లియు యిఫీ..అద్భుతమైన అందానికి, అత్యద్భుతమైన నటనకి కేరాఫ్. నటిగా, గాయకురాలిగాఅటు బుల్లితెర, ఇటు వెండితెర ప్రేక్షకుల్ని సైతం ఫిదా చేసిన గ్లామర్ క్వీన్. స్టార్ హీరోలకి దీటుగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చైనీస్ అగ్రకథానాయిక లియు యిఫీ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో.
బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన సూపర్‌స్టార్
లియు యిఫీ 1987, ఆగస్ట్ 25న, చైనాలోని హుబీ, వుహాన్ ప్రాంతంలో జన్మించారు. ఆమె అసలు పేరు యాన్ ఫెంగ్. తండ్రి యాన్ షావోకాంగ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఫ్రాన్స్‌లోని చైనీస్ ఎంబసీలో సెక్రెటరీగా పనిచేసిన మొదటి చైనీస్ వ్యక్తి కావడం విశేషం. తల్లి లియు గ్జియావోలి డాన్సర్. లియు చదువు కొనసాగిస్తూనే మోడలింగ్ ప్రారంభించారు. అలాగే తల్లితో కలిసి సింగింగ్, డాన్సింగ్, పియానో వాయించడం వంటివి నేర్చుకున్నారు. తండ్రితో తల్లి విడిపోయిన తర్వాత తల్లీకూతుర్లు న్యూయార్క్‌కి వెళ్ళారు. లూయిస్ పాస్టర్ మిడిల్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 2006లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన పేరుని లియు యిఫీగా మార్చుకున్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటికే డాన్సర్‌గా స్టేజ్ షోస్ ఇవ్వడంతో మంచి పేరు వచ్చింది. బీజింగ్ ఫిల్మ్ ఆకాడమీలోనూ జాయిన్ అయ్యారు. ఆ టైమ్‌లోనే పలు టెలివిజన్ ఆఫర్స్ వచ్చాయి. 2003లో మొదటి ఛాన్స్ వచ్చింది. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన టెలివిజన్ 'ది స్టోరీ ఆఫ్ ఏ నోబుల్ ఫ్యామిలీ'లో నటించారు. ఇది సీసీటీవీలో అత్యధిక రేటింగ్ సాధించిన టెలివిజన్ సిరీస్‌గా నిలిచింది. ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. అదే ఏడాది ప్రముఖ టీవీ సిరీస్ 'డెమి గాడ్స్ అండ్ సెమీ డెవిల్స్'లో వాంగ్ యుయాన్గా మెరిశారు. ఇది తైవాన్ టీవీలో ప్రసారమై, అత్యధిక రేటింగ్ సాధించిన చైనా సిరీస్‌గా నిలిచింది. ఇందులో ఆమె పాత్ర బాగా పాపులర్ అయ్యింది. మీడియా, ఆడియెన్స్‌తోపాటు సినీ వర్గాలు సైతం ఆమెని 'ఫెయిరీ సిస్టర్' పిలవడంతో దాన్నే నిక్ నేమ్‌గా చేశారు. 2005లో మరో పాపులర్ టీవీ సిరీస్ 'చైనీస్ పలాదిన్'లో అవకాశం అందుకున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వచ్చిన సిరీస్ విశేష ఆదరణ పొందింది. చైనా టెలివిజన్ రంగంలోనే లియు యిఫీకి మంచి పాపులారిటీ వచ్చింది. 2006లో మరో రొమాంటిక్ సిరీస్ 'ది రిటర్న్ ఆఫ్ ది కాండోర్ హీరోస్'లో గ్జియావోలాంగ్ను అనే అందమైన అమ్మాయి పాత్ర పోషించారు. దీంతో నటన పరంగా మంచి అనుభవంతోపాటు విశేష ప్రేక్షకాదరణ లభించింది. 6వ చైనా గోల్డెన్ ఈగల్ టీవీ ఆర్ట్ ఫెస్టివల్లో గోల్డెన్ ఈగల్ గాడెస్ అవార్డుని లియు అందుకున్నారు.
