బ్రూస్ విల్లిస్..ప్రేక్షకుల్ని మెప్పించిన అత్యద్భుతమైన యాక్షన్ హీరో. ఒళ్ళు గగుర్పొచిడే యాక్షన్ సీక్వెన్లతో, విలక్షణ పాత్రలతో వెండితెరపై నట విశ్వరూపం చూపించిన నటుడు.సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి హాలీవుడ్లో తిరుగులేని యాక్షన్ స్టార్‌గా ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, గాయకుడిగా అందరిని ఫిదా చేసిన ఆల్‌రౌండర్ బ్రూస్ విల్లిస్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
నటనకు దారి తీసిన అవమానాలు
బ్రూస్ విల్లిస్.. జర్మనీలోని ఐడార్ ఓబెర్ట్సీన్ 1955, మార్చి 19న జన్మించారు. వీరిది సైనిక కుటుంబం. తండ్రి డేవిడ్ విల్లిస్ అమెరికన్ సైనికుడు. తల్లి మార్టెన్ జర్మన్. వీరి నలుగురి సంతానంలో బ్రూస్ పెద్దవాడు. ఒక చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. బ్రూస్ తండ్రి మిలటరీ నుంచి రిటైర్డ్ అయ్యాక న్యూజెర్సీకి వెళ్ళి వెల్డర్‌గా, ఫ్యాక్టరీ వర్కర్‌గా పని చేస్తే, తల్లి ఓ బ్యాంక్‌లో పనిచేసేవారు. ఆ సమీపంలో ఉన్న పెన్స్ గ్రోవ్ హైస్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. బ్రూస్ది ఎడమచేతి వాటం. అలాగే ఆయనకు ఓ రకమైన నత్తి ఉండేది. పదాలు వరుసగా పలకడం రాదు. దీంతో స్కూల్‌మేట్స్ అంతా 'బక్ బక్' అంటూ ఆటపట్టించేవారు. ఆ అవమానాలు భరించలేక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ నాటకాల్లో డైలాగ్స్ ప్రాకీస్ట్ చేసే క్రమంలో తనకున్న నత్తి పోతుందని భావించి నాటకాలపై దృష్టి పెట్టారు. మరోవైపు మాంటిక్లెయిర్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఈ క్రమంలో తన మాట తడబాటుని అధిగమించడంతోపాటు విద్యార్థి నాయకుడిగానూ ఎదిగారు. ఆయన్ని స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. నాటకాలు వేశాడు కానీ సినీ రంగంలోకి వెళ్ళాలనిగానీ, నటుడు అవ్వాలని గానీ ఎప్పుడూ అనుకోలేదు. మిలటరీ ఫ్యామిలీ కావడంతో తనూ కూడా తండ్రిలాగానే మిలటరీలోకి వెళ్ళాలనుకున్నారు. గ్రాడ్యూయేట్ పూర్తయిన తర్వాత 1973లో న్యూజెర్సీలోని సలీమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. తన లక్ష్యానికి అది మొదటి మెట్టుగా భావించారు. కొన్ని రోజులకు ఆ జాబ్ మానేసి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా వర్క్ చేశారు.
