హీరోలకి, హీరోయిజానికి ప్రయారిటీ ఇచ్చే ట్రెండ్ రోజురోజుకి తగ్గిపోతోంది. దీనికి కారణం మహిళా ప్రధాన చిత్రాలకి విశేష ప్రేక్షకదరణ లభించడం, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడమే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మహిళా ప్రధాన చిత్రాల నిర్మాణం పెరుగుతూ వస్తోంది. అందం, అభినయంతోనే కాకుండా మతిపొగేట్టే అద్భుత పోరాటాలతో సైతం కథానాయికలు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నారు. అలాగే ఒకే మూసధోరణికి పరిమితమవ్వకుండా భిన్న జోనర్ చిత్రాల్లోని విభిన్న పాత్రలతో తమ ప్రతిభని నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంలో పలువురు కథానాయికలు ఇప్పటికే అత్యద్భుతమైన విజయాల్ని దక్కించుకున్నారు. మహిళా ప్రధాన చిత్రాల రూపకల్పన ఒక్క హాలీవుడ్‌కే పరిమితం కాలేదు నెమ్మదిగా అన్ని దేశాల్లోనూ విస్తరిస్తోంది. వీటిల్లో మన దేశం కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం మన దేశంలో కూడా బోల్డెన్ని మహిళా ప్రధాన చిత్రాలు రూపొంది ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేండ్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
భర్తల మాదిరిగా దొంగలుగా మారిన భార్యలు..
గతేడాది బాగా పాపులర్ అయిన మహిళా ప్రధాన చిత్రం 'విడోస్'. దొంగతనం చేసే తమ భర్తలు పోలీసుల కాల్పుల్లో మరణించడంతో నలుగురు భార్యలు తీరని బాధ, ఆవేశం, కోపంతో వాళ్ళు కూడా దొంగలుగా మారే నేపథ్యంలో రూపొందిన దొంగతన నేపథ్య చిత్రమిది. దీనికి స్టీవ్ మెక్ క్వీన్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో వియోలా డేవిస్, మైఖెల్లె రోడ్రిగ్విజ్, ఎలిజబెత్ డెబికి, కింథియా ఎరివో నటించి మెస్మరైజ్ చేయగా ఈ సినిమా గతేడాది విడుదలై భారీ విజయం సాధించింది. మహిళా ప్రతీకారాన్ని తెలిపింది.
ఓ కూతురి సాహసం..
తాను చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్న తప్పిపోవడంతో అతని ఆచూకి కనిపెట్టడం కోసం, ఆయన మిస్టరీని చేధించడం కోసం పెద్దయ్యాక ఓ కూతురు చేసే అత్యంత సాహసోపేతమైన యాక్షన్ అడ్వెంచరస్ జర్నీ నేపథ్యంలో 'టాంబ్ రైడర్' చిత్రం రూపొందింది. రోర్ ఉతాగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో కూతురు పాత్రలో అలిసియా వికాండర్ అత్యద్భుత నటన అబ్బురపరుస్తుంది. కళ్ళు చెదిరే యాక్షన్‌తో అదరగొట్టారు. సినిమా విజువల్‌గా కనువిందు చేస్తుంది.
పరిస్థితి ఏదైనా సరే..
భర్త అకస్మాత్తుగా విడాకులు కోరడంతో అయనకి గుడ్‌బై చెప్పి, మధ్యలో ఆగిపోయిన డిగ్రీని పూర్తి చేసేందుకు మధ్య వయస్కురాలైన ఓ మహిళ మళ్ళీ కాలేజ్‌కి వెళ్తుంది. అక్కడ తనని తాను ఎలా వెతుక్కుంది?, జీవితాన్ని ఎలా సంతోషమయం చేసుకుందనే కథాంశంతో రూపొందిన హాస్యభరిత చిత్రం 'లైఫ్ ఆఫ్ ది పార్టీ'. బెన్ ఫాల్కోన్ దర్శకత్వంలో రూపొంది గతేడాది విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మధ్య వయసున్న మహిళగా మెల్లిస్సా మెక్ క్యాథీ అద్భుత నటనతో మెస్మరైజ్ చేశారు.
