బ్రాడ్లీ కూపర్..
కెరీర్‌కి సంబంధించి అందరిలాగే బ్రాడ్లీ కూపర్ కూడా ఆందోళన పడ్డాడు. నటుడిగా ఇక రాణించలేమోనని ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు.
కానీ.. అనుకున్న లక్ష్య్నాన్ని సాధించాలనే కసితో చేసిన ప్రయత్నం ప్రపంచ ప్రేక్షకుల్ని మెప్పించిన అగ్రకథానాయకుడ్ని చేసింది. విలక్షణ పాత్రలకి కేరాఫ్‌గా నిలిపింది. అంతేకాదు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల కథానాయకుడిగా, వరల్డ్ సినిమాని అత్యంత ప్రభావితం చేసిన నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా ప్రేక్షకులతోపాటు శ్రోతల్ని కూడా ఫిదా చేసిన ఆల్‌రౌండర్ బ్రాడ్లీకూపర్ స్ఫూర్తిదాయక సినీ జీవిత ప్రస్థానం గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
జీవిత గమనాన్నే మార్చిన ది ఎలిఫెంట్ మ్యాన్
బ్రాడ్లీ చార్లెస్ కూపర్.. అమెరికా, ఫిలడెల్ఫియాలోని ఫెన్నిసెల్వియాలో 1975 జనవరి 5న జన్మించారు. తల్లి గ్లోరియా స్థానిక ఎన్బీసీ ఛానెల్లో పనిచేసేవారు. తండ్రి ఛార్లెస్ కూపర్ స్టాక్ బ్రోకర్. ఆయనకు అక్కయ్య హోల్లీ ఉన్నారు. బ్రాడ్లీకి చిన్నప్పుడు ఆర్మీ సైనికుడు కావాలనుకుని మిలటరీ అకాడమీలో జాయిన్ అయ్యారు. కోవర్ట్ ఆపరేషన్‌కి సంబంధించి జపాన్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆ టైమ్‌లోనే వాళ్ళ నాన్న తనకి 'ది ఎలిఫెంట్ మ్యాన్' అనే సినిమా చూపించారు. అది కూపర్‌ని విపరీతంగా ప్రభావితం చేసింది. అంతేకాదు నటుడు కావాలనే నిర్ణయం తీసుకునేలా చేసింది. పరిచయం లేని రంగంలో రాణించడం కష్టమని తల్లిదండ్రులు భయపడ్డారు. అయితే 'ది ఎలిఫెంట్ మ్యాన్' సినిమా కథ ఆధారంగా ప్రదర్శించిన నాటకంతో అలరించడంతో కూపర్‌పై వారికి నమ్మకం కలిగింది. జర్మన్ టౌన్ అకాడమీ, విల్లనోవా యూనివర్సిటీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆర్ట్స్‌లో గ్రాడ్యూయేట్ చేశారు. గ్రాడ్యూయేట్ విద్య పూర్తయ్యాక థియేటర్‌పై దృష్టి సారించారు. నటనలో నైపుణ్యం పొందాక సినిమా అవకాశాలపై ఫోకస్ చేశారు. 1999లో తొలిసారి 'సెక్స్ అండ్ ది సిటీ' టెలివిజన్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని పొందారు. ఇందులో ప్రముఖ నటి సారా జెస్సికా పార్కర్‌తో కలిసి నటించారు. 2000లో ట్రావెలింగ్ అడ్వెంచరస్ సిరీస్‌గా రూపొందించిన 'గ్లోబ్ ట్రెక్కర్'కి ప్రజెంటర్‌గానూ వ్యవహరించారు. యాక్టర్స్ స్టూడియో డ్రామా స్కూల్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పొందారు. ఈ టైమ్‌లో కొన్ని రోజులు మోర్గన్స్ హోటల్లో డోర్మ్యాన్గా పనిచేశారు. ఆ టైమ్‌లో ప్రముఖ నటుడు రాబర్ట్ డీ నిరో, సీయాన్ పెన్న్లతో పరిచయం ఏర్పడింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో వారితో పాటు పాల్గొన్నారు. ఇందులో చాలా మంది నటులు గెస్ట్‌గా పాల్గొనేవారు. అందులో మొదటి స్టూడెంట్ గెస్ట్‌గా కూపర్ హాజరు కావడం విశేషం. ఆ తర్వాత రాబర్డ్ డీ నిరోతో కలిసి కూపర్ పలు సినిమాల్లో నటించడం విశేషం.