అవకాశాలను కోల్పోయేలా చేసిన జల్సాలు
అయితే మాంటిక్లెయిర్ స్టేట్ యూనివర్సిటీలో డ్రామా విభాగంలో పనిచేయడంతో వాటి ఆధారంగా ఆయనకు టెలివిజన్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో తనలో కొత్త ఆశలు రేకెత్తాయి. మిలటరీనా?, యాక్టింగ్‌గా? అని తేల్చుకోవాల్సిన సమయంలో యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు. మొదటగా 'క్యాట్ ఆన్ ఏ హాట్ టిన్ రూఫ్' టెలివిజన్‌కి ఆడిషన్‌కి వెళ్ళగా ఎంపికై మరీ తన జూనియర్ వల్ల అవకాశాన్ని కోల్పోయాడు. 1980లో గుర్తింపు లేని సీరియల్ 'ఏ గురు కమ్స్'లో నటించారు. నాలుగేండ్ల తర్వాత 'మియామి వైస్' టెలివిజన్‌లో ఆకట్టుకున్నారు. నిజం చెప్పాలంటే నటుడిగా మారిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఆ టైమ్‌లోనే పాపులర్ టెలివిజన్ 'మూన్ లైటింగ్' కోసం ఆడిషన్ జరుగుతుంది. ఒక పాత్ర కోసం దాదాపు మూడువేల మంది పోటీపడుతున్నారు. వారందరినీ వెనక్కి నెట్టి బ్రూస్ ఎంపికై అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందులో హీరోగా, ప్రముఖ నటి సైబిల్ షెపర్డ్‌కి జోడీగా నటించి ఆకట్టుకోవడంతోపాటు అనేక అవార్డులను అందుకున్నారు. ఈ సిరీస్ ఓ రకంగా బ్రూస్కి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో ఆయనకు ప్రకటనలు క్యూ కట్టాయి. ఓ ప్రముఖ కంపెనీ ఆయనతో దాదాపు ఏడు మిలియన్ డాలర్లతో రెండేండ్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో ఒక్కసారిగా తనకు వచ్చిన ఇమేజ్‌తో ఉక్కిరి బిక్కిరై జల్సాలకు, మద్యానికి బానిసయ్యాడు. దీని కారణంగా రెండేండ్ల తర్వాత తన అగ్రిమెంట్‌ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ షాక్‌తో మద్యం మానేశాడు.
డై హార్డ్తో తిరుగులేని యాక్షన్ స్టార్ ఇమేజ్
బుల్లితెరపై స్టార్‌గా వెలుగుతున్న బ్రూస్కి 1980లో మొదటి సినిమా అవకాశం లభించింది. 'ది ఫస్ట్ డెడ్లీ సీన్'లో గుర్తింపు లేని పాత్రలో కనిపించారు. మొదటి సినిమా నిరాశే మిగిల్చింది. మరో అవకాశం రావడానికి రెండేండ్లు పట్టింది. 'ది వర్డిక్ట్'లో కూడా పేరులేని పాత్రలోనే మెరిశారు. ఆయనకు చాలా రోజుల వరకు మంచి సినిమా అవకాశం అందని ద్రాక్షగా మారింది. ఐదేండ్లపాటు చేసిన పలు ప్రయత్నాలతో చివరిగా 1987లో 'బ్లైండ్ డేట్'లో పూర్తి స్థాయి హీరోగా నటించే ఛాన్స్ దొరికింది. అంతేకాదు ఈ సినిమా మరో అవకాశం తెచ్చిపెట్టింది. అదే 'డై హార్డ్'. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా బ్రూస్కి తొలి బ్రేక్ అని చెప్పాలి. నటుడిగా తనపై తనకి నమ్మకాన్ని కలిగించిన చిత్రమిది. అలాగే సినీ రంగంలో తిరుగులేని నటుడిగా నిలబెట్టిన సినిమా. జాన్ మెక్ టీర్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా బ్రూస్ మెప్పించారు. ఇది 28 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 140 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. 'డై హార్డ్' ఆయనకి యాక్షన్ స్టార్ ఇమేజ్‌ని తెచ్చింది. ఇందులో తనే సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయడం విశేషం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. అంతేకాకుండా అప్పట్లో యాక్షన్ హీరోగా మొదటి ర్యాంక్‌ని సాధించారు.
జయాపజయాలకు అతీతంగా..
'డై హార్డ్' విజయంతో వరుసగా యాక్షన్ ప్రధాన చిత్రాలు క్యూ కట్టాయి. వీటితోపాటు విభిన్న జోనర్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఒక్కసారిగా వచ్చిన స్టార్ ఇమేజ్‌తో ఉక్కిరిబిక్కిరై కొన్ని తప్పులూ చేశారు. దీంతో వరుసగా అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ జయాపజయాలకు అతీతంగా రాణించారు.