స్నేహితురాలు కోసం..
తోటి స్నేహితురాలు తప్పిపోవడంతో తప్పని పరిస్థితుల్లో భర్తలేని మరో మహిళ తానే సొంతంగా ఇన్వెస్టిగేట్ చేయడం నేపథ్యంలో బ్లాక్ కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 'ఏ శాంపుల్ ఫేవర్' చిత్రం రూపొందింది. పాల్ ఫీగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒంటరి మహిళగా అన్నా కెండ్రిక్, తప్పిపోయిన మహిళగా బ్లేక్ లైవ్లీ నటించి మాయ చేశారు. ఇది గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
అలుపెరగని పోరాటం..
టీనేజ్ స్కూల్ విద్యార్థిని తన బెస్ట్ బారుఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్తుంది. అతడు పోలీసులు కాల్పుల్లో మరణిస్తాడు. ఆ హత్యకి తనే ప్రధాన సాక్షి. దీంతో న్యాయం కోసం తాను చేసే పోరాట నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా 'ది హేట్ యు గివ్' చిత్రం రూపొందింది. జార్గ్ టిల్ల్మన్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా అమండ్లా స్టెన్‌బర్గ్ అద్భుత నటనతో మైమరపించింది. గతేడాది రిలీజై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రమాదం..అయినప్పటికీ
అత్యంత ప్రమాదకరమైన జాంబీ వైరస్ వ్యాపిస్తూ మనుషుల్ని, మనుషులే చంపుతున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు తన ప్రేమికుడితో కలిసి స్కూల్ గర్ల్ అన్నా మ్యూజికల్‌గా చేసే పోరాటం ఆధారంగా ఫాంటసీ హర్రర్ కామెడీగా రూపొందిన చిత్రం 'అన్నా అండ్ ది అపోకలిప్సే'. జాన్ మెక్ ఫెయిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అన్నా పాత్రలో ఎల్లా హంట్ నటన మెస్మరైజ్ చేస్తుంది. గతేడాది విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
జెలసీకి భారీ మూల్యం..
అమాయకత్వానికి కేరాఫ్‌గా ఉండే ఓ టీనేజ్ విద్యార్థినికి మ్యూజిక్ టీచర్ దగ్గరవుతాడు. అది చూసి మరో విద్యార్థిని జెలసీగా ఫీలవుతుంది. వారిని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశాల సమాహారంగా సైకలాజికల్ టీనేజ్ డ్రామాగా 'బ్లేమ్' వచ్చింది. జెలసీగా ఫీలైతే జీవితంలో చాలా పోగొట్టుకోవాల్సి వస్తుందనే విషయాన్ని దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించారు. క్వీన్న్ షెఫార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్వీన్ షెఫార్డ్ టీనేజ్ విద్యార్థినిగా నటించి మెస్మరైజ్ చేసింది. మరో పాత్రలో నడియా అలెగ్జాండర్ నటించారు. గతేడాది విడుదలై బాగా ఆకట్టుకుంది.
మహిళా సాధికారతకు ప్రతిబింబం..
ఓ కేసులో శిక్ష అనుభవించి పేరోల్‌పై విడుదలైన ఓ మహిళ తన చెల్లి జీవితాన్ని సరిదిద్దేందుకు పూనుకుంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా రొమాంటిక్ కామెడీగా 'నో బడీస్ ఫూల్' చిత్రం రూపొందింది. టేలర్ పెర్రీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో జైలు నుంచి వచ్చిన మహిళ పాత్రలో టిఫ్పానీ హద్దిష్, ముఖ్యపాత్రల్లో టికా సంప్టర్, ఓమరీ హార్డ్ విక్, మెహకాడ్ బ్రూక్స్ మెప్పించగా ఇది చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. మహిళా సాధికారతకు ప్రతిబింబంగా నిలిచింది.