'వెడ్డింగ్ క్రాషర్స్'తో నటుడిగా మంచి గుర్తింపు
2001లో కామెడీ సినిమా 'వెట్ హాట్ అమెరికన్ సమ్మర్'లో చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. అదే ఏడాది ప్రసారమైన 'ఏలియాస్' అనే టెలివిజన్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. 2002లో సైకలాజికల్ థ్రిల్లర్ 'ఛేంజింగ్ లేన్స్'లో చిన్న పాత్రలో నటించగా, ఎడిటింగ్‌లో కట్ అయ్యింది. కానీ డీవీడీలో ఆయన పార్ట్‌ని ఉంచారు. అదే ఏడాది 'బెండింగ్ ఆల్ ది రూల్స్' చిత్రంలో, షార్ట్ లైవ్స్ టీవీ సిరీస్ 'మిస్ మ్యాచ్'లో, అలాగే టెలివిజన్ ఫిల్మ్స్ 'ది లాస్ కౌబారు', 'వాంట్ టు మ్యారీ ర్యాన్ బ్యాంక్స్', మరో సిరీస్ 'జాక్ అండ్ బాబీ'లో నటించారు. 2005లో విడుదలైన కామెడీ చిత్రం 'వెడ్డింగ్ క్రాషర్స్'లోని పాత్రతో మంచి గుర్తింపు లభించింది. ఇందులో ప్రముఖ నటి మెక్ ఆడామ్స్కి బారు ఫ్రెండ్‌గా నటించారు. నెగటివ్‌గా సాగే అతని పాత్ర తనపై ఉన్న కామెడీ దృక్పథాన్నే మార్చేసింది. 40 మిలియన్ డాలర్లతో రూపొంది 285 మిలియన్ డాలర్లని వసూలు చేసి సినిమా ఘన విజయం సాధించింది. దీంతో కూపర్‌కి మంచి పేరొచ్చింది. తర్వాత 'త్రీ డేస్ ఆఫ్ రెయిన్', 'ది కమ్‌బ్యాక్' చిత్రాల్లో నటించారు. 2008లో తనే ప్రధాన పాత్రలో 'ఓల్డర్ దెన్ అమెరికా'లో నటించే అవకాశం వచ్చింది. దీంతోపాటు 'ఎస్ మ్యాన్', 'ది రాకర్' చిత్రాల్లో మెరవగా, హర్రర్ చిత్రం 'ది మిడ్నైట్ మీట్ ట్రెయిన్'తో పూర్తిస్థాయిలో హీరోగా మారారు.
'ది హ్యాంగోవర్' సిరీస్‌తో క్రేజీ స్టార్ ఇమేజ్
2009లో 'హీస్ జస్ట్ నాట్ దట్ ఇన్‌టూ యు' చిత్రంలో సహాయ నటుడిగా మెరిశారు. అదే ఏడాది వచ్చిన కామెడీ చిత్రం 'ది హ్యాంగోవర్'తో భారీ బ్రేక్ అందుకున్నారు. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎడ్ హెల్మ్స్, జాచ్ గాలిఫియనకిస్లతో కలిసి నటించారు. ఇది కేవలం 35 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా 467 మిలియన్ డాలర్లని వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో హాలీవుడ్‌లోనే బ్రాడ్లీ కూపర్ క్రేజీ స్టార్‌గా నిలిచారు. ఇందులో ఆయన కామెడీ పాత్రలో కడుపుబ్బా నవ్వించారు. ఇదే ఏడాది తాను 2006లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'కేస్ 39' విడుదలైంది. ప్రముఖ నటి సాండ్రా బుల్లక్తో కలిసి 'ఆల్ అబౌట్ స్టీవ్'లో నటించగా నిరాశ పరిచింది. పదకొండు లఘు చిత్రాల కలయికలో వచ్చిన 'న్యూయార్క్ ఐ లవ్ యు'లో మెరవగా మిశ్రమ స్పందనని రాబట్టుకుంది.