వెండితెర నటిగా కీలక కెరీర్ మలుపు తిప్పిన ది ఫర్బిడెన్ కింగ్డమ్
టీవీ రంగంలో విశేష గుర్తింపు పొందడంతో సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. 2004లో లవ్ స్టోరీతో రూపొందిన 'లవ్ ఆఫ్ మే'లో నటించే ఛాన్స్ వరించింది. ప్రియురాలిగా ఆకట్టుకున్నారు. అదే ఏడాది 'ది లవ్ విన్నర్'లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. కొంత గ్యాప్ తీసుకుని దాదాపు రెండేండ్ల తర్వాత 'అబావోస్ స్టోరీ'లో అతిథిగా మెరిశారు. 2007లో విలియమ్ మోర్రిస్ ఏజెన్సీలో జాయిన్ అయ్యారు. దీంతో భారీ చిత్రాలు రావడం ఆరంభమయ్యాయి అలా 2008లో భారీ బ్లాక్ బస్టర్ 'ది ఫర్బిడెన్ కింగ్డమ్'లో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన చైనీస్, అమెరికన్ ఫాంటసీ కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్ చిత్రమిది. రాబ్ మింకాఫ్ దర్శకత్వం వహించగా. జాకీ చాన్, జెట్ లియు, కొల్లిన్ చువు, లి బింగ్‌బింగ్ వంటి అగ్ర నటీనటులు నటించారు. తొలినాళ్ళలోనే జాకీచాన్ వంటి స్టార్‌తో కలిసి నటించడం రావడం విశేషం. 55 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 128 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో గోల్డెన్ స్పారో పాత్రలో, తమ తల్లిదండ్రులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే అమ్మాయిగా నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఇది భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఆమెకి పెద్ద ప్రాజెక్ట్‌లు వరుసబెట్టాయి ఆ వెంటనే రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్ డిస్గూస్'లో నటించారు. ఈ చైనీస్ చిత్రంలో తైవాన్ నటుడు, సింగర్ వాంగ్ లీహోమ్ సరసన మెరిశారు. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. చైనాకు చెందిన ఓ దర్శకుడు తొలిసారి దర్శకత్వం వహించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
2011లో ఫాంటసీ సూపర్ నేచురల్ చిత్రం 'ఏ చైనీస్ ఘోస్ట్ స్టోరీ'లో నటించారు.
అదే ఏడాది హిస్టారికల్ చిత్రం 'వైట్ వెంగీయన్స్'లో లియోన్ లాయి, ఫెంగ్ షావోఫెంగ్, జాంగ్ హన్యు వంటి వారితో కలిసి నటించారు. ఈ సినిమాతో లియు మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2012లో గోర్డన్ చాన్ దర్శకత్వంలో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ ప్రధాన చిత్రం 'ది ఫోర్'లో అద్భుతమైన పాత్రలో మెరిశారు. ఇది కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ది ఫోర్ 2'(2013), 'ది ఫోర్ 3'(2014)లోనూ కథానాయికగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలు లియుకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. 2012లో హిస్టారికల్ చిత్రం 'ది అస్సాస్సిన్స్' నటిగా మరో భారీ బ్రేక్‌నిచ్చింది.
అంతర్జాతీయ గుర్తింపు..
2014లో కొరియన్ నటుడు, గాయకుడు రైన్‌తో కలిసి రొమాంటిక్ చిత్రం 'ఫర్ లవ్ ఆర్ మనీ'లో నటించగా, ఇది కమర్షియల్‌గా ఆకట్టుకున్నప్పటికీ నిర్మాణ విలువలు, కథ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. అదే ఏడాది యాక్షన్ ప్రధానంగా రూపొందిన 'ఔట్‌కాస్ట్'లో నికోలస్ కేజ్, హెడెన్ క్రిస్టెన్సెస్లతో కలిసి నటించే అరుదైన అవకాశం పొందారు. నిక్ పవెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆమె నటించిన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇది ఘన విజయం సాధించి లియుకి మంచి పేరు తీసుకొచ్చింది.
నెక్ట్స్ చైనీస్, సౌత్ కొరియన్ నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ మెలోడ్రామా
'ది థర్డ్ వే ఆఫ్ లవ్'లో సాంగ్ సెయుంగ్ హెయోన్కి జోడీ కట్టారు. 2016లో చైనీస్,
ఫ్రెంచ్‌కి చెందిన రొమాంటిక్ చిత్రం 'నైట్ పీకాక్' తనకు మరో విజయాన్ని అందించింది.
ఇది 40వ మాట్రీయల్ వరల్డ్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. 2016లోనే మరో
రొమాంటిక్ చిత్రం 'నెవెర్ గోన్'లో క్రిస్ ఉతో కలిసి నటించి వరుస హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. 2017లో లియు ప్రముఖ నటుడు యాంగ్ యాంగ్తో కలిసి రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'వన్స్ అపాన్ ఏ టైమ్' చిత్రంలో నటించారు. ఆంటోని లా మోలినారా, జావో గ్జియావోడింగ్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్లని సాధించింది. ఈ విజయంతో లియు నటిగా మరో మెట్టు ఎక్కారు.