పరాజయాలు: 'ఇన్ కంట్రీ', 'దట్స్ అడెక్వెట్', 'లుక్ వూస్ టాకింగ్ టూ', 'ది బోన్‌ఫైర్ ఆఫ్ ది వానిటీస్', 'మార్టల్ థాట్స్', 'హాండ్సన్ హాక్', 'బిల్లీ బాత్గేట్', 'ది లాస్ట్ బారు స్కౌట్', 'స్ట్రైకింగ్ డిస్టాన్స్', 'కలర్ ఆఫ్ నైట్', 'లాస్ట్ మ్యాన్ స్టాండింగ్', 'బ్రేక్‌ఫాస్ట్ ఆఫ్ ఛాంపియన్స్', 'ది స్టోరీ ఆఫ్ అజ్', 'బండిట్స్', 'హార్ట్స్ వార్', 'టియర్స్ ఆఫ్ ది సన్', 'ది హోల్ టెన్ యార్డ్స్', 'హోస్టేజ్', 'ఆల్ఫా డాగ్', '15బ్లాక్స్', 'ఫాస్ట్ ఫుడ్ నేషన్', 'అస్సాస్పినేషన్ ఆఫ్ ఏ హై స్కూల్ ప్రెసిడెంట్', 'సిన్ సిటీ: ఏ డ్యామ్ టు కిల్ ఫర్'.
విజయాలు: 'డై హార్ 2', 'డెత్ బికమ్స్ హర్', 'పల్ప్ ఫిక్షన్', 'నోబడీస్ ఫూల్', 'డై హార్డ్ విత్ ఏ వెంగీయన్స్', '12మంకీస్', 'ది ఫిఫ్త్ ఎలిమెంట్', 'ది జాకల్', 'మెర్య్కూరీ రైజింగ్', 'ఆర్మాంగెడ్డాన్', 'ది సీజ్', 'ది సిక్త్ సెన్స్', 'ది హోల్ నైన్ యార్డ్స్', 'డిస్నీ ది కిడ్', 'అన్బ్రేకబుల్, 'సిన్ సిటీ', 'లక్కీ నంబర్ స్లెవిన్', 'పర్ఫెక్ట్ స్ట్రేంజర్', 'లైవ్ ఫ్రీ ఆర్ డై హార్డ్', 'సర్రోగేట్స్', 'కాప్ ఔట్', 'రెడ్', 'మూన్‌రైజ్ కింగ్డమ్', 'ది ఎక్స్‌పెండబుల్స్ 2', 'లూపర్', 'జి.ఐ.జోయి: రిటేలియేషన్', 'రెడ్ 2', 'డెత్ విష్', 'గ్లాస్' ఇలా దాదాపు సగం వరకు సినిమాలు పరాజయం చెందగా, మరో సగం సినిమాలు భారీ విజయాలు సాధించి రికార్డు కలెక్షన్లని కొల్లగొట్టాయి. అయితే వరుసగా సినిమాలు పరాజయం చెందినా ఒక్క హిట్‌తో తిరిగి పుంజుకున్న సందర్భాలు కోకొల్లలు. మొత్తంగా జయాపజయాలకు అతీతంగా అద్భుతమైన నటనతో, అదిరిపోయే యాక్షన్‌తో మెప్పించి హాలీవుడ్లో తిరుగులేని యాక్షన్ స్టార్‌గా ఎదిగారు. హాలీవుడ్లో బ్రూస్కి సమకాలీకులైన ఆర్నాల్డ్ స్వ్కార్జ్‌నెగ్గర్, సిల్వెస్టర్ స్టాలోన్లకి దీటుగా రాణించారు. హీరోగా, సహాయ నటుడిగానే కాకుండా 'గ్రింద్హౌస్' చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ప్రస్తుతం 'మదర్‌లెస్ బ్రూక్లీన్', '20 మినిట్స్ గోన్' చిత్రాల్లో నటిస్తున్నారు.