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో అంతర్జాతీయ ఖ్యాతి
ఇక 2010లో గ్యారీ మార్షల్ దర్శకత్వంలో జెస్సికా ఆల్బ, క్యాతీ బేట్స్, జెస్సికా బీల్, అన్నే హాత్వే, జూలియా రాబర్ట్, టేలర్ స్విఫ్ట్ ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ కామెడీ 'వాలెంటైన్స్ డే'తో మరో బ్లాక్ బస్టర్‌ని అందుకున్నారు. అదే ఏడాది వచ్చిన కామెడీ చిత్రం 'బ్రదర్స్ జస్టీస్' డిజప్పాయింట్ చేసింది. 2011లో టెక్నో థ్రిల్లర్ 'లిమిట్లెస్'తో మరో సక్సెస్‌ని సొంతం చేసుకున్నారు. ఇదే ఏడాది నటించిన 'ది హ్యాంగోవర్ పార్ట్ 2' తన కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2012లో నాలుగు చిత్రాల్లో భాగమయ్యారు. ఇందులో రొమాంటిక్ డ్రామా 'ది వర్డ్స్' పరాజయం చెందగా, యాక్షన్ కామెడీ 'హిట్ అండ్ ది రన్' పర్వాలేదనిపించుకుంది. క్రైమ్ ట్రాజెడీ డ్రామా 'ది ప్లేస్ బియాండ్ ది పైన్స్' విజయాన్ని అందుకుంది. జెన్నీఫర్ లారెన్స్, రాబర్డ్ డీ నిరోలతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్' భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డేవిడ్ ఓ రస్సెల్ రూపొందించిన ఈ చిత్రం పడిపోతున్న కూపర్ కెరీర్‌కి బూస్టప్‌నిచ్చింది. 2013లో కూపర్ 'ది హ్యాంగోవర్' సీక్వెల్లో భాగంగా వచ్చి మూడో సినిమా 'ది హ్యాంగోవర్ పార్ట్ 3'లో నటించగా, వంద మిలియన్ డాలర్లతో రూపొంది 362 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అదే ఏడాది బ్లాక్ కామెడీ 'అమెరికన్ హస్టిల్'లో నటించి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
'అమెరికన్ స్నిప్పర్'తో అగ్రకథానాయకుడి స్టేటస్
2014లో తొలిసారి సూపర్ హీరో చిత్రంలో భాగమయ్యారు. జేమ్స్ గన్న్ దర్శకత్వంలో రూపొందిన 'గార్జియన్స్ ఆఫ్ ది గాలాక్సీ'లో క్రిస్ ప్రాట్, జోయి సల్డానా, విన్ డీజిల్, లీ పేస్ వంటి వారితో నటించారు. ఆ తర్వాత 'సెరెనా' పరాజయం చెందింది. ఇక క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వంలో రూపొందిన బయోగ్రాఫికల్ వార్ డ్రామా 'అమెరికన్ స్నిప్పర్'తో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అలాగే ఈ చిత్రంతో నిర్మాతగానూ మారారు. దీంతో కూపర్‌కి ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్‌తోపాటు అగ్ర కథానాయకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. 2015లో రొమాంటిక్ కామెడీ 'అలోహ', డ్రామా ప్రధానంగా వచ్చిన 'బర్ట్న్', బయోగ్రాఫికల్ కామెడీ డ్రామా 'జోరు' చిత్రాల్లో నటించారు. బయోగ్రాఫికల్ డార్క్ కామెడీ క్రైమ్ చిత్రం 'వార్ డాగ్స్'తో విజయాన్ని అందుకున్నారు. 2017లో 'గ్రాడియన్స్ ఆఫ్ ది గాలాక్సీ వోల్ 2'లో మరోసారి భాగమయ్యారు. మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'అవెంజర్స్: ఇన్ఫినిటి వార్'లో కూడా 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ' చిత్రంలోని నటించిన రాకెట్ పాత్రలో నటించారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