విశేష శ్రోతకాదరణ పొందిన గాయని
హిస్టారికల్ నేపథ్యంలో బిల్లె అగస్ట్ రూపొందించిన 'ది చైనీస్ విడో'లో ప్రధాన పాత్ర పోషించారు. ఓ రకంగా సినిమాకి తనే హీరో. ఆద్యంతం యుద్ధ ప్రధానంగా విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని తన నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. ఇది షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఓపెనింగ్ ఫిల్మ్‌గా ప్రదర్శించబడింది. గతేడాది ఫాంటసీ కామెడీగా వచ్చిన 'హాన్సన్ అండ్ ది బీస్ట్'లో ప్రముఖ హీరో ఫెంగ్ ఫావోఫెంగ్తో కలిసి నటించగా, ఇది పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఆమె లైవ్ యాక్షన్ చిత్రం 'ములన్'లో నటిస్తున్నారు. వార్ ప్రధానంగా రూపొందే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు దాదాపు 12ఏండ్ల గ్యాప్ తర్వాత బుల్లితెరలోకి రీఎంట్రీ ఇస్తూ 'ది లవ్ ఆఫ్ హిప్నోసిస్' అనే టెలివిజన్‌లో నటిస్తున్నారు.
లియు నటిగా చైనాతోపాటు అంతర్జాతీయ ప్రేక్షకులను ఫిదా చేశారు. అలాగే సింగర్‌గానూ అందరినీ అలరిస్తున్నారు. 2005లో జపాన్‌కి చెందిన సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి గాయనీ సైన్ చేశారు. 'మయోనక నో డూర్' అనే సింగిల్‌ని ఆలపించారు. ఆమెకిది ప్రొఫెషనల్‌గా మొదటి పాట. 2006లో విడుదలై విశేష శ్రోతకాదరణ పొందింది. మొదటి ఆల్బమ్ 'లియు యిఫీ' కూడా 2006లోనే విడుదలైంది. ర్యాప్, సాఫ్ట్ రాక్ సంగీతం ప్రధానంగా రూపొందించిన ఈ ఆల్బమ్ చైనాతోపాటు తైవాన్, హాంకాంగ్, సౌతీస్ట్ ఏషియాలో విడుదలై విశేషంగా ఆదరణ పొందింది. అదే ఏడాది తన జపనీస్ ఆల్బమ్ 'ఆల్ మై వర్డ్స్'ని కూడా విడుదల చేశారు. వీటితోపాటు 'ఐ వాంట్ మై టేస్ట్', 'లాన్ రుయోస్ లిరిక్స్', 'వైట్ వెంగీయన్స్' చిత్ర ఆల్బమ్‌లో 'సాంగ్ ఆఫ్ చు', 'ది ఫోర్' ఆల్బమ్‌లో 'డ్రీమ్స్ వోంట్ డై', 'ది అస్సాస్సిన్స్' ఆల్బమ్‌లో 'వెయిటింగ్ ఫర్ స్నో', 'ది ఫోర్ 2' ఆల్బమ్‌లో 'గివింగ్ అప్', 'నెవర్ గోన్' చిత్ర ఆల్బమ్‌లో 'స్టిల్ హియర్', 'వన్స్ అపాన్ ఏ టైమ్' ఆల్బమ్‌లో 'త్రీ లైఫ్‌టైమ్స్, టెన్ మైల్స్..' అంటూ సాగే పాటలని పాడి గాయని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పదకొండేండ్ల కెరీర్లో లియు పలు అవార్డులను అందుకున్నారు. అందులో భాగంగా 2012లో 'ది అస్సాస్సిన్స్' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా 5వ మకావ్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో అవార్డుని సొంతం చేసుకున్నారు. 2015లో నటించిన 'ది థర్డ్ వే ఆఫ్ లవ్' చిత్రానికిగానూ మోస్ట్ యాంటిసిపేటెడ్ నటిగా 16వ చైనీస్ ఫిల్మ్ మీడియా అవార్డుని అందుకున్నారు. అదే ఏడాది ప్రముఖ గూడ్స్ కంపెనీ డియోర్కి, అలాగే స్విస్ లగ్జరీ వాచ్‌మేకర్ టిస్సాట్కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఓ పక్క నటిగా, మరో పక్క గాయనిగా అందరినీ అలరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో లియు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు ముఖ్యంగా యూత్‌లో లియుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
విలక్షణ పాత్రలకు కేరాఫ్