తెలివే కాదు.. తెగువా ఉంది..
స్వతంత్ర భావాలు కలిగిన ఇద్దరు మహిళలు మంచి స్నేహితులు. అనుకోకుండా వాళ్ళిద్దరు ఓ అంతర్జాతీయ కుట్రలో ఇరుక్కుంటారు. వీరిని వెంబడిస్తున్న గూఢచారుల నుంచి, తాము ఇరుక్కున్న కుట్ర నుంచి ఆ ఇద్దరు మహిళలు ఎలా బయటపడ్డారనే కథాంశంతో యాక్షన్ కామెడీగా 'ది స్పై హు డంప్డ్ మీ' చిత్రం తెరకెక్కింది. మహిళా దర్శకురాలు సుసన్నా ఫోగెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిలా కునిస్, కేట్ మెక్ కిన్నోన్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.
ఆనందానుబంధాలు..
గర్బంతో ఉన్న ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలు, ఆయాతో ఉన్న అనుబంధాన్ని తెలిపే కథాంశంతో ఆద్యంతం కామెడీ డ్రామాగా 'టుల్లీ' చిత్రం విడుదలైంది. జాసన్ రీట్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చార్లెస్ థెరాన్, మాకెంజీ డేవిస్ ప్రధాన పాత్రల్లో నటించి మంత్రముగ్ధుల్ని చేశారు.
తానే ఆయుధంగా మారింది..
తన భర్త, ఐదేండ్ల కూతురిని దుండగులు దారుణంగా కాల్చి చంపారు.
దీనిపై ఆమె కోర్టులో న్యాయపోరాటం చేసినా లాభం లేకుండా పోతుంది. తనకు జరిగిన అన్యాయంపై తనే ఆయుధంగా మారి ఆ దుండగులపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా 'పెప్పరమింట్' చిత్రం వచ్చింది. పీర్రె మోరెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో
జెన్నీఫర్ గార్నర్ ప్రధాన పాత్ర పోషించారు. పరిస్థితి వస్తే మహిళా ఎంత శక్తివంతంగా మారుతుందో అనేదానికి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు యాక్షన్ నేపథ్యంలో వచ్చిన మహిళా ప్రధాన చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
జీవితాన్నే మార్చేసిన పరిచయం..
నైనా స్టాండప్ మంచి హాస్య నటీమణి. తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలోకి రేఫ్ అనే వ్యక్తి వస్తాడు. దీంతో ఆమె జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. ఎన్నో ఒడిదుడుకులు చూడాల్సి వస్తుంది. మరి వాటినుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసిందనే ఆసక్తికర కథాంశంతో కామెడీ డ్రామాగా 'ఆల్ అబౌట్ నైనా' చిత్రం రూపొందింది. మహిళా దర్శకురాలు ఎవా వివెస్ రూపొందించిన ఈ సినిమాలో నైనా పాత్రలో మ్యారీ ఎలిజబెత్ విస్టీడ్ నటించి మంత్రముగ్ధుల్ని చేశారు.
నిజ జీవితంఆధారంగా..
కొలెట్టీ అనే మహిళను తన భర్త నవలలు రాయమని ప్రోత్సహిస్తాడు. వాటికి తన పేరే వేసుకుంటాడు. ఆయా నవలకి మంచి పేరు వస్తున్న నేపథ్యంలో ఆమె స్వతహాగా తన సొంత పేరుతో నవలలు రాయాలని నిర్ణయించు కుంటుంది. అందుకు భర్తపై ఆమె చేసే పోరాటం నేపథ్యంలో బయోగ్రాఫికల్ డ్రామాగా 'కొలెట్టీ' చిత్రం వచ్చింది. వాష్ వెస్ట్మోరలాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొలెట్టీగా కీరా నైట్లీ నటించారు. గాబ్రియల్ కొలెట్టీ నిజ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మంచి ప్రశంసలందుకుంది.
