజ్' చిత్రాలు వరుసగా పరాజయాలు చెందాయి. మంచి సక్సెస్ కోసం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. 1994లో ఆయన నటించిన కామెడీ డ్రామా 'గార్డింగ్ టెస్', రొమాంటిక్ కామెడీ డ్రామా 'ఇట్ కుడ్ హాప్పెన్ టు యు' హిట్ అందుకుని నికోలస్కి కొంత ఊరటనిచ్చాయి.
ఆస్కార్ విజేతగా అంతర్జాతీయ ఖ్యాతి..
వరుస పరాజయాలు, ఒడిదుడుకుల సినీ ప్రయాణంలో 1995 ఏడాది నికోలస్కి చిరకాలం నిలిచిపోయేలా చేసింది. ఆయన నటించిన రొమాంటిక్ ట్రాజెడీ చిత్రం 'లివింగ్ లాస్ వేగాస్' చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం నాలుగు మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా యాభై మిలియన్ డాలర్లని వసూలు చేసింది. మైక్ ఫిగ్గీస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నికోలస్, ఎలిజిబెత్ జంటగా నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌కి నామినేటై ఉత్తమ నటుడి విభాగంలో నికోలస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దీంతో ఆస్కార్ విజేతగా నికోలస్ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు.
హాలీవుడ్లో అగ్రహీరోగా నిలబెట్టిన సినిమాలు..
ఆ తర్వాత వచ్చిన 'అడాప్టేషన్' సైతం విజయం సాధించింది. ఆ వెంటనే 1996లో యాక్షన్ థ్రిల్లర్‌గా మైఖేల్ బే దర్శకత్వంలో రూపొందిన 'ది రాక్' సంచలన విజయం సాధించింది. ఇందులో సియాన్ కన్నెరీతో కలిసి నటించారు. ఇది 75 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 335 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. జాన్ కుసాక్, జాన్ మాల్కోవిచ్లతో కలిసి 1997లో నటించిన 'కాన్ ఎయిర్' సినిమా సైతం ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. అదే ఏడాది జాన్ ట్రావోల్టాతో కలిసి నటించిన సైన్స్ ఫిక్షన్యాక్షన్ చిత్రం 'ఫేస్ ఆఫ్', 1998లో విడుదలైన రొమాంటిక్ ఫాంటసీ 'సిటీ ఆఫ్ ఏంజెల్స్', 1999లో వచ్చిన కాన్స్పిరసీ థ్రిల్లర్ 'స్నేక్ ఐయిస్', క్రైమ్ మిస్టరీ '8ఎంఎం' వంటి సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. దీంతో నికోలస్ హాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వరుసగా డ్రామా ప్రధానంగా మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో రూపొందిన 'బ్రింగింగ్ ఔట్ ది డెడ్'తో ఫ్లాప్‌ని, యాక్షన్ హీస్ట్ చిత్రం 'గోన్ ఇన్ 60 సెకండ్స్', రొమాంటిక్ కామెడీ డ్రామా 'ది ఫ్యామిలీ మ్యాన్'లతో సూపర్హిట్స్ని తన ఖాతాలో వేసుకున్నారు. వార్ ప్రధానంగా వచ్చిన 'కెప్టెన్ కోరెల్లిస్ మాండోలిన్', 'విండ్టాకర్స్', కామెడీ డ్రామా మెటా ఫిల్మ్ 'అడాప్టేషన్' చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి.