దర్శకుడిగా మారి హీరోగా నటిస్తూ 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా బ్రాడ్లీ కూపర్ విజయాన్ని అందుకున్నారు. ఇది ఎనిమిది విభాగాల్లో ఆస్కార్‌కి నామినేటై ఒరిజినల్ సాంగ్ విభాగంలో లేడీ గాగా ఆస్కార్‌ని సొంతం చేసుకుంది. క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వంలో క్రైమ్ డ్రామా 'ది మ్యూల్'లో ప్రధాన పాత్ర పోషించారు. ఇది కూడా భారీ సక్సెస్ అయ్యింది. ఇటీవల 'అవెంజర్స్: ఎండ్ గేమ్'లో మరోసారి రాకెట్ పాత్రలో ఆకట్టుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకోవడంతోపాటు నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నారు. 'లిమిట్లెస్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'ది వర్డ్స్', 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్', 'అమెరికన్ హస్టిల్'లకు ఎగ్జిక్యూటివ్‌గా చేసి, 'అమెరికన్ స్నిప్పర్'తో నిర్మాతగా మారారు. 'వార్ డాగ్స్', 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' సినిమాలని నిర్మించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన 'జోకర్' చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. పాపులర్ టెలివిజన్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన కూపర్ గాయకుడిగానూ శ్రోతలను అలరిస్తున్నారు. 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' ఆల్బమ్‌లో లేడీ గాగాతో కలిసి 'మేబీ ఇట్స్ టైమ్', 'బ్లాక్ ఐస్', 'మ్యూజిక్ టు మై ఐస్' అనే మూడు పాటలు పాడారు. 'షాలో' అనే సింగిల్‌ని ఆలపించారు. కొత్తల్లో బ్రాడ్లీకి కెరీర్ పరమైన ఆందోళన కారణంగా మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. ఒకానొక సందర్భంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశారట. అలాంటి పరిస్థితి నుంచి హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర కథానాయకుడిగా, తన సినిమాలతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా, సమాజ సేవకుడిగా బ్రాడ్లీ ఎదిగిన తీరు అందరికీ స్పూర్తిదాయకం.
విలక్షణ పాత్రలకుకేరాఫ్
బ్రాడ్లీ కూపర్.. తొలినాళ్ళలో కామెడీ ప్రధానంగా సాగే చిత్రాల్లో ఎక్కువగా నటించి మూసధోరణి నటుడిగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విలక్షణ నటనతో వరల్డ్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. నటుడిగా తెరంగేట్రం చేసిన చిత్రం 'వెట్ హాట్ అమెరికన్ సమ్మర్'లో గే కౌన్సిల్‌గా, 'వెడ్డింగ్ క్రాషర్స్'లో కన్నింగ్ ప్రియుడిగా, 'ఫెయిల్యూర్ టు లాంచ్'లో హీరో స్నేహితుడిగా, కౌబారు నేపథ్యంలో సెటైరికల్ కామెడీగా వచ్చిన 'ది కమ్‌బ్యాక్స్'లో కౌబారుగా ప్రేక్షకుల్ని అలరించారు. 'ఓల్డర్ దెన్ అమెరికా'లో జియాలజిస్ట్‌గా, హాస్యభరితంగా వచ్చిన 'ది రాకర్', 'ఎస్ మ్యాన్'లో సహాయ నటుడిగా, హర్రర్ చిత్రం 'ది మిడ్నైట్ మీట్ ట్రైన్'లో ఇన్నోవేటివ్ ఫొటోగ్రాఫర్‌గా, రొమాంటిక్ కామెడీ 'హీస్ జస్ట్ నాట్ దట్ ఇన్‌టూ యు'లో పెళ్ళి జీవితంతో ఇబ్బంది పడుతున్న భర్తగా మెప్పించారు.