ఓ మహిళా డాన్ కథ..
ఓ ముఠా గ్యాంగ్ బార్లోకి దిగి చోరీకి ప్రయత్నిస్తారు. అక్కడ ఓ లేడీ ఉంటుంది. ఆమె గతం తెలియక వీళ్ళంతా ఆమెని బెదిరిస్తూ, దాడి చేస్తారు. ఈ నేపథ్యంలో వారిపై ఆమె ఎలా తిరగబడిందనే కథాంశంతో యాక్షన్ క్రైమ్ డ్రామాగా 'పిక్కింగ్' చిత్రం రూపొందింది. ఉషర్ మోర్గన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాఫియా నేపథ్యం ఉన్న మహిళగా ఎలైస్ ప్రైజ్ నటించారు. ఇది గతేడాది విడుదలై కమర్షియల్‌గా పర్వాలేదనిపించుకున్నా, క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది.
ప్రమాదకరమైన ప్రయాణం
అమెరికన్ జర్నలిస్ట్ మ్యారీ కోల్విన్ పలు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో తిరిగి అక్కడ సివిల్ వార్స్‌పై డాక్యుమెంటరీ చేశారు. అంతేకాదు ఈ క్రమంలో జరిగే దారుణమైన విషయాలను బయటపెట్టారు. ఆమె జీవితం ఆధారంగా చేసుకుని మాథ్యూ హీన్మ్యాన్ బయోగ్రాఫికల్ డ్రామాగా 'ఏ ప్రైవేట్ వార్' చిత్రాన్ని రూపొందించారు. ఓ మహిళా జర్నలిస్ట్ సాహసోపేతమైన జర్నీని తెలిపే ఈ చిత్రంలో రోసమండ్ పైక్ అత్యద్భుతంగా నటించి కనువిందు చేశారు. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
కుటుంబ యదార్థ కథ..
సైన్యంలో పనిచేసే తన భర్త ఉగ్రవాదుల దాడిలో చనిపోవడంతో భార్య ఒంటరైపోతుంది. నైతికంగా, ఆర్థికంగా చితికిపోతుంది. తన కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్న ఆమె జీవితంలోకి ఓ డ్రైవర్ వస్తాడు. ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలాంటి టర్న్‌లు తీసుకుందనే కథాంశంతో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా 'గాడ్ బ్లెస్ ది బ్రోకెన్ రోడ్' చిత్రం రూపొందింది. అఫ్ఘనిస్తాన్‌లోని యదార్థంగా జరిగిన కథ ఆధారంగా దర్శకుడు హారోల్డ్ క్రాంక్
ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒంటరి మహిళగా లిండ్సే పల్సిఫర్ నటించగా, గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది.
చిన్నప్పుడు జరిగిన విషాదం నుంచి బయటపడి ఓ గాయని ప్రపంచం మెచ్చే పాప్ స్టార్‌గా ఎదగడం, ఈ క్రమంలో తాను పడే సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'వోక్స్ లక్స్'.
బ్రాడీ కాబ్రెట్ దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ డ్రామా చిత్రంలో పాప్ స్టార్‌గా నటాలియా పోర్ట్మన్ అద్భుత నటనతో మెప్పించారు.
ఓ జంట వీకెండ్లో భాగంగా సరదాగా బయటకి ట్రిప్ వెళతారు. మౌంటేన్ ప్రాంతంలో బైకర్ గ్యాంగ్ వీరిని ఆటపట్టిస్తారు. ఈ సందర్భంగా జరిగిన గొడవ కారణంగా ఆ గ్యాంగ్ వీరిని వెంబడిస్తుంది. అమ్మాయిపై గ్యాంగ్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో గ్యాంగ్‌పై ఆమె ఎలా తిరగబడిందనే కథాంశంతో యాక్షన్ క్రైమ్ డ్రామాగా 'ట్రాఫిక్' చిత్రం రూపొందింది. డియోన్ టేలర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తిరగబడే మహిళగా పాలా పట్టాన్ అత్యద్భుతంగా నటించారు. ఇది గతేడాది విడుదలై ఆకట్టుకుంది.