అందరినీ మెప్పించిన ఆల్‌రౌండర్
బ్రూస్ విల్లిస్ కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత, సింగర్, రైటర్ కూడా. ఆయనకు సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉండేది. 1988లో 'సన్‌సెట్' చిత్రానికి, 2002లో ది క్రోకోడైల్ హంటర్: కొల్లిషియస్ కోర్స్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసి ప్రొడక్షన్‌పై పట్టు సాధించారు. సినిమా నిర్మాణంపై ఉన్న అభిరుచి ఆయన్ని నిర్మాతగా మార్చింది. మంచి కాన్సెప్ట్ చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆర్నాల్డ్ రిఫ్కిన్తో కలిసి 2001లో చెయన్నె ఎంటర్ప్రైజెస్ సంస్థని స్థాపించారు. ఆ ఏడాది 'బండిట్స్' చిత్రాన్ని నిర్మించారు. ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు 'హార్ట్స్ వార్', 'ది క్రోకోడైల్ హంటర్: కొల్లిషన్ కోర్స్', 'టియర్స్ ఆఫ్ ది సన్', 'ది హోల్ టెన్ యార్డ్స్', 'హోస్టేజ్', 'సిరియల్', 'బ్లాక్ వాటర్ ట్రాన్సిట్', '16 బ్లాక్స్', 'జస్ట్ మై లక్', 'లైవ్ ఫ్రీ ఆర్ డై హార్డ్', 'హుస్ యువర్ క్యాడ్డీ', 'డిసెప్షన్', 'డమ్ మారో డమ్', 'సాక్రిఫైస్', 'హ్యాంగ్‌మన్' చిత్రాలను నిర్మించారు. పలు టెలివిజన్ సిరీస్‌లను కూడా ప్రొడ్యూస్ చేశారు. దీంతోపాటు తనలోని రైటర్‌కి పదును పెట్టి యాక్షన్ కామెడీగా వచ్చిన 'హడ్సన్ హాక్' చిత్రానికి కథ అందించారు. కానీ ఇది బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. దీంతో మళ్ళీ రైటింగ్ జోలికి వెళ్ళలేదు. బ్రూస్ గాయకుడు కూడా. 1980లో 'ది రిటర్న్ ఆఫ్ బ్రూనో' ఆల్బమ్‌ని రూపొందించారు. ఇందులో రికార్డింగ్ ఆర్టిస్టుగా మోడరేట్ సక్సెస్‌ని అందుకున్నారు. 2010లో చేసిన 'స్టైల్' సాంగ్ మంచి శ్రోదకాదరణ పొందింది. తాను సొంతంగా 'ది రిటర్ ఆఫ్ బ్రూనో', 'ఇఫ్ డోంట్ కిల్ యు, ఇట్ జస్ట్ మేక్స్ యు స్ట్రాంగర్', 'క్లాసిక్ బ్రూస్ విల్లిస్: ది యూనివర్సల్ మాస్టర్స్ కలెక్షన్' వంటి సోలో ఆల్బమ్స్ రూపొందించారు. అవి మంచి శ్రోతకాదరణ పొందాయి. ప్రముఖ దర్శకుడు రాబర్డ్ రోడ్రిగ్విజ్, ప్రముఖ నటుడు సామ్యూల్ ఎల్స్ జాక్సన్, ప్రముఖ యాక్షన్ హీరోలు ఆర్నాల్డ్స్వ్కార్జ్ నెగ్గర్, సిల్వెస్టర్ స్టాలోన్, కథానాయికల పరంగా షెరాన్ స్టోన్, క్యాథరిన్ జెటా జోన్స్, హల్లే బెర్రీ వంటి హేమాహేమీలతోపాటు తన పెద్ద కూతురు రూమర్‌తో బ్రూస్ నటించడం విశేషం.