బ్రాడ్లీకి బిగ్ బ్రేక్‌నిచ్చిన కామెడీ చిత్రం 'హ్యాంగోవర్'లో ఉపాధ్యాయుడుగా, తొట్టిగ్యాంగ్కి లీడర్‌గా హాస్యభరిత పాత్రలో కడుపుబ్బ నవ్వించారు. సూపర్‌నేచురల్ సైకలాజికల్ హర్రర్ చిత్రం 'కేస్ 39'లో సైకియాట్రిస్ట్‌గా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. 'ఆల్ అబౌట్ స్టీవ్'లో టీవీ ఛానెల్ కెమెరామెన్‌గా, కథానాయికకి ప్రియుడిగా, 'వాలెంటైన్స్ డే'లో రొమాంటిక్ పాత్రలో అలరించారు. 'బ్రదర్స్ జస్టిస్'లో కామెడీ పాత్రలో, యాక్షన్ ప్రధానంగా వచ్చిన 'ది ఏ టీమ్'లో పోలీస్‌గా, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'లిమిట్లెస్'లో సంఘర్షణ పడే, ఇబ్బందులు ఎదుర్కొనే రైటర్‌గా, 'ది హ్యాంగోవర్ పార్ట్ 2'లో కామెడీ పాత్రలో, రొమాంటిక్ డ్రామా 'ది వర్డ్స్'లో ఔత్సాహిక రచయితగా, ప్రియుడిగా, యాక్షన్ కామెడీ 'హిట్ అండ్ రన్'లో కేసుకి సంబంధించిన ప్రతివాదిగా, క్రైమ్ ట్రాజెడీ డ్రామా 'ది ప్లేస్ బియాండ్ ది పిన్స్'లో పోలీస్ అధికారిగా, రొమాంటిక్ కామెడీ డ్రామా 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్'లో మామూలు మనిషిగా మారే బైపోలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా, ఇలా వరుసగా విభిన్న పాత్రలతో విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. 'ది హ్యాంగోవర్ పార్ట్ 3'లో మరోసారి గ్యాంగ్‌కి లీడర్‌గా, బాడీగార్డ్‌గా నవ్వించారు. బ్లాక్ కామెడీ క్రైమ్ 'అమెరికన్ హాస్టిల్'లో కాన్ ఆర్టిస్టుగా, మొదటి సూపర్ హీరో చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ'లో జెనటిక్ ఇంజనీరింగ్‌కి సంబంధించి కిరాయి హంతకుడిగా, డ్రామా నేపథ్యంలో వచ్చిన 'సెరెనా'లో గొప్ప ప్రేమికుడిగా అబ్బురపరిచారు.
ఆర్మీ సైనికుడు క్రిస్ కైల్ రాసుకున్న ఆటోబయోగ్రఫీ ఆధారంగా వచ్చిన వార్ డ్రామా 'అమెరికన్ స్నిప్పర్'లో సైనికుడు క్రిస్‌గా మెస్మరైజ్ చేశారు. 'అలోహ'లో మిలటరీ లవర్‌బారుగా, నాటకీయంగా వచ్చిన 'బర్ట్న్'లో వంటవాడిగా, బయోగ్రాఫికల్ కామెడీ డ్రామా 'జారు'లో కేబుల్ టీవీ ఎగ్జిక్యూటివ్‌గా, బయోగ్రాఫికల్ కామెడీ క్రైమ్ డ్రామా 'వార్ డాగ్స్'లో ఆయుధాల డీలర్‌గా, 'గార్డియన్స్ ఆఫ్ ది గాలాక్సీ వోల్ 2', సూపర్ హీరో చిత్రాలు 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్ : ఎండ్గేమ్స్'లో లైవ్ యాక్షన్ ద్వారా క్రియేట్ చేయబడ్డ రాకర్ పాత్రలో వేటగాడిగా ఆకట్టుకున్నారు. క్రైమ్ డ్రామా 'ది మ్యూల్'లో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్‌గా మైమరపించారు. అన్నీ తానై రూపొందించిన రొమాంటిక్ డ్రామా 'ఏ స్టార్ ఈజ్ బోర్న్'లో లేడీ గాగాకి భర్తగా, మెంటర్‌గా, మద్యానికి బానిసైన పాప్ సింగర్‌గా విలక్షణ పాత్రలో కనువిందు చేశారు. కమర్షియల్ సినిమాలతోపాటు రియలిస్టిక్ చిత్రాలతోనూ సంఘర్షణ పూరిత పాత్రల్లోనూ నటించిన బ్రాడ్లీ కూపర్‌కి ఒక్క ఆస్కార్ కూడా దక్కకపోవడం గమనార్హం.
Authorization