లియు యిఫీ అందానికి మారు పేరు. అలాగే విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అంతేకాదు ఆమె అద్భుతమైన యాక్షన్‌కి అందరూ ఫిదా అయ్యారు. తొలి చిత్రం 'లవ్ ఆఫ్ మే'లో ప్రియురాలిగా, మ్యూజిక్ పర్ఫార్మర్గా, 'ది లవ్ విన్నర్'లో ప్రియుడిని కోల్పోయిన ప్రేమికురాలిగా, మార్షల్ ఆర్ట్స్ ప్రధాన యాక్షన్ అడ్వెంచర్ 'ది ఫర్బిడెన్ కింగ్డమ్'లో తల్లిదండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకునే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ ప్రావీణ్యురాలిగా అద్భుత యాక్షన్‌తో మంత్రమగ్ధుల్ని చేశారు. 'లవ్ ఇన్ డిస్గ్యూస్'లో స్కూల్మేట్గా, 'ఏ చైనీస్ ఘోస్ట్ స్టోరీ'లో అందమైన దెయ్యంగా భయపెట్టి మెప్పించారు. హిస్టారికల్ చిత్రం 'వైట్ వెంగీయన్స్'లో రాకుమారిగా అలరిస్తూనే యుద్ధ సన్నివేశాలతో మెస్మరైజ్ చేశారు. ఫాంటసీ యాక్షన్ క్రైమ్ చిత్రం 'ది ఫోర్'లో యాక్షన్ తరహా పాత్రలో, హిస్టారికల్ డ్రామా 'ది అస్సాస్సిన్స్'లో రాజుకి వంపుడు గత్తెగా, మార్షల్ ఆర్ట్స్ ప్రధాన చిత్రం 'లాలెస్ కింగ్డమ్' (ది ఫోర్ 2)లో నలుగురిలో ఒకరిగా, ఎమోషన్లెస్ తరహా పాత్రలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ది ఫోర్3'లోనే అదే పాత్రలో ఆద్యంతం యాక్షన్ భరిత నటనతో మైమరపించారు. 'ఫర్ లవ్ ఔర్ మనీ'లో మధ్యతరగతికి చెందిన అమ్మాయిగా సెటిల్డ్ నటనతో, యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా వచ్చిన 'ఔట్‌కాస్ట్'లో రాకుమారి పాత్రలో మెస్మరైజ్ చేయడంతోపాటు యాక్షన్‌తోనూ అబ్బురపరిచారు.
లేడీ లాయర్‌కి, సంపన్నకుటుంబానికి చెందిన కుర్రాడికి మధ్య ప్రేమ కథా నేపథ్యంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది థర్డ్ వే ఆఫ్ లవ్'లో లాయర్ పాత్రలో అలరించారు. లేడీ మ్యూజీషియన్ ప్యాషన్, లవ్, ఫ్రీడమ్ వంటి అంశాల ప్రధానంగా, ఆ మ్యూజీషియన్ జర్నీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ చిత్రం 'నైట్ పికాక్'లో మ్యూజీషియన్‌గా, శృంగారభరిత పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు.
సంపన్న కుటుంబానికి చెందిన తోటి స్టూడెంట్‌కి, పేద కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయికి మధ్య ప్రేమ కథ నేపథ్యంలో ప్రేమలోని సంఘర్షణని, ప్రేమకి అడ్డొచ్చే ఆర్థిక తేడాలను ప్రతిబింబించే రొమాంటిక్ డ్రామా
'నెవర్గాన్'లో పేద కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయిగా,
ప్రేమ కోసం తపించే అమ్మాయిగా అబ్బురపరిచారు.
మరణం లేని ఓ మహిళ తన గత జీవితంలోని ప్రేమకథలను
గుర్తు చేసుకునే కథాంశంతో ఫాంటసీ రొమాంటిక్ డ్రామా
'వన్స్ అపాన్ ఏ టైమ్'లో అమర మహిళగా అలరించారు.
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో అమెరికా జపాన్‌పై బాంబ్ దాడి సమయంలో చైనీస్ విడో ప్రేమకథని తెలిపే కథాంశంతో
హిస్టరీ రొమాంటిక్ వార్‌గా రూపొందిన 'ది చైనీస్ విడో'
చిత్రంలో చైనీస్ విడోగా, ఓ అమ్మాయికి తల్లిగా సంఘర్షణతో కూడిన పాత్రలో ఆకట్టుకున్నారు. ఫాంటసీ రొమాంటిక్
కామెడీగా అప్పుల్లో ఉన్న ఉన్న జంతు పెంపకదారుడు
నక్కతో ప్రేమలో పడే కథాంశంతో రూపొందిన
'హాన్సన్ అండ్ ది బీస్ట్' చిత్రంలో రేర్ సిల్వర్ ఫాక్స్ పాత్రలో
ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
Authorization