మరో స్థాయికి తీసుకెళ్ళిన బ్లాక్‌బస్టర్ ఘోస్ట్ రైడర్
హిట్, ఫ్లాప్‌లతో నికోలస్ కెరీర్ బ్యాలెన్స్‌గా సాగుతుంది. 2004 తర్వాత అడ్వెంచరస్ చిత్రం 'నేషనల్ ట్రెజర్'తో భారీవిజయాన్ని, క్రైమ్ డ్రామా 'లార్డ్ ఆఫ్ వార్'తో ఓ మోస్తరు హిట్‌ని, కామెడీ డ్రామా 'ది వెదర్ మ్యాన్'తో ఫ్లాప్‌ని, డిజాస్టర్ డ్రామా 'వరల్డ్ ట్రేడ్ సెంటర్'తో భారీ విజయాన్ని, హర్రర్ సినిమా 'ది విక్కర్మ్యాన్'తో పరాజయాన్ని చవిచూశారు. 2007లో మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన సూపర్ హీరో సినిమా 'ఘోస్ట్‌రైడర్'తో మరో బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'నేషనల్ ట్రెజర్: బుక్ ఆఫ్ సీక్రెట్స్', 'నోయింగ్', 'కిక్ యాస్', 'ది సోర్సెరర్స్ అప్రెంటిస్', 'సీజన్ ఆఫ్ ది విచ్', 'ఘోస్ట్ రైడర్: స్పిరిట్ ఆఫ్ వెంగెన్స్', 'లైఫ్ బిహైండ్' వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ పరాజయాలు చెందాయి. 'నెక్ట్స్', 'బ్యాంకాక్ డేంజరస్', 'బ్యాడ్ లియుటెనెంట్: పోర్ట్ ఆఫ్ కాల్ న్యూ ఓర్లీన్స్', 'డ్రైవ్ ఆంగ్రీ', 'ట్రెస్పాస్', 'సీకింగ్ జస్టీస్', 'స్టోలెన్', 'ది ఫ్రోజెన్ గ్రౌండ్', 'జోయి', 'రేజ్', 'డైయింగ్ ఆఫ్ ది లైట్', 'ఔట్ కాస్ట్', 'ది రన్నర్', 'పే ది ఘోస్ట్', 'ది ట్రస్ట్', 'స్నోడెన్', 'యుఎస్ఎస్ ఇండియానపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్', 'డాగ్ ఈట్ డాగ్', 'ఆర్మీ ఆఫ్ వన్', 'అర్సెనల్', 'వెంగియాన్స్: ఏ లవ్ స్టోరీ' వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత 2017లో నటించిన థ్రిల్లర్ సినిమా 'ఇన్కన్సీవబుల్'తో బంపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని తిరిగి పుంజుకున్నారు. అయితే ఆయన కమర్షియల్ సినిమాలతోపాటు ఆర్ట్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అయితే ఆర్ట్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోకపోవడం గమనార్హం. ఒక్క హిట్ తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాప్‌లు క్యూ కట్టాయి. 'మామ్ అండ్ డాడ్', 'లుకింగ్ గ్లాస్', 'ది హ్యూమానిటీ బురియు', '211', 'మాండీ', 'బిట్వీన్ వరల్డ్స్', 'ఏ స్కోర్ టు సెటిల్', 'రన్నింగ్ విత్ ది డెవిల్' వంటి విభిన్న దేశాల చిత్రాల్లో నటించి విజయాలకు అతీతంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆర్ట్ సినిమాకి జీవం పోస్తున్న నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
దర్శకుడిగా ఫెయిల్యూర్.. నిర్మాతగా సక్సెస్..
నికోలస్ 2002లో దర్శక, నిర్మాతగా మారారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో 'సొన్ని' చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు ఇందులో గెస్ట్‌గా నటించారు. ఈసినిమా కోసం 'సటర్న్ ఫిల్మ్స్' అనే బ్యానర్‌ని స్థాపించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. 2000లో నిర్మించిన మెటాఫిక్షన్ హర్రర్ 'షాడో ఆఫ్ ది వాంపైర్' మంచి ఆదరణ పొందింది. అలాగే 'ది లైఫ్ ఆఫ్ డేవిడ్ గాలే', 'లార్డ్ ఆఫ్ వార్', 'ది విక్కర్ మ్యాన్', 'నెక్ట్స్', 'బ్యాంకాక్ డేంజరస్', 'ఏ థౌజండ్ వర్డ్స్', 'కెనాట్ స్టాప్ లూసిగ్ యు: సర్వైవింగ్ ది పోలీస్', 'వెంగీయన్స్ : ఏ లవ్ స్టోరీ' వంటి తదితర చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నారు.