ఓ యువ జంట సీ ట్రిప్‌ని ఎంజాయ్ చేయడానికి ఏకాంతంగా పడవలో సముద్రంలోకి వెళతారు. నడి సముద్రంలోకి వెళ్ళాక అత్యంత ప్రమాదకరమైన హరికేన్ తుఫాన్ సంభవిస్తుంది. దీంతో వీరు ప్రయాణించే పడవ బాగా దెబ్బతింటుంది. తీవ్రంగా గాయపడిన ప్రియుడిని రక్షించుకోవడానికి, సముద్రం నుంచి క్షేమంగా బయటపడేందుకు ఓ ప్రియురాలు పడే మానసిక, శారీరక వేదన, సంఘర్షణ, ప్రకృతితో ఆమె చేసే పోరాటం నేపథ్యంలో రొమాంటిక్ అడ్వెంచరస్ బయోగ్రఫీగా 'అడ్రిఫ్ట్' చిత్రం రూపొందింది. 1983లో పసిఫిక్ సముద్రంలో చోటు చేసుకున్న యదార్ధ సంఘటన ఆధారంగా దర్శకుడు బల్టాసర్ కొర్మకుర్ ఈ సినిమాని రూపొందించారు. ప్రపంచ ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన ఈ సినిమాలో షైలెన్ వూడ్లీ, సామ్ క్లాఫ్లిన్ జంటగా నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా ప్రియురాలు సామ్ నటన కట్టిపడేస్తుంది.
లోవాకి చెందిన వెస్ట్ హైస్కూల్ మహిళా వాలీబాల్ టీమ్‌కి గుండెకాయ లాంటి కెప్టెన్ హఠాన్మరణం చెందుతుంది. దీంతో ఆ టీమ్‌కి మరో బలమైన లీడర్ కావాలి. అలాంటి అమ్మాయిని వెలికి తీసి ఆ టీమ్ స్టేట్ ఛాంపియన్‌గా నిలవడమనే కథాంశంతో స్పోర్ట్స్ డ్రామాగా 'ది మిరాకిల్ సీజన్' చిత్రం వచ్చింది. సీయన్ మెక్ నమరా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కెప్టెన్‌గా ఎరినా మోరియార్టీ నటించారు. దీన్ని లోవా స్కూల్లో జరిగిన రియల్ ఇన్స్‌డెంట్ ఆధారంగా రూపొందించడం విశేషం. గతేడాది విడుదలై మంచి కలెక్షన్లని సాధించింది. సింగిల్ మదర్, ఇద్దరు పిల్లలతో ఏకాంతమైన ప్రదేశంలో నివాసం ఉంటుంది. ఆమె దగ్గరున్న డబ్బుని దోచుకునేందుకు, ఆమె ఇంటిని ఆక్రమించుకోవడానికి కొందరు దుండగులు ప్లాన్ చేసి దాడి చేస్తారు.
వారిని ఎదుర్కొని, వారి చేతుల్లో చిక్కిన తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఓ సింగిల్ మదర్ చేసిన వీరోచిత పోరాటం నేపథ్యంలో థ్రిల్లర్ ప్రధానంగా 'బ్రేకింగ్ ఇన్' చిత్రం తెరకెక్కింది. జేమ్స్ మెక్ టీగ్యూ దర్శకత్వం వహించారు. తల్లిగా గాబ్రియెల్లె యూనియన్ నటించి మెస్మరైజ్ చేశారు. గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇలా ఇటీవల కాలంలో అనేక మహిళా ప్రధాన చిత్రాలు రూపుదిద్దుకుని బాక్సాఫీసు వద్ద సత్తాచాటాయి. అంతేకాదు హీరోలకు తాము ఏమాత్రం తీసిపోమని పలువురు కథానాయికలు నిరూపించుకోవడం విశేషం.
Authorization