విలక్షణ నటనకు ప్రతిరూపాలు
ప్రముఖ హాలీవుడ్ నటులు గ్యారీ కూపర్, రాబర్డ్ డీ నిరో, స్టీవ్ మెక్ క్వీన్, జాన్ వెనె వంటి తదితరులు బ్రూస్ విల్లిస్కి రోల్ మోడల్స్. నటుడిగా మారేందుకు బ్రూస్కి స్ఫూర్తినిచ్చిన నటీనటులు. ఇక యాక్షన్ హీరోగా పాపులరైన బ్రూస్ విభిన్న పాత్రలతో మెప్పించారు. లవర్ బారుగా, సంఘర్షణ పడే వ్యక్తిగా, ఇన్నోసెంట్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా, హాస్య నటుడిగా, రొమాంటిక్ తరహా పాత్రల్లోనూ మెప్పించారు. కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన రొమాంటిక్ కామెడీ 'బ్లైండ్ డేట్'లో ఇన్నోసెంట్ డ్రైవర్‌గా, ప్రేమికుడిగా నటించారు. బ్రూస్కి తిరుగులేని బ్రేక్‌నిచ్చిన చిత్రం 'డై హార్డ్'. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో న్యూయార్క్ పోలీస్ అధికారిగా, దొంగలను పట్టుకునే పోలీస్‌గా ఆద్యంతం యాక్షన్ భరిత నటనతో అబ్బురపరిచారు. 'డై హార్డ్' సిరీస్‌లో భాగంగా వచ్చిన చిత్రాల్లోనూ అదే పాత్రతో మెప్పించారు. కామెడీ ఫాంటసీ చిత్రం 'డెత్ బికమ్స్ హర్' చిత్రంలో ప్లాస్టిక్ సర్జన్‌గా, మోసాలు చేసే ప్రియురాలికి బ్రేకప్ చెప్పిన ప్రేమికుడిగా అలరించారు. తనకి 'డై హార్డ్' తర్వాత కెరీర్‌కి పెద్ద బూస్ట్‌నిచ్చిన క్రైమ్ ప్రధాన చిత్రం 'పల్ప్ ఫిక్షన్'లో బాక్సర్‌గా సహాయ నటుడి పాత్రలో ఆకట్టుకున్నారు. సైన్స్ ఫిక్షన్ నియో నోయిర్ చిత్రం '12 మంకీస్'లో క్రిమినల్‌గా, వైరస్‌ని కనిపెట్టే వైద్యుడిగా విలక్షణ పాత్రలో మైమరపించారు. మరో బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'ది ఫిఫ్త్ ఎలిమెంట్'లో టాక్సీ డ్రైవర్‌గా, మాజీ స్పెషల్ ఫోర్స్ అధికారిగా అలరించారు. సంచలన విజయం సాధించిన సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ 'అర్మాగెడ్డాన్'లో నాసా మాజీ సైంటిస్ట్‌గా, ఆయిల్ డ్రిల్లర్‌గా మెప్పించారు.
కెరీర్ బెస్ట్ హిట్స్‌లో ఒకటైన సూపర్‌నేచురల్ హర్రర్ డ్రామా 'ది సిక్త్ సెన్స్'లో దెయ్యం వల్ల భయపడుతున్న కొడుక్కి తండ్రిగా, క్రైమ్ ఆంథోలాజి చిత్రం 'సిన్ సిటీ'లో స్ట్రీట్ ఫైటర్‌గా మాఫియా తరహా పాత్రలో మెస్మరైజ్ చేశారు. యాక్షన్ కామెడీ 'రెడ్'లో సీఐఏ ఏజెంట్‌గా అద్భుతమైన యాక్షన్‌తో అదరగొట్టారు. బాలల చిత్రం 'మూన్‌రైజ్ కింగ్డమ్'లో కెప్టెన్‌గా కామెడీతో నవ్వించారు. యాక్షన్ ప్రధానంగా వచ్చిన 'ది ఎక్స్‌పాండబుల్స్ 2'లో సీక్రెట్ సీఐఏ ఏజెంట్‌గా సిల్వెస్టర్ స్టాలోన్ కోరిక మేరకు నటించి అలరించారు. మిలటరీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'జీఐ జోయి: రిటేలియేషన్'లో మిలటరీ జనరల్‌గా నటించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'లూపర్'లో క్రైమ్ సిండికేట్ నాయకుడిగా, సూపర్ హీరో థ్రిల్లర్ 'అన్బ్రేకబుల్'లో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, సెక్యూరిటీ గార్డ్‌గా, సూపర్ నేచురల్ పవర్ కలిగిన సూపర్‌మ్యాన్‌గా అబ్బురపరిచారు. సైకలాజికల్ సూపర్ హీరో థ్రిల్లర్ 'గ్లాస్'లో కూడా 'అన్బ్రేకబుల్' తరహా పాత్రతోనే ఆకట్టుకున్నారు. అనేక చిత్రాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించిన బ్రూస్ విల్లిస్కి ప్రముఖంగా చెప్పుకునే ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. అయితే ఆయన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 2.64 నుంచి 3 బిలియన్ వరకు కలెక్ట్ చేశాయి. 2010లో అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్లు రాబట్టిన హీరోగా మొదటి స్థానంలో, సహాయ నటుడిగా 12వ స్థానంలో నిలవడం విశేషం.
Authorization