విలక్షణ నటనకు ప్రతిబింబాలు
నికోలస్ మెథడ్ యాక్టర్. దీన్ని తనే సొంతంగా క్రియేట్ చేసుకోవడమే కాకుండా దానిపై ఓ పుస్తకం కూడా రాశారు. కేజ్ నటన వినోదాత్మకంగా, ఛరిష్మాటిక్గా, క్రూరంగా, ఆడంబరంగా ఉంటుందని విశ్లేషకులు అభివర్ణించారు. మరొకరు ఆయన్ని మార్లాన్ బ్రాండోతో పోల్చారు. 'జాజ్ మ్యూజిషియన్ ఆఫ్ అమెరికన్ యాక్టింగ్' అని దర్శకుడు డేవిడ్ లించ్ అన్నారు. మరోవైపు ఆయనది ఓవర్ యాక్టింగ్ అనే కొందరు విమర్శించారు. కానీ తన నటనని తాను 'మెగా యాక్టింగ్'గా వర్ణించుకున్నారు నికోలస్. చాలా మంది సినీ విమర్శకులు ఆయనది రేటింగ్‌కి అతీతమైన నటనగా అభివర్ణించారు. మెథడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నికోలస్కి మొదట రొమాంటిక్ కామెడీ 'మూన్‌స్ట్రక్' మంచి పేరు తెచ్చింది. ఇందులో ఆయన పెళ్ళి కొడుకు తమ్ముడిగా, చివరకు పెళ్ళి కూతురినే ప్రేమలో పడేసే కుర్రాడిగా ఆకట్టుకున్నారు. బ్లాక్ కామెడీగా వచ్చిన 'వాంపైర్స్ కిస్'లో లిటరరీ ఏజెంట్‌గా, నైట్ క్లబ్ వర్కర్‌గా, రొమాంటిక్ తరహా పాత్రలో ఆకట్టుకున్నారు.
డ్రామా ప్రధానంగా వచ్చిన 'రేసింగ్ విత్ ది మూన్'లో, నాటకీయ ప్రధానంగా వచ్చిన 'బర్డీ'లో స్నేహితుడిగా అల్లరి పాత్రల్లో మెప్పించారు. బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రం 'వైల్డ్ ఎట్ హార్ట్'లో అన్యోన్య జంటగా, క్రైమ్ కేస్‌లో ఇరుక్కున్న వ్యక్తిగా మెప్పించారు.యాక్షన్ ప్రధానంగా వచ్చిన 'ఫైర్ బర్డ్స్'లో పైలట్‌గా సాహసభరిత పాత్రలో అలరించారు. కామెడీ చిత్రం 'హానీమూన్ ఇన్ వెగాస్'లో ఇంకా పెళ్ళి కాని వ్యక్తి పాత్రలో అలరించారు. నియో నాయర్ 'రెడ్ రాక్ వెస్ట్' చిత్రంలో కార్ డ్రైవర్‌గా, ఆయిల్ ఫీల్డ్‌లో వర్క్ చేసే పాత్రలో, పారామెడికల్ డ్రామా 'బ్రింగింగ్ ఔట్ ది డెడ్'లో విలక్షణ పాత్రలో ఘోస్ట్‌ని ఎదుర్కొనే వ్యక్తిగా, బ్లాక్ కామెడీ క్రైమ్ 'మ్యాచ్‌స్టిక్ మెన్'లో కాన్ ఆర్టిస్టుగా పలు డిజాస్టర్స్‌తో బాధపడుతున్న వ్యక్తిగా మెప్పించారు. రొమాంటిక్ ట్రాజెడీ 'లివింగ్ లాస్ వెగాస్'లో భగ ప్రేమికుడిగా, మద్యానికి బానిసైన వ్యక్తిగా విషాదభరిత పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. అద్భుతమైన నటనకు ఆస్కార్‌ని అందుకున్నారు. కామెడీ డ్రామా మెటా ఫిల్మ్ 'అడాప్టేషన్'లో రియల్ లైఫ్ హాలీవుడ్ స్క్రీన్ రైటర్ చార్లీ కాఫ్‌మ్యాన్ పాత్రలో మైమరపించి ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ 'కాన్ ఎయిర్'లో ఆర్మీ అధికారిగా, క్రైమ్ మిస్టరీ '8ఎంఎం'లో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా అలరించారు. వార్ ప్రధానంగా వచ్చిన 'కెప్టెన్ కోరెల్లీస్ మండోలిన్'లో ఇటాలియన్ సైన్యానికి చెందిన కెప్టెన్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించారు. యాక్షన్ థ్రిల్లర్ 'ది రాక్'లో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'ఫేస్ ఆఫ్'లో ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్‌గా, టెర్రరిస్ట్‌గా ముఖ మార్పిడి చేసుకున్న పాత్రతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
అడ్వెంచరస్‌గా రూపొందిన 'నేషనల్ ట్రెజర్'లో భారీ నిధుల కోసం అన్వేషించే చరిత్రకారుడిగా, సైంటిస్ట్‌గా, క్రైమ్ డ్రామా 'లార్డ్ ఆఫ్ వార్'లో తిరుగుబాటుదారుడిగా, క్రైమ్ డ్రామా 'బ్యాడ్ లెఫ్టినెంట్: పోర్ట్ ఆఫ్ కాల్ న్యూ ఓర్లీయన్స్'లో అవినీతి లెఫ్టినెంట్‌గా, సూపర్ హీరో బ్లాక్ కామెడీ చిత్రం 'కిక్ యాస్'లో మాజీ పోలీస్ అధికారిగా, సూపర్ హీరో చిత్రం 'ఘోస్ట్ రైడర్'లో ఘోస్ట్ రైడర్‌గా, మోటర్ సైకిల్ స్టంట్ రైడర్‌గా భయానక పాత్రలో మైమరపించి ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'నోయింగ్'లో ప్రోఫెసర్‌గా, ఇండిపెండెంట్ క్రైమ్ డ్రామా 'జోయి'లో అడవిలోని కూలి వాడిగా, కుమారుడిని ఇబ్బంది పెట్టే తండ్రిగా ఆకట్టుకున్నారు. అమెరికన్ ట్విన్ టవర్స్‌పై దాడి ఘటన ఆధారంగా వచ్చిన 'వరల్డ్ ట్రేడ్ సెంటర్'లో పోలీస్ అధికారిగా, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్యాంకాక్ డేంజరస్'లో ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా, హిస్టారికల్ ఫాంటసీ అడ్వెంచరస్ 'సీజన్ ఆఫ్ ది విచ్'లో యుద్ధ వీరుడిగా, యాక్షన్ ఫాంటసీ 'ది సోర్సెరర్ అప్రింటిస్'లో మాంత్రికుడిగా, 'ఘోస్ట్ రైడర్: స్పిరిట్ ఆఫ్ వెంజియాన్'లో మరోసారి ఘోస్ట్ రైడర్‌గా మైమరపించారు. క్రైమ్ థ్రిల్లర్ 'ది ఫ్రోజెన్ గ్రౌండ్'లో ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్‌గా, హర్రర్ కామెడీ 'మామ్ అండ్ డాడ్'లో తండ్రి పాత్రలో విభిన్న భావోద్వేగాలు పలికించారు. యాక్షన్ థ్రిల్లర్ 'వెంగియన్స్: ఏ లవ్ స్టోరీ'లో పోలీస్ అధికారిగా, క్రైమ్ చిత్రం 'ది ట్రస్ట్'లో లెఫ్టినెంట్‌గా, పొలిటికల్ డ్రామా 'ది రన్నర్'లో ఐడియల్ పొలిటీషియన్‌గా, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'రేజ్'లో హంతకుడిగా, సూపర్‌నేచురల్ థ్రిల్లర్ 'బిట్వీన్ వరల్డ్స్'లో భార్యా పిల్లల్ని కోల్పోయిన భర్తగా ఆద్యంతం సంఘర్షణ పూరిత పాత్రలో ఫిదా చేశారు.
కేజ్ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది పిల్లలకు మానసికంగా, వైద్యపరంగా, పునరావాసం కోసం రెండు మిలియన్లను విరాళంగా అందించారు. హరికేన్ కత్రినా తుఫాను బాధితులను ఆదునేందుకు మిలియన్ డాలర్లని అందించారు. కేజ్ అందిస్తున్న సేవలకుగానూ యునైటెడ్ నేషన్స్ నుంచి హ్యూమనిటేరియన్ అవార్డుని అందుకున్నారు. అలాగే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. అలాగే ఆయనెక్కువ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసి రాణించారు. వాటికి సంబంధించి బాగా పాపులర్ అయ్యారు కూడా.
Authorization